గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ మాతృశాఖల్లోకి వెళ్లే ప్రక్రియ మొదలైంది. సచివాలయంలో కలిపి ఉన్న మత్స్యశాఖ తమ గ్రామీణ మత్స్యసహాయకులను అప్పగించాలని కోరుతూ కమిషనర్ రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాశారు. ‘సచివాలయ ఉద్యోగులు మాతృశాఖలకే’ శీర్షికన ‘ఈరోజు-ఈఎన్ఎస్’ రాసిన కథనాలు, క్యాబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలతో మొట్ట మొదటిసారిగా మత్స్యశాఖ స్పందించింది. దానికి సంబంధించి మత్స్యశాఖ కమిషనర్ డోలా శంకర్ రాసిన లేఖ మిగిలిన 18 ప్రభుత్వశాఖలను కదిలించేదిగా వుంది. అంతేకాకుండా గ్రామ, వార్డు సచివాలయశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, వారి మాతృశాఖ విధులకంటే అధనంగా మిగిలిన ప్రభుత్వ శాఖల విధులు నిర్వర్తించడం వలన ఉద్యోగుల ప్రభుత్వశాఖకు న్యాయం చేయలేకపోతున్న విషయాన్ని కూడా ఈ లేఖలో ప్రస్తావించడం ప్రాధాన్యతను సంతరించు కుంటున్నది.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు వారి ప్రభుత్వశాఖకు బదులు ఇతర విధులు అత్యధికంగా చేస్తున్నారనే విషయాన్ని ‘ఈరోజు-ఈఎన్ఎస్’లు పతాక శీర్షికలతో వార్తలు ప్రచురించాయి. అంతేకాకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని 74 ప్రభుత్వశాఖలు ఒకలా 75వ ప్రభుత్వ శాఖగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఒకలా ఉందనే విషయాన్ని ప్రత్యేక కథనాల రూపంలో అందించడంతో మత్స్యశాఖ కమిషనర్ ప్రత్యేకంగా దృష్టిసారించారు. వాస్తవానికి మత్స్యశాఖలోని విఎఫ్ఏలకు మాతృశాఖ డ్యూటీ చార్టే చాంతాండంత వుంటుంది. అలాంటిది వారి శాఖకు కంటే ఎక్కువగా ఇతర శాఖల పనులుచేయడం, అదీ కనీసం స్టేషనరీ కూడా గత ప్రభుత్వం మంజూరు చేయకపోవడంతో ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఎలా ఉద్యోగుల ఆర్ధిక ఇబ్బందులు తొలగించాలా అని ఆలోచిస్తున్న తరుణంలో కేబినెట్ నిర్ణయం కూడా తోడవడంతో మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులోని ప్రధాన అంశాలు, విఏఎఫ్ఏ అసోసియేషన్ ఇచ్చిన అభ్యర్ధనను కూడా పరిగణలోనికి తీసుకొని మొత్తం అంశాలను క్రోడీకరిస్తూ..లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
-మత్స్యశాఖ ప్రతిపాదనకు ప్రభుత్వం ఒకే చెబితే మిగిలిన 18 శాఖలు రెడీ..?
గ్రామ, వార్డు సచివాలయశాఖలోని 19 ప్రభుత్వ శాఖల్లో ఒకటైన మత్స్యశాఖ తమ ఉద్యోగులకు మాతృశాఖకు అప్పగించాలని రాసిన లేఖపై ప్రభుత్వం అంగీకారం తెలిపితే మిగిలిన శాఖలు కూడా క్యూ కట్టే అవకాశం ఉంది. సచివాలయ ఉద్యోగులను మాతృశాఖలకు బదిలీ చేయాలనే ప్రతిపాదన ఫిషరీష్ మినిస్టర్ కె. అచ్చెన్నాయుడతో ప్రారంభం అయ్యింది. ఏ శాఖ మంత్రి ప్రతిపాదిత లేఖలతో ఉద్యోగల విభజన పూర్తవుతుందనేది ప్రస్తుతానికి ప్రశ్నార్ధకమే అయినా ప్రక్రియ మొదలు కావడం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గత ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచడంతో చాలా మంది ఉద్యోగుల రెండేళ్లు అదనంగా పనిచేయాల్సి వచ్చింది. ఇపుడు అన్ని ప్రభుత్వశాఖల్లో ప్రతీనెలా వందల సంఖ్యలో ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. ఈ తరుణంలో గ్రామ, వార్డు సచివాలయశాఖలోని ఉద్యోగులను వారి మాతృశాఖలు వెనక్కితీసుకోకపోతే పరిపాలనా పరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా లేకపోలేదు. అలాగని కొత్త ఉద్యోగాలకు ఇప్పుడపుడే నోటిఫికేషన్లు వచ్చే పరిస్థితి కూడా లేకపోవడంతో ప్రస్తుతం సచివాలయాల్లో ఉన్న ప్రభుత్వశాఖలన్నీ తమ ఉద్యోగులను వారి శాఖల్లోకి తీసేసుకోవాల్సిన సమయం ఆశన్నమైంది.
