ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్ లు ఆలోచనలో పడ్డారా..?!


Ens Balu
99
Visakhapatnam
2023-10-13 06:13:32

ఆంధ్రప్రదేశ్ లోని ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అధికారులు ఆలోచనలా పడ్డారా..? ప్రభుత్వ విధానాలు, ఎన్నడూలేనివిధంగా జీతాలు ఆలస్యం కావడం, కొత్తజిల్లాల్లో పనిచేసే సివిల్ సర్వీస్ అధికారులకు వసతి సౌకర్యాలు లేకపోవడం, మాట్లాడితే కోర్టులకు నేరుగా అధికారులే హాజరు కావడం, ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ ఉద్యోగులు నుంచి వస్తున్న ఒత్తిడి, సహకారం లేకపోవడం ఇవన్నీ చూస్తుంటే బ్యూరోక్రాట్ లు వేరే లెవల్ లో ఆలోచన చేస్తున్నట్టుగానే కనిపిస్తున్నది. దానికి తోడు రాష్ట్రంలో ఏర్పడ్డ కొత్త జిల్లాలకి నియమితులైన కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీ, ఏఎస్పీ, ఫారెస్ట్ ఆఫీసర్లకు నేటికీ ప్రభుత్వ వసతి గృహాలు లేకపోవడం, వారంతా సాధారణ ఉద్యోగులు మాదిరిగా ప్రైవేటు ఇళ్లల్లో అద్దెకు ఉండటం ఇతర జిల్లాశాఖల అధికారులు సొంతిళ్లల్లో ఉంటం కూడా ఉన్నతాధికారులకు ఇబ్బందిగా ఉంది. రాష్ట్రప్రభుత్వం అయితే గవర్నర్ గెజిట్ ద్వారా జిల్లాలను విభజించింది తప్పితే, ఇంకా కొత్త జిల్లాలకు రాష్ట్రపతి ఆమోదం, కేంద్ర ప్రభుత్వం గుర్తింపు రాలేదు.

దీనితో కొత్తజిల్లాల్లోని సివిల్ సర్వీస్ అధికారుల కేడర్ జిల్లా రాష్ట్రం వరకూ మాత్రమే పరిగణలోకి వస్తున్నది. కేంద్రం దృష్టిలో మాత్రం వీరంతా దిగువస్థాయి అధికారులుగానే లెక్క. ఇలాంటి సందర్భంలో ఉద్యోగాలు చేస్తున్నా..ఎందుకనో లోలోన అధికారులంతా మనసులో తీవ్రవమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టుగా వార్తలొస్తున్నాయి. కొత్తజిల్లాల్లోని సివిల్ సర్వీస్ అధికారులు ఇటీవల కాలంలో అత్యంత ఎక్కువగా వారి సమస్యలను వారే సహచరులతో చెప్పుకొని బాధపడుతున్నట్టు తెలిసింది. ఒకప్పుడు జిల్లా కలెక్టర్ అన్నా, జిల్లా ఎస్పీ అన్నా, జిల్లా ఫారెస్టు అధికారి అన్నా ఒక గుర్తింపు ఉండేదని, ఇపుడు సాధారణ ఉద్యోగులు మాదిరిగా అధికారులంతా ప్రతినిత్యం ప్రజల్లోనే ఉండాల్సి వస్తుందన్న ఇబ్బందిని వ్యక్తపరచుకుంటున్నట్టుగా చెబుతున్నారు. ప్రభుత్వం పరిపాలనా విధానాన్ని మార్పులు చేసిన క్రమం తొలుత దాని ప్రభావం జిల్లా కలెక్టర్లపైనే పడినట్టు కనిపిస్తున్నది. జిల్లాలు అయితే పెంచిన ప్రభుత్వం దానికి తగ్గట్టు గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 ఇతర కేడర్ పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ మాత్రం చేయలేదు. దీనితో ఉన్నతాధికారులు సైతం అధికారుల లేమితో ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. 2024 మార్చి దాటితో ఉద్యోగులు, మినిస్టీరియల్ సిబ్బంది కొరత మరీ తీవ్రతరం కానుంది. వేల సంఖ్యల ఉద్యోగులు ఉద్యోగ విరమణలు చేయబోతున్నారు. ప్రస్తుతం ఒక్కో జిల్లా అధికారి ఉమ్మడి జిల్లాతోపాటు, విభజన జిల్లాలను కూడా పర్యవేక్షించాల్సి వస్తున్నది.

