ఒకరు చేసిన తప్పుకి మరొకరు బలైపోవడం అంటే ఏంటో గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులను చూస్తే కొట్టొచ్చినట్టు ఖచ్చితంగా కనిపి స్తుంది..అవును పేరుకి ప్రభుత్వంలోని 75వ ప్రభుత్వశాఖగా ఏర్పాటైనా.. ఈశాఖకు ఐదేళ్లు దాటిపోతున్నా కనీసం చట్టబద్దత లేదు.. కనీసం ఇందులో పనిచేసే ఉద్యోగులకు సక్రమమైన సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ కూడా లేదు.. ప్రభుత్వ ప్రయోజనాలు కల్పించడంలో గత ప్రభుత్వమే జాగు చేస్తుందనుకుంటే.. కూటమి ప్రభుత్వంలో మరింత ఆలస్యం అవుతున్నది.. కాదు. కాదు గత ప్రభుత్వం చేసిన తప్పు లను ఏ విధంగా సరిదిద్దాలో తెలియక కూటమి ప్రభుత్వం కూడా జుట్టుపీక్కుంటుంది..
జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు.. గత ప్రభు త్వం తేడా విధానాలు.. ముందుకి సాగని ఈ ప్రభుత్వ దిద్దుటబాటు చర్యలు ఫలితంగా గ్రామ, వార్డు సచివాలయశాఖలోని ఒక విభాగంగా వున్న గ్రా మీణ మత్స్య సహాయకులు కనీసం పదోన్నతులు లేకుండా పడిగాపులు కాస్తున్నారు.. మెరిట్ లిస్ట్ ఆధారంగా పదోన్నతులు కల్పిం చాలని చూసినా.. మత్స్యశాఖ కమిషనరేట్, జిల్లా కార్యాలయాల్లో చేసిన తప్పుల కారణంగా మెరిట్ నష్టపోయిన ఉద్యోగులకు ఉపస మనం కూడా దక్కలేదు..వెరసీ గ్రామీణ మత్స్య సహాయకుల పదోన్నతులతోపాటు.. జిల్లా అధికారులైన డిప్యూటీ డైరెక్టర్ల పదోన్నతులు కూడా పాత రోస్టర్ విధానం కాకుండా కొత్తగా కోర్టు తీర్పుల ఆధారం చేపట్టాలని ఓ వర్గం గట్టిగా ప్రయత్నిస్తుండటంతో పదోన్నతులు మబ్బుల్లోనే ఉండి పోయా యి..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సీరియస్ గా తలచుకున్నా ఈశాఖలోని గ్రామీణ మత్స్యసహా యకులు, ఇదేశాఖలోని డిప్యూటీ డైరెక్టర్ల పదోన్నతుల వ్యవహారం కనీసం ఒక్క అడుగు కూడా ముందుకి సాగడం లేదు. ఆఖరికి ఈశాఖ కమిషనర్ మంత్రి, ఇతర అధికారుల నిర్ణయాలు, ఉద్యోగుల అభ్యర్ధనలతో సచివాలయ శాఖ నుంచి మత్స్యశాఖలో విలీనం చేయాలని ప్రభుత్వానికి రాసిన సిఫారసు లేఖ కూడా పక్కన పడిఉంది. ప్రభుత్వంలో ఏవో సాంకేతిక కారణాలు చూపి అమరావతిలోని రాష్ట్ర అధికారులు ఈ పదోన్నతుల దస్త్రాలను, విఎఫ్ఏల విలీన అంశాలను ముందుకి కదపడం లేదు. గ్రామ, వార్డు సచివాలయశాఖలో విఎఫ్ఏ లుగా ఉన్న వారిని అసిస్టెంట్ ఇనెస్పెక్టర్ పదోతున్నలు ఇవ్వాల్సి వుంది. దానికోసం విఎఫ్ఏల మెరిట్ లిస్టు జాబితా సిద్దం చేయాలను కున్నారు. కానీ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో వీరి నియమాకాలు జరిగిన సమయంలో విఎఫ్ఏలకు ప్రభుత్వం కొన్ని గ్రేస్ మార్కులు కలిపింది.
తద్వారా విఎఫ్ఏల్లో కొంత మందికి మెరిట్ జాబితాలో వారి పేర్లు జిల్లా పరిధిలో టాప్ టెన్ లోకి వెళ్లే అవకాశం వుంది. కానీ అలా ప్రభుత్వం ఇచ్చిన గ్రేస్ మార్కులు కొన్ని జిల్లాల్లో విఏఎఫ్ లకు కలపకపోవడంతో వారు జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, కమిషనరేట్లను ఆశ్రయించారు. వాస్తవానికి గ్రామ, వార్డు సచివాలయశాఖ డైరెక్టర్ డా.లక్ష్మీషా ఉన్న సమయంలోనే ఇక్కడ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడం మొదలు పెట్టారు. అంతేకాకుండా మిగిలిన అన్నిశాఖల సిబ్బందికి పదోన్నతులు కల్పించే పనులు జరుగుతున్న సమయంలో అనూహ్యంగా ఆయ నకు మరోశాఖకు బదిలీ జరిగిపోయింది. తరువాత ఈ శాఖలోకి వచ్చిన ఏ డైరెక్టర్ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ గానీ సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల, సర్వీసు రూల్స్ విషయంలో కనీసం ఒక్క అడుగు కూడా ముందుకి వేసిన దాఖలాలు నేటికీ కనిపించలేదు.
