మ్యాజిక్ ఫిగర్ పైనే ఆశలు..!


Ens Balu
795
vizag
2024-03-29 19:03:00

భారత దేశంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన 68ఏళ్ల తరువాత 2024లాంటి విచిత్ర రాజకీయ పరిస్థితి మునుపెన్నడూ ఎవరూ చూసి ఉండరు. ప్రస్తుతం ఈ ఆలోచన, చైతన్యం, ఉత్తేజం రాష్ట్రంలో ఏర్పాటు కాబోయే ప్రభుత్వానికి సవాలుగా మారుతోంది. తాజా రాజకీయ కీయ పరిస్థితులు, సమీకరణలు చూస్తుంటే ఏ పార్టీ అయినా మ్యాజిక్ ఫిగర్ ఆపైన గెలిచే ఐదో పదో సీట్లతోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనేది రాష్ట్ర ప్రజల మాట. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందనే విషయంపై రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని ఓటు బ్యాంకు ప్రజల వద్ద ఈరోజు పేపర్-ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ నిర్వహించిన గ్రౌండ్ లెవల్ సర్వేలో ఆశక్తికర అంశాలు తెరపైకి వచ్చాయి. విద్య, వైద్యం, ఆరోగ్యం, మౌళిక సదుపాయాలు, ఉద్యోగాలు, ఉపాది, సీపీఎస్ రద్దు, స్థానికత, సామాజిక వర్గం, ప్రభుత్వ సంక్షేమం, ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి, రౌడీయిజం, దోపీడి, నూతన జిల్లాలు, ప్రత్యేక హోదా, పెరిగిన పన్నులు, విద్యుత్ చార్జీలు, ఇసుక, ప్రభుత్వ సేవలు, భూ ఆక్రమణలు, ప్రభుత్వ సంస్థల నిర్వీర్యం, ప్రభుత్వ ఉద్యోగులపై పనిభారం-ఖాళీల భర్తీ చేయకపోవడం..23 అంశాల విషయంలో ప్రజల గుండె చప్పుడు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశాం. సర్వే చేస్తున్న సమయంలో గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని ఓటర్లు దైర్యంగా వారి మనోభావాలను సర్వేలో వ్యక్తం చేశారు. 

అందజేసిన ప్రశ్నాల అంశాలవళిపై వారి మనసులో ఉన్న అభిప్రాయాలను టిక్ మార్క్ చేశారు. అంతేకాకుండా ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే పరిస్థితి లేదని కుండ బద్దలు కొట్టేశారు. ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేసినా మ్యాజిక్ ఫిగర్ స్థానాలపై ఐదో, పదో సీట్లతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి తప్పితే వైఎస్సార్సీపీ అంటున్నట్గు 175కి 175స్థానాలు, టిడిపి అంటున్నట్టుగా 130 స్థానాలకి పైగా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ప్రకటనలు ప్రజలకు చాలా దూరంగా ఉన్నాయని తెగేసి చెబుతున్నారు. ముఖ్యంగా ఉపాది, ఉద్యోగాల విషయంలో నిరుద్యోగ యువత అత్యంత బాధలో ఉన్నామని పేర్కొన్నారు. 60శాతం సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందాయని నిరుపేద కుటుంబాల్లోని ప్రజలు చెప్పుకొచ్చారు. వ్యాపారుల్లో కేవలం 40శాతం మంది మంది మాత్రమే ప్రస్తుత ప్రభుత్వానికి తమ మద్దతు తెలియజేస్తామని చెప్పగా 60శాతం మంది పూర్తిగా వ్యతిరేకత ప్రదర్శించారు. అలాగని కూటమికి అయినా సపోర్టు చేస్తున్నట్టు మాట్లాడారా అంటే అదీ లేదు ఇక్కడ కూడా కేవలం 50శాతం మంది మాత్రమే అనుకూలంగా మాట్లాడి, మరో 50శాతం మంది ఏమో చెప్పలేమని చేతులెత్తేశారు. నిరుపేద కుటుంబాల్లో ప్రభుత్వం నుంచి ఇళ్లు పొందిన వారు, సంక్షేమ పథకాలు పొందిన మహిళలు 40శాతం మద్దతు తెలియజేస్తే.. 60శాతం మంది సంక్షేమ పథకాలు ఇచ్చి మద్యంపై రేట్లు పెంచి, ఇంటి పన్నులు, విద్యుత్ ఛార్జీలు పెంచేసి, నిత్యవసర సరుకుల ధరాలు కూడా పెరగడానికి కారణం అయ్యారని పెదవి విరిచారు. అటు కూటమి వైపు కూడా 35శాతం మంది మాత్రమే సముఖత చూపించారు. విద్య, ఆరోగ్యం, వైద్యం విషయంలో 60శాతం మంది మహిళలు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. కూటమి అధికారంలోకి వచ్చినా ప్రస్తుత పథకాలే కొనసాగించాలి తప్పితే కొత్త పథకాలు ఇచ్చే ఆర్ధిక పరిస్థితి రాష్ట్రంలో లేదని చెప్పేశారు.

