తీవ్ర అన్యాయానికి గురైన సచివాలయ గ్రామీణ మత్స్య సహాయకులు


Ens Balu
188
Visakhapatnam
2024-02-04 16:01:47

గ్రామ, వార్డు సచివాలయశాఖలో జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారులు చేసిన గుడ్డి తప్పుతో మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఈసారి గ్రామీణ మత్స్యశాఖ సహాయకుల వంతు వచ్చింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 మందికి పైనే ప్రమోషన్లకు సీనియారిటీ కల్పోయి తీవ్ర అన్యాయానికి గురయ్యారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో గ్రామీణ మత్స్య హాయకులకు కలుపుతామన్న గ్రేస్ మార్కులు కలపకుండా పదోన్నతులకు సీనియారిటీ లిస్టు తయారు చేస్తోంది. దీనితో ఒక్కో జిల్లాలో టాప్ ఫైవ్ లో ఉండాల్సిన సీనియర్ అభ్యర్ధులంతా అట్టడుగుకి చేరారు.  ఏపీ ప్రభుత్వం 2019లో గ్రామ, వార్డు సచివాలయశాఖను ఏర్పాటు చేసే సమయంలో అప్పటికే మత్స్యశాఖలో పనిచేస్తున్న సహాయకులకు వారి సీనియారిటీని బట్టి పది మార్కులు చొప్పున కలిపి వారిని నియమించింది. అయితే ఆ పది మార్కుల లెక్క కాగితాలపైకి ఎక్కలేదు. ఆవిషయమై జిల్లా మత్స్యశాఖ అధికారులను గ్రామీణ మత్స్యశాఖ సహాయకులు ఎన్నిసార్లు అడిగినా ఆ విషయాన్ని పెడచెవిన పెట్టారు. ఇపుడు తాజాగా ప్రభుత్వం మత్స్యశాఖలోని అసిస్టెంట్ ఫిషరీష్ ఇనెస్పెక్టర్ పదోన్నతులకు రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని గ్రామీణ మత్స్యశాఖ సహాయకుల సీనియారిటీ లిస్టు తయారు చేయాలని కమిషర్ కన్నబాబు ఆదేశాలు జారీచేశారు. 

అప్పుడు కలుపుతామన్న గ్రేస్ మార్కులు కల్పకపోవడంతో ఇపుడు ఒక్కోజిల్లాకి మూడు నుంచి ఐదుగురు సిబ్బంది సీనియారిటీ చేజారి పోయింది. జాబితాలు సిద్దం చేసే సమయంలో వివరాలు సేకరించినపుడు ఆ విషయం కాస్త బయటకు రావడంతో గ్రామ, వార్డు సచివాలయశాఖ  గ్రామీణ మత్స్యసహాయకులు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేయడం మొదలు పెట్టారు. సీనియారిటీ లిస్టు తయారుచేసే సమయంలో ఫిర్యాదులు చేయడం సరికాదని, జిల్లా మత్స్యశాఖ అధికారులు బెదిరింపులకు, సిబ్బందిపై వేధింపులకు దిగుతున్నారు. ఇలాంటి సాంకేతిక సమస్యలు ఏమైనా ఉంటే ముందుగానే పరిష్కరించుకోవాలని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం సచివాలయశాఖలో వీరి నియామకాలు జరిపినపుడే జిల్లా మత్స్యశాఖ అధికారులు అభ్యర్ధులకు వచ్చిన మార్కులు, ప్రభుత్వం కలిపిన మార్కులను ఆన్ లైన్ చేయాల్సి ఉంది. అపుడు నియామకాలు పూర్తయిపోయాయని చేతులు దులిపేసుకున్న అధికారులు ఇపుడు..వారు చేసిన తేడా పనిపై సీనియారిటీ కోల్పోవడంతో తెరపైకి వచ్చింది. 

పదోన్నతుల విషయంలో తమ సీనియారిటీ కోల్పుతున్నామని ఉద్యోగులు జిల్లాశాఖల అధికారులకు, జిల్లా కలెక్టర్ కు, రాష్ట్రస్థాయిలో కమిషనర్ కార్యాలయానికి ఫిర్యాదులు చేస్తున్నారు. జిల్లా అధికారులు, రాష్ట్ర కార్యాలయంలోని అధికారులు చేసిన తప్పుకి తమ సీనియారిటీని కోల్పోవాలా అని గ్రామీణ మత్స్యశాఖ సహాయకులు ప్రశ్నిస్తున్నారు. తమకు పదోన్నతుల్లో అన్యాయం జరిగితే, ఆతప్పుకి బాధ్యత జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏ మాత్రం అన్యాయం జరిగినా న్యాయపోరాటానికి దిగుతామని కూడా హెచ్చరిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయశాఖలో నాడు మత్స్యశాఖ జిల్లా అధికారులు చేసిన తప్పు నేడు అదే అధికారుల మెడకు చుట్టుకునేలా ఉంది. ఈ సీనియారిటీ లిస్టులో ఏ ఒక్కరు కోర్టుని ఆశ్రయించినా జిల్లా అధికారులు సమాధానం చెప్పాల్సి వుంటుంది. పైగా పదోన్నతులు కూడా నిలిచిపోయే ప్రమాదముంది. జిల్లా, రాష్ట్ర అధికారులు చేసిన తప్పుకి ఎవరు బాధ్యత వహిస్తారన్నది ఇపుడు చర్చనీయాంశం అవుతోంది..!