నేడే ఏపీ కేబినెట్ భేటీ..సచివాలయాల సంగతేంటి..?!


Ens Balu
473
visakhapatnam
2024-08-27 19:07:10

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రిమండలి నేడు భేటీ అవుతున్నవేళ ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉండిపోయిన గ్రామ, వార్డు సచివాల యశా ఖకు చట్టబద్ధత విషయం కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇతర ప్రభుత్వశాఖల్లో ఉద్యో గాలు తీయాల్సి వస్తుందని ఏకంగా ఒక ప్రభుత్వశాఖను ఏర్పాటు చేసి తలా తోకా లేకుండా  ప్రభుత్వశాఖను ఐదేళ్లు నెట్టుకొచ్చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు ఏర్పాటు చేసే శాఖలకు ఒక దిశా నిర్ధేశం లేకుండా చేయరు. దేశం మొత్తం తొంగి చేసే విధంగా ఒక  ప్రత్యేక గ్రామస్థాయి వ్యవస్థను ఏర్పాటు చేసిన గత ప్రభుత్వం ఉద్యోగులకు ఎక్కడ ప్రయోజనాలు ఇవ్వాల్సి వస్తుందోనని అంతా సగం సగం మేనత్త పనులే చేసుకొచ్చింది. దీనితో సచివాలయశాఖలోని ఉద్యోగులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. సర్వీసులు రెగ్యులర్ అయ్యే సమయంలోనే 9నెలలు పేస్కేలు కోల్పోయిన ఉద్యోగులు.. ఆ తరువాత ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ ప్రయోజనాలు కూడా కోల్పోయారు. సచివాలయ ఉద్యోగులకు పూర్తిస్థాయిలో పీఆర్సీ ప్రయోజనాలు ఎక్కడ అమలు చేయాల్సి వస్తుందోనని పీర్సీ ప్రకటించడానికి ముందుగానే హెచ్ఆర్ఏలను, డిఏలకు కుదించేశారు. 

సర్వీసులు రెగ్యులర్ అయిన తరువాత ఉద్యోగులకు ఇవ్వాల్సిన రెండు ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా పీఆర్సీ సచివాలయ ఉద్యోగులకు కూడా అమలు చేస్తున్నామని చెప్పి పేస్కేలు పెంచి.. ప్రయోజనాలు ఇవ్వడం మానేశారు. మహిళా పోలీసులు ఉద్యోగాలను పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా కాకుండా సాధారణ ఉద్యోగులుగా నియమించారని ఉమ్మడి విశాఖజిల్లాకి చెందిన వ్యక్తి కోర్టుకి వెళితే.. అసలు మహిళా పోలీసు లకు పోలీసుశాఖ ఉద్యోగులే కారని.. చెప్పి వారిని ఏ ప్రభుత్వ శాఖకు చెందని ఉద్యోగులుగా గాల్లో పెట్టేశారు. ఇంకా మిగిలి వున్న ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు అమలు చేస్తే ఎక్కడ ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదిరిగా అన్ని రకాల ప్రయోజనాలు ఇవ్వాల్సి వస్తుందని సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయడం మానేశారు. అంతేకాదు..ఒకవేళ ఈ ప్రభుత్వశాఖను మనమే ఏర్పాటు చేశాం గనుక మనమే ఏదో సందర్భంలో మార్పులు చేసేసుకుందామనే గ్రామ, వార్డు సచివాలయశాఖకు చట్టబద్ధత కూడా ఇవ్వడం మానేశారు. అసలు ఒకప్రభుత్వశాఖను ఏ రాష్ట్రంలోనైనా ఏర్పాటు చేసే ముందు ఏ ప్రభుత్వశాఖ ఉద్యోగులకు అనుబంధంగా, ఏ కేటగిరీ ఉద్యోగాలను భర్తీచేస్తున్నారో గుర్తిస్తూ.. వారి శాఖ పేస్కేలు, ఇతర ప్రయోజనాలను వర్తిపంచేస్తూ ఆరు నెలల్లోగా చట్టబద్ధత తీసుకురావాలి. 