ఇక ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, 60 శాతం,  రిటైర్డ్ ఉద్యోగుల్లో 90శాతం మంది ప్రస్తుత ప్రభుత్వ విషయంలో పూర్తి వ్యతిరేకతతో ఉన్నామని కరాఖండీగా చెప్పేశారు. సీపిఎస్ ఉద్యోగులు అయితే ఏ రాజకీయ పార్టీ అయితే సీపిఎస్ రద్దు చేస్తుందో వారికే తమ ఓటు వేటు వేస్తామని నిర్మొహమాటం చెప్పేశారు. రిటైర్డ్ ఉద్యోగులైతే ఇలాంటి ప్రభుత్వాన్ని తమ జీవితంలో చూడలేదని..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత క్వాంటమ్ పెన్సన్ 100ఏళ్లకు పెంచేసిన ప్రభుత్వాన్ని, ప్రతీనెలా 10వ తేదీ దాటిన తరువాత మాత్రమే పెన్షన్లు వేసే ప్రభుత్వాన్ని తామెప్పుడూ చూడలేదని..తమ మద్దతు అయితే కనీసం అంటే కనీసం కూడా ఉండదని చెప్పారు. ఉపాధ్యాయులు, అంగన్వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులు 100శాతం వ్యతిరేకతోనే ఉన్నారు. ఒక్క గ్రామ, వార్డు సచివాలయశాఖలో మాత్రం 1.30లక్షల మంది ఉద్యోగుల్లో 50శాతం మంది ఉద్యోగులు ప్రస్తుత ప్రభుత్వం పట్ల పూర్తి సానుకూలతతో ఉన్నారు. అందులోనూ 50శాతం ఉద్యోగులు వ్యతిరేకతతో ఉన్నారు. తమ ఉద్యోగాలు రెగ్యులర్ చేసే సమయంలో డిఏ, హెచ్ఆర్ఏ తగ్గించేశారని, రెగ్యులైజేషన్ సమయంలో ఇవ్వాల్సిన రెండు ఇంక్రిమెంట్లు ఇవ్వలేదని, ఇంకా చాలా విభాగాల ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయలేదని, సచివాలయశాఖకు చట్టబద్దత చేయలేదని పెదవి విరిచారు. సుముఖతతో ఉన్న ఉద్యోగులైతే ప్రస్తుత ప్రభుత్వం కారణంగానే తమ జీవితాల్లో ప్రభుత్వ ఉద్యోగమనే వెలుగులు నిండాయనే మంచి మనసుతో ఉన్నారు.  కూటమి విషయంలో 40 నుంచి 50శాతం మంది మాత్రమే వివిధ అంశాల్లోని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అలాగని కూటమికే మద్దతు ఇస్తామని కూడా చెప్పలేమని, ఒకరకంగా కూటమిలో ఉండే ప్రధాన పార్టీ టిడిపి వలనే తమకు ఈ పరిస్థితి దాపురించిందని..ఆరోజు ప్రభుత్వమే సక్రమంగా ఉండి ఉంటే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి ఉండేదా అనికూడా పొలిటకల్ సర్వే చేస్తున్న ప్రతినిధులపై ప్రశ్నల వర్ష్షం కురిపించారు ఓటర్లు.

