సచివాలయ ఉద్యోగులను మాతృశాఖల్లో విలీనం చేయండి..!


Ens Balu
10
visakhapatnam
2025-11-17 20:44:33

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తాము నియామకమైన మాతృశాఖల్లోకి విలీనం చేయాలని.. ఆరున్నరేళ్లుగా కోల్పోయిన ప్రయోజనాలన్నీ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.. కూటమి ప్రభుత్వం 10 మంది మంత్రులతో కూడిన క్యాబినెట్ సబ్ కమిటీ వేసినా.. నేటికీ సదరు కమిటీ ఎలాంటి అంశాలను తెరపైకి తీసుకురాకపోవడంతో తమకు అన్యాయం జరిగేలా ఉందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఈ విషయంలో తమకు ఎలాంటి అన్యాయం జరిగినా ఉద్యోగులం అందరం న్యాయపోరాటానికి దిగుతామని కూడా హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా దానికోసం ముందస్తు కార్యాచరణ కూడా సిద్దం చేసుకోవడం..దానిపై సామాజిక మాద్యమాల్లో పెద్ద చర్చకు తెరలేపడంతోపాటు.. అవకాశం కుదిరినపుడల్లా ప్రత్యేక సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకొని దానిపై మాట్లాడుతుండటం ఇపుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ అవుతోంది..!

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే తమకు రావాల్సిన ప్రయోజనాలన్నీ కోల్పాయామనుకుంటే.. ఇపుడు కూటమి ప్రభుత్వంలో కూడా ప్రయోజనాలు కోల్పోయేలా ఉన్నామని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీ వేసినా.. దానిపై ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం సేకరించారు.. ఆయా ప్రభుత్వశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలతో ఏమేమి చర్చించారనే విషయాన్ని నేటికీ ఒక్క మంత్రి కూడా ప్రకటించకపోవడం పట్ల ఉద్యోగులందరూ ఆందోళనగా ఉన్నారు. ఇప్పటికే ఒకసారి అధికారిక వాట్సప్ గ్రూపుల్లోనుంచి బయటకు వచ్చేసిన ఉద్యోగులు.. ఇపుడు ఎలాంటి తేడా జరిగినా న్యాయపోరాటినికి దిగాలని నిర్ణయానికి వచ్చినట్టుగా కనిస్తున్నది. దానికంటే ముందు రాజ్యాంగ ప్రతినిధిగా ఉన్న రాష్ట్ర గవర్నర్ ను కలిసి తమ బాధలను చెప్పుకొని.. అప్పటికీ న్యాయం జరగకపోతే ఒకేసారి ఉద్యోగులందరం న్యాయపోరాటానికి దిగుతామని కూడా సంకేతాలు ఇస్తున్నారు. 

అంతేకాకుండా ఇప్పటి వరకూ రాష్ట్రప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల ఏదైనా ప్రయోజనాలు కల్పించలేదు.. అలాంటి ప్రయోజనాలను ఆర్టికల్ 309, రూల్ 28, ఆర్టికల్ 16 ఆధారంగా సచివాలయ ఉద్యోగులకు జరిగిన అన్యాయంపై కోర్టులో కేసుల వేసి న్యాయపోరాటం చేయాలని నిర్ణయానికి వచ్చి.. ఆ దిశగా కార్యాచరణ కూడా సిద్దం చేసుకుంటున్నారట. అయితే దానికంటే ముందు రాజ్యాంగానికి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ కి అధిపతిగా ఉన్న రాష్ట్ర గవర్నర్ ను కలిసి గత ఆరున్నరేళ్లు తాము కోల్పియి ప్రయోజనాలన్నీ వివరించాలని కూడా ఉద్యోగులు సిద్ద పడుతున్నారు. దానికోసం గవర్నర్ అపాయింట్ మెంట్ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. గవర్నర్ ను కలిసేందకు ఉన్న అన్నిదారులనూ ఉద్యోగులు వెతుకుతున్నారు. ఇప్పటి వరకూ నోషనల్ ఇంక్రిమెంట్లు కలపలేదని.. సర్వీసు రూల్స్ అమలు చేయలేదని.. ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకుండా వదిలేశారని.. పీఆర్సీ ప్రయోజనాలు కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదనే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడం ద్వారా తమ సమస్యకు పరిష్కార మార్గం దొరకుతుందని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. 

ఈ మధ్య కాలంలో రాష్ట్రప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడాని సబ్ కమిటీ వేసినా.. నేటికీ ఏ విషయమూ బయటకు రాలేదు.. మరోప్రక్క ఇదే సచివాలయశాఖలోని కొన్ని శాఖల ఉద్యోగులకు పదోన్నతులు కల్పించినా.. వారికి ప్రత్యేక ఇంక్రిమెంట్లు ఏమీ ఇవ్వకుండా మాత్రమే ప్రమోషన్ కల్పించారని ఉద్యోగులు ఆందోళన చెందున్నారు. ప్రయోజనాలు లేని పదోన్నతులు తాము ఏం చేసుకోవాలని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక సచివాలయ మహిళా పోలీసులకైతే అసలు ప్రభుత్వశాఖ లేకుండా గాల్లో ఉంచి.. అనధికారికంగా పోలీసు విధులు, స్టేషన్ విధులు అప్పగిస్తున్నారని కూడా వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలా చూసినా సచివాలయ ఉద్యోగులందరం శ్రమదోపిడీకి గురవతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ముందున్న అన్ని దారులూ మూసుకుపోయాయని ఇపుడు తమకు న్యాయం జరగాలంటే అదొక్క న్యాయపోరాట మాత్రమేనని కూడా చెబుతున్నారు. చూడాలి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాదిన్నర తరువాత సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి క్యాబినెట్ సబ్ కమిటీ వేసి.. ఏ స్థాయిలో న్యాయం చేస్తుంది.. ఎన్ని ప్రయోజనాలు ఇస్తుంది.. ఇంకెన్ని ప్రయోజనాలు తొక్కిపెడుతుంది.. నిజంగా సచివాలయ ఉద్యోగులు కోర్టు వెళితే వారికి ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదిరిగా విజయం సిద్ధిస్తుందా అనేది వేచి చూడాల్సిఉంది..!