ఈసారైనా సాధించగలరా..?!


Ens Balu
34
visakhapatnam
2024-05-28 01:29:05

మీకు తెలుసా.. ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రికార్డుల్లో మాత్రమే రాష్ట్రంలో 26 జిల్లాలు..ఇంకా కేంద్ర ప్రభుత్వం దృష్టిలో మాత్రం ఇంకా 13 జిల్లాలే. అదేంటి రాష్ట్రంలో ఒకలా..కేంద్రంలో ఒకలా ఉంటుందా వ్యవహారం.. ఎస్.. అలానే ఉంటుంది. కేంద్రప్రభుత్వం పార్లమెంటులో ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టి..దానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తేనే ఏపీలోని 26 జిల్లాల జాబితా కేంద్రంలో కూడా 26 జిల్లాలుగా నమోదు అవుతుంది. అపుడు మాత్రమే స్థానిక సంస్థల విభజన కూడా జరుగుతుంది. లేదంటే ఉమ్మడి జిల్లాల జిల్లాపరిషత్ లు, ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, జోన్ లో అన్నీ పాత 13 జిల్లాల ప్రాతిపదికన మాత్రమే జరుగుతాయ. నిధులు కూడా ఆ.. పాత 13  జిల్లాలకు మాత్రమే కేంద్రం నుంచి విడుదల అవుతాయి..ఈ విషయం మన రాష్ట్రప్రభుత్వంలోని మంది ఎంపీలకు కూడా తెలియదంటే అతిశయోక్తి కాదేమో. అలాగని ఈ విషయంపై పార్లమెంటులో సైతం ఏవిధంగా మాట్లాడాలో అంతకంటే తెలీదు. మన ఎంపీలకు తెలిసిందల్లా ఒక్కటే రాష్ట్రప్రభుత్వం పార్లమెంటులో ఏం మాట్లాడమంటే అది మాత్రమే మాట్లాడి బయటకు వచ్చేయండం. మన ఎంపీ నిర్లక్ష్యం కారణంగా పదేళ్లు విభజన హామీలు అమలు కాలేదు. విభజన రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాలేదు, జిల్లాల పునర్విభజనకు కేంద్రంలో ఆమోద ముద్ర రాలేదు. ఫలితం చాలా నిధులు, రాష్ట్ర అభివృద్ధి కోల్పోవాల్సి వచ్చింది..!

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయపార్టీలు అధికారం కోసం చూపిన శ్రద్ధ నిజంగా రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకోవడానికి చూపించలేదనడంలో రాష్ట్రవిభజన జరిగి పదేళ్లు, రాష్ట్రంలో జిల్లాల విభజన జరిగి రెండేళ్లు అవుతున్నా నేటికీ రాష్ట్రానికి కేంద్రం నుంచి పోరాడి తెచ్చుకోవాల్సిన ఆమోదాన్ని మాత్రం తెచ్చుకోలేకపోయాయి. రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చి రాష్ట్రంలో గెజిట్ విడుదల చేసి ఊరుకున్న ప్రభుత్వం దానికి కేంద్రం నుంచి ఆమోదాన్ని నేటి వరకూ సాధించలేకపోయింది. దాని కారణంగా రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభన కూడా కోల్పోవాల్సి వచ్చింది. అదే జరిగితే రాష్ట్రంలో మన ప్రజాప్రతినిధుల బలంపెరిగి కేంద్రంలో మన మాటకి పలుకుబడి మరింత పెరిగేది. కానీ ఆ దిశగా మన ఎంపీలుగానీ, రాష్ట్రప్రభుత్వం గానీ ఏ కోశానా చర్యలు తీసుకోలేదు. ప్రధాని, ఇతర కేంద్ర మంత్రులను కలవడంలో చూపిన శ్రద్ధ, అదే సమయంలో రాష్ట్రంలోని కొత్తజిల్లాలు, నియోజకవర్గాల పునర్విభజన అంశంపైకూడా ఒత్తిడి తెచ్చివుంటే చట్టసభల్లో మనకి వచ్చే సీట్లు, తద్వారా వచ్చే కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా పెరిగేవి. కేంద్రజాబితా పరిధిలోకి వచ్చే ఈ అంశాలకు సంబంధించి బిల్లు తొలిగా పార్లమెంటులో పాస్ కావాల్సి వుంటుంది. ఆ తరువాత రాష్ట్రపతి ఆమోదం పొందితే మనకు వచ్చే ప్రయోజనాలతో రాష్ట్ర అభివృద్ధికూడా అదే స్థాయిలో జరగడానికి ఆస్కారం వుండేది. కానీ విభజన ఆంధ్రప్రదేశ్ లోని 2 రాజకీయపార్టీలు ప్రభుత్వాన్ని నడిపిన వారు కేంద్రం నుంచి మాత్రం ఆమోదాన్ని సాధించలేకపోయారు. జూన్ 4 తరవాత ఏర్పాటు కాబోయే కొత్తప్రభుత్వం ముందు ప్రధానంగా ఈ అంశాలన్నీ ప్రధానంగా దండకట్టుని నిలబడతాయి. ఆ విషయంలో గతంలో చేసినట్టుగా తాత్సారం చేస్తే మరో ఐదేళ్లు మనం సాధించుకోవాల్సిన ప్రధాన అంశాలు మరుగున పడిపోతాయి. విధాన పరమైన అంశాలకు మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించే ఎంపీలు కూడా ఈ అంశాలను పార్లమెంటులో ప్రస్తావించకపోవడం వలన రాష్ట్రాభివృద్ధికి నిధుల రాకకు కేంద్రంలోనే అడ్డుకట్టపడిపోతున్నది.

