వీళ్లంటే మోజు..వాళ్లంటే గలీజు..!


Ens Balu
225
visakhapatnam
2024-06-09 06:55:35

అవును గ్రామ సచివాలయాల్లోని గ్రామీణ వ్యవసాయ సహాయకులంటే ప్రభుత్వానికి మోజు.. కాదు ఇష్టం.. లేదు ప్రేమ.. కానీ వాళ్లంటే(ఎఈఓ) మాత్రం గలీజు..ఇవన్నీ కాదుగానీ వీళ్లని అడ్డం పెట్టుకొనే అన్నీచేయొచ్చు.. ఏంటి తేడాగా ఉంది వ్యవహారం అనుకుంటున్నారా..? ఎస్ పక్కా తేడా.. అంతకు మించిన కల్తీ కూడా.. ఇంకా ఆపైన ఏమైనా చెప్పుకోవచ్చు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవసాయశాఖలోని పేస్కేలు ఎక్కువగా ఉన్న ఒక క్యాడర్(ఏఈఓ) పోస్టులను ఏకంగా రద్దు చేసేయడానికి పక్కాగా ప్రణాళిక వేసింది. కాకపోతే అందరూ నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయని అనుకున్నారు గానీ..ఆ ముసుగులో ఒక క్యాడర్ పోస్టునే రద్దుచేసేయడానికి కుట్ర జరిగిందని మాత్రం ఎవరూ ఊహించలేదు. వాస్తవాలు తెలుసుకుంటే మీరు కూడా నిజమే కదా అంటారు. వ్యవసాయశాఖలో జరుగుతున్న తేడాలపైనా.. ప్రభుత్వం ముందుకి ఈఎన్ఎస్-ఈరోజు ప్రత్యక కథనాలను తీసుకొచ్చేందుకు సిద్దపడింది. 

గ్రామ సచివాలయశాఖలో గ్రామీణ వ్యవసాయ సహాయకుల(విఎఎ) పోస్టులను రాష్ట్రవ్యాప్తంగా భర్తీచేసిన ప్రభుత్వం అప్పటికే విధులు నిర్వహిస్తున్నఏఈఓ(అగ్రికల్చర్ ఎక్స్ టెన్సన్ ఆఫీసర్) పోస్టులను భర్తీచేయడం మానేసింది. ఇపుడు అదే ఏఈఓ పోస్టుల్లోకి ప్రస్తుతం పనిచేస్తున్న విఎఎలకు గ్రేడ్-2 విఎఎలుగా పదోన్నతులు కల్పించడానికి ఫైల్ సిద్దం చేసి 26 జిల్లాల నుంచి సచివాలయాల్లోని విఎఎల సమాచారం కోరుతోంది.. మళ్లీ ఇదే ఏఈఓలను పదోన్నతులు కల్పించకుండా పక్కన పెట్టేసింది. ఒక ప్రభుత్వశాఖలోని ఉద్యోగులకు పదోన్నతులు కల్పించే సమయంలో అన్ని క్యాడర్ పోస్టలకు రోస్టర్ పాయింట్ విధానంలో పదోన్నతులు కల్పించాలి. అది ఉద్యోగుల సర్వీసు నిబంధనలను సూచిస్తుంది. కానీ వ్యవసాయశాఖలోని ఈఏఓలకు పదోన్నతులు కల్పించడానికి మాత్రం కమిషనరేట్ లోని ఉన్నతాధికారులు ససమేమిరా అంటున్నారు. మాకు పదోన్నతులు ఇవ్వరా సారూ అంటే ఆ ఒక్కటీ అడక్కు అంటున్నారు..  నిప్పులో నెయ్యివేసినట్టుగా గత ప్రభుత్వం ఏఈఓలకు పదోన్నతులు ఇవ్వకుండా పక్కనపెట్టేసిన పనికి ఇదేశాఖలోని ఏఓ(మండల వ్యవసాయాధికారులు) కూడా మద్దతు ఇచ్చారు. అంతేకాదు ఇపుడు అదే ఏఓలు ప్రస్తుత ఏఈఓ(అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్) గా ఉన్న ఉద్యోగులకు అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ పదోన్నతులు రాకుండా మోకాళ్లు అడ్డుపెడుతున్నారు. దానికి కారణం ఏఓల చదువు(బిఎస్సీ అగ్రికల్చర్) వ్యవసాయశాఖలోని కమిషనర్ తరువాత అడిషనల్ డైరెక్టర్ క్యాడర్ వరకూ అందరూ చదివింది  ఏజీబిఎస్సీనే. ఏదో అతి కొద్ది మంది అధికారులు, సిబ్బంది మాత్రమే ఎంఎస్సీ అగ్రికల్చర్ చదివారు.

