ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రసకందాయంగా మారింది. సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్సనర్లు వారి కుటుంబాలు 2వ ప్రధాన ఓటుబ్యాంకుగా మారనున్నారు.అది ఎంతంటే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 సీట్లను ప్రభావితం చేసేంతగా. ఉద్యోగులకు ఎన్నికల ముందు పీఆర్సీ, ఐర్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. దానిని తొలిసారిగా టిడిపి అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా పీఆర్సీ ఇవ్వడమే మానేసింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ఎన్నడూలేని విధంగా రివర్స్ మోడ్ లో పీఆర్సీ ఇచ్చింది. ఆ సమయంలోనే ఇక పీర్సీ ప్రతీ ఐదేళ్లకు ఒకసారి ఉండదని.. పదేళ్లకు మాత్రమే వుంటుందని ప్రకటించింది కూడా. దీనితో ఒంటికాలపై లేచిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు నాటి నుంచి అధికార పార్టీకి వ్యతిరేకంగా మారిపోయారు. కానీ ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు కావడంతో మీడియా దగ్గర నుంచి అందరూ భయపడే పరిస్థితికి వచ్చారు. అప్పటి నుంచి వారి వ్యతిరేకత వారిలోనూ ఉంచుకొని సార్వత్రిక ఎన్నికల్లో వారి ఓటు బలం ఏంటో చూపించాలనే నిర్ణయంతో ఉన్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వం ఉద్యోగులకు పీర్సీ ఇస్తామని ప్రకటించింది. దానికి ఎన్నికల సంఘం ఆదేశాలతో సంబంధం లేదని కూడా చెప్పింది. అయితే కమిటీలేదు, కనీసం ఐర్(ఇంటీరియ్ రిలీఫ్) ప్రకటించలేదు. ఒక వేళ ఐర్ ప్రకటిస్తే దానిపై ఎంతో కొంత పెంచే పీఆర్సీ ఇవ్వాల్సి వుంటుందని భావించిన ప్రభుత్వం కాలయపన చేస్తూ వచ్చింది. ప్రస్తుతం ఉద్యోగులు, వారి కుటుంబాలు అధికార ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారు.. ఈ సమయంలో ఐఆర్ ఇచ్చినా, పీఆర్సీ ఇచ్చినా ఉపయోగం లేదని భావించే కాలయాపనా చేస్తూ వచ్చిందనే ప్రచారం కూడా గట్టిగా సాగుతోంది. ఐర్, పీఆర్సీ ఇచ్చినా ఉద్యోగుల్లో ఉన్న వ్యతిరేకతలో అధికార పార్టీకి వ్యతిరేకంగానే పనిచేస్తారని.. అలాంటి దానికోసం ఇవ్వకుండా ఉంటేనే బెటరని.. పైగా ప్రభుత్వంపై ఆర్ధిక భారం కూడా తగ్గుతుందని పార్టీ వర్గాలు ఆలోచించే ఈ విధంగా చేశాయని ఉద్యోగులు బహిరంగంగానే చర్చించుకుంటున్నాయి. వాస్తవానికి అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా, ఏ పార్టీ అయినా ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీకి ముందు ఐర్ ఇస్తుంది. ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీ కూడా అమలు చేస్తుంది. కానీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తరువాత పీఆర్సీ ఇచ్చింది. అంటే మరో రెండేళ్ల వరకూ పీఆర్సీ ఇవ్వకుండా ఉండేదుకు.. ఆ మధ్యలోనే పదేళ్లకు ఒకసారి పీఆర్సీ జీఓని అమలు చేసేందుకు వీలుగా ఉంటుందనేది ప్రభుత్వం ఆలోచనగా ప్రకటించింది కూడా. దానిపై ఉద్యోగ సంఘాల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేక వ్యక్తం అయ్యింది.
