చంద్రబాబు ఆరోగ్య నివేదికలు వాస్తవాలేనా?!


Ens Balu
48
Rajamahendravaram
2023-10-28 02:41:13

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం, ఏపీ‌ అసెంబ్లీ ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర వ్యాప్తంగా రకరకాల అనుమా నాలు, మీడియా, సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. ఈ దశలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‌నిజంగానే చంద్రబాబు నాయుడు ఆరోగ్యం క్షీణిస్తోందా లేక ఇవన్నీ అపోహలు, అవాస్తవాలేనా అనేది ఎవరికీ తెలియడం లేదు. కాకపోతే చంద్రబాబు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని భువనేశ్వరి, లోకేష్, టీడీపీ నేతలు పదే పదే చేస్తున్న విమర్శలు.. విమర్శలు కావని, నిజమని వైద్యుల నివేదికలను పరిశీలిస్తే స్పష్టం అవుతుంది. యస్..చంద్రబాబు ఆరోగ్యం మునుపటిలా లేదు. అనేక అనారోగ్య సమస్యలు ఆయనను చుట్టుముడు తున్నాయి.  స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును సీఐడీ సెప్టెంబరు 9న అరెస్టు చేసింది. విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించింది. దీంతో గత 48 రోజులుగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైలులో 'స్నేహా' బ్లాక్ లో రిమాండ్ ఖైదీగా కాలం వెళ్ళదీస్తున్నారు. 

అయితే గత పదీ పదిహేను రోజుల క్రితం రిమాండ్ ఖైదీ చంద్రబాబుతో ములాఖత్ తీసుకుని ఆయన సతీమణి భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి పరామర్శించారు. ఆ సమయంలో చంద్రబాబు శరీరంపై ఉన్న దద్దుర్లను కుటుంబ సభ్యులు గమనించారు. ‌ఈ విషయాన్ని కోర్టుకు న్యాయవాదుల ద్వారా తెలియజేయగా ఏసీ సమకూర్చడంతో పాటు రాజమండ్రి నగర ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను ఒక బృందంగా ఏర్పాటు చేసి..నిత్యం చంద్రబాబు ఆరోగ్యాన్ని పరిశీలించాల్సిందిగా విజయవాడ కోర్టు ఆదేశించింది. ఆనాటి నుంచి వైద్య బృందం చంద్రబాబు ఆరోగ్యాన్ని పరీక్షించి హెల్త్ బులెటిన్ ను జైళ్ళ శాఖ అధికారుల‌ ద్వారా విడుదల చేస్తున్నారు. అయితే వైద్య పరీక్షలలో కొన్ని అంశాలను ప్రస్తావించకుండా హెల్త్ బులెటిన్ ను విడుదల చేయడాన్ని చంద్రబాబు కుటుంబ సభ్యులు, ఆయన తరపు న్యాయవాదులు తప్పుబడుతున్నారు. తమకు కూడా వైద్య పరీక్ష నివేదికలు అందజేయాలని కోరడంతో కోర్టు ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 25వ తేదీ బుధవారం చంద్రబాబును పరీక్షించిన ప్రభుత్వ వైద్యుల బృందం జైళ్ళ శాఖ అధికారులకు ఒక నివేదిక అందజేసింది. అయితే ఆ మేరకు జైలు అధికారులు బులెటిన్ విడుదల చేయకపోవడం గమనార్హం. చంద్రబాబు ఆరోగ్య విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం కనబరుస్తోందని, ఆయన ఆరోగ్య సమస్యలను కావాలనే దాచి పెడుతోందని‌ టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 చంద్రబాబును పరీక్షించిన ప్రభుత్వ ఆసుపత్రి నేత్ర వైద్యులు కంటి సమస్యతో‌ ఆయన బాధపడుతున్నారని, చికిత్స అవసరమని జైలు అధికారులకు నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. అయితే ఇప్పట్లో ఎలాంటి చికిత్సా అవసరం లేదని ఆ నివేదికలో మార్చి ఇవ్వాలని‌ ప్రభుత్వ వైద్యులపై జైలు శాఖ అధికారులు వత్తిడి తెస్తున్నట్టు టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఇదే వార్త సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. బుధవారం జైలు అధికారులు విడుదల చేసిన చంద్రబాబు హెల్త్ బులెటిన్లో‌ కంటి సమస్యను ప్రస్తావించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని గూర్చి, బయట షికార్లు చేస్తున్న వార్తలపై జైలు సూపరింటెండెంటు స్పందిస్తూ.. చంద్రబాబుకు నాలుగు నెలల క్రితమే ఒక కంటికి కేటరాక్ట్ ఆపరేషన్ చేశారని, రెండో కంటికి ఆపరేషన్ అవసరం లేదని ఆయనను పరిశీలించిన వైద్యులు చెప్పారన్నారు. సరే వైద్యులు తెలిపారు..మరి కనీసం కంటి సమస్యను ఎందుకు హెల్త్ బులెటిన్ లో చూపలేదని టీడీపీ నేతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ‌ఒక్క కంటి సమస్య మాత్రమే కాదు..చంద్రబాబు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని‌ తెలుస్తోంది. వంటిపై దద్దుర్లు, విరేచనం అయ్యే ప్రాంతంలో నొప్పి, వెన్ను కింద భాగం నొప్పి తదితర సమస్యలతో చంద్రబాబు బాధపడుతున్నట్టు  ప్రభుత్వ వైద్య బృందం‌ భువనేశ్వరికి తెలిపినట్టు సమాచారం. మూత్ర పరీక్ష, ఛాతీ ఎక్స్ రే తదితర పరీక్షలు చేయించాలని వైద్య బృందం సూచించినట్టు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. క్రోగ్యలేషన్ ప్రొక్టివ్ అనే పరీక్షను చేయించాలని వైద్యులు సూచించారు. ‌


