జర్నలిస్టు సంఘాల తేడాలపై కార్మికశాఖ కన్నెర్ర..?!


Ens Balu
237
visakhapatnam
2024-11-07 18:54:28

బాహ్య ప్రపంచంలోని సమాచారాన్ని ఒడిసి పట్టేది జర్నలిస్టులు.. సమాజాన్ని తమ వార్తలతో మేల్కొలిపేది జర్నలిస్టులు.. అవినీతిని ఎండ గట్టేది జర్నలిస్టులు.. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచేది జర్నలిస్టు.. సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న మీడియా, జర్నలిస్టులు అంటే అన్ని వర్గాల వారికి అమిత గౌరవం. ప్రజలను, సమాజాన్ని చైతన్య పరచాల్సిన జర్నలిస్టుతే తప్పుదారి పడితే.. జర్నలిస్టుల సంఘాల పేరుతో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే.. డబ్బు కోసం అడ్డదారులు తొక్కి తలా తోకా లేని సంఘాలు ఏర్పాటు చేసి..  ఒక జర్నలిస్టు సం ఘంలో ఉన్నవారు మిగిలిన  సంఘాల్లోనూ సభ్యులుగా ఉంటే ఏమవుతుంది..? బాహ్యప్రపంచంలోని సమస్త సమాచారాన్ని వార్తలుగా రాసే జర్నలిస్టులే వార్త అయిపోతారు.. ఇపుడు కూడా అదే జరిగింది. వీధికో సంఘం.. వాడకో అసోసియేషన్.. మండలానికో జర్నలిస్టు ట్రస్టు ఇలా వంద సంఖ్యలో వెలస్తూ తమ సభ్యుల వివరాలు చెప్పని జర్నలిస్టుల సంఘాలపై కార్మికశాఖ కన్నెర్ర జేసింది. అసలు మీ సంఘంలో ఎంతమంది ఉన్నారు..? మీ లెక్కలేంటి..? మీ సభ్యులెవరు..? మీ సంఘం ట్రేడ్ యూనియన్ లైసెన్స్ ఎంతవరకూ ఉందో చెప్పాలంటూ నోటీసులు పంపింది.. ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొచ్చిన  తేడా జర్నలిస్టుల సంఘాలు కార్మికశాఖ నోటీసులకు తేలుకుట్టిన దొంగల్లా బిక్కు బిక్కు మంటున్నాయి..?!

ఆంధ్రప్రదేశ్ లోని కార్మికశాఖ పనిచేయని జర్నలిస్టుల సంఘాలను నియంత్రించడానికి కంకణం కట్టుకుంది. ఒకే సభ్యుడు ఎన్ని యూనియన్లలో సభ్యుడిగా ఉంటాడు.. ఒక యూనియన్ నాయకుడు మరెన్ని యూనియన్లలో నాయకులుగా ఉంటారు.. అసలు కార్మికశాఖ చట్టాలు ఏం చెబుతున్నాయో తెలియజేసేందుకు నడుంబిగించింది. దీనితో సంఘం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లతో దందాలు చేపట్టే జర్నలిస్టుల సంఘాలు గప్ చుప్ మని కూర్చుండిపోతున్నాయి. మరికొన్ని రాష్ట్ర సంఘాలు తమ సభ్యులు వీరు, తమ సంఘం సభ్యత్వం ఇంత, మా సంఘం క్రమం తప్పకుండా ట్రేడ్ యూనియన్ లైసెన్సులు రెవిన్యువల్ చేయిస్తున్నాయి, మా సంఘం ఐటి రిటర్న్స్ ఇవీ, ఈ ఫైలింగ్ లు ఆ విధంగా ఉన్నాయంటూ లెక్కలు చూపిస్తుంటే.. కేవలం జర్నలిస్టుల సంక్షేమం పేరుతో అడ్డదారిలో కలెక్షన్లు చేపట్టే సంఘాలు మాత్రం కార్మికశాఖ  చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. 

తామేదో ఐక్యత కోసం సంఘం పెట్టుకున్నాము తప్పితే ఇవన్నీ మాకు తెలియదంటూ కాళ్లా వేళ్లా పడుతున్నాయట. తప్పుచేయనేల.. మోకరిళ్లాల్సిన పని ఏలా అన్నట్టు ఎవరికో సంఘం ఉందని చెప్పి అదే పేర వచ్చేలా సంఘాలను రిజిస్ట్రేషన్లు చేసి కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తుంటే ఎట్టకేలకు ప్రభుత్వం వాటిని నియంత్రించేందుకు  రంగంలోకి దిగింది. అందున జనవరి లేదా మార్చిలో జర్నలిస్టులకు ఇచ్చే ప్రభుత్వ గుర్తింపు( ప్రెస్ అక్రిడిటేషన్) సమావేశం కోసం ఏ జర్నలిస్టు సంఘం ప్రభుత్వ నిబంధనలను పాటిస్తున్నది.. ఏ సంఘం కేవలం కాగితాల మీదే వ్యవహారం నడిపిస్తున్నదీ తెలుసుకోవడానికి కార్మికశాఖ జర్నలిస్టుల సంఘాలకు నోటీసులు జారీచేసింది. అలా జారీ చేసిన సమయంలో కొన్ని పెద్ద జర్నలిస్టుల సంఘాలకు కూడా ట్రేడ్ యూనియన్లు చాలా కాలంగా రెవిన్యువల్ లేనట్టుగా బయట పడ్డాయి. చాలా సంఘాల్లో ఉన్న సభ్యులే అన్ని సంఘాల్లోనూ ఉన్నట్టు లెక్క తేలింది. 

