డెమోక్రసీ ఇన్ డేంజర్ తో ప్రజలను చైతన్యవంతం చేయాలి


Ens Balu
52
Vijayawada
2023-11-16 09:05:32

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపడుతున్నప్రజా వ్యతిరేక విధానాలు, అరాచకాలు, కక్షసాధింపు వ్యవహారాలన్నింటినీ ప్రజలందరూ తెలుసుకునేలా డెమెక్రసీ ఇన్ డేంజర్ కార్యక్రమం ద్వారా చైతన్యపరచాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చన్నాయుడు పేర్కొన్నారు. గురువారం విజయవాడలో తెలుగు యువత నాయకులు ఆడారి కిషోర్ కుమార్ ఆధ్యర్యంలో ఉద్యమంలా సాగుతున్న డెమెక్రసీ ఇన్ డేంజర్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను ఆయన టిడిపి నేతలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఎక్కడుందని..దానిని ఎప్పుడో ప్రభుత్వ విధానాలతో బంగాళాఖాతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కలిపేసిందన్నారు. ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే ప్రభుత్వం అలుపెరగకుండా శ్రమిస్తోందన్నారు. ఇలాంటి సమయంలో ప్రజలను ఉత్తేజపరచడానికి, ఆలోచించే విధంగా చేయడానికి డెమెక్రసీ ఇన్ డేంజర్ కార్యక్రమాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు ఎంతగానో ఆలోచిపంచేస్తున్నాయని, మంచి కార్యక్రమం తలపెట్టిన కిషోర్ కుమార్ ను అభినందించారు. ఈ కార్యక్రమానికి తమవంతు సహకారం ఉంటుందన్నారు. యువనాయకులు ఆడారి కిషోర్ కుమార్ మాట్లాడుతూ, అధికారం చేతిలో ఉందనే ఒకే ఒక్క గర్వంతో అరాచకపరిపాలన చేస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు. ముఖ్యంగా యువతను ఆలోచింపచేయడానికి, ఉద్యోగులు, మేధావుల యొక్క అభిప్రాయాలను తెలుసుకోవడానికి, వారిలో చైతన్యం నింపడానికి డెమెక్రసీ ఇన్ డేంజర్ కార్యక్రమాలను అన్ని నియోజవర్గ కేంద్రాల్లోనూ నిర్వహిస్తున్నామన్నారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందితే ఇపుడు వైఎస్సార్సీపీ పాలనలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఈ పరిస్థితి మారాలంటే ప్రజల్లో మార్పురావాలన్నారు. దానికోసం విశాఖ జిల్లా మొదలుకొని అన్ని ప్రాంతాల్లోనూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో, అమరావతి, విజయవాడకు చెందిన టిడిపి రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.