గ్రామ, వార్డు సచివాలయాలను తాకిన రేషనలైజేషన్..


Ens Balu
232
Amaravati
2024-02-10 05:36:59

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయశాఖను కూడా రేషనలైజేషన్ తాకేసింది. దానికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా జిఓనెం బరు-1ని కూడా విడుదల చేసింది. దీని ప్రకారం ప్రతీ గ్రామ, వార్డు సచివాలయంలో కనీసం ఎనిమిది సిబ్బంది ఉండేలా చేయాలని గ్రామ, వార్డు సచివాలయశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదే సమయంలో అభ్యర్ధనపై స్పౌజ్ ట్రాన్స్ ఫర్స్ కూడా చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 15వేల 4 సచివాలయాలు ఉన్నాయి. ఇందులో సుమారు 1.30లక్షలకు పైచిలుకు సిబ్బంది పనిచేస్తున్నారు. అయితే కొన్ని సచివాలయాల్లో పూర్తి సిబ్బంది, కొన్నింటిలో కనీసం పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్లు కూడా లేని పరిస్థితి నెలకొంది. దీనితో ఒక్క గ్రామ పంచాయతీ కార్యదర్శికి అదనంగా రెండు నుంచి నాలుగు పంచాయతీలను అప్పగించింది పంచాయతీరాజ్ శాఖ. ఈ అదనపు పనుల వలన సిబ్బంది లేని చోట ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందడం లేదు. ఈ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం సచివాలయశాఖలో రేషనలైజేషన్ విధానాన్ని ప్రవేశపెట్టి సిబ్బందిని మదింపు చర్యలు చేపడుతున్నది. ఈ చర్య వలన అన్ని సచివాలయాల్లో కనీసం 8మంది ఉద్యోగుల రానున్నారు. లేని చోట సిబ్బంది భర్తీ జరిగి ఉన్నచోట కుదింపు చేపడతారు.

ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, వెల్పేర్ సెక్రటరీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్, మహిళా పోలీసులను ఖచ్చితంగా ఉండేలా చేయనున్నారు. సచివాలయశాఖ ముఖ్యకార్యదర్శి ప్రత్యేక ఉత్తర్వులతో సిబ్బందిని మదింపు చేయడానికి జిల్లా కలెక్టర్లు చర్యలు చేపట్టారు. ప్రతీ సచివాలయానికి కనీస సిబ్బందిని నియమించడం ద్వారా తరువాత మిగులు సిబ్బంది, ఖాళీల భర్తీ చేపట్టే అవకాశాలు కూడా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అదనపు బాధ్యతలు చేపడుతున్న పంచాయతీ కార్యదర్శిల ఆ విధులను నుంచి తప్పించనున్నారు. అదే సమయంలో మేజర్ పంచాయతీల్లోని సచివాలయాల్లో నియమితులైన కార్యదర్శిలను, ఇతర సిబ్బందిని ప్రాధాన పోస్టులు ఖాళీగా ఉన్న సచివాలయాలకు పంపనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని సచివాలయ సిబ్బంది ఖాళీల వివరాలు, శాఖల వారీగా డిఎల్డీఓలు సమాచారాన్ని కలెక్టర్లకు నివేదించారు. దీనిపై తదుపరి చర్యలు ఒకటి రెండు రోజుల్లో చేపట్టే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో సాధారణ ఎన్నికల కోడ్ రావడానికి ముందే ఈ రేషనలైజేషన్ ప్రక్రియను పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దానికి అనుగుణంగానే అన్ని చర్యలు చేపడుతున్నది. సిబ్బంది మదింపులో ఇపుడు స్పౌజ్ ట్రాన్స్ ఫర్లు కూడా ప్రభావం చూపించనున్నాయి. అన్ని సచివాలయాలకు సిబ్బందిని సమానంగా నియమించడం ద్వారా ప్రజలకు అన్ని రకాల సేవలు, ప్రభుత్వ పథకాలు అందించవచ్చుననేది ప్రధాన లక్ష్యంగా కనిపిస్తున్నది.