గ్రామ, వార్డు సచివాలయాలు మిన్న..వచ్చే ఆదాయం సున్నా..!


Ens Balu
232
Visakhapatnam
2023-11-28 17:40:04

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేవశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజలకు అంతంత మాత్రంగానే సేవలు అందుతున్నాయి. ఫలితంగా రోజూ అత్యంత పెద్ద మొత్తంలో ప్రభుత్వం ఆదాయం కోల్పోతున్నది.  గ్రామాల్లో 12 శాఖలు, పట్టణాల్లో 16 శాఖల సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో 14వేల 5 సచివాలయాల్లో సుమారు లక్షా 35వేల మంది ఉద్యోగులున్నా.. ప్రభుత్వ ఖజానికి ఆదాయం మాత్రం తక్కువగానే వస్తున్నది. సచివాలయాల ఆదాయాన్ని ఆది నుంచి మీ-సేవా కేంద్రాలు గండి కొట్టేస్తున్నాయి. ముఖ్యంగా రెవిన్యూ ఆధారిత సర్వీసులకు ప్రజలు ఎక్కువగా ఈ కేంద్రాలనే సంప్రదిస్తున్నారు. దీనితో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం, పేరూ పోతున్నాయి. సచివాలయాల్లో ప్రభుత్వం 545 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి చెందిన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్రప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన సేవలు బాగానే అందుతున్నా మిగతా సేవలు అందించడంలో వెనుకబాటుగానే ఉన్నాయని చెప్పాలి. వాస్తవానికి ఏ ప్రభుత్వ కార్యాలయంలోనూ లేనంతగా గ్రామ, వార్డు సచివాయాల్లో ఇంటిముంగిటే ప్రభుత్వశాఖల సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ఇక్కడ అందే సేవలపై ప్రజలకు అవగాహన లేకుండా పోతున్నది. ఈ విషయమై మండల స్థాయిలో ఎంపీడీఓలు, డివిజన్ స్థాయిలో డిఎల్డీఓలు, జిల్లా స్థాయిలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు కూడా పూర్తిస్థాయిలో దృష్టిసారించిన పాపన పోలేదు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పనులు, ఆదాయం రాని పనులను అత్యధికంగా సచివాలయ సిబ్బందికి అప్పగిస్తున్న ప్రభుత్వం ఆదాయం వచ్చే పనులను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయాల్లో అందుబాటులో ఉన్న సేవలన్నింటిపైనా గ్రామాల్లోనూ, పట్టణాల్లో వార్డుల్లోనూ ప్రత్యేక అవగాహన కల్పిస్తే రోజుగకి సగటున ఒక్కో సచివాలయానికి రూ.5 వేల నుంచి 10వేల రూపాయల వరకూ ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఆదిశగా చర్యలు తీసుకోవడం లేదు.

సాంకేతిక ఇబ్బందులు మోకాలడ్డు..
గ్రామ, వార్డు సచివాయాల్లో 19శాఖల సిబ్బంది అందుబాటులో ఉన్నా ఒక్కో సచివాలయానికి కేవలం రెండు మాత్రమే కంప్యూటర్లు ఉండటం, అందులో ఒకటి రెగ్యులర్ గా డిజిటల్ అసిస్టెంటే వినియోగించడం, మరొకటి సెక్రటరీ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్లు వినియోగిస్తుండటంతో ఇతర ప్రభుత్వ సేవలు అందించడానికి కంప్యూటర్లు లేకుండా పోతున్నాయి. ఇపుడు ఏ దృవీకరణ కావాలన్నా ఆన్ లైన్ లోనే వివరాలు నమోదు చేయాల్సి ఉండటం, దానికి కంప్యూటర్లు లేకపోవడం వలన క్రమ సంఖ్యలో ఉన్న డిజిటల్ అసిస్టెంట్లే ఒక రోజుకి ఎన్ని చేయగలరో అన్నే చేస్తున్నారు. దానికితోడూ ఆధార్ కేంద్రాలు కూడా సచివాలయాలకే ఇవ్వడంతో అధిక ఆదాయం వచ్చే ప్రధాన సేవలు అందించే వీలు లేకుండా పోతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని సచివాలయాల్లో ఒక్కో కంప్యూటర్ ఉన్నచోట మరీ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గత్యంతరం లేనివారంతా చచ్చినట్టు మీ-సేవా కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. అందులోనూ సచివాయాల్లో తీసుకునే ధరకంటే మీ సేవా కేంద్రాల్లో రెండింతలు అధికంగా ఉండటంతో ప్రజలకు ఆర్ఢిక ఇబ్బందులు కూడా తప్పడం లేదు. ఒక్కోసారి రెవిన్యూ ఆధారిత దృవీకరణ పత్రాలకు ఆమ్యామ్యాలు కూడా చెల్లించుకోవాల్సి వస్తున్నది.

