ఈ నెల 22న ఓటర్ల తుదిజాబితా ప్రకటనకు సిద్దం కావాలని అధికారులను, జిల్లా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పరిశీలకులు, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జె.శ్యామలరావు ఆదేశించారు. ఆయన గురువారం జిల్లాలో పర్యటించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న సవరణ ప్రక్రియను కలెక్టర్ నాగలక్ష్మి ముందుగా వివరించారు. వివిధ అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు. ఈ సందర్భంగా పరిశీలకులు శ్యామలరావు మాట్లడుతూ, సవరణ ప్రక్రియపై నియోజకవర్గాల వారీగా ఆరా తీశారు. ప్రస్తుత పరిస్థితి, రాజకీయ పార్టీల నుంచి అందిన ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యలను తెలుసుకున్నారు. వచ్చిన అన్ని ఫిర్యాదులను పరిశీలించి, తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఓటర్ల జాబితాల తుది ప్రచురణకు చేసిన ఏర్పాట్లను తెలుసుకున్నారు. నాలుగు కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న ప్రదేశాలు, అక్కడి మౌలిక సదుపాయాలపై ప్రత్యేకంగా ఆరా తీశారు. 22న తుది జాబితాను ప్రచురించి, అన్ని పోలింగ్ కేంద్రాల్లో జాబితాలను ప్రదర్శించాలని ఆదేశించారు. జాబితాలను గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీలకు ఇవ్వడంతోపాటుగా, డిజిటల్ కాపీలను కూడా ఆన్‌లైన్లో అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతీ బిఎల్ఓ వద్దా ఓటర్ల జాబితా ఉండాలని, పబ్లికేషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఇవ్వాలని శ్యామలరావు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, డిఆర్ఓ ఎస్‌డి అనిత, నియోజకవర్గాల ఇఆర్ఓలు, ఎఇఆర్ఓలు, డిటిలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.