ఉద్యోగులకు జీతాలు పడలేదు.. రిటైర్ అయినవారికి పెన్షన్లు రాలేదు


Ens Balu
130
Visakhapatnam
2024-01-04 04:48:40

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా జీతాలు రాలేదు..రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్లూ పడలేదు. ప్రభుత్వం సంక్షేమ పథకాల నగదు బదిలీలకు ఇచ్చిన ప్రాధాన్యత ఉద్యోగులకు ఒకటోతేదీన జీతాలు ఇచ్చే విషయంలో మాత్రం ఎందకనో కాస్త ఆశ్రద్ధ చేస్తున్నట్టుగానే కనిపిస్తున్నది. సమయానికి జీతాలు రాకపోవడం వలన ఉద్యోగులు ప్రతీనెలా 2వ తేదికి కట్టాల్సిన హౌసింగ్ లోన్, పర్శనల్ లోన్, ఇతరత్రా ఈఎంఐలకు పెనాల్టీలు కట్టాల్సి వస్తున్నది. అలాగని తేదీలు కాస్త వెనక్కి మార్చుకున్నా అదే సమయానికి జీతాలుగానీ పెన్షన్లు గానీ పడతాయనే గ్యారంటీ లేదంటున్నారు ఉద్యోగులు. ఇక రిటైర్ అయిన ఉద్యోగులైతే ఈ వయసులో కూడా తమ పెన్షన్ ఎప్పుడు అకౌంట్లలోకి పడుతుందాని ఎదురుచూసి..ఆ నెల నిత్యవసరాలకు అప్పులు చేసుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ప్రతీనెలా ట్రజరీలో ఏదో ఒక సాంకేతిక కారణం చూపి ఉద్యోగుల జీతాల బిల్లలు ఆలస్యం చేస్తున్నారు. అవి ప్రభుత్వ ఆదేశాలో లేదంటే, నిజంగానే సాంకేతిక సమస్య తలెత్తుందో అర్ధం కావడం లేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ సాంకేతిక కారణమే అయితే నగదు బదిలీ పథకాలకు, వాలంటీర్ల గౌరవ వేతనాలకు మాత్రం టంచనుగా ఒకటో తేదీనే ఎలా వారి అకౌంట్లలోకి డబ్బులు పడుతున్నాయని ప్రశ్నిస్తున్నారు ఉద్యోగులు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ఒకటోతేదిన జీతం, పెన్షను అందుకోడం పట్టుపమని రెండు మూడు నెలలు కూడా చూడలేకపోతున్నామని అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

జీతాలమీదే ఆధారపడే ఉద్యోగులు, పెన్షన్ల సమస్యలు వారి బ్యాంకుల ఈఎంఐల ఇబ్బందులూ దృష్టిలో ఉంచుకొనైనా సమయానికి అకౌంట్లోకి జీతాలు సమచేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఆది నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్ ఉద్యోగుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న తీరు వచ్చే ఎన్నికల్లో తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఉద్యోగులు, పెన్షనర్ల విషయంలో ఏ ప్రభుత్వంలోనూ ఇంత ఆలస్యం చూడలేదని చెబుతున్నారు. కావాలని చేస్తున్నారో..ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని చేస్తున్నారో అర్ధం కావడంలేదని, కానీ ప్రతీనెలా జీతాలు, పెన్షన్లు మాత్రం ఆలస్యంగానే వస్తున్నాయని చెబుతున్నారు. ప్రజల్లో భాగమే ఉద్యోగులని, అలాంటి వారిని పెడచెవిన పెట్టడం వలన రానున్న రోజుల్లో మరిన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయని, కొద్దో గొప్పో వచ్చే సహకారం కూడా రాకుండాపోయే ప్రమాదం కూడా లేకపోలేదని వాదన బలంగా వినిపిస్తున్నది. రెండవ శనివారాలు, ఆదివారాలు, పండుగరోజుల్లో కూడా ప్రత్యేక జూమ్ మీటింగులు, శిక్షణా కార్యక్రమాలు, అవేమీ లేకపోతే టెలీ కాన్ఫరెన్సులు, అవీ కుదరకపోతే యాప్స్ లో డేటా అప్లోడ్ పనులు అప్పగించే ప్రభుత్వం సమయానికి ఎందుకు జీతాలు, పెన్షన్లు ఇవ్వడం లేదో చెప్పగలదా అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నిస్తున్నారు ఉద్యోగులు. చూడాలి ఎన్నికల వేల ఉద్యోగులు, పెన్షనర్లు ఈ మూడు నెలలైనా సమయానికి జీతాలు అకౌంట్లోకి సమయానికి ప్రభుత్వం వేస్తుందా అనేది..?!