విశాఖ వైఎస్సార్సీపీలో ఒక్కో నాయకుడూ పార్టీకి రాజీనామాలు చేస్తూ వస్తున్నారు. మొన్న ఎమ్మెల్సీ వంశీక్రిష్ణ శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేయగా..ఈరోజు బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ సీతం రాజు సుధాకర్ కూడా పార్టీ రాజీనామా చేశారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, కార్పోరేషన్ చైర్మన్ రెండిటికీ రాజీనామా చేస్తూ, తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డికి పంపినట్టు తెలిసింది. ఈయన రాజీనామాను విరమించే విషయంలో బుజ్జగింపులు చేపట్టినా ఫలితం లేకపోయింది. సీఎం వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడుగా వున్న సీతంరాజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడి ఓడిపోయారు. అయితే ఆ సమయంలో ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు తన గెలుపుకోసం కనీసం పనిచేయలేకపోవడం వలనే తాను ఓడిపోయానని ఆయన పలు మార్లు తమ కార్యకర్తల ముందు ఆవేదన వెల్లగక్కారు. రాజకీయాల్లోలకి వచ్చిన తరువాత పార్టీకోసం చాలా పెద్దమొత్తంలో ఖర్చుచేసినా ఫలితం లేకుండాపోయిందని..దానిని ఎక్కడ పెట్టుబడిగా పెట్టినా ఫలితాలు వేరేలా ఉండేవని ఆయన సన్నిహితులు కూడా అప్పట్లో ఆయన ముందే కుండబద్దలుగొట్టినట్టుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంతోనే విశాఖ దక్షిణం ఎమ్మెల్యే సీటు ఆశించినా ఈయనకు అధిష్టానం నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో మనస్థాపానికి గురైన ఆయన పార్టీకి, ఆయన పదవికి రాజీనామా చేశారు. దీనితో రెండు రోజుల తేడాలో ఇద్దరు నియోజవర్గస్థాయి నాయకులు అధికార వైఎస్సార్సీపి పార్టీకి రాజీనామా చేయడం విశాఖలో చర్చనీయాంశం అవుతుంది. వైఎస్సార్సీపికి రాజీనామా చేసిన వంశీక్రిష్ణ శ్రీనివాస్, జనసేనలోకి చేరన రోజే ప్రకటించారు. ఇంకా నాతోపాటు చాలామందే పార్టీని వీడుతున్నారని, వారిని జనసేనలో చేర్చుతానని చెప్పారు. అన్నట్టుగా రెండో రాజీనామా ప్రకటన సీతంరాజు సుధాకర్ చేశారు. ఈయన జనసేనపార్టీలో చేరుతారా..? మరేదైనా పార్టీలో చేరుతారా అనేవిషయంలో మాత్రం క్లారిటీ రావాల్సివుంది. ఈయనకు బీజేపి నుంచి ఎమ్మెల్యే సీటు ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. సెంటిమెంటుగా, బ్రాహ్మణులు, యాదవుల మనస్థాపాలు, ఆందోళనలు చాలా విషయాల్లో ప్రభావాన్ని చూపిస్తాయి. విశాఖ వైఎస్సార్సీపీలో కూడా అదే సామాజిక వర్గానికి చెందిన నాయకులే రాజీనామాలు చేయడంతో ఈవిషయం రాష్ట్రవ్యాప్తం హాట్ టాపిక్ అయ్యింది.