ఐదేళ్లు దాటగానే మొదటి పదోన్నతి కల్పించాలి. లేదా ప్రమోషన్ ఛానల్ లో పొందుపరిచిన విధంగా ఏడేళ్ల తరువాతనైనా ఉద్యోగులకు తొలి పదోన్నతి కల్పించాలి. ఇలా ఎక్కడ చేయాల్సి వస్తుందోనని ముందుగానే ఆలోచించిన ప్రభుత్వం.. ప్రభుత్వ పరంగా చేయాల్సిన పనులేమీ చేయకుండా అన్నీ సగం సగం చేసి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను గాల్లో ఉంచేసింది. ఆతరువాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వమైనా ఉద్యోగులకు మేలు చేస్తుందా అని ఆశపడిన ఉద్యోగులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వంలో మరింత నిరాశ కలిగేలా చర్యలు మొదలు పెట్టింది. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దాల్సిన కూటమి ప్రభుత్వం. వారికంటే పెద్ద తప్పులను చేసే విధంగానే యోచన చేస్తుందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు మేము ఇతర 74 ప్రభుత్వశాఖల ఉద్యోగులు మాదిరి గానే ఉద్యోగులమా.. లేదంటే అటు రెగ్యులర్, ఇటు కాంట్రాక్టు బేస్డ్ ఉద్యోగులం కాకుండా మధ్య తరహా ఉద్యోగులమా అనే అనుమానం వస్తుందని కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఏ ప్రభుత్వమైనా ఒక కొత్త ప్రభుత్వశాఖకు సంబంధించిన అంశాలను పూర్తిచేయడానికి ఐదేళ్లు సమయం సరిపోలేదాని కూడా ప్రశ్నిస్తున్నారు.

 కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వంలోని క్యాబినెట్ బేటీ ఎప్పుడు జరిగినా మా ఊసు చర్చకు వస్తుందా..? అసలు మాకోసం ఆలోచిస్తారా..? మా ప్రయోజనాలు మాకిస్తారా..? లేదంటే పరిపాలనా సౌలభ్యం పేరుతో ఉన్నవి ఈ ప్రభుత్వం మరింతగా తీసేస్తుందా అనే అనుమానాలనే వ్యక్తం చేస్తున్నారు. సచివాలయశాఖకు చట్టబద్ధత కల్పించడంతోపాటు, సర్వీసు రెగ్యులర్ సమయంలో ఇవ్వాల్సిన 2 ఇంక్రిమెంట్లు, గత పీఆర్సీ సమయంలో కుదించేసిన ప్రయోజనాలు, సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేసి.. మహిళా పోలీసులకు ఒక ప్రభుత్వ శాఖను ఏర్పాటు చేయడమో.. లేదంటే విద్యార్హతలను బట్టి డిపార్ట్ మెంట్ స్టైడింగ్ అయినా ఇచ్చి తమకు ఎంత పెద్ద బాధ్యతలు అప్పగించినా కష్టమైనా భరిస్తూ చేస్తామంటున్నారు ఉద్యోగులు. అయితే ఇవేమీ గత ప్రభుత్వంలో పట్టకపోగా.. ఈ ప్రభుత్వంలో అసలు చర్చకు వచ్చే దాఖలాలు కూడా కనుచూపు మేరలో కనిపించలేదు. ఒకవేళ గత ప్రభుత్వం కావాలని చేయకుండా మానేసిన అంశాలన్నీ టేకప్ చేస్తే ప్రభుత్వంపై ఆర్ధిక భారం పెద్ద ఎత్తున పడుతుంది. 

అంతేకాదు.. సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేస్తే వీరికి పదోన్నతులు కల్పించి ఉద్యోగుల సంబంధిత ప్రభుత్వ శాఖల్లోకి వీరిని పంపాల్సి వుంటుంది. అలా పంపితే రెండేళ్ల తరువాత మళ్లీ సచివాలయశాఖలో కొత్తగా ఉద్యోగాలు తీయాల్సి వుంటుంది. అవన్నీ చేసేకంటే అదిగో ఇదిగో అని కాలం గడిపేస్తే.. ఈ ప్రభుత్వం కూడా ఐదేళ్లపాటు గత ప్రభుత్వం సాగదీసినట్టుగా సాగదీసేయొచ్చు. అయినా సచివాలయ ఉద్యోగుల సమస్యలు తీర్చే సమయాన్ని ఇతర ప్రభుత్వశాఖలపై వెచ్చిస్తే అన్ని ప్రభుత్వ శాఖల విధులు సచివాలయ శాఖ ఉద్యోగులతో చేయించొచ్చు.. వీరి సమస్యలు పరిష్కరించకుండా వదిలేయోచ్చు అన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టుగానే కనిపిస్తున్నది వ్యవహారం. చూడాలి ఈరోజు జరిగే క్యాబినెట్ భేటీలో గ్రామ, వార్డు సచివాలయశాఖకు సంబంధించిన అంశాలు, ఉద్యోగుల సమస్యలు, ఈ శాఖకు చట్టబద్ధత, సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్. ఇతర ప్రయోజనాల విషయంలో చర్చిస్తారో లేదోనని..లేదంటే ట్విస్ట్ ఇచ్చి.. ఈ సబ్జెక్ట్ తరువాత చూద్దాంలే అని వదిలేస్తారో మరి ఈరోజు క్యాబినెట్ ముగిసేలోగా తేలిపోతుంది..!