కొన్ని సార్లు రావడం ఆలస్యం అయితే అవొచ్చు కానీ.. రావడమైతే పక్కా అంటాడు పవన్ కళ్యాణ్ సినిమాలో.. కానీ ఇపుడు ఇపుడు అదే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం.. కట్ చేస్తే సరిగ్గా ఇపుడు అదే డైలాగుని అధికారికంగా చెబితే బాగుండునని మూడు ప్రభుత్వశాఖల కమిషనర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు వెయిట్ చేస్తున్నారు.. క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయం మేరకు గ్రామ సచివా లయ సిబ్బందిని మాతృశాఖల్లోకి విలీనం చేసే ప్రక్రియ మొదలు పెట్టాలని ఒక్క మాట చెబితే ఒకేసారి నాలుగు విభాగల సచివాలయ సిబ్బం ది పంచాయతీరాజ్ శాఖలో విలీనం అయిపోతారు. ఇపుడు ఒక విభాగం విలీనమైనా దానికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత రాలేదు. ముఖ్య మంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు క్యాబినెట్ సమావేశం అయిన కొద్ది రోజుల్లోనే మత్స్యశాఖ కమిషనర్, ముఖ్యకార్యదర్శిలతో ప్రత్యేక సమావేశం పెట్టి మరీ ప్రభుత్వానికి తమ సిబ్బందిని తమకి అప్పగించేయాలని మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాలు కమిషనర్ రాసిన లేఖ ఇపుడు మిగిలిన శాఖలు కదిలిస్తోంది. దానికితోడు ఈరోజు-ఈఎన్ఎస్ ప్రచురిస్తున్న ప్రత్యేక కథనాలు కూడా 19 ప్రభుత్వశాఖలను చైతన్యం చేస్తున్నాయి. సత్వరమే సచివాలయంలోని 19శాఖల సిబ్బందిని మాతృశాఖల్లో విలీనం చేసేస్తే వారికి ఒక నిర్ధిష్ట ప్రభుత్వశాఖ ఏర్పడుతుందనేది ప్రభుత్వఆలోచన..!
ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయశాఖలో ఉద్యోగులను వారి మాతృశాఖలకు పంపించేందుకు రాష్ట్ర అధికారులు రంగం సిద్దం చేస్తున్నారు. వందలాదిగా రిటైర్ అవుతున్న ఖాళీలను ఒకేసారి భర్తీచేయాలంటే ప్రభుత్వం ముందున్న ఏకైన అవకాశం సచివాలయ ఉద్యోగులను మాతృశాఖలకు పంపడమే తద్వారా తక్షణం ఖాళీల భర్తీతోపాటు, ఉద్యోగులకు ఒక చిరస్థాయి ప్రభుత్వశాఖ కేటాయింపు కూడా చేయవచ్చుననేది ప్రభుత్వం ముందున్న ఆలోచన. దానికోసం ఇటీవల క్యాబినెట్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేస్తున్నారు. అందునా మత్స్యశాఖ కమిషనర్ ప్రభుత్వానికి రాసిన లేఖను కూడా మిగిలిన ప్రభుత్వశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్లు కాస్త సీరియస్ గానే తీసుకున్నారు. ప్రస్తుతం జిల్లా అధికారుల బదిలీల నేపథ్యంలో ప్రక్రియ ఆలస్యం అయినా.. సంక్రాంతి నాటికి సిబ్బందిని మాతృశాఖల్లోకి పంపే ప్రక్రియ దాదాపు పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి సారిస్తే ఒకేసారి మూడు ప్రభుత్వశాఖల్లోని నాలుగు విభాగాల ఉద్యోగులు వారి మాతృశాఖల్లోకి వెళ్లిపోవడానికి ఆస్కారం వుంటుంది. మత్స్యశాఖ కమిషనర్ రాసిన లేఖ ఆధారంగా మిగిలిన శాఖలు కూడా అదే బాటలో పయనించేందుకు సిద్ధమవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉంటుందా..? ఊడుతుందా..! శీర్షికన ఈరోజు-ఈఎన్ఎస్ ప్రచురించిన కథనంపై ప్రభుత్వం వెంటనే స్పదించింది. ఆపై క్యాబినెట్ లో చర్చించి వారిని మాతృశాఖలకు బదిలీ చేయాలని నిర్ణయించింది. క్యాబినెట్ ఆదేశాలను తక్షణం అమలు చేసిన మత్స్యశాఖ తమ సిబ్బందిని తమశాఖలో విలీనం చేయాలని ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనితో మిగిలిన శాఖల్లోనూ చలనం మొదలైంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామ పంచాయతీలను బలోపేతం చేయాలని నిర్ణయించి.. ఇన్చార్జిలతో నడుస్తున్న గ్రామ పంచాయతీల్లో కార్యదర్శిలను నియమిస్తే ఫలితం వస్తుందని బావించారు. దానికి అనుగుణంగానే గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలను బదిలీల పేరుతో చిన్న పంచాయతీలకు బదిలీలు చేశారు. తద్వారా ఇన్చార్జిలతో నడుస్తున్న చాలా పంచాయతీలకు రెగ్యులర్ కార్యదర్శిలు నియామకాలు జరిగాయి. ఇంకా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 13వేల 326 గ్రామ పంచాయతీల్లో చాలా వరకూ ఇన్చార్జి పాలనే నడుస్తున్నది. కాకినాడ, ఏలూరు, రాజమండ్రి, డా.బీఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో అత్యధికంగా మేజర్ పంచాయతీల్లో ఉన్న గ్రేడ్-5 కార్యదర్శిలు ఇండివిడ్యువల్ పంచాయతీలకు బదిలీల్లోనే వెళ్లిపోయారు. ఒక రకంగా పంచాయతీ రాజ్ శాఖ ఒక విభాగం గా పంచాయతీ కార్యదర్శిలు అనధికారికంగా విభజన జరిగిపోయినట్టే.
ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి సారిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఇన్చార్జి కార్యదర్శిలతో నడుస్తున్న పంచాయతీల్లో కూడా మేజర్ పంచాయతీల్లో ఉన్న కార్యదర్శిలను బదిలీచేసి పూర్తిస్థాయి కార్యదర్శిలు ఉండే విధంగా చేయొచ్చు. ఇంకా మిగిలివున్న గ్రేడ్-6 పంచాయతీ కార్యదర్శిలు(డిజిటల్ అసిస్టెంట్లు), ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వెల్పేర్ అసిస్టెంట్లకు కూడా స్థానచలనం వచ్చే అవకాశలుంటాయి. ప్రస్తుతం మత్స్యశాఖ కమిషనర్ ప్రభుత్వానికి మంత్రి అచ్చెన్నాయుడుతో జరిగిన ప్రత్యేక సమావేశ వివరాలను, ఇతర ఇబ్బందులను ఉంటకిస్తూ రాసిన లేఖ ఇపుడు పంచాయతీరాజ్ లోనూ హాట్ టాపిక్ అయ్యింది. డిప్యూటీ సీఎం ఆదేశం కోసమే అధికారులు వేచి చూస్తున్నారట. ఒక్క ఆదేశం వస్తే 70శాతం పంచాయతీలకు ఇన్చార్జిల వ్యవస్థ తప్పిపోతుంది. అంతేకాకుండా నాలుగు విభాగాల సిబ్బందికి పంచాయతీరాజ్ శాఖలో విలీనం కూడా అయిపోతారు. గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటైన దగ్గర నుంచి ఈరోజు-ఈఎన్ఎస్ లు సంయుక్తంగా ఈ శాఖలో జరిగే అన్ని రకాల వ్యవహారాలపైనా ప్రత్యేక కథనాలు ప్రచురించడం కూడా ప్రభుత్వంలోని కదలికలకు కారణం అవుతున్నది.
గత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటు చేసి తలా తోకా లేకుండా.. కనీసం ఈ ప్రభుత్వశాఖకు చట్టబద్ధత లేకుండా.. ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగా సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకుండా వదిలేసింది. ఫలితంగా మహిళా పోలీసుల పోస్టులపై కోర్టుల్లో కేసులు పడి .. ఇపుడు వారు ఏ ప్రభుత్వశాఖకీ చెందని వారుగా ఉండిపోయారు. వారిని పోలీసుశాఖలోనే ఉంచేస్తారా..? లేదటే అర్హతలను బట్టి సైబర్ క్రైమ్ విభాగానికి పంపిస్తారా..? లేదంటే భారీగా రిటైర్ అవుతున్న పంచాయతీ కార్యదర్శిల ఖాళీల్లో భర్తీచేస్తారా..? లేదంటే దేనికీ చెందకుండా గాల్లోనే ఉంచేస్తారా..? అనే విషయంలో మాత్రం చిన్న క్లారిటీ కూడా రాలేదు. ఈ విషయంలో హోం మంత్రి అనిత నిర్ణయం తీసుకొని డిజిపీతో మాట్లాడి ఒక దారి చూపించాల్సి వుంది. కానీ అక్కడ కూడా పనిజరగలేదు. అన్నిశాఖల మంత్రులు ఒకేలా ఆలోచించగలిగితే వ్యవహారం ఇట్టే తేలిపోతుంది.
గత ప్రభుత్వ తేడా విధానాలే ఇపుడు కూటమి ప్రభుత్వానికి ఈ శాఖలోని సిబ్బందిని ఒక్కొక్కరుగా మాతృశాఖల్లోకి విలీనం చేసేయడానికి అవకాశాలుగా మారాయి. అన్నీ అనుకుంటే వచ్చే సంక్రాంతి నాటికి సచివాలయశాఖలోని అన్ని ప్రభుత్వాశాఖల అధికారులు ప్రభుత్వానికి లేఖలు రాసి సిబ్బందిని మాతృశాఖల్లోకి విలీనం చేస్తాయని సమాచారం అందుతుంది. ఆపై గ్రామ, వార్డు సచివాలయశాఖను ఉంచాలా..? లేదంటే ఐదారుగురితో నడిపి గ్రామ పంచాయతీలు, వార్డు కార్యాలయాలుగా నడపాలా అనేదానిపై స్పష్టమైన నిర్ణయం కూడా వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి రాజున్న రోజుల్లో ఏం జరుగుతుందనేది.