ఒక సంఘంలో జర్నలిస్టులు ఉన్నారని చెప్పడానికి సంఘం సభ్యత్వాలు కట్టి మమ అనిపించేసే సంఘాల్లో ఉన్నవారు నిజంగా జర్నలిస్టులా.. లేదంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడంతో గల్లీ గల్లీలో ఉన్న జర్నలిస్టుల సంఘాలన్నీ వారి సంఘంలోని సభ్యులందరూ మీడియాలో పనిచేస్తున్నవారేనని కార్మికశాఖకు దృవీకరణ చూపించే ప్రయత్నం చేస్తున్నాయని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. చాలా సంఘాలు నోటీసులు తీసుకొని కార్మిక చట్టాలను ఉల్లంఘించి పనిచేస్తున్నట్టు గుర్తిస్తే అలాంటి సంఘాలను నోటీసుబోర్డులో పెట్టడానికి లేబర్ డిపార్ట్ మెంట్ స్టేట్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట.

-ఇకపై జర్నలిస్టుల సంఘాలు నిబంధనలు అమలు చేయాలి
ఆంధ్రప్రదేశ్ లోని జర్నలిస్టుల  సంఘాలు కార్మిక శాఖ చట్టాలు, నిబంధనలకు లోబడి పనిచేయాల్సి వుంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఏ జర్నలిస్టు అయినా ఒక సంఘంలో సభ్యుడిగా ఉంటే మరో సంఘంలో సభ్యత్వం స్వీకరించకూడదు. ఇకపై సభ్యుడు ఏ సంఘంలో ఉంటున్నారో ఆ సంఘం సభ్యత్వం తీసుకునే సమయంలో సమర్పించే ఆధార్ కార్డు నెంబరు మరో సంఘంలోని సభ్యత్వంతో రూఢీ అయితే సదరు సంఘాన్ని బ్లాక్ లిస్టులో పెడతారు. ఖచ్చితంగా జర్నలిస్టు ట్రేడ్ యూనియన్లు ప్రతీ ఏడాది సంఘం రెవిన్యువల్ తోపాటు, జనరల్ బాడీ సమావేశాలు కూడా నిర్వహించాలి. సభ్యత్వాలు పక్కాగా వసూలు చేసి నమోదు చేయాలి. సంఘం సభ్యత్వాలు, ఖర్చులు, ఆదాయం, వ్యయాలపై బ్యాలెన్స్ షీట్, ఇన్ కం టాక్స్ రిటర్న్స్, ఈఫైలింగ్ చేయించాలి. ఒక జర్నలిస్టు పదుల సంఖ్యలో సంఘాల్లో సభ్యుడిగా ఉన్నట్టు తేలితే సదరు సంఘం, జర్నలిస్టుని మరే ఇతర సంఘంలోనూ సభ్యత్వం తీసుకోకుండా నోటీసులు జారీచేస్తారు. 

అలా కార్మిక చట్టాలు ఉల్లంఘించిన సంఘాల రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తారు. నిర్వాహకులను మోసపూరిత సంఘాలు రిజిస్ట్రేషన్ చేసి నిర్వహణ చేస్తున్నందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. తద్వారా నిజంగా జర్నలిస్టులు వారి సంక్షేమం, ఐక్యత కోసం ఏర్పాటైన సంఘాలకు గుర్తింపు ఇవ్వాలని కార్మికశాఖ యోచిస్తున్నదట. గతంలో జర్నలిస్టుల సంఘాలుకి సంబంధించిన సొసైటీ రెవన్యువల్ చేస్తే లైవ్ లో ఉన్నట్టుగా కార్మికశాఖ రిపోర్టులు ఇచ్చేది. ఇకపై జర్నలిస్టుల సంఘాల సభ్యత్వాలు కూడా ఆధార్ కార్డు సంఖ్య ఆధారంగా తనిఖీలు చేయాలని నిర్ణయించిందని సమాచారం. చూడాలి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎక్కడ పడితే అక్కడ జర్నలిస్టుల సంఘాలను ఏర్పాటు చేసేసి ఊళ్లపై కలెక్షన్ దందాలకు పాల్పడే వారిపై నిజంగా చెక్ పెడుతుందా. ఒక సభ్యుడు ఒకటి కంటే ఎక్కువ సంఘాల్లో సభ్యుడిగా ఉంటే అలాంటివారిపై చర్యలు తీసుకుంటుందా.. అనేది..?!