జర్నలిస్టు పనిచేయకపోతే బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు.. జర్నలిస్టు వార్త రాయకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకి తెలీదు.. జర్నలిస్టు ఫోటో తీయకపోతే వాస్తవాలకి ప్రతిరూపం కనిపించదు.. జర్నలిస్టులు కథనం రాయకపోతే సమస్యకి పరిష్కారం లభించదు..జర్నలిస్టు సందేశాత్మక వార్తలు రాయకపోతే ప్రజల్లో చైతన్యం రాదు.. మీడియా, ప్రెస్, జర్నలిస్టులు లేకపోతే ఈరోజు ప్రపంచమే ఒక్కసారిగా స్థంబించిపోతుంది. అంతటి ప్రాధాన్యత ఉన్న మీడియాకి సొసైటీలో నాలుగో స్థంబంగా గుర్తింపు ఉంది. అయితే అది పేరుకి..కాగితాలపై మాత్రమే కనిస్తున్నది. 77ఏళ్ల స్వాంత్ర్య భారత దేశంలో నేటికీ చాలామంది జర్నలిస్టులు అర్ధాకలితోనే జీవిస్తు న్నారంటే అతిశయోక్తి కాదు. ఓట్లను నోట్లకు కొని అధికార పీఠాలు చేజిక్కించుకునే రాజకీయపార్టీలు కూడా వారి కార్యకలాపాలన్నీ ప్రజలకు తెలియజేసే మీడియాని కనీసం పట్టించుకోవడం లేదు. సామాన్య ప్రజలకి వర్తింపజేసే ఒక్క సంక్షేమ పథకానికి కూడా జర్నలిస్టు నోచుకోవడం లేదంటే వీరి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల్లోని సుమారు 60 వేల జర్నలిస్టుల కుటుంబాలున్నాయి. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులు ఏ ఒక్క సంక్షేమ పథకానికి నోచుకోకపోవడంతో ఈసారి జర్నలిస్టు సమస్యలను కూడా రాజకీయపార్టీల మేనిఫెస్టోలో చేర్చాలని, పరిష్కారం కాని సమస్యలు, అమలు చేయని డిమాండ్లను జర్నలిస్టులు రాజకీయపార్టీల ముందు ఉంచుతున్నాయి. అలాగైతేనే మా మద్దతు మీకుంటుందని కూడా తెగేసి చెబుతున్నారు.
ఒకప్పుడు జర్నలిం అంటే ప్రజలను చైతన్యవంతం చేసేదిగా ఉండేది. ఇపుడు రాజకీయపార్టీలు కూడా సొంతంగా మీడియా సంస్థలు ఏర్పాటు చేసుకోవడంతో అది కాస్త ప్రచార వేధికలుగా మారిపోయాయి తప్పితే ఫోర్త్ ఫిల్లర్ కి ఉండే గుర్తింపు కనుచూపు మేరలోకూడా కనిపించడంలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రచారాలకు మాత్రమే నేడు మీడియా ఒక ప్రత్యేక సాధనంలా కనిపిస్తున్నది. వారి మీడియా సంస్థలకు ఆదాయ మార్గాలను మాత్రమే వారు వెతుక్కుంటున్నారు. ఇతర చిన్న, మధ్య తరగతి మీడియా సంస్థలను గాలికొదిలేస్తున్నారు. వారి సంస్థలను అభివృద్ధి చేసుకోవడానికి చిన్న మీడియా సంస్థల మనుగడనే ప్రశ్నార్ధకం చేస్తున్నారు. ఎక్కడలేని నిబంధనలు పెట్టి పూర్తిగా మీడియా నియంత్రణ తో అణగదొక్కాలని చూస్తున్నారు. చేతిలో ఉన్న అధికారంలో, తమ సొంత సంస్థలను అడ్బం పెట్టుకొని ఎన్నిచేసినా.. ఈ సొసైటీలో జర్నలిస్టులూ ఓటర్లే..