పది, ఇంటర్ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు ..మంత్రి బొత్స


Ens Balu
19
Vizianagaram
2024-02-22 11:03:03

ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్ త‌దిత‌ర‌ ప‌రీక్ష‌ల‌కు ప‌టిష్ట ఏర్పాట్లు చేసి, ప‌క‌డ్బందీగా నిర్వ‌హించాల‌ని రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ ఆదేశించారు. తాడేపల్లిలోని విద్యా శాఖ కార్యాలయం నుంచి ఇంటర్మీడియట్, 10వ తరగతి, డీఎస్సి, టెట్ పరీక్షలపై జిల్లా కలెక్టర్ లతో, స్కూల్ ఎడ్యుకేషన్ కమీషనర్ సురేష్ కుమార్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమీషనర్ సౌరబ్ గౌర్, విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ తో కలిసి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం సమీక్షా స‌మావేశాన్ని నిర్వహించారు. వీడియో కాన్ఫ‌రెన్స్‌లో మంత్రి బొత్స మాట్లాడుతూ రానున్న‌ది ప‌రీక్ష‌ల కాల‌మ‌ని, అధికారులంతా అప్ర‌మ‌త్తంగా విధుల‌ను నిర్వ‌హించాల‌ని ఆదేశించారు.  మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్ పరీక్షలకు, మార్చి 18వ తేదీ నుంచి నిర్వహించే పదవ తరగతి పరీక్షల కోసం ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే ఈ నెల 27 నుంచి టెట్‌, మార్చి 15 నుంచి డిఎస్‌సి జ‌రుగుతాయ‌ని చెప్పారు. విద్యార్ధుల భ‌విష్య‌త్తును నిర్ణ‌యించే ఈ ప‌రీక్ష‌ల‌కు ప‌క‌డ్బంధీ ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. మ‌రోవైపు ఎన్నిక‌ల ప్ర‌క్రియ కూడా ప్రారంభం కాబోతుంద‌ని, దీనిని దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేయాల‌న్నారు. 

ప‌రీక్ష‌ల‌ను స‌జావుగా నిర్వ‌హించ‌డంతోపాటు, స్పాట్ వేల్యూయేష‌న్‌కు కూడా క‌లెక్ట‌ర్లు త‌గిన ఏర్పాట్లు చేయాల‌న్నారు. ముఖ్యంగా వివిధ శాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌ యంతో వ్య‌వ‌హ‌రిస్తూ, నిరంత‌రం ఈ ప్ర‌క్రియ‌ను ప‌ర్య‌వేక్షించాల‌ని మంత్రి కోరారు. వివిధ శాఖ‌ల రాష్ట్ర ఉన్న‌తాధికారులు మాట్లాడుతూ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసి పరీక్షలను తనిఖీ చేయాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి బందోబస్తు ఏర్పాటు చేయాలని, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో నిరంతరం విద్యుత్ సరఫరా జరగాలని, ఫ్యాన్లు, లైటింగ్ ఏర్పాటు చేయాలని, పరీక్ష కేంద్రాలకు ఆర్టీసీ బస్సులతో రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. పరీక్షలు జరిగే రోజు 100 మీటర్లలోపు ఉండే జిరాక్స్ సెంటర్లను బంద్ చేయించాలన్నారు. అన్ని పరీక్ష కేంద్రాలలో ఫస్ట్ ఎయిడ్ కిట్ తో పాటు ఒక నర్సును ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి మాస్ కాపీయింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 

పరీక్ష కేంద్రాలను సెల్ ఫోన్ ఫ్రీ జోన్ గా ప్రకటించడం జరిగిందని,  సిబ్బంది కూడా సెల్ ఫోన్ లను ఉపయోగించరాదని స్ప‌ష్టం చేశారు. పరీక్ష కేంద్రానికి వెళ్లే ముందు అమ్మాయిలను మహిళా పోలీసులు తనిఖీ చేయాలన్నారు. విద్యార్ధులు ప‌రీక్షా కేంద్రాల‌కు చేరుకొనే విధంగా బ‌స్సుల‌ను ఏర్పాటు చేయాల‌ని, హాల్ టిక్కెట్ చూపిస్తే ఉచిత ప్ర‌యాణానికి అనుమ‌తించాల‌ని సూచించారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని రకాలుగా సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ల‌ను, ఇత‌ర‌ అధికారులను ఆదేశించారు.  వీడియో కాన్ఫరెన్స్లో  జిల్లా నుంచి  కలెక్టర్ నాగ‌ల‌క్ష్మి, డిఇఓ ఎన్‌.ప్రేమ్‌కుమార్‌,  డివిఇఓ భీమ‌శంక‌ర్‌, ఆర్ఐఓ మ‌జ్జి ఆదినారాయ‌ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.