ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని 75 ప్రభుత్వ శాఖల్లో ప్రధానంగా ఉన్న వైద్యఆరోగ్యశాఖలో అనుబంధ విభాగం ఆయుష్ పూర్తిగా రద్దు చేయడానికి భారీ కుట్ర జరుగుతు న్నట్టుగా కనిపిస్తోంది.. వినడానికి కాస్త కంగారుగా వున్నా..వాస్తవరూపంలోకి వెంటనే తేకుండా ఈ విభాగంలోని కొన్ని రకాల ఉద్యోగాలను కుదిస్తూ.. ఇటీవలే వైద్యఆ రోగ్యశాఖ జారీచేసిన జీఓ నెంబరు-53 తీవ్ర దుమారం రేపుతోంది. అవును ఒకేసారి వైద్యవిభాగంలో ఉన్న అనుబంధ శాఖను రద్దు చేస్తే పెద్ద ఎత్తున గొడవలు జరుగు తాయని బావించిన కమిషనర్ అదనంగా ఉన్న ఉద్యోగాలను కుదింపు చేస్తున్నట్టుగా చూపించి..ఆయుష్ వినాశనానికి తెరలేపారన్నఆరోపణలు బలంగా వినిపిస్తు న్నాయి. సప్రషన్ ఆఫ్ పోస్ట్స్ పేరుతో ఆయుష్ లోని 12 రకాల ఉద్యోగాల్లో మొత్తం 28 పోస్టులను కుదిస్తూ కమిషనర్ డా.ఎస్.బి.రాజేంద్రకుమార్ పెట్టిన ప్రపోజల్ ను అంగీకరిస్తూ..వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి.క్రిష్ణబాబు పేరుతో మార్చి 16-2024న జీఓ కూడా జారీ అయిపోయింది. ప్రభుత్వం దృష్టిలో ఆయుష్ కమిషనర్ ప్రభుత్వంపై ఆర్ధిక భారం పడకుండా..ప్రభుత్వ ఉద్యోగాలను కుదించిన తెలివైన అధికారి..కానీ ఈ ముసుగులో ఏకంగా ఆయుష్ విభాగాన్నే రద్దు చేయడానికి పన్నాగం పన్నుతున్నారని..త్వరలోనే ఉద్యోగుల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందని నేడు ఉద్యోగులు, వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ సీనియర్ మెడిల్ ఆఫీసర్లకు పదోన్నతులు రాకుండా, వారికి రోస్టర్ పాయింట్లు పనిచేయకుండా ఉండేందుకు వీలుగానే ఈ సప్రషన్ ఆఫ్ పోస్ట్స్ పేరుతో ఉద్యోగాలను కుదించేశారని సీనియర్ వైద్యాధికారులు వాపోతున్నారు. దీనికారణంగా ఎస్సీ, ఎస్టీ సీనియర్ మెడికల్ ఆఫీసర్లకు ఆర్డీడీలుగా పదోన్నతులు రావు. ఇదే విషయాన్ని సీనియర్ మెడికల్ ఆఫీసర్లు సీఎంఓకి ఫిర్యాదు రూపంలో కమిషనర్ చేసిన వ్యవహారాన్ని ఫిర్యాదు రూపంలో తెలియజేసినా ఫలితం లేకపోయింది.
ఏ ప్రభుత్వ శాఖలోనైనా కమిషనర్లు, ప్రిన్సిపల్ సెక్రెటరీలు సదరు ప్రభుత్వశాఖను అభివృద్ధి చేయాలని..ఉద్యోగుల సమస్యలు తీర్చాలని, వారికి సకాలంలో పదోన్నతులు కల్పించాలని, అవసరాన్ని బట్టి ప్రభుత్వంతో చర్చించి కొత్త ఉద్యోగాల కల్పన చేపట్టి.. ప్రజలకు పూర్తిస్థాయిలో అందించాలని చూస్తారు. కానీ దానికి భిన్నంగా ఆయుష్ విభాగంలో మాత్రం ఉద్యోగులకు పదోన్నతులు రాకుండా అవసరమైన మేరకు.. అనవసర కొర్రీలు వేస్తూ.. ముఖ్యంగా దళితులకు పదోన్నతులు రాకుండా.. వారికి రోస్టర్ విధానం అమలు కాకుండా ఏకంగా ఉన్న పోస్టులనే కుదించేస్తున్నారంటే దళిత వైద్యులంటే ఈశాఖలోని అధికారులకు ఎలాంటి గౌరవం ఉందో అర్ధం చేసుకోవచ్చునని ఎస్సీ, ఎస్టీ వైద్యాధికారులు పేర్కొంటున్నారు. ఏ ప్రభుత్వ శాఖలోనైనా సిబ్బంది, అధికారుల సమస్యల పరిష్కారానికి కమిషనర్ ను సంప్రదిస్తారని..కానీ ఆయుష్ లో మాత్రం సమస్యే కమిషనర్ అయిపోయారని వైద్యాధికారులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమ సమస్యను పరిష్కరించాల్సిందిగా నేరుగా సీఎంఓకే మొరపెట్టుకున్నారంటే ఎలాంటి పరిస్థితి ఆయుష్ విభాగంలో నడుస్తోందో తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. విధి నిర్వహణ పేరిట వైద్యాధికారులను అందరి ముందూ జూమ్ మీటింగ్లు, టెలీకాన్ఫరెన్సులు, డిస్పెన్సరీల సందర్శన సమయంలో నోటికొచ్చినట్టు తిడితే..వైద్యులు వారంతట వారే ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్లిపోతారని..దానికోసం మానసికంగా వేధించడం మొదలు పెడుతున్నారని ఆయుష్ వైద్యులు ఆరోపిస్తున్నారు. దీని కారణంగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో వైద్యులు స్వచ్చంద రాజీనామాలకు కూడా సిద్దపడుతున్నారు. మరికొందరు మూకుమ్మడి సెలవులకు ఉపక్రమిస్తున్నారని తెలిసింది.
