సచివాలయ మహిళా పోలీసులకి స్టైడింగ్ ..?!


Ens Balu
578
visakhapatnam
2024-06-11 05:20:53

ఆంధ్రప్రదేశ్ లో సీఎం నారా చంద్రబాబు నాయుడు అంటే సమర్ధవంతమైన పరిపాలన అనేది ఉద్యోగులు, ప్రజల్లో ఒక నమ్మకం. ఆయన నిర్ణయం తీసుకుంటే  దిశ, దశ మారడం ఖాయం.. సంపదను సృష్టించాలన్నా ఆయనే.. ఉన్న వనరులను అదనపు భారం పడకుండా పూర్తిస్థాయిలో వినియోగించాలన్నా ఆయనే..అందుకే బాబు వస్తే జాబుకి గ్యారెంటీ వస్తుందని యువత అంతా బలంగా నమ్ముతారు..ఇపుడు అదే నమ్మకం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను కూడా గాడిలో పెట్టి ప్రజలకు ఇంటి ముంగిటే ప్రభుత్వ సేవలు అందించడానికి ఉపయోగ పడేలా మారనుంది. గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటు దగ్గర నుంచి ఈశాఖలోని లోపాలు, అభివృద్ధి, ఇబ్బందులు.. ప్రజలకు అందే సేవలు, ప్రభుత్వానికి ఈశాఖ వలన ఉపయోగాలపై ఈఎన్ఎస్-ఈరోజు మాత్రమే మరే మీడియా రాయని వాస్తవాలు రాసింది.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుందన్నట్టు.. ముఖ్యమంత్రి తీసుకునే ఒక్క నిర్ణయంతో కొత్త ఉద్యోగాల కల్పన లేకుండా ఉన్న ఉద్యోగులతోనే పూర్తిస్థాయిలో ప్రజలు సేవలు అందించడంతోపాటు, ఉద్యోగుల భవిష్యత్తుకి కూడా గ్యారెంటీ వస్తుందనడంతో ఎలాంటి సందేహం లేదు. ఆ నిర్ణయం ఏంటి..? ఎందుకు తీసుకోవాలి..? దాని వలన ఉపయోగాలేంటి..? ఒక ప్రభుత్వ శాఖ ప్రక్షాళనకు ఆ నిర్ణయం ఏ విధంగా దోహద పడుతుందనేది ఈ స్టోరీ చదివితే మీకే అర్ధం అవుతుంది..! 

గ్రామ, వార్డు సచివాలయశాఖ.. పేరుకి ప్రభుత్వశాఖ అన్నమాటే గానీ ఇందులో పనిచేసే ఉద్యోగులకు మాత్రం తమ ఉద్యోగాల భవిష్యత్తు ఏంటో అనే అనుమానమే విధుల్లోకి చేరిన దగ్గర నుంచి నేటి వరకూ ఉద్యోగులను వెంటాడుతూనే ఉంది. దానికి కారణం ఈ శాఖను ఏర్పాటు చేసిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం దీనికి దిశ, దశ కల్పించకపోవడమే. ప్రభుత్వశాఖను ఏర్పాటు చేసిన ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తూ..ఇపుడు ఉద్యోగుల భవిష్యత్తుని కూడా అంధకారంలోకి నెట్టేసింది. తొలి తప్పు ఈ శాఖకు చట్టబద్ధత కల్పించకపోవడం. రెండవ తప్పు ప్రధాన ప్రభుత్వశాఖల ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకపోవడం, మూడవ తప్పు నిబంధనలకు పట్టించుకోకుండా నియామకాలు చేపట్టడం. కోర్టుకేసులు పడినా వాటికి ప్రభుత్వం తరపునుంచి పరిష్కారం చూపకపోవడం. ఇలా చెప్పుకుంటే పోతే గత ప్రభుత్వం చేసిన తప్పులు నేడు సచివాలయ ఉద్యోగులను వెంటాడుతున్నాయి. ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శి ఉద్యోగాల నియామకాల్లో పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నిబంధనలు అమలు చేయకుండా నియామకాలు చేపట్టారని హైకోర్టులో ఉమ్మడి విశాఖజిల్లాకు చెందిన వ్యక్తి కేసు వేస్తే..దానికి పూర్తిస్థాయిలో ప్రభుత్వం తరపున కౌంటర్ ఇవ్వని ప్రభుత్వం వీరిని పోలీసులుగా పరిగణించమని, వారికి పోలసు విధులు అప్పగించమని చెప్పి హైకోర్టుకి అఫడిట్ దాఖలు చేసి చేతులు దులిపేసుకుంది. దీనితో మహిళా పోలీసుల భవిష్యత్తు అంధకారం అయిపోయింది. ఇపుడు వీరు పేరుకి పోలీసుశాఖ ఉద్యోగులైనా..వీరికి ఎలాంటి పదోన్నతులు రాకుండా కోర్టుకేసులు మోకాలడ్డుతున్నాయి. వాస్తవానికి పోలీసుశాఖ నుంచి నియమితులైన వీరంతా అదే పోలీసుశాఖ వీరు మా ఉద్యోగులు కారని, వారికి పోలీసు విధులు అప్పగించమని చెబితే మరే ప్రభుత్వశాఖకు చెందిన ఉద్యోగులనేది గత ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. అలాగని వీరికి పోలీసుశాఖ విధులేమైనా ఇవ్వడం మానేశారా అంటే కోర్టుకి సమర్పించిన అఫడవిట్ మినహా పనులన్నీ వీరితోనే చేయిస్తున్నారు. అంతేకాకుండా సచివాలయాల్లో ఖాళీగా ఉన్నశాఖల ఉద్యోగాల విధులు కూడా వీరితోనే చేయిస్తున్నారు.

