అడకత్తెరలో మహిళా పోలీసుల భవితవ్యం..?!


Ens Balu
147
visakhapatnam
2024-11-20 07:32:17

గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసుల భవితవ్యం మళ్లీ అడకత్తెరలో పడే సూచనలు కనిపిస్తున్నాయి.. వీరి నియామకాలు ఏపీ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా జరగని కారణంగా వీరు పోలీసుశాఖకు చెందరంటూ కోర్టులో కేసులు పడ్డాయి. దానితో గత వైఎ స్సార్సీపీ ప్రభుత్వం వీరంతా పోలీసుశాఖకు సంబంధం లేదని కోర్టుకి అఫడవిట్ దాఖలు చేసి వీరికి ఏ ప్రభుత్వశాఖ కేటాయించకుండా గాల్లోనే పెట్టి మళ్లీ పోలీసుశాఖ సేవలే చేయించింది.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనైనా ఫలితం వుంటుందా అంటే.. ఏదో ఒకటి చేసి వీరికి న్యాయం చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చేసిన హోం మంత్రి ప్రకటనపై ప్రభుత్వానికి కూడా దారీ తెన్నూ కనిపించడం లేదు.. వీరిని పీఎస్పీఆర్బీ పరీక్ష రాయించి పోలీసుశాఖ శిక్షణ ఇచ్చి పోలీసులుగా తీసుకోవాలా..? లేదంటే గ్రామ, వార్డు సచివాలయ విభాగా ల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లోకి స్లైడింగ్ ఇచ్చి సర్దుబాటు చేయాలా.. అదీ కాదంటే పోలీసుశాఖలోనే మినిస్టీరియల్ స్టాఫ్ గా కొనసాగిం చాలా అనే విషయంలో ప్రభుత్వం నిర్ఱయం తీసుకోలేకపోతున్నది.. మరోవైపు తమకు పోలీసుశాఖ వద్దని, యూనిఫారం అసలే వద్దని.. మహిళా పోలీసు ల్లోనే కొందరు అటు, ఇటు గెంతులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ వీరి పరిస్థితి గాల్లో దీపంలా తయారైంది..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ మహిళా పోలీసుల విషయంలో ఏం నిర్ణయం తీసుకోవాలో తెలీక బుర్రలు పీక్కుంటున్నది. ప్రస్తుతం వీరంతా గ్రామ, వార్డు సచివాలయాల్లో పోలీసుశాఖ ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నారు. కానీ వీరికంటూ ఏ ప్రభుత్వ శాఖ కేటాయించలేదని గత ప్రభుత్వం హైకోర్టుకి అఫడవిట్ దాఖలు చేసింది. అలాగని వీరిని పోలీసులుగా అనడానికి ఇదే పోలీసుశాఖలో హోంగార్డు నుంచి ఎస్సై వరకూ వీరిని పోలీసులని అనడానికి ఇష్ట పడటం లేదు. కానీ.. పోలీసుశాఖకు చెందిన అన్ని పనులూ వీరితోనేచేయిస్తున్నారు. అవి కాకుండా రెవిన్యూ విభాగానికి చెందిన బిఎల్వో(బూత్ లెవల్ ఆఫీసర్), సంక్షేమ శాఖకు చెందిన పథకాలు పంపిణీ, పంచాయతీలకు, మున్సిపాలిటీలకు చెందిన బిల్ కలెక్టర్ సేవలు, విద్యాశాఖకు చెందిన ఎన్యుమరేషణ్, జియో ట్యాగింగ్, ఏశాఖలోనైనా సిబ్బంది తక్కువగా ఉంటే వారి పనులు, ఇతర కార్యాలయ పనులూ అన్నీ వీరే చేస్తున్నారు.