రికార్డులకే పరిమితం అవుతున్న మిగులు సిబ్బంది..
సచివాలయాల్లో సరిపడినన్ని కంప్యూటర్లు లేకపోవడం, ఉన్నచోట స్టేషనరీలు సక్రమంగా లేకపోవడం, అన్నీ ఉన్నచోట సిబ్బంది లేకపోవడం తదితర కారణాల వలన ప్రధాన సేవలు గ్రామ స్థాయిలో అందకుండా పోతున్నాయి. గతంలో కంటే మిన్నగా సచివాలయాల్లో సేవలు అందుతున్నా..ఆదాయం మాత్రం రావడం లేదు. ప్రభుత్వానికి ఆదాయం కూడా సచివాలయాల ద్వారా వస్తే మరిన్ని సేవలు ప్రజల ముందుకి తీసుకురావడానికి వీలుపడుతుంది. సాంకేతి పరమైన ఇబ్బందులున్న చోట మిగిలిన సిబ్బంది రికార్డుల పనికే పరిమితం కావాల్సి వస్తున్నది. వాస్తవాని ఈ విషయాలన్నీ జిల్లా స్థాయిలో కలెక్టర్లు, మండలస్థాయి అధికారులకు తెలిసినప్పటికీ ప్రభుత్వం దృష్టికి అసలు విషయాన్ని తీసుకెళ్డం లేదు. దీనితో ప్రభుత్వం అందించాలనుకున్న సేవలు ప్రజలకు చేరడం లేదు. అటు ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరడం లేదు.

సచివాలయాలను వేధిస్తున్న సిబ్బంది కొరత
రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది కొరత వేధిస్తున్నది. ప్రభుత్వలు అందించడానికే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డిజిటల్ అసిస్టెంట్ పోస్టులు చాలా చోట్ల ఖాళీగా ఉండిపోయాయి. ప్రభుత్వం కొన్ని చోట్ల కారుణ్య నియామకాల ద్వారా ఖాళీలు భర్తీచేసినప్పటికీ అత్యంత అవసరం ఉన్న డిజిటల్ అసిస్టెంట్, పంచాయతీ సెక్రటరీ లాంటి పోస్టులు భర్తీ కావడంలేదు. దీనితో ఉన్న సిబ్బందే పక్క సచివాయాలకు వెళ్లి అత్యవసర సేవలు ఏ విధంగా ఆన్ లైన్ ద్వారా చేయాలో తెలుసుకొని వాటిని చేస్తున్నారు. చాలా మంది పంచాయతీ కార్యదర్శిలకు ఒక్కొక్కరికి రెండు మూడు పంచాయతీలు ఇన్చార్జిలు అప్పగించడంతో ప్రధాన అవసరాలు గ్రామపరిధిలో తీరడం లేదు. అలాగని కొన్నిచోట్ల సిబ్బంది ఉన్నా పనులు జరగడం లేదు. దీనింతటికీ పర్యవేక్షణ లోపమే ప్రధానంగా కనిపిస్తున్నది. జిల్లా స్థాయిలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డివిజన్ స్థాయిలో డిఎల్డీఓలు, మండల స్థాయిలో ఎంపీడిఓలు పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తే ఉన్న కొద్దిపాటి సిబ్బందితోనైనా పూర్తిస్థాయిలో సవలు అందించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని కూడా పెంచే ఏర్పాటు చేయవచ్చు. కానీ ఆదిశగా ఎక్కడా చర్యలు తీసుకుంటన్న దాఖలాలు కనిపించడం లేదు. దానికితోడు సిబ్బందికి ఎన్నికల విధులు అదనంగా వచ్చి చేరడం కూడా సేవల విధులకు ఆటంకం ఏర్పడుతుంది. ఈ మొత్తం వ్యవహారం రాష్ట్ర అధికారులు దృష్టి సారిస్తే తప్పా పరిపాలన, తద్వారా సేవలు.. ఆపై ప్రభుత్వానికి ఆదాయం సమకూరే అవకాశం లేదు..!