అసెంబ్లీ రౌడీ సినిమా గుర్తింది కదా.. అందులో మరుగుదొడ్లు శుభ్రం చేసే ఒక క్యారెక్టర్ అదేనండీ టిప్పు టాపుగా డ్రెస్ వేసుకొని.. వెళ్లి మరీ మరుగుదొడ్లు శుభ్రం చేస్తుంది ‘పాకీజా’ ఆ సీన్ ఆ సినిమాకే చాలా హైలేట్. ఇప్పటికీ మరుగుదొడ్లు కడికేవారికి, ఇంట్లో పనులు చేసేవారినీ ‘పాకీజా’ అనే సింబాలిక్ గా పిలుస్తారు.. అయినా ఈరోజు-ఈఎన్ఎస్ వాళ్లకి ఇదెందుకు గుర్తొచ్చింది అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం. ఆ సినిమాకి పాకీజా క్యారెక్టర్ ఎంత ఫ్యామస్ అయ్యారో.. త్వరలో గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు కుడా అంతే ఫ్యామస్ కాబోతున్నారు. కాకపోతే ఆ సినిమాలో పాకీజా దొడ్లు కడిగితే.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న ఎడ్యుకేషన్ అండ్ వార్డు వెల్ఫేర్ అసిస్టెంట్లు మరుగుదొడ్లకు వారంలో రెండు రోజులు ఫోటోలు తీసి ఓ కొత్త తరహా పాకీజీలా ఫ్యామస్ కాబోతున్నారు. గ్రామ, వార్డు సచివాలయశాఖలో మార్పు కోరుకున్న ఉద్యోగులకు ‘మహా కంపు’ అదనపు బాధ్యతలు వచ్చి చేరాయి. అదేనండీ పాఠశాలల్లో మరుగుదొడ్లు ఎలా ఉన్నాయో సచివాలయ ఉద్యోగులే పర్యవేక్షించాలి. అంతేకాదండోయ్.. వాటిని చక్కగా ఫోటోలు తీసి ప్రభుత్వ యాప్ లో అప్లోడ్ కూడా చేయాలి. ఈ కంపు భాద్యతను సచివాలయాల్లో ఎడ్యుకేషన్ అండ్ వార్డు వెల్ఫేర్ కార్యదర్శిలు చేయాలని.. వారంలో రెండు రోజులు సోమ, గురువారాల్లో మరుగుదొడ్లను పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొంద రాష్ట్ర ప్రభుత్వం.
ఒకప్పుడు ఈ బాధ్యత పాఠశాలల్లో పాఠాలు చెప్పే గురువులకు ఉందేది. ఇపుడు దానిని సచివాలయాల్లో విధులు లేక ఖాళీగా ఉన్నట్టుగా భావించిన ప్రభుత్వం సంక్షేమ కార్యదర్శిలకు మళ్లించేసింది. సంక్షేమ పథకాలకు ప్రజలను గుర్తించి ఎంపిక చేసే వీరే ఇపుడు వారంలో రెండు రోజులు ఈ పాకీజీ పనులు చేయాలన్నమాట. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన, చేయాల్సిన పనులు సకాలంలో చేస్తే.. ఎలాంటి విధులు అప్పగించినా ఉద్యోగులు చేయడానికి సిద్దంగానే ఉంటారు. ఒక వేళ చేయకపోయినా బెదిరించి..అదిరించి మరీ పనిచేయించే పరిపాలన సౌలభ్యం కూడా ప్రభుత్వం వద్దనే వుంటుంది. గురువు గౌరవం పోకూడదని వాళ్లు చేసే పని సచివాలయ ఉద్యోగులకు అదనంగా మళ్లించిన ప్రభుత్వం.. వాస్తవానికి వీరికి చేయాల్సిన న్యాయపరమైనా, ప్రభుత్వ విధానంలోని ప్రయోజనాలను మాత్రం రాష్ట్రప్రభుత్వం చేయలేదు. గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటై ఐదేళ్లు దాటిపోతున్నా..నేటికీ ఎడ్యుకేషన్ అండ్ వార్డు వెల్ఫేర్ అసిస్టెంట్ లకు సర్వీసు నిబంధనలు, పదోన్నతుల దారి చూపించలేదు ప్రభుత్వం. ఇంకతీ వీరంతా ఏ ప్రభుత్వశాఖ పరిధిలోకి వస్తారో కనీసం ఆశాఖలోని సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానలైనా అమలు చేయాలేదు. పైగా వీరి సర్వీసు రెగ్యులైజేషన్ సమయంలో ఇవ్వాల్సిన రెండు ఇంక్రిమెంట్లను కూడా నేటికీ ఇవ్వలేదు. పీఆర్సీ ప్రయోజనాలు కూడా వీరికి ప్రభుత్వం వర్తింపచేయలేదు. వాటి విషయంలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోని రాష్ట్రప్రభుత్వం ఇపుడు ఒకేసారి సచివాలయ ఉద్యోగులను పాకీజీ పనులు చేయాలని మాత్రం ఉత్తర్వులు జారీచేసేసింది. అదేమంటే..ప్రభుత్వం వద్ద నిధులు లేవు.. ప్రభుత్వానికి ఆర్ధిక భారమైన పనులు ప్రభుత్వం చేయలేదు. కానీ ప్రభుత్వానికి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా విధులు మాత్రం ప్రభుత్వం మార్చేస్తుందన్నట్టుగా సచివాయ ఉద్యోగులకు ఈ అదనపు బాధ్యతలు అప్పగించేసింది.