ఆలు లేదు సూలు లేదు కొడుకుపేరు సోమలింగం..వాడ్ని చూసి నవ్వేవాడేమో బోడిలింగం అన్నాడట వెనుకటకి ఓ మారాజు.. నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసే తప్పునే కూటి ప్రభుత్వం కూడా చేసేలా ఉందనే తేడా సంకేతాలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లోకి వెళుతున్నాయి.. నాటి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖకు చట్టబద్ధత, సర్వీసు నిబంధనలు, ప్రమోజషన్ ఛానల్(కొన్నిశాఖలకు) ఏర్పాటు చేయకుండా పనిచేయించుకుంది. కూటమి ప్రభుత్వంలోనైనా న్యాయం జరుగుతుందని ఆశపడిన సచివాలయ ఉద్యోగులకు తీవ్ర నిరాశ.. జీవితంలో పదోన్నతులు లేని విధులు.. శాస్వతంగా ఇదేశాఖలో కూరుకుపోయే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే వ్యతిరేక బావం అపుడే పెరిగిపోతుంది. రాష్ట్రంలోని 74 ప్రభుత్వంశాఖల్లో మాదిరిగా 75వ ప్రభుత్వశాఖగా ఏర్పడిన గ్రామ, వార్డు సచివాల యశాఖ ఉద్యోగులకు ఎదుగూ బొదుగూ లేకుండా చేయాలని చూసిన గత ప్రభుత్వ విధానాలే ఇప్పుడు కూడా అమలు జరిగేలా కనిపిస్తు న్నాయి. ఉద్యోగులను పరిపాలనై పరమై ఇబ్బదులను అధిగమించడానికి సర్ధుబాటు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం..ముందు సచివాలయ ఉద్యోగులను ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులుగా గుర్తించి చట్టబద్ధత కల్పిస్తే తప్పా.. న్యాయపరమైన చిక్కులు తప్పేటట్టు కనిపించడం లేదు. విజన్ ఉన్న ప్రభుత్వ అధినేత ఈ విధంగా చేస్తున్నారేంటనే చెడ్డపేరూ మోయాల్సి వస్తుందేమో..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత వైఎస్సార్సీపీ ఏర్పాటు చేసి గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని ఉద్యోగులను విభజన చేయాలని భావిస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక ఇల్లుకట్టాలంటే పునాధులు బలంగా నిర్మిస్తే ఇంటి నిర్మాణం సజావుగా జరుగుతుంది. లేదంటే ఎక్కడో ఒక చోట కూలిపోవడం తథ్యం. అలాగే ఇపుడు గ్రామ, వార్డు సచివాలయశాఖను ఏర్పాటు చేసిన గత ప్రభుత్వం ఈ శాఖకు కనీసం చట్టబద్ధత ఇవ్వలేదు సరికదా.. ఒకే శాఖలో ఉన్న పలు శాఖల సిబ్బందికీ నేటికీ సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయలేదు. వాస్తవానికి చట్టబద్ధత తేని ప్రభుత్వశాఖలోని ఉద్యోగులను సర్ధుబాటు చేయాల్సి వస్తే ముందుగా కొత్తగా ఏర్పాటు అయిన ప్రభుత్వశాఖకు చట్టబద్ధత ప్రభుత్వ గెజిట్ ద్వారా తీసుకు రావాల్సి వుంటుంది. ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగులు మాదిరిగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకపోతే.. వీరు పీఆర్సీ సమయంలోనూ చాలా ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పటికే గత వైఎస్సార్సీపీ కావాలని సచివాలయ ఉద్యోగుల విషయంలో చేసిన మోసం కారణంగా ఈ ప్రభుత్వశాఖకు చట్టబద్ధత లేకుండా పోయింది. అంతేకాకుండా పీఆర్సీ ప్రయోజనాలు కూడా పెద్ద మొత్తంలో కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాకుండా ఉద్యోగులందరూ 9 నెలల పాటు పేస్కేలు, సర్వీసులు రెగ్యులర్ అయిన తరువాత రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు కూడా కోల్పోయారు. వాటిపై ఉద్యోగులు నేటికీ ఏమీ చేయలేని పరిస్థితి. ఉద్యోగ సంఘాలు నోరు విప్పడం లేదు. ఆ ఇబ్బందులు కనీసం కూటమి ప్రభుత్వం లోనైనా తీరుతాయనుకుంటే వైఎస్సార్సీపీ ఎంత త్వరగా గ్రామ, వార్డు సచివాలయశాఖను ఏర్పాటు చేసిందో.. కూటమి ప్రభుత్వం అంతే త్వరగా ఈ శాఖను విచ్చిన్నం చేయాలని చూస్తున్నట్టుగానే ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నది.
