డిప్యూటీ సీఎం పవన్ కి పంచాయతీల సవాల్..!


Ens Balu
48
visakhaptanam
2024-06-28 18:12:52

గ్రామ గ్రామానా గ్రామస్వరాజ్యం అన్నారు.. ఇంటి ముందే ప్రజలకు ఉచిత సేవలన్నారు.. ఏ పనైనా గ్రామ సచివాలయాలుగా మారిన పంచాయతీల్లోనే అన్నారు.. ఏది ఎక్కడ..? ఒక్కో పంచాయతీ కార్యదర్శికి 4 పంచాయతీలు ఇన్చార్జిలు అప్పగిస్తే పనులు ఎలా చేపడతారు? ఎలా సేవలు అందిస్తారు.. నిధులన్నీ ప్రభుత్వం దారి మళ్లిం చేస్తుంటే.. కనీసం వీధుల్లో వీధిలైట్లు ఎవరు వేయిస్తారు.. పారిశుధ్య సిబ్బంది లేమి భారీ ఉంటే కాలువల్లో చెత్తను ఎవరు ఎత్తిస్తారు.. టెక్నికల్ సిబ్బంది లేకపోతే ఇంటింటికీ మంచినీటి కుళాయిలు మరెవరు వేయిస్తారు.. రోడ్డు ప్రక్కన దోమలు ప్రభల కుండా బ్లీచింగ్ అని పిలవబడే తెల్లబూడిదను ఎవరు చల్లిస్తారు.. గ్రామ పంచాయ తీల్లో నిధు ల్లేక సర్పంచ్ లు సొంత నిధులు, ఆపై చాలక అప్పులు చేస్తుంటే ఆ బిల్లులు చెల్లించేది ఎవరు..? గత ప్రభుత్వంలో అన్నీ కాకిలెక్కలు.. ప్రకటనలకు ఖర్చులు తప్పా ప్రజ లు ఒరిగింది ఏమీ లేదు. నిజమైన గ్రామ స్వరాజ్యం గ్రామ సచివాలయాలతోనే సిద్ధిస్తుందని చెప్పి 1.25లక్షల ఉద్యోగాలు భర్తీచేసినా..నేటికీ ప్రజలకు సేవలు అందకపో వడానికి లోపాలు ఎక్కడున్నాయి..? అస్తవ్యస్థ గ్రామ పంచాయతీ పరిపాలన ఇపుడు ఇపుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ముందుకి వచ్చింది.. మరి పాలన గాడిన పడుతుందా..? సిబ్బంది లేమితో చతిలక పడుతుందా..?

ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల్లోని 13,313 గ్రామ పంచాయతీలు, 14వేల గ్రామ, వార్డు సచివాలయాలు, 1.25 లక్షల మంది 19శాఖల సిబ్బంది ఉన్నా నేటికీ పంచాయ తీల్లో కార్యదర్శిలంతా ఒక్కొక్కరూ నాలుగైదు పంచాయతీలకు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. పంచాయతీలకు సర్పంచ్ ఉంటే సరిపోతుందా..? పరిపాలన చేయడానికి కార్యదర్శి అవసరం లేదా..? ఉన్న సిబ్బందితో పనులు అయిపోతాయా కష్టమే అంటోంది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ. ఇప్పటికే ఇన్చార్జిల పాలనతో నడుస్తున్న గ్రామ పంచాయతీలు మరికొద్ది నెలల్లో మరింత సిబ్బంది కొరతను ఎదుర్కోనున్నాయని ఆందోళన చెందుతోంది. గత ప్రభుత్వ హయాంలో గాడితప్పిన పంచాయతీ పాలనకు..నేటి కూటమి ప్రభుత్వంలోనై మోక్షం వస్తుందా అని రాష్ట్రస్థాయి అధికారులే ఎదురు చూస్తున్నారంటే గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. గత ప్రభుత్వ హయాంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి భారీగా ఉద్యోగాలు భర్తీచేసినా.. పంచాయతీలకు అవసరమైన పంచాయతీ కార్యదర్శిలను మాత్రం పూర్తిస్థాయిలో భర్తీచేయలేకపోయింది. చేసిన వారికైనా గ్రామపంచాయతీలను అప్పగించిందా అంటే అదీలేకుండా పోయింది.

మేజర్ పంచాయతీల్లో మూడు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రతీ సచివాలయానికి గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిని నియమించి ఒకే చోట ముగ్గురు కార్యదర్శిలను ఉంచింది తప్పితే.. భారీగా ఖాళీలు ఉన్న పంచాయతీల్లో మాత్రం వీరిని నియమించలేదు. అదేమంటే వారికి పూర్తిస్థాయి శిక్షణ, అనుభవం లేదని ఐదేళ్ల పాటు కాలం నెట్టుకొచ్చేసింది. అంతా సర్వేలు, రిపోర్టులంటూ సిబ్బందిని అసలైన సేవలకు వినియోగించకుండా అనవసర సేవలకు వినియోగిస్తూ వచ్చింది. తీరా ఇపుడు అదే సిబ్బంది లేమి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామపంచాయతీలపై తీవ్రంగా పడింది. ఇన్చార్జి కార్యదర్శిలతో ఏ పంచాయతీలోనూ ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. దానితో ఉన్న సిబ్బందినే ఖాళీగా ఉన్న విభాగాల సేవలకు వినియోగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని 74 ప్రభుత్వ శాఖల్లో లేని విధానం ఒక్క గ్రామ సచివాలయాల్లోనే నడుస్తుందంటే అతిశయోక్తి కాదేమో. ఏ ప్రభుత్వశాఖలోనైనా సదరు ప్రభుత్వశాఖ విధులు మాత్రమే నిర్వహిస్తారు. కానీ ఇక్కడ సిబ్బంది ఏ విభాగంలో ఖాళీ ఉంటే ఆ విభాగం పనులు చేయాల్సిందే. అదీ సీనియర్ పంచాయతీ కార్యదర్శిల బెదిరింపులు, జిల్లా, మండల స్థాయి అధికారుల ఆదేశాలతో.  అలా పనిచేసినా పంచాయతీల్లో ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. పంచాయతీల్లో 740 సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చినా.. కనీసం 50 సేవలు కూడా ప్రజలకు అందడం లేదు.

