సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ తిరగండి.. ఇంటి పనులు 70శాతం వసూలు చేయండి.. లేదంటే మీ ఉద్యోగాలు తీసేస్తాం.. మీరు హౌస్ టాక్స్ కలెక్షన్ చేసిన దానిని బట్టే మీ ఉద్యోగాలు ఉంటాయో.. ఊడుతాయో తేలిపోంది.. మున్సిపాలిటీలో కమిషనర్లు చేసే హెచ్చరిక.. చెప్పినంతా పన్నులు వసూలు కాకపోయినా.. మీ జేబుల్లోనుంచైనా కట్టేయాలి.. వారి దగ్గర నుంచి మీరు తరువాత వసూలు చేసుకోవాలి.. ఇది గ్రామాల్లో మండల అధికారులు చేస్తున్న హెచ్చరిక.. ఏం చేస్తారో తెలీదు.. ఎలా చేస్తారో తెలీదు.. అన్ని పనులు మానేసైనా.. ప్రతీ రోజూ ఇంటింటికీ తిరిగేసి పన్నులు వసూలు చేయాలి..ఇది ముఖ్యమంత్రి ఆర్డర్.. అంటూ మండలాల్లో ఎంపీడీఓల హుకుం.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు చేసేది ఒక శాఖలోనే అయినా.. వీరు చేసే పనులు మాత్రం 20శాఖలపైనే ఉంటున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన పనే ఇపుడు కూటమి సర్కారు కూడా చేస్తుంది.. గత ప్రభుత్వం ఉద్యోగులను నమ్మించడానికైనా ఒకటి రెండు శాఖల్లోని ఉద్యోగులకు పదోన్నతులు కల్పించింది. కూటమి ప్రభుత్వం అలా చేయడం లేదు సరికదా.. ఉద్యోగులను తాటతీసే పనులకి ఉపక్రమిం చింది. దీనితో రామేశ్వరం వెళ్లినా శనేశ్వరం తప్పలేదంటూ సచివాయ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఇంతచేసినా.. వీరికి ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన ప్రయోజనాలు, పదోన్నతులూ అడిగితే మాత్రం ఆ ఒక్కటీ అడక్కు అంటూ ప్రభుత్వం తెగ సిరాకులు పడిపోతుందని వాపోతున్నారు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇపుడు అర్జెంటుగా ఆదాయం కావాలి. ఆదాయం వచ్చే ప్రభుత్వశాఖలన్నింటికీ ఒకేసారి టార్గెట్లు ఇచ్చేసింది. దాని తో రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లా అధికారులకు టార్గెట్లు ఇస్తే.. వాళ్లు సచివాలయ ఉద్యోగుల పీకపై కత్తి పెట్టి మరీ వారిని అదిరించి బెదిరిం చేస్తున్నారు. హెల్మెట్ లేకుండా రోడ్డెక్కితే పోలీసులు ఫైన్లు మీద ఫైన్లు హోంగార్డులతో సహా ఫోటోలు తీసి వేసేస్తున్నారు. ఇటు సచివాల యాల్లో ఉద్యోగులను ఇంటింటికీ పంపి ప్రజలను పన్నుల కోసం వెంటాడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరునెలలు తిరక్కముందే ఆదాయం కోసం ఉద్యోగులను వేధించి మరీ ప్రజలను ముక్కు పిండి వసూలు చేయడానికి కార్యాచరణ సిద్దం చేసింది. అనుకు న్నదే తడవుగా రాష్ట్రంలోని 26 జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కమిషనర్లు, మండలాల్లో ఎంపీడీఓలకు ఆదేశాలు జారీ చేసి మరీ పన్నుల వసూలకి ప్రజలను పరుగులు పెట్టిస్తున్నారు.
