వ్యవసాయ శాఖలో రివర్స్ ఎక్స్ టెన్షన్..!


Ens Balu
601
visakhapatnam
2024-10-28 14:14:52

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయశాఖలో రివర్స్ ఎక్స్ టెన్షన్ మొదలు పెట్టింది..ఏళ్లతరబడి సర్వీసు చేస్తున్న అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్లను(ఏఈఓ)లను తిరిగి గ్రామ సచివాలయాల్లో ఖాళీగా వున్న గ్రామీణ వ్యవసాయ సహాయకుల స్థానంలో పంపబోతున్నది. పరిపాలనా సౌలభ్యం కోసం చేస్తున్న ఈ రివర్స్ ఎక్స్ టెన్షన్ ను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏఈఓలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హేతు బద్దీకరణ పేరుతో రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న ఈ తిరకాసు వ్యవహారంపై మండి పడుతున్నారు. ఏళ్ల తరబడి సర్వీసు చేస్తున్నా కనీస పదోన్నతులకు నోచుకోని ఈఏఓల కోసం సర్వీసు నిబంధనలను సడలించి పదోన్నతులు కల్పించాల్సిన ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. ప్రస్తుతం గ్రామీణ వ్యవసాయ సహాయకులకు ఏఈఓలుగా పదోన్నతులు ప్రారంభించిన ప్రభుత్వం సర్వీసు నిబంధనలు సడలించకపోతే ప్రస్తుతం 26 జిల్లాలోని 15వేల 4 గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రామీణ వ్యవసాయ సహాయకులు కూడా జీవితాంతం ఏఈఓలుగానే గ్రామాల్లోనే విధులు నిర్వహించి రిటైర్ కాక తప్పదు..!

కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తమ సర్వీసులో పదోన్నతులు చూస్తామని ఆశపడిన అగ్రికల్చర్ ఎక్స్ టెన్సన్ ఆఫీసర్లకు చుక్కెదురైంది. పదోన్నతుల మాట దేవుడెరుగు ఉన్న క్యాడర్ ని. సీనియారిటీ పరిపాలనా సౌలభ్యం కోసం.. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీలు ఉన్న విఏఏ(విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు) స్థానాల్లో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం చూస్తున్న విధానం ఏఈఓలకు మింగుడు పడటం లేదు. దానికోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖాళీల వివరాలను సేకరించిన ప్రభుత్వం ప్రస్తుతం మండ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్నవారిని గ్రామాల్లో ఉన్న ఖాళీల్లో సర్ధుబాటు చేయడానికి చక చకా పనులు చేసేస్తున్నది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటు చేసినపుడు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు పూర్తిస్థాయిలో నియామకాలు చేయలేదు.

 దానితో అనుబంధ శాఖలుగా వున్న హార్టికల్చర్ అసిస్టెంట్లు, సెరీ కల్చర్ అసిస్టెంట్లతో గత ప్రభుత్వం పూర్తిస్థాయి సిబ్బంది ఉన్నట్టుగా చూపించి మమ అనిపించేసింది.  కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఏ శాఖ ఉద్యోగులను ఆశాఖలోనే ఉంచాలని.. ఒక శాఖ ఉద్యోగులను మరోశాఖ సిబ్బందిగా చూపించకూడదని నిర్ణయించిన సమయంలో రాష్ట్రవ్యాప్తంగా చాలా ఖాళీలు బయట పడ్డాయి. దీనితో ఆ ఖాళీల్లో మండల కేంద్రాల్లోనూ, అగ్రికల్చర్ ల్యాబుల్లోనూ విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని తిరిగి సదరు ఖాళీల్లోకి భర్తీచేస్తే.. పూర్తిస్థాయిలో సిబ్బంది ఉన్నట్టుగా ఉంటుందని..కొత్తగా ప్రభుత్వంపై ఉద్యోగాలు తీసే భారం కూడా పడదనే ఆలోచనకు వచ్చింది. అనుకున్నదే తడవుగా పనులను చకచకా చేసుకు పోతున్నది.

