అదనపు విధులు.. సచివాలయ సిబ్బందికి జేబులు చిల్లు..!


Ens Balu
459
visakhapatnam
2024-10-25 19:56:43

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయశాఖ 2019 అక్టోబర్ 2 ప్రభుత్వంలో 75వ ప్రభుత్వశాఖగా ప్రారంభమైన దగ్గర నుంచి ఎప్పుడూ ఏదో విషయంలో మీడియాలో నలుగుతూనే వుంటుంది.. మంచిగా అనుకునేరు.. తేడా వ్యవహారాల్లోనే సుమీ..అదేంటి ఇలా మాట్లాడుతున్నారు అంటే..అసలు విషయం తెలిస్తే మీరే నోరెళ్ల బెడతారు. అంతే కాదు అయ్యో పాపం అంటూ ముక్కున కూడా వేలేసుకుంటారు. ఏ ప్రభుత్వశాఖలోనూ లేని తేడా వ్యవహారాలన్నీ ఈ శాఖలోనే జరుగుతాయంటే అతిశయోక్తి కాదు. దానికి సాక్షులు మండలాల్లో ఎంపీడీఓలు.. డివిజన్ స్థాయిలో డిఎల్డీఓలు.. పట్టణాల్లో జోనల్ కమిషనర్లు.. నగరపాలక సంస్థ పరిధిలో కమిషనర్లు.. జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్లు.. ఏంటి ఇంత మంది తేడాగానే ఉంటున్నారా అంటే ముమ్మాటికి ఇది నిజం. అధికారులు ఓ.. తెగఫీలపోయినా..కాదనలేని వాస్తవం.  గ్రామ, వార్డు సచివాలయశాఖలో సిబ్బంది వారిశాఖ విధులకు బధులు, అదనంగా చేస్తున్నవిధుల విషయమై ఇటీవల రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలోని అంశాలను సదరు శాఖ కమిషనర్ ప్రభుత్వానికి రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఒక ప్రభుత్వశాఖ కమిషనరే ఈ విధంగా ప్రభుత్వానికి తెలియజేయడం ఇపుడు చర్చనీయాంశం అవుతోంది..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని 74 ప్రభుత్వశాఖల్లో అధికారులు, సిబ్బంది వారి శాఖకు సంబంధించిన పనులు మాత్రమే చేసుకుంటే 75వ ప్రభుత్వశాఖగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయశాఖ మాత్రం ప్రభుత్వశాఖల్లోని అన్ని విధులు, పనులు చేసి.. ఆఖరికి వారికొచ్చే జీతంలో నుంచి స్టేషనరీకి, వైట్ పేపర్లకు, జెరాక్స్ లకు నెలకీ కనీసం రూ.500 వరకూ ఖర్చు చేస్తున్నపరిస్థితులు నెలకొన్నాయంటే అతిశయోక్తి కాదేమో. ప్రభుత్వ శాఖగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కనీసం స్టేషనరీ కూడా ప్రభుత్వం సరఫరా చేయడం లేదంటే నమ్ముతారా..? దానికి ఇప్పటి వరకూ సచివాలయ సిబ్బంది స్టేషనరికీ పెట్టిన ఖర్చులే నిలువెత్తు సాక్ష్యం. సచివాలయశాఖ ఏర్పాటైన దగ్గర నుంచి సచివాలయ సిబ్బంది కేవలం స్టేషనరీ బిల్లులే ఒక్కో ఉద్యోగికి సుమారు ప్రభుత్వం రూ.25వేలకి పైగా ఇవ్వాలంటే నమ్ముతారా.. కానీ ఇది అక్షర సత్యం రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని 1.35లక్షల మంది ఉద్యోగులు సగటుని నెలకి సుమారుగా ఒక్కొక్కరూ రూ.600 పైగా కేవలం వైట్ పేపర్లు, ఇతర స్టేషనరీలకు ఖర్చు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో వీరు చేసే అదనపు విధులు బిఎల్వో(బూత్ లెవల్ ఆఫీసర్) గా చేసేటపుడు అయితే ఈ మొత్తం రూ.1000 నుంచి 2వేల వరకూ చేరేది. చేసేది అదనపు పనైనా.. స్టేషనరీ ఖర్చులు కూడా వీరితోనే పెట్టించింది గత ప్రభుత్వం. ఆ విధానం కూటమి ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో అమలు చేసేస్తున్నది. 

రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులను వారి మాతృశాఖలల్లో విలీనం(ఇన్ కార్పోరేట్) చేయాలని నిర్ణయం తీసుకున్న తరువాత.. సచివాలయ ఉద్యోగులు ఏ తరహా అదనపు విధులు నిర్వహిస్తున్నదీ రాష్ట్రమత్స్యశాఖ, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నేతృత్వంలోని అధికారులు చాలా చక్కగా ప్రభుత్వానికి వివరించారు. మొత్తం ఎనిమిది రకాల సర్వీసులు సచివాలయ ఉద్యోగులు చేస్తున్నారని.. అందునా గ్రామీణ మత్స్య సహాయకులు చేస్తున్నారని ఉటంకించారు. అందులో మొదటిది 1)కేస్ట్ సర్వే 2) పంచన్ల పంపిణీ 3)బిఎల్ఓ(బూత్ లెవల్ ఆఫీసర్) 4)ఇంటి పన్నుల వసూలు 5) గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆపాదించిన పనులు 6)ఇరిగేషన్ కెనాల్ డ్యూటీస్ 7) హౌస్ హోల్డ్ సర్వే  8)మిగిలిన ప్రభుత్వశాఖల పనులు చేస్తున్నారని.. తద్వారా మత్స్యశాఖ పనులు చేయడానికి ఎక్కడా వీలు పడలేదనే విషయాన్ని లిఖిత పూర్వకంగా మత్స్యశాక కమిషనర్  డోలా శంకర్ రాసుకొచ్చారు. సచివాలయశాఖ ఏర్పాటు అయిన దగ్గర నుంచి ఇప్పివరకూ ఏ ప్రభుత్వశాఖ కమిషనర్లు గానీ, కార్యదర్శిలు గానీ.. ప్రభుత్వానికి ఈ తరహా లేఖలు రాయలేదు. వాస్తవాన్ని మొట్టమొదటి సారికి మత్స్యశాఖ మాత్రమే ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేసింది. కనీసం ఈ విధంగానై ప్రభుత్వం దృష్టికి ఉద్యోగులు సమస్యలు వెళతాయని చిన్న నమ్మకం.

ఏదైనా ప్రభుత్వశాఖలో అయితే వారి శాఖల పనులు మాత్రమే ఉద్యోగులు చేస్తుంటారు. కానీ సచివాలయ ఉద్యోగులు మాత్రం వారి మాతృశాఖల పనులు కంటే ఇతర ప్రభుత్వశాఖల పనులే అదనంగా చేయాల్సి వస్తుంది. దానికి అయ్యే ఖర్చు కూడా ఉద్యోగులే భరిస్తున్నారు. ఈ విషయంలో పంచాయతీల్లో కార్యదర్శి దగ్గర నుంచి మండలాల్లో ఎంపీడీఓ.. డివిజనల్ స్థాయిలో డిఎల్డీఓలు, జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఉద్యోగులపైనే అదనపు భారాన్ని మోపుతూ వస్తున్నారు. నాటి నుంచి నేటి వరకూ ఉద్యోగులకి కావాల్సిన స్టేషనరీ ఇవ్వలేదనే విషయం ఒక్క అధికారి కూడా దృష్టిపెట్టిన పాపాన పోలేదు. కానీ సచివాలయాలకు స్టేషనరీ పంపిణీ చేస్తున్నట్టు సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శిలు.. పట్టణాల్లో జోనల్ అధికారులు, మున్సిపల్ కార్యాలయాలు మాత్రం లక్షలకు లక్షలు బిల్లులు డ్రా చేస్తున్నారు. 

పంచాయతీల్లో అయితే పరిస్థితి మరీ దారుణం అదనపు పనులు చేస్తున్నదే కాకుండా వైట్ పేపర్లు తమ సొంత ఖర్చుతో తేలేదనే సాకుతో సిబ్బందిని ఇబ్బంది పెడుతున్న సందర్భాలు లేకపోలేదు. ఎంత మంది అధికారులకు చెప్పినా.. ఏం సచివాలయ ఉద్యోగులంటే ఆ మాత్రం కూడా స్టేషనరీ మీ సొంత ఖర్చులతో కొనుక్కోలేరా అని అడిగేవారే తప్పితే.. ఏ ఒక్క జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ సైతం ఉద్యోగుల ఆర్ధిక ఇబ్బందులు పట్టించుకున్న దాఖలాలు లేవు. చేసిన అదనపు బిఎల్వో పనులకు గత నాలుగేళ్లు ప్రభుత్వం ఇవ్వాల్సిన అదనపు గౌరవ వేతనం కూడా ఎగ్గొట్టేసింది ప్రభుత్వం. చూడాలి ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు స్టేషనరీ బిల్లులు చెల్లిస్తుందా..? లేదంటే గత ప్రభుత్వమే ఇవ్వకుండా వారితోనే ఖర్చు పెట్టించగా లేనిది.. తామెంకుదుకు ఇచ్చి వారి ఆర్ధిక ఇబ్బందులు తొలగిస్తామని.. అదే పాత విధానాన్ని కంటిన్యూ చేస్తుందా.. అనేది..?!