ఆ శాఖలకే పదోన్నతుల యోగ(శాప)ం..!


Ens Balu
426
Visakhapatnam
2023-11-25 07:23:20

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని గ్రామ, వార్డు సచివాలయశాఖలో కొందరు ఉద్యోగులకు పదోన్నతుల యోగం వరిస్తే..మరికొందరిని పదోన్నతి వ్యవస్థలేని శాపం వెంటాడుతోంది. ఏంటి ఈ వింత అనుకుంటున్నారా..అవును మీరు చదువున్నది అక్షర సత్యం. భారతదేశంలోనే ఆంధ్రపదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయశాఖలోని కొన్ని లోపాలను సరిచేయకపోవడం వలన ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. మరికొందరు ఉద్యోగులు అమితానందం చెందిన పరిస్థితీ నెలకొంది. సచివాలయ శాఖలో మొత్తం 19 ప్రభుత్వ శాఖల ఉద్యోగులు పనిచేస్తుంటే..అత్యధికంగా వైద్యఆరోగ్యశాఖలో పనిచేసే ఏఎన్ఎం లకు ఇన్ సర్వీసు క్రింద స్టాఫ్ నర్స్ ట్రైనింగ్ ఇచ్చారు. ఇక హార్టికల్చర్, పశుసంవర్ధకశాఖ సహాయకులకు పదోన్నతులు ఇచ్చారు. అయితే సచివాలయశాఖలో రెండేళ్లు సర్వీసు ప్రొబేషన్ పూర్తిచేసుకున్న రెగ్యులర్ ఉద్యోగులందరికీ ఈశాఖలో సర్వీసు నిబంధనలు, పదోన్నతుల వ్యవస్థలను ఏర్పాటు చేయలేదు. ఆ కోవలోకే ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వస్తున్నారు. ఇక మహిళాపోలీసులకు సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఉన్నప్పటికీ వీరి వ్యవహారం కోర్టులో ఉన్నందున వీరికి కూడా పదోన్నతులు వరించలేదు.  అంతేకాదు వీరి ఉద్యోగాలు ఇపుడు ఉంటాయా..వేరే ప్రభుత్వ శాఖలో విలీనం అవుతాయోకూడా తెలియని పరిస్థితి నెలకొంది. అటు వ్యవసాయశాఖ, ఉద్యానవన శాఖ ఉద్యోగులకు ఇన్ సర్వీసు వ్యవస్థ ఏర్పాటు చేస్తారో లేదో తెలియకపోయినా..వీరికి పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కావడంతో వీరంతా ఆనందంగా ఉన్నారు.

 రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వో ఖాళీలు చాలా ఉండటంతో ఆ ఖాళీలను విఆర్ఏలుగా పనిచేస్తున్నవారికి పదోన్నతి కల్పించి విఆర్ఏలుగా మార్చింది. ఇక పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నవారిలో గ్రేడ్-6 పంచాయతీ కార్యదర్శిలు అనగా ప్రస్తుతం డిజిటల్ అసిస్టెంట్లు, తరువాత ప్రస్తుత గ్రేడ్ గ్రేడ్-5 పంచాయతీకార్యదర్శిలు, సర్వేయర్లు, వీఆర్వోలు, నగర పరిధిలో వార్డు సెక్రటరీలు, శానిటేషన్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులు, సెరీ కల్చర్ అసిస్టెంట్లు ఉన్నారు. వీరంతా తమ పదోన్నతుల మాట ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం రెండు మూడుశాఖల ఉద్యోగులకే పదోన్నతులు కల్పించడం ద్వారా తమకు ఎప్పుడు పదోన్నతులు ఇస్తారని అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. వ్యవసాయశాఖ, ఉద్యానవన శాఖ, పట్టుపరిశ్రమశాఖ, పశుసంవర్ధకశాఖ ఉద్యోగులు కనీసం ఇన్ సర్వీస్ ఛానల్ ఏర్పాటు చేస్తే దానితోనైనా పొందడానికి ఆస్కారం వుంటుందని వాపోతున్నారు. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయశాఖలో ఒక్క ఏఎన్ఎంలకు మాత్రమే ఇన్ సర్వీసులో స్టాఫ్ నర్స్ ట్రైనింగ్ ఇచ్చి మళ్లీ వారి విధులను సచివాలయాల పరిధిలోనే పనిచేసే విధంగా వెనక్కి పంపారు. రానున్న రోజుల్లో వీరికి పదోన్నతులు వస్తే వీరు పీహెచ్సీల్లోని స్టాఫ్ నర్సులుగా వెళ్లే అవకాశాలుంటాయని, వీరి స్థానంలో కొత్త ఏఎన్ఎంల భర్తీ జరగవచ్చునని చెబుతున్నారు. 

