ఆయుష్ లోని అణచివేత చర్యలు ప్రారంభం అయ్యాయి. ఏ ప్రభుత్వశాఖలోనూ లేనివిధంగా జరుగుతున్న తేడా వ్యవహారాలను ప్రశ్నిస్తున్నందుకు సీనియర్ వైద్యులు, దళిత వైద్యులు, ఉద్యోగుల పట్ల కమిషనర్ డా.ఎస్బీ.రాజేంద్రకుమార్ దుందుడుకు వైఖరిని అవలంభిస్తున్నట్టు జిఓఎంఎస్ నెంబరు 61 సాక్ష్యంగా నిలుస్తుంది. ఆర్ధిక పరమైన ఇబ్బందులు వస్తున్నాయంటూ రాష్ట్రవ్యాప్తంగా 599 డిస్పెన్సరీలు, 4 మినీ ఆసుపత్రులకు చెందిన వైద్యుల డిడిఓ పవర్స్ ను రద్దు చేస్తూ కమిషనరేట్ లోని అకౌంట్స్ ఆఫీసర్ కి బదిలీచేశారు. ఇటీవల కాలంలో కమిషనర్ ఆయుష్ శాఖను, ఇక్కడి వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని పరిపాలన పేరుతో ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. ఈ తేడా వ్యవహారాన్ని ప్రశ్నించినందుకు వైద్యులపై ప్రతీకారం తీర్చుకునేలా వ్యవహరిస్తూ..ఏకంగా డిస్పెన్సిరీల్లోని వైద్యాధికారుల డిడిఓ పవర్స్ ను పూర్తిగా రద్దు చేశారు. ఈ ఫైలుకి వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి. క్రిష్ణబాబు ఆమోదం తెలపడంతో జీఓ కూడా విడుదల అయిపోయింది. అసలు డిస్పెన్సీరీల్లో ఆర్దిక పరమైన ఇబ్బందులు ఏమొస్తాయో కూడా సదరు జీఓలో ఎక్కడా వివరించలేదు. డిస్పెన్సరీల్లో వైద్యుడు, కాంపౌండర్, స్వీపర్ లేదా అటెండర్ మాత్రమే ఉంటారని, అలాంటి చోట వైద్యాధికారులకు డిడిఓ అధికారాలుంటే నిధుల గోల్ మాల్ జరుగుతుందని మాత్రం జీఓలో పొందు పరిచారు. దీనితో తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వైద్యాధికారులపై తొలివేటుగా డిడిఓ పవర్స్ ను రద్దు చేసి కమిషనర్ పై చేయి సాధించారని వైద్యాధికారులంతా ఆరోపిస్తున్నారు. ఈ విధంగా చేయడం వలన తమకు పోయిందేమీ లేదని, కాకపోతే ఏ ప్రభుత్వశాఖలోనూ లేనివిధంగా ఒక్క ఆయుష్ లోనే కమిషనర్ ఈ విధంగా డిడిఓ పవర్స్ తొలగించి ఆయుష్ పరువు తీశారని మండి పడుతున్నారు.
పరిపాలనలో వెనుక..స్వపరిపాలన తిట్ల దండకంలో ముందు
ఏ ప్రభుత్వ శాఖలోనైనా కమిషనర్లు సదరు శాఖలోని తాము పనిచేసిన కాలంలో తీసుకొచ్చిన అభివృద్ధిని కొలమానంగా చూపించుకుంటారు. అదేందో ఆయుష్ లో మాత్రం అన్నింటికంటే భిన్నంగా జరుగుతోంది. ఏ శాఖలోనూ లేనివిధంగా వైద్యాధికారులను జూమ్ సమావేశాలు పెట్టి అమ్మనా బూతులు తిట్టడం..అరేయ్ తురేయ్ లాంటి పద సంభాషణ, రాస్కెల్, యూజ్ లెస్ ఫెలో లాంటి మంచి మాటలతో తిట్ల దండకం కమిషనర్ డా.ఎస్బీ.రాజేంద్రకుమార్ కే చెల్లింది. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 599 డిస్పెన్సరీలు, 4 మినీ ఆసుపత్రులను ఏ కోణంలో అభవృద్ధి చేశారని తిరిగి చూస్తే..ఏ ఒక్కటీ లేదు సరికదా..ఉన్న ఉద్యోగాల్లో నుంచి కోత విధించడం, వైద్యాధికారులకు పదోన్నతులు రాకుండా, రోస్టర్ పాయింట్లు అమలు కాకుండా మోకాళ్లు అడ్డుపెట్టేటువంటి తేడా జీఓలో ఈ కమిషనర్ హయాంలో వచ్చాయని వైద్యాధికారులు ఈయన చేసిన ఘనకార్యాలయాలను సీఎంఓకి చేసిన లిఖిత పూర్వక ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉదాహరణకు తీసుకుంటే కమిషనర్ గా ఈయన బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ఏ ఒక్క ఆయుష్ ఉద్యోగి ఎఫ్ఆర్ఎస్ ను ఆన్ లైన్ లో పరిశీలించినది లేదు. పైగా జోన్-1లోని ఒక జిల్లా కార్యాలయంలో డ్రైవర్ విధులకు గైర్హాజరవుతూ, ఎఫ్ఆర్ఎస్ వేయకుండా ఉన్నా కూడా సదరు డ్రైవర్ పనిచేసే చోట తనకు అనుకూలంగా ఉన్న ఆర్డీడికి బంటు కావడంతో డ్రైవర్ విషయంలో కనీసం ఒక్క మాటల కూడా అనకుండా వదిలేశారు. దీనితో ఆ డ్రైవర్ తనకి నచ్చిపుడు కార్యాలయానికి వచ్చి, ఇష్టం లేనపుడు రావడం మానేస్తున్నాడు. వచ్చినపుడే కార్యాలయంలోని సూపరింటెండెంట్ సహకారంతో అన్ని రోజులకీ కలిపి ఒకేసారి రిజిస్టర్ లో ఆప్సెంట్ లు కూడా వేసేస్తున్నాడు.. ఒక రెగ్యులర్ డ్రైవర్ విధులకు సక్రమంగా రాని వ్యక్తిపై చర్యలు తీసుకోలేని కమిషనర్, ప్రజలకు వైద్యసేవలు చేస్తూ..ఎంతో విలువైన సమయాన్ని వైద్యం కోసం వెచ్చిస్తుంటే తమను కించపరిచేవిధంగా కమిషనర్ డిడిఓ పవర్స్ ను రద్దు చేయడాన్ని వైద్యులంతా జీర్ణించుకోలేకపోతున్నారు.
అంతా నాయిష్టం..నన్నే ప్రశ్నిస్తారా..చూడు వారందరినీ ఏం చేస్తానో..?
ఆయుష్ డిపార్ట్ మెంట్ కి నేను కమిషనర్ ని..అలాంటి నా నిర్ణయాలే తప్పుబడతారా..? నన్నే ప్రశ్నిస్తారా..? నేను అనుకుంటే ఈ డిపార్ట్ మెంటే లేకుండా చేయగలను..నేను పెట్టే ఏ ప్రపోజల్ ఫైలుకైనా ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఇట్టే సంతకం చేసేస్తారు..అందుకే వైద్యాధికారులకు వ్యతిరేకంగా ఇన్ని జీఓలు తే గలిగానని తనకు అనుకూలంగా వున్న ఆర్డీడీల వద్ద కమిషనర్ ప్రస్తావించినట్టు కమిషనరేట్ నుంచే వైద్యాధికారులకు ఉప్పందినట్టు చెబుతున్నారు. ఇప్పటికే తమను చాలా దారుణంగా వేధిస్తున్న కమిషనర్ ఇంకా తమపై కక్షగట్టి మరీ ఇలాంటి తేడా వ్యవహరాలకు పూనుకుంటున్నాడని వైద్యాధికారులు ఆవేదన చెందుతున్నారు. అయితే తాను కొందరు వైద్యాధికారుల దగ్గర నుంచి అప్పులు తీసుకున్న విషయంలో బ్యాంకు రిసిప్టులు కూడా మీడియా ద్వారా బయటపెట్టిన వైద్యులను ఏం చేసినా తప్పులేదని, మీరు చేసే పనులకు తమవంతు సహకారం వుంటుందని కొందరు ఆర్డీడీలు కమిషనర్ కి వత్తాసు పలికినట్టు తెలిసింది. డిపార్ట్ మెంట్ లో ఏం జరిగినా వెంటనే మీడియాకి మన వైద్యాధికారులే ఉప్పందించేస్తున్నారని అలాంటి వాళ్ల కొమ్ములు విరగ్గొట్టాలంటే మీరు చేసిన డిడిఓ పవర్స్ రద్దుతో వాళ్లంతా మనదారికి వస్తారని ఆర్డీడీ కమిషనర్ కి చెప్పారని కూడా ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వానికి మచ్చ తెచ్చేవిధంగా వ్యవహరిస్తున్న కమిషనర్ చర్యలకు కొందరు ఆర్డీడీలు, వైద్యులు తానా తందానా అంటూ భజన చేస్తున్న కారణంగా వైద్యాధికారులు, సిబ్బందిపై ఇష్టం వచ్చినట్టు జీఓల రూపంలో తన కక్షతీర్చుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఏ ప్రభుత్వశాఖలోనూ లేనివిధంగా ఒక ప్రభుత్వశాఖలో కమిషనర్ చేస్తున్న తేడా వ్యవహారాలకు జీఓ ల రూపంలో ప్రభుత్వ చర్యలు కూడా రావడం ఇతర ప్రభుత్వశాఖల్లో చర్చనీయాంశం అవుతుంది. చూడాలి వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బందిపై కమిషనర్ చర్యలు ఇంకా ఎన్ని తేడా జీఓలు రావడానికి కారణమవుతుందోనని టాక్ రాష్ట్రమంతా దావానంలా వ్యాపిస్తుంది.