సచివాలయ ఉద్యోగుల పరస్పర బదిలీలకు ఎదురుచూపులే..?!


Ens Balu
39
Amaravathi
2023-06-26 03:03:37

గ్రామ,వార్డు సచివాలయశాఖ ఉద్యోగులకి ప్రభుత్వం చేపడతామన్న పరస్పర బదిలీలు(మ్యూచ్ వల్) ప్రక్రియకు తేదీ ఖరారు చేయకపోవడంతో ఆన్ లైన్ లో దరఖాస్తు పెట్టుకున్నవారంతా ఉసూరుమంటూ వేచి చూడాల్సి వస్తోంది. ఈనెల 10 నుంచి 12 లోపు అన్ని రకాల బదిలీలు చేపడతామని ప్రకటించిన ప్రభుత్వం మ్యూచ్ వల్ ట్రాన్స్ ఫర్స్ విషయంలో ఎందుకనో వెనక్కి తగ్గింది. దీనితో ఉద్యోగులు నిరాశపడిపోయారు. చాలామంది ఇటీవల తేదీ ఖరారు చేసి జిల్లాలకు రమ్మని చెప్పిన తరువాత.. తూచ్ మళ్లీ మీకు బదిలీల తేదీని ప్రకటిస్తామని చెప్పడంతో చాలమంది ఉద్యోగులు తిరిగి వారి ఉద్యోగ ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోయారు. కొందరు ఉద్యోగులు తేదీ ప్రకటించేస్తారని బ్రమపడి నాలుగైదు రోజులు సెలవులు వాడేసుకొని వెనక్కి వెళ్లకుండా ఉండిపోయారు. తీరా తేదీని ప్రకటించకపోవడంతో చేసేది ఏంలేక ఆదివారం సాయంత్రం పెట్టేబేడా సర్ధుకుని విధులకు వెళ్లిల్సిన దుస్తితి ఏర్పడింది. జిల్లాల పరిధిలోని బదిలీలను ఇచ్చిన సమయానికే పూర్తిచేసిన గ్రామ, వార్డు సచివాలయశాఖ మ్యూచ్ వల్ ట్రాన్స్ ఫర్లు, ఇంటర్ డిస్ట్రిక్ట్ బదిలీల విషయంలో ఆలోచనలో పడింది. దీనితో ఆ ప్రభావం ఉద్యోగులపై తీవ్రంగా పడింది.


అందరికీ బదిలీల చేసిన ప్రభుత్వం తమను మాత్రం గాలికొదిలేసిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో తాము ఎవరిని సంప్రదించాలో కూడా తెలియని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. జిల్లాల్లో ఉన్న డిఎల్డిడీఓలకు, జిల్లాశాఖల అధికారులకు సమాచారం లేకపోవడం వారు కూడా చేతులెత్తేస్తున్నారు.. ప్రభుత్వం నుంచి సమాచారం వస్తే అందరికీ ఒకేసారి తెలుస్తుంది కదా అంటూ ఉద్యోగులపై చిరాకు ప్రదర్శిస్తున్నారు. కొన్ని చోట్ల బదిలీల ప్రక్రియ జరిగిపోయినా..స్థాన చలనం కదిలిన సచివలయం నుంచి బదిలీ జరిగిన సచివాలయంలో చేరేందుకు వీలు లేకుండా వారం రోజుల పాటు ఆర్డర్లు కూడా ఇవ్వలేదు. ఇదంతా 19 ప్రభుత్వశాఖల మధ్య సమన్వయ లోపంగానే చెబుతున్నారు. పోనీ ప్రక్రియ మొత్తం ఆన్ లైన్ లోనే జరిగినందున కనీసం ఆన్ లైన్ కౌన్సిలింగ్ సైతం చేపకట్టకపోవడం వెనుక ఆంతర్యం ఉద్యోగులకు అంతుపట్టడం లేదు.. అసలు తాము దరఖాస్తు చేసుకున్న ప్రదేశాలకు బదిలీలు చేస్తారో..చేయరోననే ఆందోళనను ఉద్యోగులు వ్యక్తం చేయడం విశేషం. అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులు మాదిరిగా కాకుండా ఒక్క గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులకు మాత్రమే వీరి ఉద్యోగాలు ప్రారంభం అయిన దగ్గర నుంచి నేటి వరకూ అంతా కాస్త తేడాగానే చేస్తున్నది ప్రభుత్వం. దీనితో సాధారణ ప్రభుత్వశాఖల ఉద్యోగులుగా తాము లేమనే బావన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొననసాగితే 2024 ఎన్నికల్లో ఈ శాఖ ఉద్యోగుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.