ప్రస్తుతం 22460 పేస్కేలు తీసుకునే సచివాలయ ఉద్యోగులకు పదోన్నతి లభించిన తరువాత ఏకంగా రూ.34 వేలు దాటి పేస్కేలు తీసుంటున్నారు. దీనితో పదోన్నతులు రాని ఉద్యోగులంతా తామంతా సచివాలయ శాఖలో శాపగ్రస్తులం అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు పదోన్నతుల వ్యవస్థకే నోచుకోని డిజిటల్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ల బాధలైతే వర్ణణాతీతంగా ఉన్నాయి. కనీసం కొన్ని శాఖలకు ప్రమోషనల్ ఛానల్ ఏర్పాటు చేశారు..మేము దానికి కూడా నోచుకోకుండా అన్ని రకాల ఇంజనీరింగ్ పనులనూ చేయాల్సి వస్తుందని కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎన్నో వేల రూపాయల జీతాలు వచ్చే ప్రైవేటు ఉద్యోగాలను వదులుకొని ఈ శాఖలోకి రెగ్యులర్ ఉద్యోగమనే ఆశతో వచ్చిన మాకు తీవ్ర నిరాస మిగిలిందని వాపోతున్నారు. ఇప్పటికే రెండేళ్లలో రెగ్యులర్ కావాల్సిన తమ సర్వీసులు అదనంగా 9 నెలలు పనిచేసినపుడు అపుడు పేస్కేలు, సుమారు రెండు డిఏలు కోల్పోయామని, పీఆర్సీ వర్తించినట్టు పేస్కేలు పెంచినా..అందరు రెగ్యులర్ ఉద్యోగులు మాదిరిగా తమకు పేస్కేలు అరియర్స్ కూడా అందుకోలేకపోయామని చెబుతున్నారు. అసలు పీఆర్సీ అరియర్స్ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనా రాకపోవడం తమను తీవ్ర నిరాశకు గురిచేసిందని వాపోతున్నారు.

 గ్రామ, వార్డు సచివాలయశాఖలో చేరిన దగ్గర నుంచి ఇప్పటి వరకూ ఒక్కో ఉద్యోగి సుమారు రూ.2.50లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ ప్రయోజనాలు కోల్పోయామని, ఇపుడు పదోన్నతుల విషయంలో కూడా తీవ్ర అన్యాయం జరుగుతోందని అంటున్నారు. మొత్తం 19శాఖల ఉద్యోగుల్లో రెండు శాఖల ఉద్యోగులకు పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కాగా, ఒక శాఖ ఉద్యోగులకు ఇన్ సర్వీస్ వ్యవస్థ ప్రారంభమై వారి శిక్షణ కూడా పూర్తిచేసుకున్నారు. మిగిలిన శాఖల్లో కూడా అవకాశం ఉన్నమేర ఇన్ సర్వీస్, ప్రమోషన్ ఛానల్ వర్తిపంజేస్తే ఇతర శాఖల ఉద్యోగులకు కూడా ప్రయోజనం చేకూరే అవకాశం వుంది. లేదంటే అంతర్ జిల్లాల బదిలీల్లో జిల్లాలు మారిన వారికి, అసలు పదోన్నతుల ప్రక్రియే ప్రారంభం కాని శాఖల ఉద్యోగులకు తీవ్ర నష్టం జరిగే అవకాశం వుంది. ఈ విషయంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి..!