వారి చేతిలోనూ కలం వుంటుంది..వారి బుర్రలోనూ ఆలోచన వస్తుంది..వారి పెన్నూ పనిచేయడం మొదలు పెడుతుంది. అలా జరిగిన రోజు మాకూ మీడియా సంస్థలు ఉన్నాయని చెప్పుకొని విర్రవీగే వారందరికీ పతనం మొదలవుతుంది. భారత దేశంలో బ్రిటీషు కాలంలో కూడా మీడియాపై ఇన్ని ఆంక్షలు లేవు. ఆ తరువాత స్వాతంత్ర్యం వచ్చాక ఏర్పాటైన దగ్గర నుంచి మీడియాపై ఆంక్షలను, నిబంధనలను పెంచుతూ నియంత్రణ దిశగానే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. ఇప్పటి వరకూ ప్రజల కోసం ఆలోచించిన జర్నలిస్టులు తొలిసారి వారి కోసం వారు ఆలోచించడం మొదలు పెట్టారు. తమ సమస్యలను పరిష్కరించే వారికే తమ మద్దతు, వారు రాసే అక్షర చైతన్య మద్దతు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. దానికోసం ఏనాటి నుంచో అమలుకి నోచుకోని సమస్యలను, డిమాండ్లను ఎన్నికల బరిలో నిలిచే రాజకీయ పార్టీల ముందు ఉంచుతున్నారు.
జర్నలిస్టుల ప్రధాన డిమాండ్లు ఏంటి..? వాటిని ఎందుకు ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలి..? అనే విషయాలు ఒక్కసారి తెలుసుకుంటే.. వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం గుర్తింపుని ఇవ్వాలి(ప్రెస్ అక్రిడిటేషన్), నిత్యం ప్రజలకు సమాచారం అందించేందుకు తిరిగే జర్నలిస్టులకు ఖచ్చితంగా యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్, మెడికల్ ఇన్స్యూరెన్న్ కల్పించి వాటిని ప్రభుత్వమే భరించాలి, జర్నలిస్టుల సంక్షేమ నిధిని 100 కోట్లు చేసి, వాటి ద్వారా వచ్చే వడ్డీతో రిటైర్ అయిన జర్నలిస్టులకు కనీసం నెలకు రూ.7500 పెన్షన్ ఇవ్వాలి, ప్రెస్ అక్రిడిటేషన్ల మంజూరులో నిబంధనలు సరళతరం చేయాలి, చిన్న, మధ్య తరహా పత్రికలకు ఆదాయం లేని సంస్థలకు జిఎస్టీ పూర్తిగా తొలగించాలి, పెద్ద పత్రికలన్నింటికి ఒక ఏడాది ప్రభుత్వ ప్రకటనలు ఇస్తే అదే మొత్తాన్ని రాష్ట్రంలోని చిన్నపత్రికలకు మరో ఏడాది ప్రకటనలు ఇవ్వాలి, పేపరు డిజైనింగ్, ప్రింటింగ్ ఖర్చులు భారీగా పెరిగినందున ప్రింట్ కాపీల సంఖ్యలను తగ్గించాలి, ప్రతీ మండల విలేఖరికి ప్రెస్ అక్రిడిటేషన్, రాయితీ రైల్వే పాస్ మంజూరు చేయాలి, జర్నలిస్టుల హెల్త్ కార్డులో అన్ని రకాల వైద్యసేవలు, మెడికల్ టెస్టులు చేయించుకునే విధంగా నిబంధనలు మార్పు చేయాలి, జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఉచితంగానే కేటాయించి, హౌసింగ్ స్కీములో ఇళ్లు మంజూరు చేయాలి,