 అదే వీరి మాట ప్రభుత్వంలో చెల్లుబాటు కావడానికి కారణం అయ్యింది. ఎజీబిఎస్సీ చదివి మండల వ్యవసాయాధికారిగా విధులు నిర్వహిస్తున్న తమ క్రింద ఏఈఓలకు అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గా పదోన్నతి కల్పిస్తే వాళ్లూ మేము ఒకటే అయిపోతామని చెప్పి రాష్ట్రస్థాయిలో అధికారులపై తీవ్రమైన ఒత్తిడి తేవడంతో అగ్రికల్చర్ డిప్లమో చదివి ఏఈఓలుగా ఉద్యోగాలు చేస్తున్నావారు పదోన్నతులకు దూరం అయిపోయారు. వీరి పదోన్నతులకు సంబంధించి గతంలోని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు తీవ్రంగా ప్రయత్నించి విసిగిపోయారు. ఆ తరువాత కమిషనరేట్ నుంచి మండల స్థాయి వరకూ ఏఓలంతా ఒక్కటైపోయి వీరికి పదోన్నతులు రాకుండా అడ్డుకున్నారనే విషయం తెలుసుకొని ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి స్థాయిలో ఫైలు కదిపినా.. కమిషనరేట్ అధికారులు దానికి సంబంధించి ఫైల్ కదపకపోవడంతో చేసేది ఏం లేక వెనుతిరిగారు. ఒకా నొక సమయంలో మీశాఖలోని అధికారులే మీ పదోన్నతులకు అడ్డుపడుతుంటే నేను మాత్రం ఏం చేయగలనని మంత్రి ఉన్నప్పుడే కన్నబాబు చేతులెత్తేశారు. 

కాగా ఇపుడు తాజాగా గ్రామ సచివాలయాల్లోని విఎఎలకు గ్రేడ్-2 ఏఈఓలుగా పదోన్నతులు కల్పించడానికి ప్రభుత్వం అంతా సిద్దం చేసింది. ఆ సమయంలో వీరికంటే ముందుగా ఉన్న ఏఈఓలకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించిన తరువాత. ఆ ఖాళీల్లోని పోస్టులను రోస్టర్ పాయింట్ల ద్వారా భర్తీచేయాల్సి వుంది. కానీ ఏఈఓలకు పదోన్నతులు ఇవ్వకుండానే ఇపుడు విఎఎలకు పదోన్నతులు కల్పించడం ఏంటని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఈఏఓలు నెత్తీనోరూ కొట్టుకుంటూ లబోదిబో మంటున్నారు. ఈఏఓలకి పదోన్నతులు ఇవ్వడానికి ప్రభుత్వం అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ అనే క్యాడర్ ను ఏర్పాటుచేస్తే దానికి ఏఓల సంఘం నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేక వచ్చింది. దానిని దృష్టిలో పెట్టుకొని అదే చదువులో కమిషనరేట్ విధులు నిర్వహిస్తున్న అడిషనల్ డైరెక్టర్ క్యాడర్ అధికారులు కూడా ఏఈఓ ప్రమోషన్ ఫైల్ పక్కన పెట్టేశారు. కావాలంటే వీరికి ప్రభుత్వం ద్వారా ఇన్ సర్వీస్ లో ఏజీబిఎస్సీ చదివించి ఆపై ఏఓలుగా పదోన్నతులు ఇవ్వడానికి అంగీకరిస్తాం తప్పితే .. డిప్లమా అగ్రికల్చర్ చదివి తమ క్యాడర్ కి సమానంగా తమ క్రింది ఆఫీసర్ అనే పదంతో వీరికి పదోన్నతులు ఇస్తే.. వారికి మాకూ పెద్దగా తేడా ఏముంటుందని..ఏఓలంతా రాష్ట్రస్థాయిలో నెట్వర్క్ తిప్పడంతో.. వీరికి మద్దతుగా కమిషనరేట్ లో కూడా ఏఈఓ ప్రమోషన్ ఫైలు పక్కన పెట్టేశారు.