 ప్రస్తుతానికి వీరి ఉద్యోగాలకు ఎటువంటి డోకా లేకపోయినా భవిష్యత్తులో మాత్రం చిక్కుల్లో పడటం ఖాయంగా కనిపిస్తుంది. కారణం వీరికి ఏ ప్రభుత్వశాఖ కేటాయించకపోవడమే. అలాగని ప్రభుత్వం కోర్టుకి సమర్పించిన అఫడవిట్ కారణంగా వీరు పోలీసుశాఖకు చెందరు కనుక.. పోలీసుశాఖకు చెందిన సర్వీసు నిబంధనలు, పదోన్నతులు కూడా వీరికి వర్తించవు. ఒక్క ముక్కలో చెప్పాలంటే వీరు కాంట్రాక్టు బేస్ ఉద్యోగాలకి ఎక్కువ.. రెగ్యులర్ డిపార్ట్ మెంట్ ఉద్యోగాలకు తక్కువ అన్నట్టుగా తయారైంది వీరి పరిస్థితి.

ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయశాఖలోని 19 విభాగాల్లో చాలా శాఖల్లో సిబ్బంది కొరత అధికంగా వుంది. ముఖ్యంగా వార్డుల్లో అడ్మినిస్ట్రేటివ్ కార్యార్శిలు, గ్రామ సచివాయాల్లో పంచాయతీ కార్యదర్శిలు ఎక్కువగా వుంది. ఇక్కడ సిబ్బంది లేక ఉన్నవారిలోనే ఎవరో ఒకరికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. ప్రస్తుతం మహిళా పోలీసు ఉద్యోగాలకు, నాన్ ఇంజనీరింగ్ విభాగాల్లోని ఉద్యోగాలకు డిగ్రీ, డిప్లమో విద్యార్హతలుగా ఉన్నాయి. పేస్కేలు కూడా ఒకే విధంగా వుంటుంది. ఒక్క కార్యదర్శిలకు వీరికి రూ.850 మాత్రమే వ్యత్యాహం ఉంది. ఈ నేపథ్యంలో మహిళా పోలీసులకు డిపార్ట్ మెంట్ స్లైడింగ్ ఇస్తే.. ప్రస్తుతం అత్యవసరంగా ఉన్న .. ఎక్కువగా ఖాళీలున్న పంచాయతీలకు, వార్డు సెక్రటరీలకు స్టైడింగ్ ఇస్తే పరిపాలన కూడా సజావుగా సాగడానికి ఆస్కారం వుంటుంది. 

మరికొన్ని చోట్ల వెల్పేర్ అసిస్టెంట్లు, కొన్ని చోట్ల అగ్రికల్చర్, హర్టీకల్చర్, వీఆర్వో, డిజిటల్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. చాలా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ పోస్టులు లేక ప్రజలకు సేవలు కూడా అంతంత మాత్రంగానే అందుతున్నాయి. ఈ క్రమంలో మహిళా పోలీసులకు న్యాయం చేయాలన్నా, వారికి ప్రభుత్వశాఖ కేటాయించాలన్నా వారినికి డిపార్ట్ మెంటల్ స్లైడింగ్ ఇవ్వడమే సబబని..ఆ కోణంలోనే సలహాలు కూడా వెళుతున్నట్టు సమాచారం అందుతుంది.  

మరోప్రక్క రాష్ట్రవ్యాప్తంగా సుమారు 13500కి పైగా ఉన్న మహిళా పోలీసుల వలన పోలీసుశాఖకు స్టేషన్లు వారీగా  కీలకమైన సమాచారం అందుతుంది. అత్యవసర పనులకు వీరినే వినియోగిస్తున్నారు. పైగా పోలీసుశాఖలో భారీ ఎత్తున ఖాళీలు ఉన్నాయి. వాటి భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. అలాగని మహిళా పోలీసులను పీఎస్పీఆర్బీ ద్వారా మళ్లీ పరీక్ష రాయించి వారికి శిక్షణ ఇచ్చి పోలీసులుగా తీసుకునే పరిస్థితి కూడా లేదు. అంతేకాకుండా ప్రస్తుతం మహిళా పోలీసులుగా ఉన్నవారిలో కొందరు  ఈ శాఖ నుంచి తమను వేరే శాఖకు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు కాఖీ చొక్కా వేసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఇంకా ఎక్కువగా ఖాళీలు ఉన్న ఐసీడిఎస్ లో నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.