ప్రజల వద్ద డబ్బుల ఉన్నా.. లేకపోయినా.. సచివాలయంలో ఉద్యోగం చేస్తున్న పాపానికి వారి జేబుల్లోనుంచైనా కట్టి టార్గెట్లు పూర్తిచేయాలని ఆదేశిస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీనితో సచివాలయ ఉద్యోగులు గత వైఎస్సార్సీపీ చేసిన పాపం ఇపుడు కూటమి ప్రభుత్వంలోనూ తమను వెంటాడు తోందని ఉద్యోగులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ప్రజలు పన్నులు కడితే ప్రభుత్వానికి అప్పజెప్పగలం.. కానీ ప్రతీరోజూ అడుక్కునే వారి మాదిరిగా .. ఇంటికి వెళ్లి మరీ పన్నుల కోసం వెంట పడుతుంటే అమ్మనా బూతులు తిడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడుక్కునే వారికి ఇంట్లో సరుకులు నిండుకున్నాయని సున్నితంగానైనా చెబుతున్నారు. సచివాలయ ఉద్యోగుల మొహం మీదే ప్రజలు చాలా చిరాకులు ప్రదర్శిస్తున్నారంటూ తమ ఇబ్బందులు చెబుతున్నారు.
ప్రభుత్వం ఆదాయం కోసం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను వెంటాడి మరీ పన్నుల వసూలకి క్షణాల్లో ఆర్డరు వేస్తున్న అధికారులు.. అదే సచివాల ఉద్యోగుల సమస్యలు.. వారికి రావాల్సిన ప్రయోజనాలను అమలు చేయాలంటే మాత్రం నోరు మెదపడం లేదు. కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రభుత్వం ఊరకనే మీకు జీతాలు ఇచ్చేస్తుందని.. వారి జేబులో నుంచి జీతాలు ఇచ్చినట్టుగా అధికారులు తెగ ఫీలై పోతున్నారు. మీటింగులు పెట్టి తీవ్రంగా భయపెడుతున్నారు.. వార్డులు, మండలాలు, పంచాయతీల వారీగా ఇచ్చిన టార్గెట్ లు పూర్తిచేయ కపోతే ఉద్యోగులను టార్గెట్ చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగులను వెంటాడి మరీ ప్రభుత్వానికి కావాల్సినట్టుగా ఒక ప్రకభుత్వ శాఖ ఉద్యోగు లతో 20 ప్రభుత్వశాఖల పనులు చేయిస్తూ..ఉద్యోగుల జేబులకి కన్నం పెడుతున్న ప్రభుత్వం వీరికి ఇవ్వాల్సిన ప్రయోజాలను మాత్రం అడగొద్దని తెగేసి చెబుతోంది. పైగా మీ శాఖను రేపు ఎత్తేస్తాం.. మాపు ఎత్తేస్తాం.. మీ ఉద్యోగాలన్నీ గాల్లోనే ఉంటాయని అధికారులతో తేడా బెదిరింపులకి దిగుతోంది..
(ఒకసారి ప్రభుత్వం ఉద్యోగంలోకి వచ్చిన తరువాత ఏ ఒక్కరినీ నేరుగా ఉద్యోగాల్లో నుంచి తొలగించేయడం దేశంలోని ఏ ప్రభుత్వ తరమూ కాదు.. దానికి సర్వీసు నిబంధనలు కూడా ఓప్పుకోవు.. పనిగట్టుకొని తొలగించేయాలనుకుంటే.. రాజ్యాంగంలోని చట్టాలు, ఆర్టికల్స్, క్లాజులను ఆధారంగా చేసుకొని మాత్రమే చేపట్టాలి. లేదంటే రాజ్యంగంలోని ఆర్టికల్స్ గట్టిగా అడ్డుతగులుతాయి.. అయినా స్కూల్లో పిల్లాడిని బెదిరించినట్టుగా సచివాలయ ఉద్యోగులను మీ ఉద్యోగాలను తొలగించేస్తామని జిల్లా అధికారులు నోటి మాటగా బెదిరిస్తున్నారంటే.. రాష్ట్రప్రభుత్వం..జిల్లా అధికారులు... రాజ్యాంగంలోని 14వ భాగంలోని 308 నుంచి 323 వరకూ అనగా ఆర్టికల్ 315 ద్వారా సర్వీస్ కమిషన్లు ఏర్పాటు.. 311వ అధికరణ ద్వారా ఉద్యోగుల సర్వీసు రూల్స్.. ఉద్యోగుల భద్రత, రక్షణ అంశాలను ఉద్యోగుల సేవలని ఉల్లంఘిస్తున్నట్టే లెక్క)
-ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ఎగవేసిన ప్రయోజనాలివీ
రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్వీసు నిబంధనల ప్రకారం వీరి ఉద్యోగాలు రెగ్యులర్ అయిన వెంటనే ఇవ్వాల్సిన 2 ఇంక్రిమెంట్లు ఇవ్వలేదు. 74 ప్రభుత్వశాఖలకు అమలు చేసిన పూర్తిస్థాయి పీఆర్సీ.. దానిపై ఇవ్వాల్సిన అరియర్సుపై కనీసం ప్రకటన చేయలేదు. సచివాలయ శాఖకు చట్టబద్ధత తీసుకురాలేదు. గత ప్రభుత్వం చేయని చట్టబద్దత లోపాన్ని అడ్డుపెట్టుకొని ఇంకా నాలుగైదు శాఖల ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ కూడా ఏర్పాటు చేయలేదు.. ఇదే శాఖలోని మిగులు ఉద్యోగాలను భర్తీ చేయకుండా ఖాళీల్లో ఉన్న ఉద్యోగుల పనులు ఉన్నవారితోనే చేయిస్తున్నది. సచివాలయశాఖ ఉద్యోగంతోటు సుమారు ప్రతినిత్యం 8శాఖల పనులను చేయిస్తున్నది.
బిఎల్వో విధులు అప్పగించి కనీసం స్టేషనరీ కూడా ఇవ్వకుండా దానికయ్యే ఖర్చు మొత్తం ఉద్యోగులనే పెట్టిస్తున్నది. బిఎల్వో విధులు చేసినందుకు ఇవ్వాల్సి అదనపు గౌరవ వేతరం కూడా నాలుగేళ్లు ఇవ్వడం మానేసింది. మొక్కుబడిగా ఒకటి రెండు శాఖల్లో పదోన్నతులు కల్పించి.. మిగిలిన శాఖల ఉద్యోగులను గాలికొదిలేసింది. పదోన్నతులు ఇస్తే మరో ఇంక్రిమెంట్ ఇవ్వాల్సి వస్తుందని.. తద్వారా ప్రభుత్వం భారం పడుతుందని ఆ ఊసే ఎత్తడం లేదు. ప్రభుత్వం ఇచ్చే ఏడాదికొకసారి ఇచ్చే ఇంక్రిమెంటుని సైతం అధికారులు లంచాలు తీసుకుండా బిల్లులు పెట్టడం లేదు. లీవ్ ఎన్ క్యాష్ మెంట్ గానీ, ఇన్ సర్వీసు గానీ సచివాలయ ఉద్యోగులకు వర్తింప చేయడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ఎగ్గొట్టిన ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
ఇన్ని ఉన్నా వాటిపై నోరు మెదపని ప్రభుత్వం.. ఆదాయం కోసం వీరిని వెంటాడి మాత్రం అన్ని పనులు చేయిస్తున్నది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వలన ఇబ్బందులు పడిన తాము కూటమి ప్రభుత్వాన్ని నిలబెడితే.. గత ప్రభుత్వం కంటే దారుణంగా ఈ ప్రభుత్వంలో ఉందని ఉద్యోగులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ఉద్యోగులను వేధించి మరీ పనులు చేయిస్తున్న అధికారులు.. వీరికి ఇవ్వాల్సిన ప్రయోజనాలు, పదోన్నతులు ఇస్తే ప్రభుత్వం చెప్పిన అన్నిపనులూ చేస్తామంటున్నారు ఉద్యోగులు. చూడాలి.. ఆదాయమే కాదు.. ఉద్యోగుల సంక్షేమం కూడా ప్రభుత్వం చూడటం ఎప్పటి నుంచి మొదలు పెడుతుందనేది..?!