రిటైర్ మెంట్లు జరిగితే ఒక్కోశాఖ అధికారి అదనంగా ఇతర శాఖలను చూసే పరిస్థితి కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఈ తరుణంలో జిల్లా అధికారులు కూడా కలెక్టర్, ఎస్పీల మాటలు వినే పరిస్థితి కనిపించడం లేదనేది ప్రధాన వాదనగా కనిపిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎన్నడూలేనివిధంగా సివిల్ సర్వీస్ అధికారుల పరిస్థితి తయారైందని, సాధారణ జిల్లాశాఖల ఉద్యోగులకు, తమకు పెద్దగా వ్యత్సాసం కనిపించలేదని యువ కలెక్టర్లు లోలోన మధన పడుతున్నారట. అలాగని విశేష అధికారాలను వినియోగించి అభివృద్ధి పనులు చేయాలన్నా, తమ మార్కు చూపించుకోవాలన్నా నిధుల కొరత తీవ్ర స్థాయిలో వెంటాడుతోంది. గతంలో ప్రతీ జిల్లా కలెక్టర్ కు ప్రత్యేకంగా జిల్లాకు నిధులు ఉండేవి. వాటితో కలెక్టర్లే ప్రత్యేక అవసరాలకు ఆ నిధులను వెచ్చించే వారు. ఇపుడు ఏపీలో ఆ పరిస్థితి లేదు. దీనితో సివిల్ సర్వీస్ అధికారులు కూడా డమ్మీలైపోయినట్టుగా వాళ్లంతట వాళ్లే భావిస్తున్నారని సమాచారం. మరో వైపు రాష్ట్రంలోని శాఖాధిపతులుగా ఉన్నవారు రాష్ట్ర సర్వీసులకు నమస్కారం పెట్టి కేంద్ర సర్వీసులకు వెళ్లిపోవడానికి ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు ముమ్మరంగా చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఎప్పుడూ లేనంతగా ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే ఇలాంటి పరిస్థితి ఎదరైందనే వాదన కూడా బ్యూరోక్రాట్ లలో బలంగా వినిపిస్తోందట. రాష్ట్ర సమీక్ష సమావేశాల్లో ఏ ఇద్దరు సీనియర్ ఐఏఎస్ లు కలిసినా ఇదే విషయంపై చర్చలు జరుగుతున్నాయనే విషయం నిఘా వర్గాలకు సైతం వెళ్లిందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్టుగానే ఐఏఎస్ లకు జీతాలు ఆలస్యం గా ఇవ్వడం, అదే స్థాయిలో కొన్నిశాఖల ఉద్యోగులకు నెల నెలా ఇవ్వాల్సిన జీతాలు 45 రోజులకి ఒకసారి ఇస్తుండటం కూడా సీనియర్ ఐఏఎస్ లకు మింగుడు పడటం లేదు. జిల్లా అధికారులు, ఉపాధ్యాయులకు జీతాలు ఆలస్యంగా వచ్చినట్టే మనకీ ఆలస్యంగానే అందుతున్నాయి..రేపు ఈ పరిస్థితి మరింతగా పెరగొచ్చని ఓ ఐఏఎస్ అధికారి ఒకరు వ్యాఖ్యానించండం కూడా చర్చనీయాంశం అవుతుంది. ప్రభుత్వాన్ని నడిపించే సివిల్ సర్వీస్ అధికారుల పరిస్థితి ఇలాఉంటే సాధారణ ఉద్యోగుల పరిస్థితి రానున్న రోజుల్లో ఎలా ఉంటుందనేది వేయి డాలర్ల ప్రశ్న. చూడాలి ముందు ముందు ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అధికారుల మనోగతం మరెంతగా మారుతుందనేది..!