గ్రామ సచివాలయ మహిళాపోలీసులకు స్టేషన్లతో కాలం చెల్లింది..!


Ens Balu
717
Amaravati
2023-07-28 04:30:19

ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల్లో 14వేల5 గ్రామ, వార్డు సచివాలయాల్లోని సుమారు 15వేలకు పైచిలుకు మహిళా పోలీసులకు, పోలీస్ స్టేషన్లు,అక్కడి విధులతో కాలం చెల్లిపోయింది. ఇకపై సచివాలయ మహిళా పోలీలను ఎట్టిపరిస్థితుల్లోనూ పోలీసులుగా పరిగణించేది లేదని డిజిపి రాజేంధ్రనాధ్ రెడ్డి హైకోర్టుకి ఆఫడవిట్  సమర్పించారు. ఇకపై ఎవరినీ పోలీసులుగా పరిగించమని అందులో పేర్కొన్నారు. గ్రామాల్లోని మహిళలు, చిన్నారులు ఎదుర్కొంటున్న  సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ఇతర శాఖలతో సమన్వయ పరుచుకుని వారికి కావాల్సిన పూర్తి సహాయసహకారాలు అందిస్తారని అందులో పేర్కొన్నారు. కాగా గ్రామ,వార్డు సచివాలయశాఖ ఏర్పాటైన దగ్గరనుంచి ఒక్క మహిళా పోలీసు పోస్టులపైనే హైకోర్టులో కేసులు నమోదు అవుతున్నాయి. కోర్టుకి సమర్పించిన అఫిడవిట్ ను, తమ ఆదేశాలను ఏ ఒక్క స్టేషన్ ఆఫీసర్, సిఐ, డిఎస్సీ, ఎస్పీ ఎవరు అతిక్రమించినా కఠినచర్యలు తీసుకుంటామని కూడా స్టేట్ పోలీస్ కాన్ఫరెన్సులో డిజిపి ఇప్పటికే హెచ్చరికలు జారీచేశారు. దానితో నేటి నుంచి ఆ ఆదేశాలు అమలులోకి రానున్నాయి. కోర్టుకి సమర్పించిన ఆఫడవిట్ లోని అంశాలన్నీ సచివాలయ మహిళా పోలీసుల విధుల విషయంలో పోలీసుశాఖ పాటించనున్నది.

 గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళ పోలీస్ ను పోలీస్ శాఖలోని సాధారణ విధులైన బందోబస్తు, రిసెప్షన్ మరియు  శాంతి భద్రతల  వంటి వాటికి వినియోగించడం,  తరచుగా పోలీస్ స్టేషన్ కు పిలిపించడం వంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదనే లక్ష్మణరేఖను ప్రత్యేక ఉత్తర్వులతో డిజిపి  గీసి ఉంచారు. దానితో మహిళా పోలీసులకు పోలీస్టేషన్లకు సంబంధ బాంధవ్యాలు తెగిపోయినట్టు అయ్యింది. వాస్తవానికి మహిళా పోలీసు విభాగం ఏర్పాటు చేయడం అసలు పోలీసుశాఖలోని హోం గార్డుల దగ్గర నుంచి కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలకు ఇష్టం లేదు. వారి అసహనాన్ని చాలా సందర్భాల్లో వెళ్లగక్కేవారు. వీరందరూ తమ క్రింద ఉద్యోగులుగా వ్యవహరించేవారు. ఈ విషయం ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా డిజిపి కార్యాలయానికి తెలిసినా క్రింది స్థాయి సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి ఉండేది కాదు. అదే సమయంలో వీరిని తరచుగా పోలీస్ స్టేషన్ రిసెప్షన్ డ్యూటీలు, స్టేషన్ రికార్డ్ వర్క్, సభులు, సమావేశాలు జరిగినపుడు బందోబస్తు డ్యూటీలకు, కోర్టు సమన్లు వచ్చినపుడు వాటి సమాచారం వీరితోనే సదరు నోటీసు దారులకు తెలియజేయడానికి వినియోగించేవారు. ఇపుడా విధానాలకు పూర్తిగా కోర్టుకేసు, డిజిపి ఆదేశాలతో అడ్డుకట్ట పడినట్టు అయ్యింది.