 కొందరు మాత్రం పీఎస్పీఆర్బీ ద్వారా తమను పోలీసులుగా మార్చాలని కోరుతున్నారు. ఇవన్నీ చేయడానికి ప్రభుత్వంలోని సర్వీసు నిబంధనలు సహకరిస్తాయా..? లేదంటే వీరికోసం ఉన్న సర్వీసు నిబంధనలను సవరిస్తారా..? ప్రత్యేక ఆర్డినెన్సులు చేస్తారా..? అనేదానిపై కూడా క్లారిటీ లేదు.  మహిళా పోలీసులను గాల్లోనే ఉంచి గత ప్రభుత్వం అదిగో ఇదిగో అంటూ ఐదేళ్లు కాలం గడిపేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హోం మంత్రి వంగలపూడి అనిత విషయాన్ని సీరియస్ గా తీసుకున్నా పరిష్కార మార్గం చూపించడానికి పోలీసుశాఖలో దారులు కనిపించకపోవడంతో మేథోమధనం ప్రారంభించారు. 

గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం కారణంగా గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులు ఇపుడు వారి సర్వీసు మొత్తం కోల్పోవాల్సి వస్తున్నది. వారితోపాటు విధుల్లోకి చేసిన ఇతర ప్రభుత్వశాఖల సిబ్బందికి పదోన్నతులు లభిస్తుంటే.. వీరికి ప్రస్తుతం ప్రభుత్వశాఖ కూడా ఏర్పాటు కాలేదు.  ఏశాఖలోకి పంపుతారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఇదే శాఖలో ఉంచడానికి కోర్టుకేసులన్నీ పెండింగ్ లో ఉన్నాయి. అలాగని గత ప్రభుత్వం ఇచ్చిన జీఓలు సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఆధారంగా పదోన్నతులు కల్పించానికి వీరు పోలీసుశాఖకి చెందిన వారు కాదు. పైగా పోలీసుశాఖలోని సిబ్బందే వీరిని తమశాఖ ఉద్యోగులుగా అంగీకరించడం లేదు. కోర్టుకేసులపై ప్రభుత్వం లిఖిత పూర్వకంగా అఫడవిట్ ఇవ్వడంతో వీరు పోలీసుశాఖకు చెందిన వారు కాదు. ఈ నేపథ్యంలో వీరి భవిష్యత్తు ఏంటనే దానిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. 

ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి.. వీరిని ఖాళీగా ఉన్న శాఖల్లోకి స్లైడింగ్ అయినా ఇవ్వాలి..? లేదంటే కోర్టు కేసులు క్లియర్ చేసి..వీరికి మళ్లీ నూతనంగా సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ అయినా ఏర్పాటు చేయాలి..? అదీ కూడదంటే పోలీస్ రిక్రూట్ మెంట్ ద్వారా ప్రత్యే కంగా పరీక్ష పెట్టి మళ్లీ వీరిని పోలీసులుగా అయినా తీసుకోవాలి..? వీటిలో ఏ నిర్ణయం తీసుకోకపోతే మాత్రం గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులు జీవితాంతం ఏ ప్రభుత్వశాఖకు చెందని ఉద్యోగులుగా ఉంటూ.. పనిచేస్తూ.. ఎలాంటి పదోన్నతులు, ప్రభుత్వ ప్రయోజ నాలకు నోచుకుండా ఉండిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఇతర ప్రభుత్వశాఖల మంత్రుల ద్వారా సూచనలు, సలహాలు స్వీకరి స్తున్న హోం మంత్రి అనిత మహిళా పోలీసుల విషయంలో ఏం పరిష్కార నిర్ణయం తీసుకుంటారనే దానిపై  మాత్రం కనుచూపు మేరలో కనిపించడం లేదు..?!