ఆంధ్రప్రదేశ్ లోని మొత్త ప్రభుత్వ శాఖలు 75 ఉండగా, 26 జిల్లాల పరిధిలోని ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వీరంతా వన్ సైడ్ అయిపోతే 175/175 సంఖ్యలో భారీ తేడాలు వచ్చేస్తాయి. అలాగని కూటమి తమ మద్దతు ఇద్దామన్నా కూడా ఆ వర్గం
నుంచి కూడా పీఆర్సీ, ఐర్ తోపాటు, సిపిఎస్ రద్దు విషయంలో ఎలాంటి అనుకూల ప్రకటనా రాలేదు. వాస్తవానికి సిపిఎస్ ని ప్రవేశపెట్టింది టిడిపి ప్రభుత్వమే దానితో వాళ్లే తిరిగి దానిని రద్దు చేయడానికి సాహసించడం లేదు. పైగా సిపిఎస్ స్థానంలో మెరుగైన విధానాన్ని కూటమి అధికారంలోకి వస్తే అమలు చేస్తామని ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన పట్ల కూడా ఉద్యోగులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికల్లో ఉద్యోగులు, వారి కుటుంబాల ఓటు బ్యాంకు ఏ పార్టీ ఖాతాలో పడుతుందోననే ఉత్కంఠ రోజు రోజుకీ పెరగుతుంది. అంతేకాకుండా వైఎస్సార్సీపీ అధికారంలో వస్తే ఇక పదేళ్లకు ఒక్కసారి మాత్రమే పీఆర్సీ ఇచ్చే విధంగా చట్టం చేసినా చేస్తారనే భయం కూడా ఉద్యోగుల్లో వెంటాడుతోంది. ప్రస్తుతం ఆ విషయమం మీదే ఉద్యోగ సంఘాలు, వారి వారి సామాజిక మాద్యమాల్లో ప్రధానంగా చర్చను లేవదీస్తున్నారు. ఉద్యోగుల ప్రయోజనాల విషయంలో కనీసం ప్రాధాన్యత ఇవ్వని అధికార పార్టీకి మద్దతు ఇవ్వాలా..? లేదంటే ఆ విషయంలో కనీస ప్రకటన కూడా చేయని కూటమికి మద్దతు ఇవ్వాలా..? లేదా ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చి తమ డిమాడ్లను నెరవేర్చుకోవాలా అనేది ఉద్యోగులు తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు సమాచారం అందుతోంది. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ- టిడిపి, బీజేపీ, జనసేన కూటమికి మధ్య మాత్రమే ప్రధాన పోటీ జరుగుతున్నది. దీనితో ఉద్యోగులు ఎటూ ఆలోచించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు వారి కుటుంబాల మద్దతు అధికారపార్టీకి ఎలాగూ ఉండదని నిర్ణయించుకున్న తరువాత ఐఆర్ ఇచ్చినా ప్రయోజనం లేదని అధికార పార్టీ భావించినట్టు చెబుతున్నారు.
అయితే ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఒకేసారి 1.25 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించిన గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగం నుంచి రెగ్యులర్ అయిన ఉద్యోగులు వారి కుటుంబాల ఓట్లు, పలు ఉద్యోగ నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందిన వారు మాత్రమే అధికార వైఎస్సార్సీపీ మద్దతుగా నిలుస్తారని,
మిగిలిన వారి దగ్గర నుంచి పూర్తి వ్యతిరేకత మాత్రమే వస్తుందని ఉద్యోగ సంఘాలే పేర్కొంటున్నాయి. ఇటీవల అన్ని ప్రధాన పార్టీలు ఉద్యోగ సంఘాల్లోని అనుకూలితుల ద్వారా ఏర్పాటు చేసుకున్న రహస్య సమావేశాల్లో కూడా ఇదే విషయం వెల్లడైందని తెలిసింది. ఉద్యోగులకి ఇవ్వాల్సిన డిఏ బకాయిలే దఫ దఫాలు ఇస్తే ఇక ఐర్, పీఆర్సీ ఏం ప్రకటిస్తారనే పెదవి విరుపు కూడా ఉద్యోగుల నుంచి వ్యక్తం అవుతుంది. అదే సమయంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా అన్యాయం చేశారని.. రెండేళ్లకు రెగ్యులర్ చేయాల్సి ఉద్యోగాలను తొమ్మిది నెలలు పెంచడంతోపాటు, పేస్కేలు పూర్తిస్థాయిలో ఇవ్వాల్సి వస్తుందని ఆ సమయంలోనే డిఏ, హెచ్ఆర్ఏ తగ్గించి, రెగ్యులర్ సమయంలో ఇవ్వాల్సిన రెండు ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా అన్యాయం చేశారని కూడా కొందరు ఉద్యోగులు అధికార పార్టీపై వ్యతిరేకతతో ఉన్నారు. అంతేకాకుండా చాలా విభాగాల ఉద్యోగులకు సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయలేదని, ఒకేసారి ఉద్యోగాల్లోకి వచ్చిన వారికి ఒకే విధానం అమలు చేయకుండా ఒక్కో శాఖ ఉద్యోగి ఒక్కోలా పదోన్నతులు కల్పించడంపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదేశాఖలోని మహిళా పోలీసుల ఉద్యోగాలు ఉంటాయో, కోర్టు కేసుల నెపంతో ఊడుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. అంతేకాదు..నేటికీ కూడా ఈ ప్రభుత్వశాఖకు చట్టబద్దతను అధికార వైఎస్సార్సీపీ తీసుకు రాలేదు. ఈ కారణాల దృష్ట్యా కూడా కొందరు వ్యతిరేకం అయ్యే అకవాశాలున్నాయని చెబుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వ పథకాలు, నాడు నేడు కార్యక్రమాల ద్వారా చేసిన అభిృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకొని కొందరు ఉపాధ్యాయులు, ఉద్యోగులు కూడా అధికారపార్టీకి విధేయులుగా కూడా మారారు. కానీ రాజకీయ చదరంగంలో ప్రధాన భూమిక పోషించే ఉద్యోగు, ఉపాధ్యాయ, పెన్షనర్లు వారి కుటుంబాలు ఎప్పుడు ఏవిధంగా మారి వారి ఓటుతో సమాధానం చెబుతాయో ఎవరికీ అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయింది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులు, వారి కుటుంబాలు పూర్తిగా ఎవరివైపు ఉంటాయనేది మాత్రం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది..!