ప్రభుత్వ ఉద్యోగుల్లో సిపిఎస్ రద్దు ప్రకంపన


Ens Balu
929
Visakhapatnam
2023-11-05 17:58:33

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల చిరకాల కోరిక సిపిఎస్ రద్దు.. పాత పెన్షన్ విధానం ముద్దు. ఇపుడు అదే విషయాన్ని తెలుగుదేశం-జనసేన పార్టీలు ఉమ్మడిగా ఈ నిర్ణయాన్ని అమలుచేయాలని చూస్తున్నాయి. ఏపీలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాల ఓట్ల ద్వారా సుమారు 25 నుంచి 35 సీట్లు గెలిచేటన్ని ఓట్లు రాబట్టొచ్చు ఏ రాజకీయ పార్టీ అయినా. అయితే గత ఎన్నికల్లో వైఎస్.జగన్ సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ ఇస్తానని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తరువాత జిపిఎస్ ను అమలు చేయడంతో ప్రభుత్వ ఉద్యోగులు దానిని జీర్ణించుకోలేకపోతున్నారు. నిరసనతో రగిలిపోయిన ఉద్యోగులు తమ ఓటు యొక్క బలమేంటో రాష్ట్రంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజం చేసి చూపించారు కూడా. అయితే ఇపుడు మళ్లీ సిపిఎస్ రద్దు చేస్తే ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాల ఓట్లన్నీ నేరుగా టిడిపి-జనసేన ఓటు బ్యాంకుగా మలుచుకోవచ్చుననే పవన్ కళ్యాణ్ ఆలోచనకు టిడిపి అధినేత ఆమోదం తెలిపినట్టు వార్తలొస్తున్నాయి. ప్రధాన మీడియాలో వచ్చిన ఈ వార్త ఆదివారం ఒక్క రోజే అతి పెద్ద చర్చకు సామాజిక మాద్యలో తెరలేపింది. 

అంతేకాదు సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ అమలు చేస్తారనే విషయానికి సంబంధించిన వీడియో క్లిప్పింగులు, పేపర్ కటింగ్ లు, మొబైల్ యాప్ న్యూస్ కార్డ్ లు ఉద్యోగుల సోషల్ మీడియా మాద్యమాల్లో విపరీతంగా ట్రోల్ అయ్యాయి. అదే సందర్భంలో ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులు కూడా వారి వారి జిల్లాల్లో అంతర్గతంగా సమావేశాలు కూడా పెట్టుకొని సిపిఎస్ రద్దు చేసే పార్టీలకే తమ మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు కూడా నిఘా వర్గాలకు సమాచారం అందిందని చెబుతున్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత రివర్స్ పీఆర్సీ ఇవ్వడాన్ని ఉద్యోగులు ప్రధాన నష్టంగా భావిస్తున్నారు. కనీసం గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని ఉద్యోగుల మద్దతు అయినా లభిస్తుందా అంటే వారి సర్వీసులు కూడా రెండేళ్లకు రెగ్యులర్ చేయాల్సింది తొమ్మిది నెలలు అదనంగా పనిచేయించుకున్న తరువాత రెగ్యులర్ చేశారు. దీనితో వారికి రెండు డిఏలు, తొమ్మిది నెలల పుల్ పేస్కేలు కోల్పోయారు. పైగా ఉద్యోగాలు రెగ్యులర్ అయిన తరువాత ఇవ్వాల్సిన రెండు ఇంక్రిమెంట్ల విషయంలో కూడా ప్రభుత్వం నేటికీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. అంతేకాకుండా వీరికి పీఆర్సీ అమలు చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం అరియర్స్ మాట ఎత్తకుండా స్థబ్దుగా ఉండిపోయింది. 

ఈ విషయాన్ని కూడా ఉద్యోగ సంఘాల సమావేశాల్లో తీవ్రంగా చర్చించి జనసేన పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ ప్రభుత్వ శాఖను కూడా అభివద్ధి చేయడంతోపాటు, మరికొన్నిశాఖల ఉద్యోగాలను ఈ శాఖకు అనుసంధానం చేసి ఉద్యోగాల సంఖ్య పెంచాలని కూడా వారి సమావేశంలో చర్చకు వచ్చినట్టు చెబుతున్నారు. మొన్నటి వరకూ టిడిపి అధికారంలోకి వస్తే గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉంటుందా..? ఊడుతుందా..? అని ప్రచారం చేశారంటూ అపవాదు మూటగట్టుకున్న టిడిపీయే ఇపుడు ప్రస్తుతం ఉన్న 19విభాగాలను, 23 విభాగాల సిబ్బందికి పెంచాలని నిర్ణయించే దిశగా చర్యలు తీసుకుంటారనే ప్రచారం ఆదివారం పెద్ద ఎత్తున ఉద్యోగులకు చేరింది. ప్రస్తుతం ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు పదోన్నతుల విషయంలో ఒక విధి విధానం లేకుండా ఇస్తున్న అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు వద్ద ప్రత్యేకంగా చర్చించగా, ప్రభుత్వ పరిపాలనా విధానాలపై మంచి పట్టు సాధించారని  చాలా ముఖ్యమైన సూచనలు, సలహాలు ఇచ్చారని చంద్రబాబు పవన్ ను మెచ్చుకున్నారట. గతంలోనే పవన్ కళ్యాణ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు వారి సమస్యలు మాకు చెప్పినా చెప్పకపోయినా మా ప్రభుత్వం ఏర్పాటైతే ఖచ్చితంగా వాటిని నెరవేస్తామని ప్రకటించారు. 


ఆ క్రమంలో ఇపుడు చంద్రబాబుతో మేనిఫెస్టో విషయమై చర్చించినపుడు ముఖ్యంగా ఉద్యోగుల సిపిఎస్ రద్దు, ప్రతీ ఏటా జాబ్ కేలండర్ లో ఉపాధ్యాయ డిఎస్సీ, ఏపిపిఎస్సీకి విశేష అధికారాలు ఇస్తూ నోటిఫికేషన్లు, అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ఉద్యోగులకు పదోన్నతులు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాల విధానం రద్దు, అధికారంలోకి వచ్చిన వెంటనే పిఆర్సీ తదితర అంశాలు చర్చించారనే విషయాన్ని తెలుసుకున్న ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తూ ఆలోచనకు, చర్చకు తెరలేపారని తెలిసింది. వీరిద్దరి కలయికలో వచ్చిన చర్చ ఇంత పెద్దగా రాష్ట్రవ్యాప్తంగా దావానంలా వ్యాపించడం విశేషం. అయితే వీరి ఉమ్మడి మేనిఫస్టో వచ్చేంత వరకూ ప్రస్తుతానికి ఈ ట్రోలింగ్స్ ఆగేటట్టుగా  కనిపించడం లేదు. పైగా నవంబరు నెల కావడం పిక్నిక్ లు జరిగే సమయం కావడంతో ఉద్యోగులంతా ఒకే చోటకు చేరి ఈ విషయంలో పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. చూడాలి ఏం జరుగుతుందనేది..!