సూడు సెగరెట్రీ పెన్నట్టుకున్న పెతోడూ ఇలేకరీ అయిపోడు.. ఇలేకరంటే సమాజంపై కుసింత అవగాహనుండాల.. పెజిల సమస్యలు సమాచారంగా మీడియాలో వార్తలు రాయడం వచ్చుండాల.. ముందు అది తెలుసుకో.. ప్రెస్ అనగనే ఓ.. ఎగేసుకొని వచ్చినోడిని వచ్చినట్టు లోనకంపేయడం కాదు..కాదు.. అసలు వొచ్చినోడెవడు..? ఏ పేపరు.. మరేటివి..? కనుక్కొని మరీ లోనకంపాల.. అంటాడు సినిమాల్లో రావుగోపాలరావు.. ఇది ఒకప్పటి మాట.. ఆ రోజుల్లో మీడియా అంటే విలువలుండేవి.. ఇంటర్నెట్ పుణ్యమాని ఇపుడు ట్రెండ్ మారిపోయింది.. మీడియా రాను రాను తగ్గిపోతున్నది.. సోషల్ మీడియానే పాపులర్ అవుతోంది అంటూ జి మెయిల్ అకౌంట్ ఉన్న ప్రతోడు యూట్యూబ్ ఛానల్, బ్లాగ్ స్పాట్ సైట్ పెట్టుకొని.. దానికొక పేరెట్టేసుకొని.. సోషల్ మీడియాగా చెలామణి అయిపోతున్నాడు.. అసలు మీడియాలో పనిచేసేవాడిని ప్రక్కన బెట్టి.. అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా సోషల్ మీడియాలోనే పబ్లిసిటీ వస్తుందంటూ వారినే ప్రోత్సహిస్తున్నారు. ఫలితంగా మీడియా పక్కకి పోవాల్సి వస్తున్నది.. ఇలా ఉంటే కష్టమనుకున్న అసలు మీడియా.. తమని డామినేట్ చేస్తున్న సోషల్ మీడియాపై యుద్ధం ప్రకటించింది.. పనిగట్టుకొని జిల్లా కలెక్టర్, పోలీసులకు ఫిర్యాదులు ఇవ్వడం మొదలెట్టింది.. అది విషయం కూడా ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలోనే వైరల్ అవుతున్నది. జర్నలిస్టులుగా ఫిర్యాదు చేసిన వారెవరూ వారి పత్రికల్లో ఈ విషయాన్ని రాయడం లేదు..?!
ఆంధ్రప్రదేశ్ లో మీడియా కంటే సోషల్ మీడియానే బాగా పాపులారిటీ సంపాదించుకుంటున్నది. దానిని అసరాగా చేసుకొని మీడియా కాని మీడియా..అసలు మీడియాకి డూపుగా సోషల్ మీడియా తయారై.. మీడియాని పక్కకి నెట్టేస్తున్నది. చేసేది లేక మీడియా ప్రభుత్వం వద్దకు వెళ్లి బాబూ మేము మీడియా వాళ్లం.. ఆ సోషల్ మీడియా సంగతేంటో కాస్త చూద్దురూ అంటూ ఎడా పెడా జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీసులకు ఫిర్యాదులివ్వడం మొదలు పెట్టింది. వాస్తవానికి ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా మీడియా స్థానాన్ని పూర్తిగా తొక్కేసింది. దానితో అసలు మీడియా కిందకి పోయి.. పెసలు మీడియా ముద్రవేసుకున్న సోషల్ మీడియా హల్ చల్ చేయడం మొదలు పెట్టింది. కనీసం ఒక రెండు లైన్లు వార్త రాయడం రాని వాడు కూడా నేనూ జర్నలిస్టునే అంటూ అసలు జర్నలిస్టులను డామినేట్ చేసేస్తున్నాడు.
చేతిలో యూట్యూబ్ గొట్టం, సెల్ లో ఫ్రీగా వచ్చిన బ్లాగ్ స్పాట్ ను చూపిస్తూ... ఇదిగో మీ వార్త అంటూ మీడియా కంటే ముందుగా వెళ్లిపోతున్నాడు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో కూడా ఈ సోషల్ మీడియాదే హవా. ఆ పరిస్థితి ఎంత వరకూ వచ్చిందంటే ఒకప్పుడు ప్రెస్ మీట్ కి వెళితే కేవలం మీడియా మాత్రమే వచ్చేది. ఇపుడు మీడియాలోని జర్నలిస్టులు పది శాతం హాజరైతే సోషల్ మీడియా 70శాతం హాజరువుతుంది. అక్కడ జర్నలిస్టులకు కాస్త మర్యాద చేయడానికి ఇచ్చే మంచినీళ్లు, టీ, కాఫీ అల్ఫాహారం కూడా పెట్టడం మానేస్తున్నారు నిర్వాహకులు. లేదంటే సోషల్ మీడియాకి తెలియకుండా గుట్టు చప్పుడుగా కాకుండా ప్రెస్ మీట్లు నిర్వహించుకుంటున్నారు. ఆ విధంగా చేస్తున్నా.. ఆఖరు నిమిషంలో మూకుమ్మడిగా సోషల్ మీడియా సదరు కార్యక్రమాల్లో చటుక్కున మెరుస్తున్నది.
