రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఈసారి త్వరగానే నామినేటెడ్ పోస్టులను క్యాడర్ కట్టబెట్టేందుకు కార్యాచరణ మొదలు పెట్టింది. గతంలో అధికారంలో ఉన్నపుడు ఆఖరి దశలో నామినేటెడ్ పదవులు ఇవ్వడంతో క్యాడర్ పూర్తిగా పనిచేయలేకపోయారు. ఆ పరిస్థితి మళ్లీ రాకుండా ఈసారి వెంటనే పోస్టులు ఇవ్వడం ద్వారా కూటమి అధికారంలోకి రావడానికి శ్రమించిన నేతలకు, క్యాడర్ కి సముచిత స్థానం ఇవ్వాలని సీఎం చంద్రబాబు యోచన చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటులో చాలా మంది సీనియర్లు ఈసారి ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవా ల్సి వచ్చింది. అలా సీట్లు కోల్పోయిన వారు.. జిల్లాల్లో క్యాడర్ ను ఒక తాటిపైకి తెచ్చిన పార్టీ కోసం పనిచేసిన వారిని పార్టీ గుర్తించే పనిలో ప డింది. ప్రధాన కార్పోరేషన్లలో చైర్మన్ పదువులు, దేవస్థానాల్లో చైర్మన్ పదవులు మూడు పార్టీలకు థామాషా పద్దతిలో ఇస్తే కలిసికట్టుగా పనిచే యడానికి బావుంటుందని కూడా కూటమి ప్రభుత్వంలోని పెద్దలు సమాలోచనలు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసినా.. వారికి వచ్చిన ఇట్టు తక్కువగానే ఇచ్చారు.
కనీసం నామినేటెడ్ పదవుల్లో నైనా అగ్రభాగం ఇవ్వకపోతే పొరపొచ్చాలు వచ్చే అవకాశాలున్నాయని.. ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ముఖ్యమైన కార్పోరేషన్లు, సంస్థలను ఇప్పటికే జాబితా తయారు చేసిన సీఎం చంద్రబాబు ఆగస్టు 15 తరువాత పదువులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎప్పటి నుంచో మైనార్టీలకు ముఖ్యమైన పదవులు దక్కలేదు. దీనితో వారికి పెద్ద కార్పోరేషన్లు ఇస్తే బాగుంటుందని కూడా పార్టీలోని ఎమ్మెల్యే, ఎంపీలు ఇప్పటికే చంద్రబాబు ముందు ఉంచారట. గతంలో పోస్టులు ఇచ్చినా వారికి అతి తక్కు వ పదవీకాలం మాత్రమే పనిచేయడంతో క్యాడర్ లో కూడా నిరాశ, నిస్ప్రుహలు ఉన్నాయి. జిల్లాల్లోని సంస్థలు వాటి స్థితిగతులను బేరీజు వేస్తున్న ప్రభుత్వం ఏ సంస్థకు, ఏ కార్పోరేషన్ కు ఎవరు సూటవుతారో కూడా జిల్లాల వారగా సమీక్షలు జరిపిన అనంతరం పదవులు పంచే అవకాశాలున్నాయి. కాగా ఇప్పటికే అధిష్టానం వద్ద ప్రాధమిక జాబితా సిద్దమైనందని చెబుతున్నారు. పంద్రాగస్టు హడావిడి పూర్తయిన తరు వాత నామినేటెడ్ పదవుల భర్తీకి ముహూర్తం ఫిక్స్ చేసి వాటిని క్యాడర్ కు ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచన. దానితో పాటు జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు, పొలిట్ బ్యూరో, మండల కమిటీలు ఇలా అన్నింటినీ కొత్తవాటిని ఏర్పాటు చేస్తే పార్టీ కూడా ప్రజల్లోకి వెళ్లి పనిచేయడానికి బావుంటుందని ఇటీవల మంత్రుల సమావేశంలో చర్చించారని సమాచారం.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఇచ్చే నామినేటెడ్ పదవులు కాస్త హుందాగా, కనీస గౌరవ వేతనంతో ఇస్తే పార్టీ క్యాడర్ ని కూడా గుర్తించినట్టు వుంటుందని మంత్రుల వద్ద సీఎం చంద్రబాబు ప్రస్తావించినట్టు తెలిసింది. దానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పచ్చజెండా ఊపడంతో త్వరలోనే నామినేటెడ్ పదవులు కూటమి ప్రభుత్వంలోని మూడు పార్టీలకు దక్కే అశకాశాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీలు, రాజ్యసభ స్థానాలకు ఒక స్థాయి నాయకులు, కార్పోరేషన్లకు ఒక క్యాడర్ ను, దేవస్థానాల చైర్మన్లకు ఒక క్యాడర్, ఇక జిల్లాల్లో చిన్నా చితకా కార్పోరేషన్లకు జిల్లా నాయకత్వంలోని ప్రధాన భూమిక వహించే వారిని ఎంపిక చేసి పదువలు ఇస్తే రెండున్నరేళ్లు ఒకరికి, మరో రెండున్నరేళ్లు మరొకరికి ఇవ్వడం ద్వారా మూడు పార్టీల్లోని అన్ని వర్గాల నాయకులకు సముచి స్థానం ఇచ్చినట్టు అవుతుందని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నదట. అయితే ఎవరిని రెండున్నరేళ్లు ఉంచుతారు. మరెవరిని ఐదేళ్ల వరకూ కొనసాగిస్తారనే విషయం పదవులు పంపకాలు జరిగి ప్రభుత్వ ఉత్తర్వులు వస్తేగానీ తెలిసే పరిస్థితి లేదు. అనుకున్నట్టు జరిగితే ఈ నెల 15 దాటిన తరువాత కార్యాచరణ మొదలు పెట్టి వచ్చే నెలలో పదవులు ఇచ్చే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. చూడాలి కూటమి ప్రభుత్వంలో ప్రధాన సంస్థలు, కార్పోరేషన్లలోని నామినేటెడ్ పదవులు ఎవరెవరిని వరిస్తాయనేది..