అవును పండుటాకులు ఎదురు చూస్తున్నాయి.. గ్రామ వాలంటీరు వేకువ జామున తలుపు తట్టలేదు.. ఒకటో తేదీ దాటినా చేతికి పించను అందలేదు.. అవ్వా తాత మొహాల్లో చిరునవ్వు కనిపించలేదు.. కిరాణా కొట్టోడికి నెల బాకీ తీరలేదు..మనురాలికి ముసలమ్మ ఇచ్చే కిడ్డీ బ్యాంకు ఇవ్వలేదు.. వెరసీ ప్రభుత్వం ద్వారా ఇవ్వాల్సిన పించను సొమ్ముకి పించను దారులే గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లాలి అదీ 4వ తేదీ దాటిన తరువాత.. గత నాలుగన్నరేళ్లుగా ఇంటి వద్దనే తీసుకునే పించను సొమ్ము సుమారు మూడు నెలల పాటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఆధార్ కార్డు పట్టుకొని తిరిగే పరిస్థితి ఆ వితంతువులది, ముసలోడిది, అవ్వా, తాతలది. ఎన్నికల వేల సమయానాకి డబ్బులొస్తాయనుకుంటే రాజకీయ చేసిన రచ్చ..పై ఎన్నికల సంఘం స్పందించాల్సి వచ్చింది. ఫలితంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 26 జిల్లా ల్లోని 15 వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లో మూడు లక్షలకు పైగా వాలంటీర్ల సేవలు నిలిచిపోయి..ఏ ఒక్కరికీ పించను అందలేదు సరికదా ప్రభుత్వం నియమిం చిన వాలంటీర్ల దగ్గర ఫోన్లు, బయో మెట్రిక్ డివైజ్ లు తిరిగి ప్రభుత్వానికే సమర్పించాల్సి వచ్చింది. ఇపుడు ఆ పించన్లను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంద 4వ తేదీ నుంచి పంపిణీ చేయనున్నారు. వీరు పంపిణీ చేస్తే సుమారు రాష్ట్రవ్యాప్తంగా 15 రోజులకి పైనే పట్టే అవకాశం వుంటుంది. దాని కోసం ఇప్పటికే ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. అందులోనూ మార్చి నెల కావడంతో సచివాలయాల పరిధిలోని పించన్లు ఇవ్వడానికి డబ్బు కూడా చేరుకోలేదు. సచివాలయాల్లో సిబ్బందిని ఏర్పాటు చేసిన తరువాత, సమయానికి పించను దారులు సదరు కార్యాలయాలకు వెళితే అప్పుడు అవి చేతికి రానున్నాయి. మామూలుగా అయితే వాలంటీర్లు, సిబ్బంది ఒకటో తేదిన ఉదయం 5గంటలకు మొదలు పెట్టి మూడవ తేదీ సాయంత్రం 5గంటలకు పించన్ల పంపిణీని పూర్తిచేసేవారు. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది వాలంటీర్ల సంఖ్యలో సగం కూడా లేకపోవడంతో పించన్ల పంపిణీ ఖచ్చితంగా ఆలస్యం అయ్యే పరిస్థితి వుంది. అదీ పించను దారులు సమయానికి సచివాలయాలకు వెళితే.
మాకాలడ్డిన ప్రతి పక్షాల ఫిర్యాదు..
పించను పథకం నేరుగా వాలంటీర్లు ఇళ్లకు పట్టుకొని వెళ్లి ఇస్తే పార్టీ ప్రచారం అయిపోతుందని భావించిన ప్రతిపక్షాల ఫిర్యాదుతో ఎన్నికల సంఘం రాష్ట్రంలో వాలంటీర్ల సేవలను నిలుపుదల చేసింది. అందేకాకుండా వారి వద్ద ఉన్న ఫోన్లు, డివైజులు వెనక్కి ఇచ్చేయిలని ఆదేశించడంతో వాలంటీర్లంతా సచివాలయాలకు వారి వారి ఫోన్లను సరెండర్ చేసేశారు. ఫిర్యాదుపై వాలంటీర్ల సేవలను అయితే నిలిపేసిన ప్రభత్వం తరువాత ప్రభుత్వం ద్వారా ప్రత్యమ్నాయ ఏర్పాట్లు మాత్రం చేయలేకపోయింది. ప్రస్తుతం తమకు రావాల్సిన పించన్లు ఎవరిద్వారా ఆగిపోయిందని పండుటాకులు ఉసూరు మంటున్నాయి. ఇన్నాళ్లైతే చక్కగా ఇంటి వద్దకే పించను వచ్చేదని, ఇపుడు కాళ్లీడీచ్చుకొని సచివాలయాలకు ఉదయం 10దాటిన తరువాత మండు టెండలో వెళితే తప్పా పించను వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు. అందునా..వారి పించను పుస్తకాలను కూడా సచివాలయాలకు తీసుకెల్లకూడానే నిబంధన పెట్టడంతో ఎవరు పించను దారో, ఎవరో కాదో తెలుసునే ప్రయత్నం ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే ప్రశ్న ఉత్పన్న మవుతుంది.
ఎన్నికల సంఘం మానవాత దృక్పదంతో ఆలోచించాలి..
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవి ఈ ఎన్నికల సమయంలో అందించకపోయినా..ఒక్క పించన్లు మాత్రం అందించాలని ముసలివారంతా ముక్తకంఠంతో కోరుతున్నారు. అటు పతిపక్షాలు ఫిర్యాదుపై ప్రత్యేక ఆదేశాలతో నిలిపివేసిన పించన్ల పంపిణీ ఎన్నికల సమయం ఎంత కాలం ఉంటే అంతకాలం వర్తింపజేయాలని కోరుతున్నారు. ఈ ముసలి వయసులో తమను ఇబ్బందులకు గురిచేయొద్దని వేడుకుంటున్నారు. అయితే కేవలం ఎన్నికల ముందు వాలంటీర్లు ప్రబుత్వ పించను ఇచ్చినా ఎన్నికల ప్రచారం జరిగిపోతుందని భావించి తమను ఇబ్బందులు పాలు చేశారనే వ్యతిరేక కూడా పించను దారుల నుంచి వస్తోంది. ఇటు ప్రభుత్వం కూడా ఈ విషయంలో పునరాలోచించాలని ఎన్నికల సంఘాన్ని వేడుకుంటున్నా ఫలితం అయితే రాలేదు. తప్పనిసరిస్థితి లోనే ఈ ఆదేశాలు అమలవుతున్నాయని కూడా ఎన్నికల సంఘం చెబుతోంది. చూడాలి 4వ తేదీ నుంచి సచివాలయ సిబ్బందితో పంపిణీ చేసే ఈ పించన్ల కార్యక్రమం ఎన్నిరోజులకు పూర్తవుతుందనేది..!