ఆ.. రెడ్డి కాలంలో అవినీతి దొడ్డిదారి..!


Ens Balu
395
visakhapatnam
2024-07-14 03:54:32

ఆంధ్రప్రదేశ్ సమాచార పౌరసంబంధాల శాఖ మాజీ కమిషనర్ టి.విజయ్ కుమార్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం అత్యంత లోతుగా దర్యాప్తు ప్రారంభించింది. సుమారు 91 అంశాలకు సంబంధించి విచారణ జరుగుతుందని ప్రాధమిక సమాచారం అందుతోంది. ఒక ప్రభుత్వశాఖలో ఉంటూ ఆ ప్రభుత్వశాఖనే నిర్వీర్యం చేసే దిశగా తీసుకున్న చర్యలు, రెడ్డి వడ్డనలు చేసిన విస్తరి పద్దులను లెక్క గట్టే పనిలో ప్రభుత్వం వేగంగా విచారణ ప్రారంభించింది.  గత ప్రభుత్వ హయాంలో సెంట్రల్ సర్వీసులో ఉన్న ఈయన స్టేట్ సర్వీసుకి వచ్చారు. ప్రభుత్వం మారిపోగానే సదరు సారు కూడా వెంటనే తనను వెనక్కి పంపేయాలని ప్రభుత్వానికి అర్జీపెట్టుకొని ఆమోదం కూడా పొందారు. అయితే వెనక్కివెళ్లిపోతే చేసిన ఘనకార్యాలన్నీ గాల్లో కలిసిపోతాయనుకున్న మాజీ కమిషనర్ చర్యలకు కూటమి ప్రభుత్వం తీసుకున్న మొదటి చర్య విచారణకు ఆదేశించడం. దానితో మాజీ కమిషనర్ గొంతులో పచ్చి వెలక్కాయ్ పడ్డట్టు అయ్యింది. విచారణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, గత ప్రభుత్వంలో చేసిన పనులకు సంబంధించిన విషయాలన్నీ బయటకు తీసేందుకు సుమారు 12ఏళ్ల తరువాత చాకులాంటి ఐఏఎస్ హిమాంశు శుక్లాను కూడా సమాచారశాఖ డైరెక్టర్ గా ప్రభుత్వం నియమించింది. అఖిలభారత సర్వీసుల్లో ప్రధాన క్యాడర్ లైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను సమాచారశాఖ కమిషనర్, డైరెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో నియమించడం చాలా అరుదు. 

ఈ ప్రభుత్వశాఖ ఏర్పాటైన దగ్గర నుంచి అతి కొద్ది మంది మాత్రమే ఐఏఎస్ లు ఈశాఖలో పనిచేశారు. ఆ తరువాత అంతా ఐఐఎస్ అధికాలే పనిచేశారు. ఏదైనా ఒక ప్రభుత్వశాఖపై ఎంక్వైరీ కమిషన్ వేసినపుడు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను ప్రభుత్వం ప్రత్యేకంగా నియమిస్తుంది. తద్వారా విచారణ వేగవంతం కావడంతోపాటు, తప్పులను కప్పిపచ్చుకునే వ్యవహారాలకు అడ్డుకట్ట వేయడానికే ఈ విధంగా చేస్తుందని చెబుతారు. అందులోనూ ప్రస్తుతం సమాచారశాఖ డైరెక్టర్ గా నియమితులైన హిమాంశు శుక్లా డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాకు కలెక్టర్ గా పనిచేశారు. ఆ సమయంలో మాజీ కమిషనర్ టి.విజయ్ కుమార్ రెడ్డి తీసుకొచ్చిన అక్రిడిటేషన్ల జీఓపై పెద్ద ఎత్తున దుమారం కూడా రేగింది. ఆ సమయంలో అక్కడి జిల్లా జర్నలిస్టుల సంఘాలతో చర్చలు జరిపి జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్లు కూడా కొత్త జిల్లాలో కలెక్టర్ గా పనిచేసిన కాలంలో ఆయన జారీచేయడంలో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయనే సమాచారశాఖ కమిషనర్ గా రావడంతో ఇపుడు ఇక్కడి అధికారులు, పాత ప్రభుత్వంలోని నేతలు, సలహాదారుల అడుగులకు మడుగులు ఒత్తిన అధికారులందరికీ ఇప్పుడు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 

