గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులకు మహర్ధశ..?!


Ens Balu
910
visakhapatnam
2024-11-13 15:17:17

ఏ ప్రభుత్వ శాఖకు నోచుకోకుండా  గాల్లోనే ఉన్న గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసుల సమస్యలపై కూటమి ప్రభుత్వం స్పందిం చింది. వీరి సమస్యలు, ఇబ్బందులు, జీఓలు, కోర్టుకేసులు, అదనపు విధుల నిర్వహణపై ఈరోజు-ఈఎన్ఎస్ ప్రచురించిన ప్రత్యేక కథనా లపై  హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత రాష్ట్ర అసెంబ్లీలోనే ప్రస్తావించారు..2019 లో ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యో గుల సమస్యలు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఒక్కటి కూడా పరిష్కారానికి నోచుకోలేదు.. నాటి నుంచి నేటి వరకూ వీరి సమస్యలను  ఈరోజు-ఈఎన్ఎస్ ప్రత్యేక కథనాల రూపంలో అందిస్తూనే ఉంది. ముఖ్యంగా ఈ శాఖకు చట్టబద్ధత తేకుండా.. కనీసం మాతృశాఖలోని సర్వీసు నిబంధనలకు వీరికి అమలు చేయకుండా ప్రత్యేకంగా వారికోసం రూపొందించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. దానిని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడంతో ఉద్యోగులు వారి సర్వీసును, ప్రభుత్వ ప్రయోజనాలను పూర్తిగా కోల్పోవాల్సి వచ్చింది. సామాజిక బాధ్యతతో సచివాలయ ఉద్యోగుల సమస్యలను బుజాన వేసుకున్న ఈరోజు-ఈఎన్ఎస్.. వీరి సమస్యలను ప్రభుత్వం దృష్టికి వార్తల రూపంలో తీసు కెళ్లడంతో కూటమి ప్రభుత్వం స్పందించి.. అసెంబ్లీ సాక్షిగా వీరి సమస్యలను పరిష్కరించేందుకు చర్చకు తెరలేపింది. దీనితో ఏశాఖ లే కుండా గాల్లో ఉన్న మహిళా పోలీసులకి ప్రాణం లేచొచ్చినట్టు అయ్యింది..!


గ్రామ, వార్డు సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శలు విధులు, జాబ్ చార్టులపై త్వరలోనే సంబంధిత శాఖలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత రాష్ట్ర అసెంబ్లీలో వెల్లడించారు. దీని కోసం ఎమ్మేల్యే తమ సలహాలు, సూచనలు అందించాలని కోరారు.  గ్రామ సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శుల విధుల గురించి క్లారిటీ ఇవ్వాలని ఎమ్మెల్యేలు కూన రవికుమార్, గౌరు చరితారెడ్డి, మాధవిరెడ్డి కోరారు. వారి ప్రశ్నలకు అసెంబ్లీలో హోంమంత్రి అనిత సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వం మహిళా సంరక్షణ కార్యదర్శుల విషయంలో యాక్టులు కూడా చదవకుండా జీవోలు ఎడా పెడా ఇచ్చేసిందన్నారు. 2019లో రిక్రూట్ మెంట్ సమయంలో మహిళా పోలీసులుగా ఎలాంటి ట్రైనింగ్, డిపార్ట్ మెంటల్ పరీక్షలు లేకుండా చేశారన్నారు. సుమారు 15 వేల మందిని రిక్రూట్ చేసుకుంటే.. అందులో 13,815 మంది పనిచేస్తున్నారని.. మరో 1,189 ఖాళీలు ఉన్నాయని సభకు తెలిపారు. 2021లో మరో జీవో తెచ్చి.. వారిని మహిళా సంరక్షణ కార్యదర్శులుగా మార్చారన్నారు.