అదటుంచితే ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగవిరమణ వయస్సు 62ఏళ్లకు పెంచేయడంతో సచివాలయాల్లో పనిచేసే పంచాయతీ కార్యదర్శిలు రిటైర్ కాకుండా సుమారు మూడు వేల మంది ఉండి పోయారు. వాళ్లంతా వచ్చేఏడాది మార్చి తర్వాత మూకుమ్మడిగా ఉద్యోగ విరమణ చేస్తారు. అపుడు ఒకేసారి సచివాలయాలు ఖాళీ అయిపోతాయి. ఆ సమయంలో ప్రభుత్వం ఉద్యోగాలను కొత్తనోటిఫికేషన్ తో భర్తీచేయకపోతే గ్రామాల్లో సేవలు అందించడం కష్టమవుతుంది. ఇప్పటికే సచివాలయశాఖలో చాలా ఉద్యోగాలు భర్తీకాకుండా ఉండిపోయాయి. ఖాళీలను కారుణ్య నియామకాల ద్వారా భర్తీచేస్తున్నా, దీనికంటే మంచి ఉద్యోగం వస్తే ఉద్యోగులు ఈ ఉద్యోగాన్ని వదలి వెళ్లిపోతున్నారు. దానితో ఏ ప్రభుత్వశాఖకు చెందని మహిళా పోలీసులతోనే సచివాలయాల్లోని ఖాళీగా వున్న ప్రభుత్వశాఖల  విధులను చేయిస్తోంది ప్రభుత్వం. ఏ ప్రభుత్వ శాఖలోనైనా ఉద్యోగులు వారి శాఖకు చెందిన విధులు మాత్రమే చేస్తారు. వెరైటీగా సచివాలయశాఖలోని ఉద్యోగులు మాత్రం అన్ని ప్రభుత్వశాఖలకు చెందిన విధులూ ఖచ్చితంగా నిర్వర్తించాల్సిందే. వాటికితోడు సొంత ఖర్చులు పెట్టుకొని మరీ చేసే బిఎల్వో విధులు వీరికి అధనం. అదనపు విధులు అప్పగించిన ప్రభుత్వం వారితోనే స్టేషనరీ, ట్రాన్స్ పోర్టు ఖర్చులన్నీ పెట్టుకొని మరీ చేయమంటుంది. బలవంతంగా చేయిస్తోంది కూడా. అలా చేయని ఉద్యోగులపై సస్పెషన్సులు, చార్జి మెమోలు కూడా ఇచ్చి భయపెడుతోంది. ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు సస్పెన్షన్ కి గురై విధుల్లోకి చేరకుండా ఉండిపోయారు.

ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు 14వేలకు పైబడి మహిళా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. వీళ్లు ఇపుడు ఏ ప్రభుత్వశాఖకు చెందిన ఉద్యోగులో ప్రభుత్వం దగ్గర కూడా నివేదికలు లేవు. ఏ కారణంగా వీళ్లని పోలీసులుగా పరిగణంచమని చెప్పి హోంశాఖ హైకోర్టుకి అఫడవిట్ దాఖలు చేయడమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఉద్యోగులకు స్లైడింగ్ ఇస్తే..ఇదే గ్రామ, వార్డు సచివాలయశాఖలోని ఖాళీగా ఉన్న కార్యదర్శిలు, డిజిటల్ అసిస్టెంట్లు, వెల్పేర్ అసిస్టెంట్లు పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా చేయాలని గత ప్రభుత్వం కూడా ఆలోచించినా దానిని ఆచరణలో పెట్టలేదు. కారణం ఆ భయంతోనైనా వైఎస్సార్సీపీకే సచివాలయ ఉద్యోగులందరూ ఓటువేస్తారనే కుటిల ఆలోచనతో అలా చేసిందనే బలంగా నమ్మారు. ఉద్యోగులు. ఒక్క శాఖ ఉద్యోగులను అడ్డం పెట్టుకొని మొత్తం 19శాఖల ఉద్యోగులను భయపెట్టి..వారి చేతులో పెట్టుకోవాలని చూసిందని కూడా ఇపుడు ఒంటికాలపై లేస్తున్నారు. త్వరలో సుమారు మూడువేల మంది పంచాయతీ కార్యదర్శిలు ఉద్యోగ విరమణ చేయనున్నారు. అపుడు ఒకేసారి సచివాలయాల్లో సేవలకు ఉన్న ఉద్యోగులకే మళ్లీ అదనపు బాధ్యతలు ఉన్నఅప్పగించాలి. ఇప్పటికే రాష్ట్రంలో ఒక్క పంచాయతీ కార్యదర్శి మూడు నాలుగు పంచాయతీలకు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. దానితో ఏ పంచాయతీకి న్యాయం చేయలేకపోతున్నారు. ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే డిగ్రీ క్వాలిఫికేషన్ పై నాలుగు ఉద్యోగాలకు పోటీ పరీక్షరాసి మహిళా పోలీసులుగా ఎంపికై వారికి స్టైడింగ్ అమలు చేయడం ద్వారా మహిళా పోలీసులు కోరుకున్న, ఖాళీ ఉద్యోగాల్లో భర్తీకి మార్గం సుగమం అవుతుంది.

 మహిళా పోలీసుల్లోనూ చాలా మంది బిటెక్ చేసిన వారు, డిగ్రీలు, పీజీలు, పీహెచ్డీలు చేసిన వారు కూడా ఉన్నారు. వీరి అర్హతలతో 19విభాగాల్లోని ఖాళీగా ఉన్న పోస్టులన్నీ స్టైడింగ్ ద్వారా ప్రభుత్వం ఎంచెక్కా భర్తీచేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వానికి కొత్తగా ఉద్యోగాలు భర్తీచేసే ఆర్ధిక భారం కూడా తప్పుతుంది. ఎలాగూ మహిళా పోలీసు వ్యవస్థకి పోలీసుశాఖలో హోంగార్డు నుంచి ఎస్ఐ వరకూ అందరూ వ్యతిరేకమే కనుక.. ఈ మహిళా పోలీసు వ్యవస్థను తీసేయడానికి, కోర్టు కేసుల నుంచి వీరికి విముక్తి కల్పించడానికి మంచి అవకాశం కూడాఏర్పడుతుంది. ఇపుడు ప్రభుత్వం ముందున్న ఆప్షన్ కూడా ఇదొక్కటే. ఒక్క ఐడియాతో గ్రామ, వార్డు సచివాలయశాఖకు చట్టబద్ధత, ఖాళీల భర్తీ, అయోమయంలో ఉన్న ఉద్యోగులకు స్లైడింగ్ ద్వారా ఉద్యోగ భద్రత అన్నీ వచ్చేస్థాయ్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ శాఖ ఉద్యోగులు, వారి కుటుంబాలు ఎంతో  నమ్మకం పెట్టుకొని మరీ చూపించిన ఓటు మద్దతుకు సీఎం చంద్రబాబు తీసుకునే ఒక్క నిర్ణయంతో వేలాది మంది ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నిండుతాయనడంతో ఎలాంటి సందేహం లేదు.. వచ్చిన అశకాశాన్ని అందిపుచ్చుకుంటే ఉద్యోగులకు సమ న్యాయం చేయడంతోపాటు కోర్టు కేసులకి సమాధానం చెప్పే పనికూడా ఉండదు. చూడాలి కూటమి ప్రభుత్వం సచివాలయశాఖ ఉద్యోగుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది..!