ప్రభుత్వం ఆయుష్ విభాగంలో పారామెడికల్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులిస్తే.. కేవలం 22 మంది ఉద్యోగులను రెగ్యులర్ చేసి.. 12 మంది ఉద్యోగు లను రెగ్యులర్ చేయకుండా వారంతా సర్వీసుల్లోకి వచ్చే సమయంలో కులం నమోదులో బయటపడిన చిన్న చిన్న తప్పులను పెద్ద కారణాలు చూపి వారి ఉద్యోగాలు రెగ్యులర్ చేయకుండా..సదరు ఫైల్ ని ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎంటి.క్రిష్ణబాబు కి పంపకుండా కమిషనర్ వద్దే అట్టే పెట్టుకున్నారు. ఈ ఉద్యోగుల విషయంలో కూడా సాంకేతిక కారణాలు చూపించడం ద్వారా ప్రభుత్వానికి మరో 12 ఉద్యోగాలను కాంట్రాక్టు ఉద్యోగాలుగానే ఉంచేస్తే..కొత్తగా పోస్టులను తీసే పనిలేకుండా..ఉన్న ఉద్యోగులతోనే ప్రభుత్వంపై భారం పడకుండా చేసి..ప్రభుత్వంలో మార్కులు కొట్టేయాలని చూస్తున్నారు తప్పా.. ఉద్యోగుల కుటుంబాల ఉసురు పోసుకుంటున్నారని కనీసం ఆలోచించడం లేదని కూడా సిబ్బంది కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ విషయంలో వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి మిగిలిన సిబ్బందికి సంబంధించిన ఫైలు పెట్టమన్నా కమిషనర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం విశేషం. కమిషనర్ చర్యలన్నీ ఆయుష్ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసి..వైద్యులను విధి నిర్వహణ పేరిట వేధించి, ఫేస్ రికగ్నైజేషన్ నెపంతో ఇబ్బందులు పెట్టి.. ఆసుపత్రి నిర్వహణ పేరుతో బండబూతులు తిడుతూ.. పరువు తీసేసే విధంగా అమ్మా..ఆలీ..ఒరేయ్..ఏరా లాంటి తిట్లు తిడితే ఆత్మాభిమానం అడ్డొచ్చిన వైద్యులు విధులకు వారంతట వారే రాజీనామాలు చేస్తారని మాస్టర్ ప్లాన్ వేశారని కూడా చెబుతున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వంపై ఆర్దిక భారం పడుతుందని..అఖిలభారతస్థాయి అధికారిగా తన ద్వారా ప్రభుత్వానికి మేలు ఉద్యోగాలను కుదించేసి..పదోన్నతులు రాకుండా చేసేసి..వైద్యులను వేధించి వారంత వారే ఉద్యోగాలు మానేసినా..ప్రభుత్వానికి ఎంతో కొంత ఆర్ధిక భారం తగ్గించినట్టు అవుతుందని, కొందరు ఆర్డీడీల మాటలు విని ఇదంతా చేస్తున్నారని వైద్యులు ఆరోపిస్తున్నారు. తమకు అన్యాయం జరిగితే మాత్రం న్యాయపరమైన పోరాటం చేస్తామని చెబుతున్నారు. ఉద్యోగాల కుదింపు జీఓ ఇపుడు 75ప్రభుత్వశాఖల్లోనూ చర్చనీయాంశం అవుతుంది. ఆయుష్ కమిషనర్ ను ఆదర్శంగా తీసుకొని మిగిలిన ప్రభుత్వశాఖల కమిషనర్లు కూడా ఈ విధంగా చేస్తే చాలా ప్రభుత్వ ఉద్యోగాలు రద్ద అయ్యే అవకాశం కూడా లేకపోలేదని ఉద్యోగ సంఘాలు కంగారు పడుతున్నాయి. ఈవిషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఆందోళన తప్పదని కూడా హెచ్చరిస్తున్నాయి. చూడాలి ఆయుష్ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసే చర్యలు ఇంకా ఎన్ని ప్రభుత్వశాఖలను నాశనం చేస్తాయో లేదంటే..లేదంటే ఇలాంటి తేడా పనులకు పూనుకున్న కమిషనర్ పై చర్యలకు ఉపక్రమిస్తారోననేది..?!