చంద్రబాబుకు దద్దుర్లు వల్ల మంట వస్తోందని, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని‌ కోర్టు దృష్టికి తీసుకు రావడంతో టవర్ ఏసీ‌ ఏర్పాటు చేశారు. అయితే పలు అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్న చంద్రబాబుకు మెరుగైన వైద్యం అత్యవసరమని వైద్యులు సూచిస్తున్నారు. పూర్తి పరీక్షలు చేయిస్తే ఏయే లోపాల కారణంగా అనారోగ్యానికి గురవుతున్నారో స్పష్టమవుతుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.‌ కేవలం రెగ్యులర్ చెకప్ వల్ల ఫలితం ఉండదని, అశ్రద్ధ చేస్తే మొత్తం శరీరానికే ఇబ్బంది కలుగుతుందని చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జైలు అధికారులు చంద్రబాబు అనారోగ్య సమస్యలను దాచాల్సింది ఎందుకనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. పైపెచ్చు కంటి సమస్యను హెల్త్ బులెటిన్ లో చూపించవద్దని‌ జైలు అధికారులు ప్రభుత్వ వైద్య బృందాన్ని ఎందుకు కోరిందో తెలియడం లేదు.

 అంటే కావాలనే ప్రభుత్వం వెనుక ఉండి జైలు అధికారులతో‌ ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని‌ టీడీపీ శ్రేణులు చేస్తున్న అనుమానాల్లో ఎంతో కొంత వాస్తవం లేకపోలేదు. ప్రస్తుతం చంద్రబాబు ఆరోగ్య విషయంలో ప్రభుత్వ వైద్యుల బృందం, జైలు అధికారుల మధ్య విభేదాలు పొడచూపే అవకాశం కనిపిస్తోంది. వైద్యులు వారి విధులు వారు సక్రమంగా నిర్వర్తిస్తున్నా..జైలు అధికారులు కూడా వారి విధులను ఎవరి ఆదేశాలకు అనుగుణంగా నిర్వర్తిస్తున్నారనే అనుమానాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. ఒక మాజీ ముఖ్యమంత్రికి జైలులో అందుతున్న వసతులు, అతని వయస్సు, ఆరోగ్యం, ప్రస్తుతం వస్తున్న చర్మవ్యాధులు, కంటి సమస్యలు ఇవన్నీ చంద్రబాబుపై ఆరోగ్యం తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మరో వైపు వాయిదాలు పడుతున్న కోర్టుకేసులతో చంద్రబాబు సార్వత్రిక ఎన్నికలకు బయటకు వచ్చే అవకావాలు కనపించడంలేదు. ఈ పరిస్థితి ముందు ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి..!