ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ప్రభుత్వానికి ఒక తేడా న్యూస్..గత ప్రభుత్వంలో రాష్ట్రంలోని 13 జిల్లాలు 26 జిల్లాలు అయితే..కూటమి ప్రభుత్వం రాగానే మళ్లీ 26 జిల్లాలు 13 జిల్లాలు అయిపోయాయి. కావాలంటే సమాచార పౌరసంబంధాలశాఖ అధికారిక వెబ్ సైట్ చూడండి. పనిచేయని ల్యాండ్ లైన్ ఫోన్ నెంబర్లు, కేవలం 13 జిల్లాలు మాత్రమే దర్శనమిస్తాయి. ఇది మీడియాతో పాటు ప్రజలు, ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించడం కాదా..? మళ్లీ ఏమైనా అంటే మాత్రం ఈ శాఖలోని అటెండరు దగ్గర నుంచి ఆర్జేడీ, అడిషనల్ కమిషనర్ వరకూ మనిషికి వచ్చినంత కోపాలు వచ్చేస్తాయ్.. ఆపై తెగ ఫీలైపోతారు. అదేంటి రాష్ట్ర ప్రభుత్వ సమాచారం ప్రజలకు మీడియాకి అందించే సమాచారశాఖ తప్పుచేయడం ఏంటి అని మీరు అనుకోవచ్చు.. ఆ అనుమానమే మీడియాకి వచ్చి సదరు సమాచారశాఖ వెబ్ సైన్ ని ఓపెన్ చేస్తే.. అక్కడున్నవి పాత ఉమ్మడి 13 జిల్లాలు మాత్రమే అంటే. ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలు 13 జిల్లాలు అయిపోయినట్టా.. కాదా..? అదేమంటే ఈ వెబ్ సైట్ ని అసలు మీడియా తరచుగా చూస్తుందా..? లేదా..? అని టెస్టింగ్ చేస్తున్నామని తేడాగా సమాధానం ఇస్తున్నారు ఇక్కడి అధికారులు.
గత ప్రభుత్వంలో రాష్ట్రంలోని 13 జిల్లాలు గెజిట్ విడుదల చేసి మరీ 26 జిల్లాలుగా మార్చారు. రాష్ట్రంలో అయితే జిల్లాలు మార్చారు తప్పితే ఇంకా ఈ కొత్త జిల్లాలకు రాష్ట్రపతి ఆమోదం రాలేదు. రాష్ట్రపతి ఆమోదం వస్తే తప్పా కేంద్రంలో కూడా ఇంకా ఉమ్మడి 13 జిల్లాల క్రిందే లెక్క. ఆంధ్రప్రదేశ్ లోనే కాదు.. తెలంగాణలో కూడా అదే పరిస్థితి. ఈ విషయం అటుంచితే.. విచిత్రంగా సమాచార పౌర సంబంధాల శాఖను కూడా గత ప్రభుత్వం విభజన చేసి కొత్తగా ఏర్పాటు చేసిన 13 కొత్తజిల్లాల్లో జిల్లా కార్యాలయాలను కూడా ఏర్పాటు చేసింది. ఆ విషయాన్ని మీడియాకి ఇదే ప్రభుత్వశాఖ సమచారం కూడా అందించింది. మరి కూటమి ప్రభుత్వం రాగానే ఇదే శాఖకు బహుసా 26 జిల్లాలను మళ్లీ 13 జిల్లాలుగా మార్చేస్తున్నామని సమాచారం ఇచ్చిందో.. లేదంటే అంతా మా ఇష్టం.. మా తేడా తనాన్ని ఏ విధంగానైనా బయటపెట్టి అటు ప్రభుత్వాన్ని, మీడియాని తప్పుదారి పట్టించి ప్రజలను అయోమయంలోకి నెట్టేయడానికి ఇలా చేసిందో అర్ధం కాని పరిస్థితి.