 వీరికి సుమారు 6 ప్రభుత్వ శాఖలతో కలిపి.. జాబ్ చార్ట్ ఇచ్చారని తెలిపారు. చీఫ్ సెక్రటరీకి ఎన్ని బాధ్యతలు ఉంటాయో.. అన్ని బాధ్యతలు వీరికి ఇచ్చారని ఘాటుగా విమర్శించారు. ఇది జగన్ ప్రభుత్వం యొక్క అవివేకానికి నిదర్శనమన్నారు దుయ్యబట్టారు. పోలీస్ శాఖలో ఉద్యోగాలు అంటే దేహధారుడ్య పరీక్షలు, రాత పరీక్షలతో పాటు ట్రైనింగ్ కూడా ఉంటుందని.. కానీ వీరికి కేవలం 2 వారాల ట్రైనింగ్ తో పోలీసులుగా మార్చే ప్రయత్నం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిందన్నారు. ఇదంతా కేవలం పోలీస్ శాఖలో 15 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం అని చెప్పుకొనేందుకు చేసిన వృథా ప్రయత్నమన్నారు. దీంతో పాటు మహిళా సంరక్షణ కార్యదర్శులకు ఇష్టం లేకుండానే పోలీస్ యూనిఫామ్ వేయించాలానే ప్రయత్నం చేశారన్నారు. యూనిఫామ్స్, జాబ్ ఛార్టులపై కోర్టుల్లో 7 రిట్ పిటిషన్లు కూడా దాఖలయ్యాయన్నారు. గత ప్రభుత్వానికి జాబ్ చార్టులపైనా, సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛార్ట్ లపై కనీస అవగాహన లేదని విమర్శించారు. 

అందుకే మహిళా సంరక్షణ కార్యదర్శులు రిపోర్ట్ చేయాల్సింది గ్రామ సెక్రటరీకి, అడ్మిన్ రైట్స్ పోలీస్ శాఖలు, జీతాలు, సెలవులు ఇచ్చేది ఎంపీడీవోలు వెళ్లిందన్నారు. ఇన్ని శాఖల సంబంధం వల్ల మహిళా సంరక్షణ కార్యదర్శులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో 75 ప్రభుత్వశాఖల్లో ఉద్యోగులు వారి పనులు వారు చేసుకుంటే వీరు మాత్రం అన్ని శాఖల పనులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి వీరిని గత ప్రభుత్వం ఎస్కార్ట్ డ్యూటీలు, బందోబస్తు డ్యూటీలతో పాటు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో కూడా ఉపయోగించు కుంద న్నారు. గత ప్రభుత్వ అవివేకం వల్ల ఎన్నో ఇబ్బందులు పడిన మహిళా సంరక్షణ కార్యదర్శుల విషయంలో పెద్ద చర్చ జరగాలన్నారు. వారి ని ఏ శాఖకు కేటాయించాలి అన్న అంశంపై ఎమ్మెల్యేలు  తమ సలహాలు, సూచనలు లిఖిత పూర్వకంగా అందజేయాలని కోరారు. సంబం ధిత శాఖలతో చర్చ జరిపి అతి త్వరలోనే మహిళా సంరక్షణ కార్యదర్శుల విధులపై శాశ్వత నిర్ణయం తీసుకుంటామన్నారు.

-  హోం మంత్రి ప్రకటనతో మహిళా పోలీసుల హర్షం
రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అని మహిళా పోలీసుల సమస్యలను, వారి జాబ్ చార్ట్, సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్, ఇతర శాఖల పనులు చేయిస్తున్న విధానంపై నేరుగా అసెంబ్లీలో ప్రస్తావించడంపై మహిళా పోలీసులు హర్షం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లకు కూటమి ప్రభుత్వంలో మా సమస్యలు నేరుగా ప్రభుత్వం దృష్టికి హోం మంత్రి తీసుకెళ్లగలిగారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రభుత్వశాఖ లోనైనా ఆ శాఖ పనులు మాత్రమే వాళ్లు చేస్తారని.. కానీ తాము అన్ని ప్రభుత్వశాఖల పనులూ చేయాల్సి వస్తుందని.. తమ సమస్య గత ప్రభుత్వంలో ఎంత మంది ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని.. కానీ హోం మంత్రి అనిత అసెంబ్లీలో ప్రస్తావించడంతోపాటు తమకు న్యాయం చేసే దిశగా తొలి అడుగు వేశారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ విషయంలో మొదటి నుంచి ఈరోజు-ఈఎన్ఎస్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అండగా ఉంటూ తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి ప్రత్యేక కథనాల రూపంతో తీసుకెళ్లడంపై కూడా మహిళా పోలీసులు మీడియా కార్యాలయానికి ఫోన్లు చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. హోం మినిస్టర్ లాంటి డైనమిక్ మంత్రులు ఉంటే ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.