ఇక సామాజిక వర్గాలు(కులాలు), మద్యం, భూ ఆక్రమణలు, విశ్వ విద్యాలయాలను నిర్వీర్యం చేయడం, ఉద్యోగాల భర్తీచేపట్టకపోవడం, విద్యావ్యవస్థలో ఉపాధ్యాయులను రేషనలైజేషన్ పేరుతోనూ, పాఠశాలల విలీనం పేరుతోనూ ఉద్యోగాలను కుదించేస్తున్న అంశం, ఇసుక, భారీగా పెంచేసిన ఇంటిపన్నులు, రాష్ట్రంలో ఎక్కడా కానరాని అభివృద్ధిపైన కూడా ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 23 అంశాల ప్రశ్నావళిలో అందరూ ప్రధాన అంశాలను వ్యతిరేకిస్తూనే వచ్చారు. అయితే ప్రస్తుత రోజుల్లో ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు ఒకటేనని..కాకపోతే కొత్త పథకాలు, ఉద్యోగాల కల్పన, ఉపాది అవకాశాలు అయితే ఎవరూ చూపించే పరిస్థితి లేదని నిరుద్యోగ యువత నిరసనతో తమ మనో బావాలను వ్యక్తం చేశారు. దానికితోడు సోషల్ మీడియా ప్రభావం కూడా ఇపుడు ప్రతీ ఓటరుపైనా పక్కాగా ఉందని కూడా చెప్పుకొచ్చారు. 23 అంశాల సర్వేలో అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీ(కూటమి)కి ఒక్క 20శాతం మాత్రమే వ్యత్యాసం కనిపించడం విశేషం. పైగా ఇపుడు అధికార పార్టీ 80చోట్ల అభ్యర్ధులను మార్పు చేయడం, మరో 40 మందికి పూర్తిగా సీట్లు ఇవ్వడం మానేయడం, కూటమి మూకుమ్మడిగా మూడు పార్టీలు కలిసి రావడం, వంటి అంశాలనూ కూడా ప్రజలు సర్వే సమయంలో ప్రస్తావించారు. మరీ ముఖ్యంగా ఈ దఫా మాత్రం స్థానిక నేతలకు తప్పా, స్థానికేతరులను ప్రోత్సహించేది లేదని మాత్రం తెగేసి చెప్పారు. 

ఈ సారి ఎన్నికల్లో డబ్బు, మద్యం, చీరలు, బిర్యానీ ప్యాకెట్లు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చునని.. ప్రతీ ఒక్క ఓటరు చైతన్యం కావడానికి సోషల్ మీడియా మాత్రం బాగా ఉపకరిస్తుందని కూడా తేటతెల్లమైంది. అధికార పార్టీకి సంక్షేమ పథకాలు కలిసి వస్తుంటే.. ప్రతిపక్షపార్టీకి మాత్రం అధికారపార్టీ చేసిన తప్పులు, దారుణాలు, మద్యం రేట్లు, కరెంటు బిల్లులు, ఇంటిపన్నులపెంపు వంటి అంశాలు కలిసొస్తున్నట్టుగా కనిపించింది. సుమారు 3.50 కోట్ల ఓటర్లలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు, వైద్యులు, సీపీఎస్ ఉద్యోగులు వారి కుటుంబాల ఓటు బ్యాంకు వలన సరాసరి 20 నుంచి 30 సీట్లు అధికార పార్టీ కోల్పోవాల్సి వస్తుందని కూడా వారే చెప్పడం గమనార్హం. మిగిలిన వర్గాలకు సదరు ప్రభుత్వం వలన జరిగిన మేలు అధారంగా ఓట్లు పడతాయని, లేదంటే కూటమి మిగిలిన సీట్లను కొట్టుకెళ్లి పోతుందనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. మొత్తం మీద 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా అది మ్యాజిక్ ఫిగర్.. ఆ పై వచ్చే ఐద నుంచి పది సీట్ల తేడాలో మాత్రమే ఆధార పడి వుంటుందని వారి వారి విశ్లేషణలు వ్యక్తం చేయడం కొరసమెరుపు. చూడాలి 2024 సార్వత్రిక ఎన్నికలల్లో ఏ రాజకీయపార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనేది..! (ఓటర్ల దగ్గర నుంచి స్వయంగా మా నెట్వర్క్ చేపట్టిన సర్వేలో వచ్చిన అంశాలను మాత్రమే ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. ఇందులో సీట్ల గెలుపు, పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం వారు వారు గెలిచే సీట్లను బట్టి ఆధారపడి ఉంటుందని, ఈ సర్వే కూడా ప్రజా ప్రయోజనార్ధం మాత్రమే నిర్వహించాం తప్పితే ఏ పార్టీకీ అనుకూలమో, లేదా ప్రతికూలమో కాదని..ఇక్కడ ప్రజల నాడి మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేశామనే విషయం కూడా లిఖిత పూర్వకంగ తెలియజేస్తున్నాం.