కారణం గత ప్రభుత్వం సేవలకు అనుమతులు ఇవ్వకపోవడమే. దీనితో సేవలతోపాటు, గ్రామాల్లోని ప్రజలకు మౌళిక వసతులు కూడా పంచాయతీలు సమకూర్చలేని పరిస్థితి ఏర్పడింది. పారిశుధ్య సిబ్బంది కొరత, వారితో పనిచేయించే పంచాయతీ కార్యదర్శిల కొరత గ్రామం పంచాయతీలను తీవ్రంగా వేధిస్తోంది. కాగా గత ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయస్సు 62కి పెంచడం వలన మరో ఆరునెలల్లో భారీగా పంచాయతీ కార్యదర్శిలు భారీగా ఉద్యోగ విరమణ చేయనున్నారు. అపుడు పరిస్థితి మరింత జఠిలం అవుతుంది. ఈ ఇబ్బందిని గుర్తించిన గత ప్రభుత్వం ఒకేసారి 4 ఉద్యోగాలకు పోటీ పరీక్షలు రాసిన సచివాలయ మహిళా పోలీసులకు ఆప్షన్లు ఇచ్చి ఖాళీ అయిన పంచాయతీ కార్యదర్శి పోస్టుల్లోకి వీరిని స్లైడింగ్ ఇచ్చి భర్తీచేయాలని చూసింది. అంతకంటే ముందుగా గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు కొన్ని పంచాయతీలు అప్పగించి. తరువాత మిగిలిన వారికి పంచాయతీలును అప్పగించాలని ప్రయత్నించింది. దానికి కారణం ఏంటంటే సచివాలయాల్లోని మహిళా పోలీసు ఉద్యోగాలపై కోర్టు కేసులు నమోదు కావడంతో వారంతా పోలీసు శాఖకు చెందిన వారు కాదని డిజిపి కార్యాలయం నుంచి హైకోర్టుకి అఫడవిట్ దాఖలు చేశారు.

ఆ తరువాత వారందరినీ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న విభాగాల్లోని సేవలకోసం వినియోగిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారిని పంచాయతీ కార్యదర్శిలు, డిజిటల్ అసిస్టెంట్లు, వెల్పేర్ అసిస్టెంట్లు పోస్టులకి స్లైడింగ్ ఇచ్చి పంపాలని భావించారు. కానీ కాలయాపన చేయడం, వీరికి సర్వీసు నిబంధనలు పూర్తిస్థాయిలో లేకపోవడం, ఈ శాఖకు చట్టబద్దత లేకపోవడంతో ఆ పనికి కూడా మంగళం పాడేసింది. ఇపుడు ఆ ప్రభావం కూటమి ప్రభుత్వంపై పడింది. త్వరలో ఖాళీ అయిపోయే పంచాయతీ కార్యదర్శిల స్థానంలో కొత్తగా భర్తీచేయాంటే సుమారు 3500పైగా పోస్టులను భర్తీచేయాలి. అయితే ఆర్ధిక పరమైన అంశాల జోలికి వెళ్లకూడదని సీఎం చంద్రబాబునాయుడు అన్ని ప్రభుత్వశాఖలను ఆదేశించడంతో కొత్తగా ఉద్యోగాలు భర్తీచేసే పరిస్థితి కనిపించడం లేదు. ఈ సమయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ముందు పంచాయతీలను గాడిలో పెట్టాలన్నా, ప్రజలకు పూర్తిస్థాయిలో పరిపాల న అందించాలన్నా..ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శిలను భర్తీ అయినా చేయాలి..లేదంటే ఏ ప్రభుత్వశాఖకు చెందని మహిళా పోలీసులనైనా సదరు ఖాళీల్లో  స్లైడిండ్ ఇచ్చి భర్తీచేయాలి. గ్రామ స్వరాజ్యం అంటే ఎలా వుంటుందో చేతల్లో చూపిస్తానని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందు భారీ లక్ష్యం ఉంది. ఇపు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద మాత్రమే ఖాళీల భర్తీ ఆర్ధిక భారం పడకుండా చేపట్టడానికి ఆస్కారం వుంటుంది. అదే సమయంలో గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు కూడా పంచాయతీల అప్పగింత, పదోన్నతులు కూడా చేపడితే తప్పా ఉన్న సిబ్బంది ఉత్సాహంగా పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు. చూడాలి భారీ లక్ష్యాన్ని ముందుంచుకున్న డిప్యూటీ సీఎం పంచాయతీల సవాల్ ను ఏ విధంగా స్వీకరిస్తారు. ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు ఎలా అందిస్తారనేది ఇపుడా రాష్ట్రంలో హాట్ టాపిక్ కు ఎలాంటి పుల్ స్టాప్ పెడతారనేది..?!