పుండుపై కారం చల్లినట్టుగా గత ప్రభుత్వ విధానాల వలన తీవ్రంగా ప్రభుత్వ ప్రయోజనాలు నష్టపోయిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇపుడు కూటమి ప్రభుత్వం తీసుకునే సర్ధుబాటు నిర్ణయం వలన ఇక జీవితాంతం ఉద్యోగులందరూ ఎలాంటి పదోన్నతులు లేకుండా సచివాలయ ఉద్యోగులుగానే మిగిలిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇందులో పనిచేసే కొన్నిశాఖల ఉద్యోగులకు సర్వీసు నిబంధనలను ప్రభుత్వం ఇంకా ఏర్పాటు చేయలేదు. అలా ఏర్పాటు చేయకుండానే ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ఇతర ఇంజనీరింగ్ విభాగాల్లోకి సర్ధుబాటు చేయాలని యోచిస్తున్నది. అదే జరిగితే వీరికి ప్రభుత్వశాఖలు మారి ఇంకా పెద్ద ఇబ్బందులు చవిచూసే ఆస్కారం ఏర్పడుతుంది. ప్రస్తుతం ఇంజనీరింగ్ అసిస్టెంట్లను విభజన చేయాలని చూస్తున్న ఈ శాఖ ఉద్యోగులకు కూడా ఇంకా ఎలాంటి సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు కాలేదు. వీరితోపాటు వెల్ఫేర్ అసిస్టెంట్లు కూడా ఉన్నారు. మరోప్రక్క మహిళా పోలీసులను పోలీసు శాఖ నుంచి తప్పించి మరోశాఖలోకి పంపాలని చూస్తున్నది. గత ప్రభుత్వంలో వీరందరని పోలీసు విధులకు పనిచేయించుకోమని కోర్టుకి అఫడివిట్లు జారీచేశారు. దానితో నాటి నుంచి నేటి వరకూ మహిళా పోలీసులు ఏ ప్రభుత్వశాఖ లేని ఉద్యోగులుగా మిగిలిపోయారు. మళ్లీ ఇపుడు ఇంజనీరింగ్ అసిస్టెంట్లను సర్ధుబాటు పేరుతో విభజన చేసి మరో శాఖలోకి పంపే సమయంలో వారికి సదరు శాఖ నిబంధనలనైనా వర్తింపచేసి వారిశాఖ మార్పు చేస్తూ ప్రభుత్వ గెజిట్ విడుదల చేస్తే తప్పా.. వారికి శాఖాపరమైన ఇబ్బందులు తప్పవు. తప్పిదారి విధినిర్వహణలో ఏ ఉద్యోగి అయినా మరణిస్తే వారినిక కారుణ్య నియామాల్లో ఉద్యోగం పొందే అవకాశం కూడా లేదు. ప్రస్తుతం ఎనర్జీ అసిస్టెంట్ల పరిస్థితి అలానే ఉంది వీరికి కూడా సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ లేకపోవడంతో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబంలో నేటికీ ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. చాలా మంది విధుల్లోనే తీవ్రంగా గాయాలపాలై చేతులు, కాళ్లూ పోగొట్టుకొని మంచాలకే పరిమితం అయ్యారు. వారికి కూడా ప్రభుత్వం ఎలాంటి ప్రయోజనం కానీ, భృతిగానీ ఇవ్వడం లేదు.
ఈ తరుణంలో ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం, గత ప్రభుత్వం రెండేళ్ల పెంచేసిన ఉద్యోగుల రిటైర్ మెంట్ కాలం పూర్తయి ఉద్యోగులు వేల సంఖ్యలో రిటైర్ అవుతున్న వేళ సచివాలయ ఉద్యోగులను సర్ధుబాటు చేయాలని చూస్తున్నది. అలా చేసే సమయంలో ఉన్నప్రభుత్వశాఖకు గుర్తింపు, చట్టబద్ధత ఇవ్వకుండా సుమారు 700 మంది ఇంజనీరింగ్ ఉద్యోగులను శాఖలు మార్పు చేయాలని, ఆపై పంచాయతీ కార్యదర్శిలను పంచాయతీలకు పంపించాలని కూడా యోచన చేస్తున్నది. ఇదే జరిగితే చట్టబద్దత నోచుకోని ఉద్యోగులు, ప్రయోజనాలు కోల్పోయిన సచివాలయ ఉద్యోగులు కోర్టుని ఆశ్రయిస్తే ప్రభుత్వం న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తున్నది. తాడు బొంగరం లేని గ్రామ, వార్డు సచివాలయశాఖకు ముందు చట్టబద్ధత కల్పించి.. ఆపై పరిపాలనా పరమైన ఉత్తర్వులు జారీ చేస్తే తప్పా చిక్కులు తప్పవు. కాదు కూడదు.. మమ్మల్ని ఎదిరించేవారే నష్టపోతారనుకుంటే ఉద్యోగులు విధి నిర్వహణలో చేసే తప్పులకు, మోసాలకు, తీవ్రమైన జాప్యాలకు ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే వాదన కూడా బలంగా వినిపిస్తున్నది. ఇదే అంశం ప్రజల్లోకి బలంగా వెళ్లినా కూటమి ప్రభుత్వం చెరుపుకోలేని చెడ్డపేరు కూడా మోయాల్సి వస్తుంది. ప్రభుత్వం ఇప్పటికైనా గ్రామ, వార్డు సచివాలయశాఖ విషయంలో ఇతర 74 ప్రభుత్వశాఖల మాదిరిగా ఈ శాఖకు కూడా చట్టబద్ధత, ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్, నోషనల్ ఇంక్రిమెంట్లు, పీఆర్సీ ప్రయోజనాలు పూర్తిగా కల్పించిన తరువాత మాత్రమే సర్ధుబాటు చేస్తే ఉద్యోగుల నుంచి కూడా మంచి ఆదరణ లభించే అశకాలున్నాయ్.. లేదంటే పరిపాలనా పరమైర సర్ధుబాటు కంటే కోరి కొనితెచ్చుకునే చిక్కులే కళ్లముందు సాక్షాత్కరిస్తున్నాయి. చూడాలి కూటమి ప్రభుత్వం సర్ధుబాటుకు ముందుగానీ.. తరువాత గానీ శాఖలు మార్పుచేసే ఉద్యోగుల విషయంలో ఎలాంటి ఉత్తర్వులు జారీచేస్తుందనేది.!?