అందులోనూ.. సమాచాపౌర సంబంధాలశాఖ అధికారిక వెబ్ సైట్ ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిస్థాయిలో మార్పులు చేర్పులు చేపడుతున్నారు. ప్రస్తుతానికి ఈ వెబ్ సైట్ నిర్మాణంలో ఉందని సమాచారం స్క్రోలింగ్ రూపంలో పెట్టినా... రాష్ట్రప్రభుత్వ సమాచారాన్ని కేవలం చూడటానికి మాత్రమే వీలుండేలా సీఎంఓ నుంచి కొన్ని ప్రెస్ నోట్లను ఇందులో అప్లోడ్ చేస్తున్నారు. కానీ అవి చూడటానికి మాత్రమే పనిచేస్తాయి. వాటిని మీడియా డౌన్ లోడ్ చేసుకోవడానికి గానీ, పత్రికల్లో వార్తలుగా వినియోగిండానికి గానీ వీలుపడవు. అన్నీ పీడిఎఫ్ రూపంలోనే అప్లోడ్ చేస్తున్నారు. గతంలో ఇదే సమాచారశాఖకు చెందిన వెబ్ సైట్ రాష్ట్ర సచివాలయం, సీఎంఓ ఇతర 75 ప్రభుత్వశాఖలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని, జీఓలను, ఇతర అన్ని అంశాలను ప్రెస్ నోట్లుగా రన్నింగ్ టెక్స్ట్ ను పొందు పరిచేవారు. ఇపుడు కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబుకి చెందిన ఒకటి అరా సమాచారాన్ని మాత్రమే పొందుపరుస్తున్నారు. దీనితో రాష్ట్రప్రభుత్వ సమాచార పౌర సంబంధాల శాఖకు చెందిన ఈ వెబ్ సైట్ ఎవరు చూసినా అందులో కనిపించే 13 జిల్లాలను చూసి అవాక్కవుతున్నారు. ఏంటి 26 జిల్లాలు కాస్తా 13 జిల్లాలు అయిపోయాయంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. అటు మీడియా కూడా సమాచారశాఖ అన్ని వర్గాలను తప్పుదోవ పట్టించడాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం సమాచారశాఖ అధికారిక వెబ్ సైట్ మార్పులు, చేర్పుల దశలో ఉండటంతో కొత్తగా ప్రెస్ అక్రిడిటేషన్ ఆన్ లైన్ చేసుకోవాడినికి, ప్రెస్ లో మానేసిన జర్నలిస్టులు వారి ప్రెస్ అక్రిడిటేషన్ క్యాన్సిల్ చేసుకోవడానికి, కొత్త మీడియా సంస్థలు, పత్రికలు, టివిఛానల్స్, సిటీకేబుల్స్, న్యూస్ ఏజెన్సీలును ఆన్ లైన్ చేయడానికి ఆస్కారం లేకుండా పోతుంది. ఇదిలాఉండగా, ప్రభుత్వం జర్నలిస్టుల హెల్త్ కార్డులకు సంబంధించిన గడువును పొడిగించింది. హెల్త్ కార్డు పొందాలంటే ప్రెస్ అక్రిడిటేషన్ కు దరఖాస్తులు ఆన్ లైన్ చేసుకోవాల్సి వుంది. కానీ ప్రస్తుతం సమాచారశాఖ వెబ్ సైట్ లో అక్రిడిటేషన్ ఆన్ లైన్ చేసుకునే సదుపాయం అందుబాటులో లేదు. అంతేకాకుండా జర్నలిస్టుల లాగిన్ కూడా సర్వర్ సమస్య తలెత్తింది. దీనితో చాలా సంస్థల పేర్లు సమాచారశాఖ వెబ్ సైట్ లో ఆన్ లైన్ కి నోచుకోకుండా పోయాయి. ఈ విషయాన్ని రాష్ట్ర సమాచారశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించినా.. మీడియా సంస్థలు, జర్నలిస్టులు చేసు ఫోన్లు ఆన్సర్ చేయలేనంత బిజీగా జిల్లాల్లోని డిపీఆర్వోల దగ్గర నుంచి రాష్ట్రంలోని సమాచారశాఖ డైరెక్టర్ కార్యాలయంలోని అధికారుల వరకూ అంతా బిజీ అయిపోయారు.
సమాచారశాఖ అధికారిక వెబ్ సైట్ లో రాష్ట్రంలోని జిల్లాలకు సంబంధించిన సమాచారం 26 జిల్లాలకు బదులు 13 జిల్లాలే చూపిస్తుందని, ముఖ్యమైన మెనూలు వెబ్ సైట్ లో పనిచేయడం లేదనే సమాచారం తెలియజేయడానికి కూడా అధికారులు అందుబాటులో ఉండటం లేదు. అలాగని అధికారిక ఈమెయిల్ కి సమాచారం పంపినా.. అవి కూడా ఇన్ బాక్స్ పూర్తిగా నిండిపోవడం వలన మెయిల్స్ కూడా సమాచాశాఖ కార్యాలయానికి చేరుకోవడం లేదు. వెబ్ సైట్ లో ఇచ్చిన ఫోన్ నెంబర్లు, ఫ్యాక్స్ నెంబర్లు కూడా ట్రై చేసినా.. ఈ నెంబర్లు మనుగడలో లేవనే సమాధానం మాత్రమే వస్తున్నది. సమాచారశాఖ అధికారిక వెబ్ సైట్, రాష్ట్ర కార్యాలయాల ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో వాటిని పరిశీలిన చేస్తేనే అర్ధం అవుతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారిక సమాచారం మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసే సమాచారశాఖ ప్రజలను, ప్రభుత్వాన్ని అలాగే మీడియాని తప్పుదారి పట్టించకుండా ఉండేలా... చాలా ఏళ్లకు ఈశాఖకు నియమితులైన ఐఏఎస్ హిమాంశు శుక్లా చర్యలు తీసుకోవాల్సి ఉన్నది. చూడాలి.. కూటమి ప్రభుత్వంలోనైనా సమాచార పౌరసంబంధాలశాఖలోనూ, ఇక్కడి అధికారుల్లోనూ మార్పువస్తుందో.. లేదో...?!