జర్నలిస్టులను 100శాతం నుంచి 20శాతానికి కుదించేసే ప్రక్రియలో భాగంగా భారీ మార్పులకు శ్రీకారం చుట్టి పాత జీఓలను రద్దు చేసి మరీ కొత్త జీఓ నెంబరు 38ని తెరపైకి తీసుకొచ్చి వేలాది జర్నలిస్టుల పొట్ట గొట్టడంతో మాజీ కమిషనర్ సఫలీకృతులయ్యారు. అంతే కాకుండా అధికారపార్టీ మీడియాకే  అగ్రభాగం ప్రకటనలు ఇవ్వడం, వాటిని ఇచ్చిన రోజే బిల్లులు మంజూరు చేసేయడం, ఇతర మీడియా బిల్లును పూర్తిగా తొక్కిపెట్టేయడం, స్థానిక పత్రికలను నియంత్రించేందుకు దారుణంగా వ్యవహరించడంతో ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు పెద్ద ఎత్తు ఎదురుతిరిగాయి. ఫిర్యాదులు కూడా చేశాయి. రెడ్డి ప్రభుత్వంలో రెడ్డే అధికారిగా ఉండటంతో ఆ ఫిర్యాదులను ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల ఫిర్యాదుతోపాటు, మాజీ కమిషనర్ టి.విజయ్ కుమార్ రెడ్డి కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యూటేషన్ పై వచ్చిన దగ్గర నుంచి చేసిన కార్యాలన్నింటిపైనా ప్రాధమిక విచారణ చేపట్టడంతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అదే సమయంలో మళ్లీ జర్నలిస్టుల సంఘాలు కూడా ఫిర్యాదు చేయడం, వేల సంఖ్యలో జర్నలిస్టులు ప్రభుత్వ గుర్తింపు అయిన అక్రిడిటేషన్ కూడా కోల్పోవడం వంటి అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని వెంటనే విచారణకు ఆదేశించింది.

 అయితే ఈ విషయం ముందుగానే పసిగట్టి మాజీ కమిషనర్ తట్టాబుట్టా ప్రభుత్వం మారగానే సర్దేశారు. ఎంత సర్దేసినా.. అధికారికంగా చేసిన పనులు, వెలగబెట్టిన ఘనకార్యాలకు ఊరకనే పోవు కదా..వాటిపై విచారణ ప్రారిభించింది కొత్త ప్రభుత్వం. ముఖ్యంగా కనీసం జర్నలిజం బ్యాక్ గ్రౌండ్ లేనివారిని, ప్రెస్ నోటు కూడా రాయడం చేతకాని వారిని రాష్ట్వ్యాప్తంగా ఏపీఆర్వోలుగా దొడ్డిదారిన నియామకాలు చేపట్టారు. వారితో పాటు, ఫోటో గ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లను కూడా గత ప్రభుత్వంలోని నేతల సిఫారసులతో నియామకాలు చేపట్టి..రెగ్యులర్ పోస్టుల భర్తీకి నియమించిన కాంట్రాక్టు బేస్డ్ పోస్టులనే బూచీగా చూపారు. అంతేకాకుండా ఏపీఆర్వోల నుంచి డివిజినల్ పీఆర్వోల పదోన్నతులు, డివిజనల్ పీఆర్వో నుంచి డిపిఆర్వో పదోన్నతులు తొక్కడిపెట్టారనే ఫిర్యాదులు కూడా అందినట్టు సమాచారం. ముఖ్యంగా జిల్లాల పునర్విభజన తరువాత ఏర్పాటైన కొత్త జిల్లాల్లో కూడా మాజీ కమిషనర్ కి అనుకూలంగా ఉన్నవారిని అందలం ఎక్కిస్తూ..వారికే ఏడీల దగ్గర నుంచి డిడి వరకూ అదనపు బాధ్యతలు, కోరుకున్న జిల్లాలకు  బదిలీలు, డిపిఆర్వోగా పనిచేస్తున్న కాలంలో విచారణలు ఎదుర్కొంటున్నవారి ఫైల్  ను పక్కనపెట్టి మరీ వారికి అదనపు బాధ్యతలు అప్పగించడం..ఇలా సమాచాశారశాఖను గత ప్రభుత్వంలోని సహాలదారులత అండదండటతో ఇష్టవచ్చినట్టుగా మార్చారు.

 గత ప్రభుత్వ అధికారంలో ఉన్నంత కాలం ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగినా..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దాఖలైన ఫిర్యాదులతో విచారణ మొదలు పెట్టేసరికి కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. అదే సమయంలో గత ప్రభుత్వంలో కమిషనర్ కి సహకరించి, అడ్డదారి వ్యవహారాల్లో భాగస్వాములైన వారికి కూడా ఇపుడు గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రాధమికంగా జరిగిన విచారణలో కీలకమైన అంశాలను బయటకు వస్తే.. ఇక విచారణ పూర్తిగా సాగితే ఇంకెన్ని అంశాలు బయటకు వస్తాయనేది ఇపుడు చర్చనీయాంశం అవుతోంది. అయితే ఇలాంటి విచారణలు ప్రభుత్వాలు మారినపుడు తరచుగా చేస్తున్నప్పటికీ..మాజీ కమిషనర్ జర్నలిస్టు వ్యవస్థనే పూర్తిగా నిర్వీర్యం చేసి..సమాచారశాఖ నుంచి జర్నలిస్టులకు ఏఒక్క ప్రయోజనం కూడా రాకుండా చేయడానికి ముఖ్యమైన ప్రెస్ అక్రిడిటేషన్ పొందేందుకు భారీ మార్పులు తీసుకు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులంతా ఏకమయ్యారు. చూడాలి పూర్తిస్థాయి విచారణ జరిగేసరికి మాజీ కమిషనర్ రెడ్డి వ్యవహారాలు ఇంకెన్ని వెలుగు చూస్తాయనేది...!