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఏఈఓలకు పదోన్నతులు కల్పించడం కోసం ఏఈఓలు ఏఓలకు మధ్య ఒక క్యాడర్ ను ఏర్పాటు చేసి వారికి పదోన్నతులు ఇవ్వాలని ఆలోచన చేసింది. అయితే దానిని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏఓలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ సమయంలో రాష్ట్ర స్థాయిలో వ్యవసాయాధికారులు  కూడా సహకరించడంతో దానిని కార్యారూపంలోకి రానీయకుండా చేశారు. దానితో ఆ ఆలోచనన ప్రభుత్వం కూడా విరమించుకుంది. వీరిలోనే మరికొందరిని ఇన్ సర్వీసు కి పంపి ఏఓలుగా పదోన్నతులు కల్పించింది. అలా కల్పించిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వెయ్యి మందిలో కొందరు ఇన్ సర్వీసులో పదోన్నతులు పొంది వెళ్లిపోయారు. తరువాత చాలా మంది ఏఈఓలకు వయస్సు పెరిగిపోవడంతో ఇన్ సర్వీసులో ఏజీబిఎస్సీ చేసే అవకాశం కల్పోయారు. అలా మిగిలిన వారంతా పదోన్నతులకు నోచుకోకుండా సర్వీసులోనే  మిగిలిపోయారు.

 ఏఈఓల సర్వీసుని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. ప్రస్తుతం నూతన సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదు. ఈ సమయంలో ఏఈఓలుగా ఉన్నవారినే ఖాళీల్లోకి పంపించాల్సి వుంటుంది. అలా పంపించడం ద్వారా  కొద్దిమేరకైనా ఖాళీలను భర్తీచేసినట్టు వుంటుందనేది ప్రభుత్వ ఆలోచన. అదే సమయంలో ఉద్యోగ విరమణ వయస్సు రెండేళ్లు పెంచేసిన సమయం కూడా పూర్తవడంలో వీరిలోనే మరికొందరు ఉద్యోగులు రిటైర్ కానున్నారు. అలా రిటైర్ అవగా మిగిలిన వారిని గ్రామీణ వ్యవసాయ సహాయకుల స్థానంలోకి పంపితే మిగులు ఖాళీలు భర్తీ జరుగుతుందనేది ప్రభుత్వ బావన. అంతేకాదు వారికి పదోన్నతులు ఇచ్చే విషయం కూడా పక్కదారి పట్టించడానికే ఇపుడు వారిని రివర్స్ ఎక్స్ టెన్షన్ విధానంతో వెనక్కి పంపాలని ప్రభుత్వం చూస్తున్నట్టుగా కనిపిస్తున్నది.

ఏఈఓలకు పదోన్నతులు కల్పించాలంటే ఖచ్చితంగా ఏఈఓలు, ఏఓలకు మధ్య ఒక క్యాడర్ ని ప్రభుత్వం  ఏర్పాటుచేయాల్సిన అవసరం వుంది. అలా చేయాలంటే ప్రస్తుతం వీరికున్న సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ కొత్తగా రూపొందించాల్సి వుంటుంది. లేకపోతే ఉన్న నిబంధనలను అదనపు అంశాలతో నవీకరణ చేయాలి. అలా చేయడం వలన ప్రభుత్వంపై పెద్దగా ఆర్ధిక భారం ఏమీ పడదు కారణం ఇప్పటికే చాలా మంది ఏఈఓలు ఏఓ పే స్కేల్ ని కూడా దాటేశారు. ఈ సమయంలో ఏఈఓలకు పదోన్నతులు ఇవ్వడానికి నిబంధనలు సడలించడమో.. లేదంటే సర్వీస్ రూల్స్ అమైండ్ మెంట్ చేయడమో చేయాలి. అలా చేయకపోతే ప్రస్తుతం ఉన్న ఏఈఓలకు వారి సర్వీసు కాలంలో పదోన్నతి పొందే అవకాశం ఉండదు. 

అంతేకాదు.. వారి స్థానంలో పదోన్నతులపై వచ్చే గ్రామీణ వ్యవసాయ సహాయకులు కూడా జీవితాంతం ఏఈఓలుగానే అదే పంచాయతీల్లోనే  మగ్గిపోవాల్సి వుంటుంది. ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం ఆలోచించే సమయాన్ని ఏఈఓలకు పదోన్నతులు కల్పించడానికి ఆలోచించడం ద్వారా ప్రస్తుతం ఏఈఓలకు, తరువాత గ్రామీణ వ్యవసాయ సహాయకులకు పదోన్నతులు కల్పించడానికి వీలుపడుతుంది. పరిపాలనా సౌలభ్యం, ఖాళీల్లో సిబ్బంది సర్ధుబాటు కోసం మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నది ప్రభుత్వం. ఈ తరుణంలో ఏఈఓలకు ప్రభుత్వం పదోన్నతులు కల్పిస్తుందా.. వాళ్ల సంగతి ఆలోచించడం ద్వారా టైమ్ వేస్ట్ అని విఏఏ ఖాళీల్లోకే ఖచ్చితంగా వెనక్కి పంపి రివర్స్ ఎక్స్ టెన్సన్ మాత్రమే చేస్తుందా...? అనేది తేలాల్సి వుంది..!