ప్రభుత్వంతో చర్చలకి సచివాలయ ఉద్యోగ సంఘానికి దక్కని చోటు


Ens Balu
95
Amaravati
2024-02-22 12:45:07

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో నిర్వహిస్తున్న ప్రత్యేక చర్చలకు గ్రామ, వార్డు సచివాలయశాఖ సంఘానికి చోటు దక్కలేదు. ప్రభుత్వం జిఏడి నుంచి ఉద్యోగ సంఘాలకు చర్చలకు రావాలని సుమారు 13 సంఘాలకు పిలుపునివ్వగా, సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి మానసపుత్రిక శాఖ అయిన గ్రామ సచివాలయ ఉద్యోగు ల సంఘం పేరు అందులో లేదు. ఉద్యోగ సంఘాలతో శుక్రవారం ఉదయం 10.30గంటలకు రాష్ట్ర సచివాలయంలో చర్చలు జరగనున్నాయి. ఏపీలోని 75 ప్రభుత్వశాఖల్లో గ్రామ, వార్డు సచివాలయశాఖ ప్రత్యేకంగా వుంటుందని, సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి ముందుచూపుతో ఏర్పాటైన ఈ శాఖకు అన్ని విధాలా గుర్తింపు వుంటుందని అంతా భావించారు. ఆది నుంచి ఈశాఖ ఉద్యోగుల సంఘానికి ప్రాతినిత్యం పూర్తిస్థాయిలో లేకపోవడం విశేషం. పైగా అన్ని ప్రభుత్వ శాఖ ఉద్యోగులతోపాటు సమానంగా ప్రయోజ నాలు రాకపోయినా, ప్రశ్నించడానికి ముందుకి వెళ్లలేని పలు యూనియన్ల నాయకులు మాత్రం ప్రభుత్వ నిర్ణయాలను సమర్ధిస్తూనే ఉంటారు. కాగా ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరుగుతున్న వేళ  గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘానికి వర్తమానం లేకపోయిన విషయం హాట్ టాపిక్ అవుతోంది.