ఈ బాధనలు తట్టుకోలేక సోషల్ మీడియాపై మీడియా యుద్దం ప్రకటించింది. బాబోయ్ ఈ సోషల్ మీడియాని కట్టడి చేయాలంటే ప్రభుత్వానికి స్పందన, మీకోసం కార్యక్రమాల్లో జర్నలిస్టులు గుంపులు గుంపులుగా వెళ్లి అర్జీలు పెడుతున్నారు. గత ఏడాది కాలంగా ఈ ఫిర్యాదులు మరీ ఎక్కువయ్యాయి. మీడియలో అయితే కొద్ది మందికే సమాచారం చేరుతుందని.. అదే సోషల్ మీడియా అయితే చాలా ఎక్కువమందికి విషయం తెలుస్తుందని భావిస్తున్న ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు సోషల్ మీడియాని ప్రోత్సహిస్తుండటంతో అసలు మీడియాకి చెందిన జర్నలిస్టులు తెగ ఫీలైపోతున్నారు. దానితో పరుగులు పెడుతూ అయ్యబాబోయ్ సోషల్ మీడియా వచ్చేస్తుందంటూ లగెత్తుతున్నారు. ఇంతకీ విశేషం ఏంటంటే చాలా జర్నలిస్టుల సంఘాల్లో సభ్యులుగా ఉన్నది సోషల్ మీడియా ప్రతినిధులే. అసలు మీడియా జర్నలిస్టులు ఒక 40శాతం ఉంటే 60శాతం సోషల్ మీడియా వాళ్లే ఉండటం విశేషం.
ఇపుడు ఆ అధిక శాతం సోషల్ మీడియాలోని వారే మీడియాగా చెప్పుకుంటూ పోలీసులకి, జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదులు చేస్తున్నారనే ప్రచారం కూడా గుప్పు మంటున్నది. సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న మీడియాకి.. అందులో పనిచేసేవారికి కనీస విద్యార్హత, జర్నలిస్టుగా పనిచేసే సామర్ధ్యం లేకపోయినా వారు జర్నలిస్టులేనని యాజమాన్యాలు వారికి ఐటెంటీ కార్దులు ఇచ్చేస్తుండటంతో ఇబ్బడి ముబ్బడిగా విలేఖరులు తయారైపోతున్నారు. కొంత కాలం మీడియాలో పనిచేసి.. సంస్థల ఆర్ధిక భారాన్ని మోయలేక రక రకాల పేర్లతో యూట్యబూ ఛానళ్లు, న్యూస్ బ్లాగ్ స్పాట్లు పెట్టి మీడియాగానే చలా మణీ అయిపోతున్నారు. వారిని నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం కూడా వేడుక చూస్తున్నది తప్పితే వారిపై కనీస చర్యలు తీసుకోవడం లేదు.
చాలా వరకూ మీడియాలో నేను విలేఖరి అని చెప్పుకుంటూ తిరిగేవాళ్లలో కేవలం 60శాతం మందికి మాత్రమే కనీసం వార్తలు రాయడంపై అవగాహన వుంటుంది. మిగిలిన 40శాతం మంది కూడా వారు వారి పేపర్లు, టివీలకు, న్యూస్ ఏజెన్సీలకు పంపే వార్తలన్నీ కూడా కాపీ పేస్టు వార్తలే. అన్నీ సోషల్ మీడియాలో వచ్చే వార్తలనే కాపీ చేసి వాటికి డేట్ లైన్ తగిలించి మరీ పంపించేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో పనిచేసేవారైతే మరీ దారుణం. వారిలో కనీసం 30శాతం మందికి వార్తలు రాయడం వస్తే మిగిలిన 60శాతం మంది.. అదే సోషల్ మీడియాలో వచ్చే వార్తలను మేమే రాసామంటూ అధికారులు, ప్రజాప్రతినిధులకు వాట్సప్పుల్లో పంపేసి మరీ విలేఖరులుగా చలా మణీ అయిపోతున్నారు. గ్రామాల నుంచి రాష్ట్ర రాజధాని కేంద్రాలు ఇలా ఎక్కడ చూసినా మీడియా కంటే సోషల్ మీడియాదే హవా. ప్రెస్ మీట్లు, అధికారిక కార్యక్రమాల్లో కూడా అసలు మీడియా వేయని ప్రశ్నలు కేవలం సోషల్ మీడియావాళ్లే వేస్తూ.. అక్కడ వారు చేసే హడావిడి అంతా ఇంతా కాదు.
మీడియా కంటే సోషల్ మీడియాలో పబ్లిసిటీ కాస్త ముందుగా వస్తుండటంతో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా సోషల్ మీడియానే ప్రోత్సహిస్తున్నారు. అంతెందుకు అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ప్రభులతోపాటు రాజకీయపార్టీలు కూడా ఒక ప్రత్యేక సోషల్ మీడియా విభాగాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీనితో అసలు మీడియాకి మెంటలొచ్చేసి.. సోషల్ మీడియాను చూసి పరుగో పరుగు అంటూ లగెత్తుతున్నారు. ఇపుడు ఆ పరుగులు ఆపేసి ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. సోషల్ మీడియాని నియంత్రించాలని. చూడాలి.. ఇప్పటికైనా ప్రభుత్వం అనధికార, నకిలీ, సోషల్ మీడియాని నియంత్రిస్తుందా..? లేదంటే మీడియాకంటే వీళ్లే బాగా పనిచేస్తూ పబ్లిసిటీ కల్పిస్తున్నారని ప్రోత్సహిస్తుందా.. అనేది..?!