జర్నలిస్టు విధి నిర్వహణలకు, కార్యకలాపాలు చేసుకోవడానికి వీలుగా డివిజన్, జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వమే ప్రెస్ క్లబ్ ల నిర్మాణాన్ని చేపట్టాలి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా తరహాలోనే న్యూస్ ఏజెన్సీలకు కూడా నియోజవర్గానికి రెండు లేదా, పార్లమెంటు నియోజకవర్గానికి నాలుగు చొప్పున ప్రెస్ అక్రిడిటేషన్లు మంజూరు చేయాలి, ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ మొత్తాన్ని 8లక్షలకు కుదించి, ప్రెస్ అక్రిడిటేషన్లకు అధికారుల కమిటీలను తొలగించి పాత విధానంలోనే గుర్తింపు పొందిన, ట్రేడ్ యూనియన్ల జర్నలిస్టులతోనే కమిటీలు(పెద్ద పత్రికలు, చిన్నపత్రికలు, లోకల్ కేబుల్ టీవీలు, ఎలక్ట్రానిక్ మీడియా, న్యూస్ ఏజెన్సీల ప్రతినిధులతో)వేయాలి, కఠిన తరం చేసిన ఆర్ఎన్ఐ నిబంధనలను సరళీకృతం చేసేలా రాష్ట్రప్రభుత్వమే పూనుకోవాలి, జర్నలిస్టుల పిల్లలకు ఖచ్చితంగా అన్ని ప్రైవేటు విద్యాసంస్థల్లో 50శాతం రాయితీ కల్పించాలి, కేంద్రీయ విద్యాలయం లాంటి విద్యాసంస్థల్లోనూ జర్నలిస్టుల పిల్లలకు కనీసం 25 సీట్లుకేటాయించాలి, సిఎస్ఆర్ నిధులతో జర్నలిస్టులకు రాష్ట్రప్రభుత్వమే ఏడాదికి ఒకసారి క్రీడా పోటీలు ఏర్పాటు చేయాలి, మండల స్థాయి, డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి జర్నలిస్టులకు విద్యార్హతలను ఏర్పాటు చేసి వాటిని ఖచ్చితంగా అమలు చేయాలి వంటి డిమాండ్లను పరిష్కరించాలని జర్నలిస్టులు కోరుతున్నారు.
తమ సమస్యలపై ఏ రాజకీయపార్టీ సానుకూలంగా స్పిందిస్తుందో వారికి తమ సంపూర్ణ మద్దతు, తమ కుటుంబాల మద్దతు వుంటుందని కూడా ప్రకటిస్తున్నారు. ఇప్పటికే జర్నలిస్టుల సంఘాలన్నీ ఏకమై రాజకీయపార్టీ అధిష్టానాలకు జర్నలిస్టుల సమస్యలు మేనిఫెస్టోలో పెట్టాలంటూ అర్జీలు కూడా పెడుతున్నాయి. ఈ క్రమంలో కొందరు సానుకూలంగా స్పందిస్తుంటే..మరికొందరు అది జరిగే పనేనా..? అంటూ పెదవి విరుస్తున్నారు. ఇన్నాళ్లు ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే జర్నలిస్టులకు కూడా ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు వర్తింపజేస్తే తమవంతు చైతన్యం కూడా ప్రజల్లో వచ్చే చేస్తామని అంటున్నారు జర్నలిస్టులు.. చూడాలి.. ఈసారి ఏ రాజకీయపార్టీ జర్నలిస్టుల సమస్యలను మేనిఫెస్టోలో పెట్టి కనీసం జర్నలిస్టులను గుర్తిస్తుందనేది...? అలా కాని పక్షంలో ఎన్నికల బరిలో నిలబడే రాజకీయపార్టీల కోసం, వారి ప్రచారాల కోసం కూడా జర్నలిస్టులు వేరే రకంగా ఆలోచించాల్సి వస్తుందనే హెచ్చరికలను కూడా పంపించడానికి కలం కార్మికులంతా ఏకతాటిపైకి రావాలని నిర్ణయం తీసుకున్నారనే సమాచారం అందుతుంది. ఏం జరుగుతుందనేది వేచి చూడాల్సిందే..?!