జనసేనలోకి చేరేందకు చాలా మందే వస్తారు..ఎమ్మెల్సీ వంశీ


Ens Balu
43
Amaravati
2023-12-27 16:40:12

వైఎస్సార్సీపి నుంచి జనసేనపార్టీలో చేరేందుకు చాలా మందే సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్సీ వంశీక్రిష్ణ శ్రీనివాస్ సంచలన ప్రకటన చేశారు. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన తీర్ధం పుచ్చుకున్న ఆయన బయటకు వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీలో తనకు ఎలాంటి లోటూ రాలేదని, తానుకోరుకున్న స్థానం నుంచి ఎమ్మెల్యే పోటీచేసే అవకాశం లేకపోవడం వలన తాను పార్టీ మారాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తనతోపాటు, నాయకులు, క్యాడర్, కొంతమంది ముఖ్యమైన నేతలు కూడా జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వారందరినీ పార్టీలోకి తానే చేర్చుతానని కూడా చెప్పారు. వైఎస్సార్సీపి ప్రాధమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా సమర్పించినట్టు ఆయన తెలియజేశారు. తన అనుచరులు, అభిమానులు, కుటుంబ సభ్యుల కోరిక ఎమ్మేల్యే కావడమని..దానికి అనుగుణంగానే నడుచుకుంటున్నానని చెప్పారు. పార్టీలో తనను కాదని దద్దమ్మలాంటి వ్యక్తులకు ప్రత్యేక స్థానం కల్పించారనే మాటకు తాను కట్టుబడే ఉన్నానని, వాళ్లెవరో 2024 ఎన్నికల తరువాత తెలుస్తుందని అన్నారు. విశాఖ నగరంలో ఎక్కడి నుంచైనా తాను పోటీ చేస్తానని చెప్పారు. అంతకు ముందు పార్టీలో చేరిన తరువాత ఆయన మాట్లాడుతూ, తాను తన సొంతింటికి వచ్చిన అనుభూతి కలుగుతుందని..తనకు పవన్ కళ్యాణ్ కు ఎప్పటి నుంచో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకముందు నుంచి తాను ఆయన అభిమానని, ఏ సినిమా వచ్చినా తొలిరోజే సినిమా చూస్తానని కూడా చెప్పారు. వంశీక్రిష్ణ శ్రీనివాస్ చేసిన ప్రకటన ఇపుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది. దీనితో ప్రస్తుతం అధికార వైఎస్సార్సీపి పార్టీలో అసంతృప్తులు ఎవరున్నారనే విషయమై పార్టీ అధినాయకత్వం ఆరా తీస్తుందనే వాదన కూడా తెరమీదకు వచ్చింది. ప్రజారాజ్యం పార్టీ నుంచి వంశీక్రిష్ణ శ్రీనివాస్ చాలా మంది నేతలతో చాలా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు. ఒకరంగా విశాఖతోపాటు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా యాదవుల్లో మంచి పట్టున్న నాయకుడిగా వంశీక్రిష్ణ శ్రీనివాస్ గుర్తింపు పొందారు.