విభజన ఆంధ్రప్రదేశ్ లో జనాభా గణన జరిగితే తొలుత అసెంబ్లీ స్థానాలు, పార్లమెంటు స్థానాలు రెండూ పెరుగుతాయి. అలా పెరగడం వలన రాష్ట్రంలోని పెద్ద సభ శాసన మండలి సీట్లు పెరుగుతాయి. కేంద్రంలోని పెద్దలసభ రాజ్యసభలోనూ సీట్లు పెరుగుతాయి. ఇక రాష్ట్రంలో జిల్లా పరిషత్ లు పునర్విభజన ప్రతీజిల్లాకు ఒక జిల్లా పరిషత్ ఏర్పాటవుతుంది. కొత్త మండలాలతో పాటుగా కొత్త పంచాయతీల ఏర్పాటు కూడా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ ఆదమోదం లేకుండా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి గెజిట్ లు విడుదల చేసినా అవి కేవలం రాష్ట్రానికి మాత్రమే పరిమితం అవుతాయి. అలా కాకుండా విధానపరంగా ఆమోదం పొందాలంటే మాత్రం పార్లమెంటులో విభజన రాష్ట్రాల్లోని కొత్త జిల్లాలు, స్థానిక సంస్థల పునర్విభజనకు ఆమోదం లభించి ఆపై రాష్ట్రపతి సంతకం కూడా కావాల్సి వుంటుంది. అలా జరిగిన రోజు మాత్రమే రాష్ట్రంలో చేపట్టిన జిల్లాల పునర్విభజనకు చట్టబద్దత ఏర్పాటై కేంద్రం దృష్టిలో కూడా 26 జిల్లాలుగా  గుర్తింపు లభిస్తుంది. అపుడు జిల్లాలకు ఇచ్చే నిధుల శాతం కూడా పెరుగుతంది. తర్వాత సివిల్ సర్వీసు అధికారులకు జిల్లా కార్యాలయాలు, క్యాంపు కార్యాలయాలు నిర్మాణం జరుగుతాయి. జిల్లాల స్వరూపాన్ని బట్టి కేంద్రప్రభుత్వ సంస్థల ఏర్పాటు కూడా మన ఎంపీల డిమాండ్ తో నెరవేరే అవకాశం వుంటుంది. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయాలు, సెంట్రల్ యూనివర్శిటీలు, కేంద్రప్రభుత్వ సంస్థల జోనల్ కార్యాలయాలు కూడా ఏర్పాటు కానున్నాయి. ఇవన్నీ జరగాలంటే ముందు పార్లమెంటులో బిల్లు పాసై రాష్ట్రపతి ఆమోద ముద్ర కావాలి..దానికోసం మన ఎంపీలు రాష్ట్ర పరిస్థితిని పార్లమెంటులో చర్చించాలి. దానితోపాటు రాష్ట్రప్రభుత్వం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా  ప్రత్యేకంగా రాష్ట్ర సమస్యలను కేంద్రానికి నివేదికలు ద్వారా తెలియజేయాలి. ఇవన్నీ సాధించాలంటే రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించాలి..ఆ రకంగా చేస్తారా..? ఈసారైనా అన్నీ సాధిస్తారా? అనేది కొత్త ప్రభుత్వం ఆలోచన మీద మాత్రమే ఆధారపడి వుంటుంది..!