గత ప్రభుత్వం చేసిన ప్రధాన తప్పిదం వలన కూటమి ప్రభుత్వం సచివాలయాల్లోని ఉద్యోగులను మాతృశాఖలకు పంపడానికి మార్గం సుగమం అయ్యింది. కేవలం గ్రామ, వార్డు సచివాలయశాఖకు చట్టబద్ధత కల్పించని కారణంగానే ఉద్యోగులను వెనక్కి పంపాలంటూ మాతృశాఖలు ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నాయి. గ్రామ,వార్డు సచివాలయశాఖ ఏర్పాటు దగ్గర నుంచి ప్రభత్వ అనుకూల మీడియా కూడా బయట పెట్టని అంశాలు ఒక్క ‘ఈరోజు-ఈఎన్ఎస్’ మీడియా మాత్రమే బయట పెట్టింది. ప్రజలకు ఇంటిముంగిటే సేవలు అందించే ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విషయంలోనూ నష్టపోకూడదనే సామాజిక బాధ్యతతో ‘ఈరోజు-ఈఎన్ఎస్’ఈ శాఖలో జరిగే ప్రతీ అంశాన్నీ ప్రభుత్వశాఖలకు తెలిసేలా ప్రత్యేక కథనాల ద్వారా బయట పెడుతున్నది. రానున్న రోజుల్లో కూడా ఇదే తరహా సమాచారాన్ని ప్రభుత్వానికి, ప్రజలకు.. ప్రజలకు సేవలు చేసే సచివాలయ ఉద్యోగులకు అందిస్తామని కూడా ఈ సందర్భంగా ‘ఈరోజు-ఈఎన్ఎస్’తెలియజేస్తున్నది.
-గాల్లో ఉన్న ఆ శాఖల సిబ్బందికి ఉద్యోగ భద్రత, పదోన్నతులు
గత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖను ఏర్పాటు చేసిన తరువాత కొన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులకి సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయాలేదు. దానితో వారికి సర్వీసు కాలంలో పదోన్నతులు వచ్చే అకవకాశం లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఇప్పటి వరకూ సర్వీసు రూల్స్, ప్రమోషనల్ ఛానల్ లేని మహిళా పోలీసులు, ఏఎన్ఎం(ఇన్ సర్వీస్ స్టాఫ్ నర్స్), వెల్పేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లుకి ఉద్యోగత భద్రత కూడా వస్తుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా వీరింతా కూడా మాతృశాఖల్లో విలీనం అయితే వారికి ప్రస్తుతం సదరు శాఖలో ఉన్న సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ కూడా, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు కూడా పొందేందుకు అవకాశం వుంటుంది.
ప్రభుత్వం కూడా ఉద్యోగుల విషయంలో కాస్త లోతుగా ఆలోచించే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను వారి మాతృశాఖలకు పంపిస్తున్న దనే చర్చ ఉద్యోగుల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నది. అన్ని ప్రభుత్వశాఖల కంటే ముందుగా మత్స్యశాఖ తమ ఉద్యోగులను తమశాఖలో విలీనం చేసి ప్రభుత్వ పథకాల అమలుకి సహకరించాలని లేఖరాయడంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులంతా మాతృశాఖలకు వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. చూడాలి సచివాలయంలోని మిగిలిన 18ప్రభుత్వశాఖల కూడా వారి ఉద్యోగులను వెనక్కి పంపాలని ప్రభుత్వానికి లేఖలు రాస్తాయో.. లేదంటే సచివాలయశాఖలోనే ఉంచేసి సర్వీసు నిబంధనలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పీఆర్సీ ప్రయోజనాలు ఇవ్వకుండా గత ప్రభుత్వం వ్యవహరించినట్టే వ్యవహరిస్తాయా.. అనేది..?!