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఏర్పాటైంది.. వారి హయాంలోనే సచివాలయ ఉద్యోగులను అదిరించి, బెదిరించి.. ఒక్కోసారి పంచాయతీ కార్యదర్శిలు, ఎంపీడీఓలు, జిల్లా కలెక్టర్లతో వీరిపైకి పంపి మరీ బెత్తం పట్టుకొని పనిచేయించారు. అంతేకాదండోయ్ ఒక్కోసారి మీ ఉద్యోగాలు మేము ఎప్పుడు తీసేయాలనుకున్నా.. తొలగించాలనుకున్నా తీసేయడానికి సిద్దంగా ఉన్నామని.. దానికి గ్రామ, వార్డు సచివాలయశాఖకు చట్టబద్దత లేదని, ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగుల మాదిరిగా మీకు సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ కూడా లేవని.. తాము ఏం చేయడానికైనా అవకాశాలున్నాయని చెప్పి మరీ పనులు చేయించేది. దానితో గత ప్రభుత్వంలో వారికి ఒక ప్రత్యేక శాఖ ద్వారా ఉద్యోగాలు వచ్చినా.. వేధింపులు తట్టుకొని మరీ పనిచేశారు ఉద్యోగులు. అంత చేసినా ఉద్యోగుల సర్వీసు రెగ్యులైజేషన్ 9నెలలు అదనంగా కేవలం రూ.15 వేలకే కరోనా సమయంలో కూడా సెలవులు ఇవ్వకుండా కూడా పనిచేయించింది గత ప్రభుత్వం. కనీసం ఇంతలా పనిచేయించిన గత ప్రభుత్వం వీరికి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సిన ప్రయోజనాలనైనా ఇచ్చిందా అంటే అదీలేదు. దానితో ప్రజలతోపాటు ఉద్యోగులు కూడా మార్పు కోరుకొని 2024 ఎన్నికల్లో కసిగా ఓట్లేశారు. ప్రభుత్వం మారింది. కనీసం ప్రభుత్వం మారిన తరువాతనైనా మంచిరోజులు వస్తాయనుకుంటే.. మరీ దారుణంగా ఇలాంటి కంపు విధులు అదనంగా వచ్చి చేరుతాయని కలలో కూడా ఊహించలేదని గగ్గోలు పెడుతున్నారు సచివాలయ ఉద్యోగులు. కేవలం రెగ్యులర్ జాబ్ అనే ఒకే ఒక్కకారణంతో పనిచేస్తున్న తమకు ఈ ప్రభుత్వంలో కూడా న్యాయం జరగుతుందనే నమ్మకం సన్నగిల్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసెంబ్లీ రౌడీ సినిమాలో లాగా వారానికి రెండు రోజులు టిప్పు టాపుగా తయారై మరుగుదొడ్ల పర్యవేక్షణ చేయాల్సిన పరిస్థితి ఎదురైందని వాపోతున్నారు. ఇలాంటి పనులకు ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం తమకు చేయాల్సిన మేలుపై మాత్రం ఎంతుకు ఎందుకు ప్రత్యేక ఉత్తర్వులు జారీచేయడం లేదని సచివాలయ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి చాలా సచివాలయాల్లో ఉద్యోగులు వారి విధులు పూర్తయిన తరువాత కాస్త సమయంల ఖాళీగానే ఉంటున్నారని భావించిన గత ప్రభుత్వం.. సిఎంఎస్ సర్వీసులన్నీ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారానే ప్రజలకు అందించాలని భావించింది. దానికోసం ఒక్కో సచివాలయానికి సుమారు ఐదు కంప్యూటర్లను కేటాయించి అన్ని రకాల అనుమతులూ ఇక్కడి నుంచే ఇవ్వాలని కూడా ఆలోచన చేసింది. అనూహ్యంగా వైఎస్సార్సీపీ అధికారం కోల్పోవడంతో గ్రామ, వార్డు సచివాలయశాఖలో మార్పులు వచ్చేస్తున్నాయని ఇపుడు ఉద్యోగులు గొల్లుమంటున్నారు. ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించడానికి నియమితులమైన మేము మరుగుదొడ్ల పర్యవేక్షణ చేయాలా అంటూ మండిపడుతున్నారు. పోనీ ప్రభుత్వం ఆదేశించినపుడు చేయక చస్తామా అనుకున్నా.. తమకు రావాల్సిన ప్రయోజనాల విషయంలోన ప్రభుత్వం నోరు మెదకపోవడం, నేటికీ ఒక్క చర్య కూడా తీసుకోకపోవడం, ఇన్నిసార్లు క్యాబినెట్ సమావేశాలు జరిగినా.. తమ సచివాలయ ఉద్యోగుల కోసం పట్టించుకోకపోవడం దారుణం అంటున్నారు ఉద్యోగులు. గ్రామ స్థాయిలో ప్రజలకు సేవలు అందించాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖను ఏర్పాటు చేసి ఐదేళ్ల పాటు సేవలు అందిస్తే.. అధికారం మారగనే కూటమి ప్రభుత్వం పూర్తిగా సచివాలయశాఖలో సమూల మార్పులు తీసుకు రావాలని యోచిస్తున్నది. పాకీజీ నుంచి మొదలైన అదనపు బాధ్యతలు ఈశాఖ ఉద్యోగులకు ఇతర శాఖల విధులు అదనంగా ఎన్ని వచ్చి చేరతాయో వేచి చూడాలి. సేవలను అదనంగా పొడిగించేస్తున్న ప్రభుత్వం వీరికి ప్రభుత్వ పరంగా కల్పించాల్సిన సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్, కోల్పోయిన పేస్కేలు, పీర్సీ ప్రయోజనాల విషయంలోనూ అంతే అదనంగా పనిచేస్తుందా.. లేదా అనేది ప్రస్తుతానికి కైతే ప్రశ్నగానే మిగిలి పోయింది.. దానికి జవాబులు వస్తాయా..లేదా అని ముందు ముందు చూడాల్సి వుంది..!