దేశంలో ఎక్కడాలేనివిధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ప్రత్యేకంగా గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటు అయ్యింది. ప్రభుత్వశాఖను అయితే ఏర్పాటు చేశారుగానీ 2019 అక్టోబరు 2 నుంచి నేటి వరకూ సుమారు 19 ప్రభుత్వశాఖల్లోని రాష్ట్ర ముఖ్యకార్యదర్శిలకు వారిలో వారికే సమన్వయం లేకుండా పోయింది. ఒకశాఖ జారీచేసిన ఉత్తర్వులు మరోశాఖ నేటివరకూ అమలు చేయడం లేదు. మరోప్రక్క జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సైతం ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులను పక్కన పెట్టి అందరు సిబ్బందినీ అన్ని శాఖల విధులకూ నేటికీ వినియోగిస్తూనే ఉన్నారు. ఏపీలోని 75 ప్రభుత్వశాఖల్లో ఏశాఖ ఉద్యోగులు ఆశాఖ విధులను మాత్రమే నేటికీ చేస్తూ వస్తున్నారు. కానీ ఒక్క సచివాలయ ఉద్యోగులు మాత్రమే అన్ని ప్రభుత్వశాఖల విధులు, పనులు సచివాలయాల్లో చేయాల్సి వస్తున్నది. విశేషం ఏంటంటే ఏ ప్రభుత్వశాఖలోనూ లేని విధంగా అన్నిశాఖల జిల్లా అధికారులు సచివాలయశాఖ ఉద్యోగులపై అజమాయిషీ చేస్తూ ఉండటం. ఇక్కడి ఉద్యోగులందరూ వారి జిల్లా, డివిజన్, అన్నిమండలశాఖ అధికారులతోపాటు, సచివాలయాల్లోని పంచాయతీ కార్యదర్శిలకూ సమాధానాలు చెప్పుకోక తప్పడంలేదు.

ఏ ప్రభుత్వంలోనైనా ఏదైనా కొత్త ప్రభుత్వ శాఖ ఏర్పాటుచేసినా..దానికి సిబంధించిన చట్టబద్దతను అసెంబ్లీలో ప్రత్యేక బిల్లుద్వారా రెండేళ్లలో పూర్తిచేస్తుంది. ఆపై సదరు ప్రభుత్వశాఖకు  ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, డైరెక్టర్, అడిషనల్ డెక్టర్, జిల్లా అధికారి, డివిజన్ అధికారి, మండల అధికారి ఇలా రాష్ట్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ అన్ని రకాల పోస్టులను తయారు చేస్తుంది. ఈశాఖ అధికారులతోనే ప్రభుత్వంలోని ఏ సర్వీసు నిబంధనలతో ఏ ఉద్యోగాలను భర్తీచేశారో..దానికి తగ్గట్టుగా వారికి ప్రమోషన్ ఛానల్, ఇంక్రిమెంట్లు, డిఏలు, ఎస్ఆర్ మాన్యువల్ ఏర్పాటు చేయాలి. కానీ నేటివరకూ గ్రామ, వార్డు సచివాలయశాఖకు ప్రభుత్వం చట్టభద్దతే కల్పించలేదు. దానికి కారణం కూడా లేకపోలేదు తరచూ ఏదోవిధంగా ఈశాఖపై కోర్టులో కేసులు దాఖలవుతూనే ఉన్నాయి. ఒక్క మహిళా పోలీసు విభాగంపై 2 కేసులు నేటికీ హైకోర్టులో ఉన్నాయి. ఫలితంగా ఈశాఖలోని ఉద్యోగులకు సర్వీసు రెగ్యులర్ అయిన తరువాత ఇవ్వాల్సిన 2ఇంక్రిమెంట్లు, పీఆర్సీ ఇచ్చామని ప్రకటించిన సమయంలో కూడా వీరికి ఐఆర్ ఇవ్వలేదు. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన డిఏ కూడా వీరికి వర్తింపచేయలేదు. ఈ కారణాలతో అసలు తమ ఉద్యోగాలు రెగ్యులర్ వా..కాంట్రాక్టు పద్దతిలోనే ఉన్నాయా అనే అనుమానాన్ని ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. ఈశాఖ ఉద్యోగులకు అడుగడునా, అవమానాలు, ఇబ్బందులే ఎదురవుతున్నాయి. అటు ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలు కూడా రావడంలేదు. చూడాలి కోర్టు కేసులు దాఖలవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈశాఖ విషయంలో ముందు ముందు ఏవిధంగా వ్యవహరిస్తుందనేది..!