ఇపుడు మళ్లీ విఎఎలకు పదోన్నతులు ఇస్తున్న వేళ ఏఈఓలు కూడా తమకు పదోన్నతి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వీరిలో చాలా మంది పదోన్నతులు రాక ఏఈఓటుగానే ఉద్యోగ విరమణ చేయడంతో తాము కూడా ఒక్క ప్రమోషన్ కూడా తీసుకోకుండానే ఉద్యోగ విరమణ చేయాల్సి వస్తుందని ప్రస్తుతం ఉన్న ఏఈఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఏఈఓల పదోన్నతుల ఫైల్ క్లియర్ అయిన తరువాత మాత్రమే సచివాలయశాఖలోని విఎఎలకు పదోన్నతులు కల్పించాలి. అలాకాకుండా వెనుక విధుల్లో చేరిన విఎఎలకు కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే పదోన్నతులు ఇచ్చి...పదేళ్లు, 20ఏళ్లుగా పనిచేస్తున్న ఏఈఓలను ప్రభుత్వం పూర్తిగా పక్కనపెట్టేయడానికి ఏఈఓలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయంలో ఏఈఓలు వ్యవసాయశాఖ చేస్తున్న తేడా వ్యవహారాలపై కోర్టును ఆశ్రయిస్తే.. దానిని ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. కేవలం అగ్రికల్చర్ ఆఫీసర్ క్రింద అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ అనే పదం వస్తే తట్టుకోలేకపోతున్న ఏఓలు, కమిషనరేట్ అధికారుల కుటిల బుద్ధి కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎన్నో ఏళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్న ఏఈఓలు పదోన్నతులకు దూరం అయిపోయారు. 

ఇపుడు గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న విఎఎల్లో చాలా మంది బిఎస్సీ అగ్రికల్చర్ చేసినవారు, ఎమ్మెస్సీ చేసిన వారు కూడా ఉన్నారు. బహుసా ఈ కారణంతోనే వీరి పదోన్నతుల విషయంలో ఏఓలు కమిషనరేట్ లోని రాష్ట్రస్థాయి అధికారులు నోరు మెదపలేదు. అయితే పదోన్నతులు లభిస్తు అందులో కూడా డిప్లమా అగ్రికల్చర్ చేసిన ఉద్యోగులు ఉన్నారు.. మరి అలాంటపుడు వారి విషయంలోనైనా అడ్డుతగులు తారా అంటే..ఇప్పుడేం తగలం ఆ తరువాత పదోన్నతుల సమయంలో మాత్రం మళ్లీ తెరమీదకి సమస్యను తీసుకు వస్తాం అన్నట్టుగా రాష్ట్రస్థాయి అధికారులు వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తున్నది. కమిషనరేట్ అధికారులు, ఏఓలు మోకాలు అడ్డుపెట్టిన ఫలితంగా ఏఈఓలు పదోన్నతులకు దూరమైపోయారు. అయితే ఇప్పటికైనా కొత్తగా ఏర్పడే రాష్ట్రప్రభుత్వం ఈఏఓలకు జరిగిన అన్యాయంపై దృష్టిసారిస్తే ముందు వీరికి పదోన్నతులు ఇచ్చిన తరువాత, గ్రామ సచివాలయాల్లోని విఎఎలకు పదోన్నతులు కల్పిస్తుంది. లేదంటే ఈ ప్రభుత్వంలోనూ ఏఈఓలు పదోన్నతులు రాని ఉద్యోగులుగానే మిగిలి పోతారు. అయితే ఇక్కడ గ్రామ సచివాలయ గ్రామీణ వ్యవసాయ సహాయకులకు పదోన్నతులు రావడం ఈఎన్ఎస్-ఈరోజు వ్యతిరేకం కాదు. అదే సమయంలో ఎన్నో ఏళ్ల నుంచి వ్యవసాయశాఖలో సేవలందిస్తున్న ఏఈఓలకు కూడా సర్వీసు నిబంధనలు అమలు జరిగి ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేసి పదోన్నతులు దక్కాలన్నది మాత్రమే లక్ష్యం.  చూడాలి కూటమి ప్రభుత్వం వ్యవసాయశాఖలోని అధికారుల నిర్లక్ష్యం, ఓర్వలేని తనం కారణంగా అన్యాయంగా పదోన్నతులు కోల్పోయిన ఏఈఓల విషయంలో ఏ విధంగా న్యాయం చేస్తుందనేది...!