స.హ.చట్టం దరఖాస్తుపై కదిలిన 3జిల్లాల యంత్రాంగం


Ens Balu
73
Visakhapatnam
2023-10-07 11:13:47

గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులు, 19శాఖల సిబ్బంది యొక్క సర్వీసు నిబంధనలు, ఇంక్రిమెంట్లు, డిఏలు, ప్రమోషన్ ఛానల్, బదిలీలు, ఇన్ సర్వీస్, భర్తీకానీ ఉద్యోగాల ఖాళీలు, తదితర అంశాలపై ఈఎన్ఎన్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ బ్యూరోచీఫ్ పి.బాలభాను(ఈఎన్ఎస్, బాలు) దాఖలు చేసిన సమాచారహక్కు చట్టం దరఖాస్తుపై  ఉమ్మడి విశాఖజిల్లా, విభజన మూడు జిల్లా అధికారులు కదిలారు. సుమారు 20 అంశాలతో కూడిన నివేదిక వివరాలు కావాలని సమాచారహక్కుచట్టం దరఖాస్తు దాఖలు చేసిన వెంటనే విశాఖజిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి సమాచారం కోసం జిల్లా పరిషత్ కు నివేదించామని మూడు రోజుల క్రితం తిరుగు టపా వచ్చింది. నిన్న జిల్లా పరిషత్ లో భాగంగా ఉన్న మూడు జిల్లాల అధికారులకు సమాచారం కోసం దరఖాస్తు పంపినట్టుగా తిరుగు టపా జిల్లా పరిషత్ అధికారులు పంపారు. మీరు కోరిన సమాచారం కోసం అల్లూరిసీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా, విశాఖపట్నం జిల్లా, నర్సీపట్నం డిఎల్డీఓలకు ఆర్టీఐ దరఖాస్తు పంపినట్టుగా తిరుగు జవాబులో వర్తమానం పంపించారు. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగాల్లో కెల్లా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు, వారి విధులు భిన్నంగా ఉన్నాయి. అంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్గాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగుల విషయంలో ఏఒక్క అంశమూ ఇతర ప్రభుత్వశాఖల సిబ్బంది మాదిరిగా జరగడం లేదు.

ఈ ప్రభుత్వశాఖ ఏర్పాటు చేసి నాలుగేళ్లు దాటుతున్నా నేటికీ చాలాశాఖల సిబ్బందికి సర్వీసు నిబంధనలు పొందు పరచలేదు. ప్రమోషన్ ఛానల్ కూడా ఏర్పాటు చేయలేదు. ఇంకా చాలా మంది ఉద్యోగులకు కనీసం సర్వీస్ కూడా రెగ్యులర్ కాలేదు. సుమారు ఆరు నెలల క్రిందట క్యాబినెట్ లో తీసుకున్న చట్టభద్దత నిర్ణయానికి నేటికీ అతీ గతీ లేకుండా పోయింది. సచివాలయశాఖ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేశామని చెప్పిన ప్రభుత్వం వారికి అరియర్స్ ఇవ్వలేదు, సర్వీసు రెగ్యులర్ చేసిన 
రేండేళ్ల 9 నెలలకు ఇవ్వాల్సిన సుమారు మూడు ఇంక్రిమెంట్ల విషయంలోనూ ఇప్పటికీ ఏమీ మాట్లాడలేదు. వీరికి ఏ తరహా డిపార్ట్ మెంటల్ టెస్టులు పెడతారు. ఏఏ పరీక్షలు పాసైతే వీరికి పదోన్నతులు వస్తాయి అనే క్లారిటీ కూడా లేకుండా పోయింది. రాష్ట్రప్రభుత్వంలోని 76 ప్రభుత్వశాఖల్లో ఏ శాఖలోనూ చేయని సేవలు సచివాలయ ఉద్యోగులు చేస్తున్నారు. ఏదైనా ప్రభుత్వశాఖ అయితే సదరు శాఖ విధులు మాత్రమే నిర్వహిస్తారు. కానీ గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని ఉద్యోగులు మాత్రం సుమారు ఐదారు ప్రభుత్వశాఖలకు చెందిన విధులు నిర్వహించాల్సి వస్తున్నది. ఇంత చేస్తున్నా, వీరికిప్రభుత్వం ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులకు రాజ్యాంగ బద్దంగా ఇవ్వాల్సిన ప్రయోజనాలను సక్రమంగా కల్పించడం లేదు.

ఈ శాఖ ఏర్పాటైన దగ్గర నుంచి ఏ ఒక్క కార్యక్రమం ఉద్యోగుల విషయంలో సక్రమంగా జరిగిన దాఖలాలు లేవు. దానికితోడు గ్రామపంచాయతీ కార్యదర్శి నుంచి ఎంపీడీఓల వరకూ ఉద్యోగులను పలు రకాల వేధింలపులకు గురిచేస్తున్నారు. ఈ తరుణంలో ఉద్యోగులకు చెందాల్సిన ప్రయోజాలను ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను, ఇతర సదుపాయాలను బహిర్గతం చేసేందుకు, వాటిని సచివాలయ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులకు తెలియజేసేందుకు వీలుగా సమాచార హక్కుచట్టం దరఖాస్తు ద్వారా వివరాలు సేకరిస్తోంది ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ. ప్రభుత్వం ఇచ్చే లిఖితపూర్వ వివరాలతో ఇప్పటి వరకూ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో ఏంచేసిందనే విషయం ప్రభుత్వశాఖలే తేటతెల్లం చేయనున్నాయి. ఈ తరుణంలో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ దాఖలు చేసిన సహచట్టం దరఖాస్తుపై జిల్లా అధికారులు స్పందించి సమాచారం త్వరలోనే అందజేస్తామని లిఖితపూర్వకంగా దరఖాస్తుదారునికి లేఖల ద్వారా తెలియజేశారు. సుమారు 20 అంశాల్లో అడిగిన సమాచారం బయటకు వస్తే సచివాలయ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఏం చేసిందనేది తేలనుంది.