జిల్లా మత్స్య శాఖ కార్యాలయాల్లో నియమాకాల్లో సమయంలో ప్రభుత్వం ఇచ్చిన గ్రేస్ మార్కులతో కలిపి మెరిట్ లిస్టు జాబితాలను తయారు చేయాల్సిన అధికారులు గత ప్రభుత్వంలో నిర్లక్ష్యంగా వదిలేశారు. తీరా విఎఫ్ఏలకు పదోన్నతులు కల్పించాలని చూసిన సమయంలో ఈ సాంకేతిక అంశం తెరపైకి వచ్చింది. అలా మెరిట్ లిస్టులో తమపేర్లు లేవని..ప్రభుత్వం కలిపిన గ్రేస్ మార్కులు తమకు కలవలేదని మెరిట్ నష్టపోయిన విఎఫ్ఏలు జిల్లా కలెక్టర్, జిల్లా మత్స్యశాఖ అధికారులతోపాటు, అమరావతిలోని కమిషనరేట్ లో కూడా ఫిర్యాదులు చేశారు. ఉద్యోగు లు నష్టపోయిన అంశంలో స్పందన లేదు. కానీ గ్రేస్ మార్కులు కలపని విషయమై జిల్లాశాఖ అధికారులు తమ సమస్య పరిష్క రించలేదని కమిషనరేట్ కి, ఇదేశాఖలోని ప్రిన్సిపల్ సెక్రటరీలను కలిసిన విఎఫ్ఏలకు మాత్రం మెమోలు ఇచ్చారు ఇదేశాఖ అధికారులు.
అంటే ఇక్కడ చేయాల్సిన పనులు చేయకపోగా.. తమనకు అన్యాయం జరిగిందని రాష్ట్ర అధికారులకు మొరపెట్టుకుంటే చర్యలు తీసుకోవ డానికి అత్యంత వేగంగా ముందుకి కదిలిన జిల్లా అధికారులు, మెరిట్ లిస్టులో నష్టపోయిన విషయంలో విఎఫ్ఏలకు న్యాయం చేయడానికి మాత్రం ముందుకి రాలేదు. అలాగని జిల్లా అధికారులు పంపిన మెరిట్ లిస్టులపై కమిషనరేట్, ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయ అధికారులు కూడా చర్యలు తీసుకోలేదు. ఫలితంగా వీరి పదోన్నతుల వ్యవహారం ఇంకా మబ్బుల్లోనే తేలుతూ ఉంది.
మత్స్యశాఖలో పనిచేస్తున్న నాల్గవ తరగతి ఉద్యోగులకే కాదు.. జిల్లా అధికారుల పదోన్నతులపై కూడా రాష్ట్రప్రభుత్వం గానీ, ఇదేశాఖలోని కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీలు గానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. విఎఫ్ఏలకు మెరిట్ లిస్టుల్లో తేడాలున్నాయని వారి ప్రమోషన్ ఫైల్ పక్కన పెట్టేసినట్టే.. జిల్లా మత్స్యశాఖ అధికారులు(డిప్యూటీ డైరెక్టర్)ల పదోన్నతులు కూడా ఎప్పటి నుంచో వస్తున్న రోస్టర్ విధానం కాకుండా కోర్టు తీర్పుల విషయాన్ని తెరమీదకు తీసుకొచ్చి పదోన్నతులను ముందుకి సాగనీయకుండా చేస్తున్నారు మత్స్యశాఖ కమిషనరేట్ అధికా రులు. ప్రభుత్వంలోని ఎప్పటినుంచో వస్తున్న రోస్టర్ విధానంలోనే పదోన్నతుల ఫైల్ పెట్టాలని మత్స్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అన్ని సామా జిక వర్గాల ఉద్యోగులకు న్యాయం చేయాలని చూస్తున్నా.. ఇదేశాఖలోని కొందరు రాష్ట్రస్థాయి అధికారులు మాత్రం కొన్ని సమాజిక వర్గాల అధికారులకు పదోన్నతులు రాకుండా చేయడానికి, రోస్టర్ విధానం కాకుండా కోర్టు అంశాలను తెరపైకి తీసుకొచ్చి పదోన్నతుల సవ్యంగా జరగకుండా అడ్డుపడుతున్నారు.
ఫలితంగా ఇప్పటికే నలుగురు డిడిలు వారి సర్వీసులో జెడీ ప్రమోషన్ రాకుండానే రిటైర్ అయిపోయారు. అయినా మత్స్యశాఖ అధికారులు మాత్రం డిడి ప్రమోషన్ ఫైల్స్ ని ముందుకి సాగనీయడం లేదు. ఈ విషయంలో సాక్షత్తూ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కలుగజేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఇలా ఒక్క గ్రామీణ మత్స్యసహాయకుల పదోన్నతులే కాకుండా జిల్లా అధికారుల పదోన్న తులు కూడా ప్రస్తుతం గాల్లోనే ఉన్నాయి. మరో వైపు జిఏడీ నుంచి కూడా నిర్ధిష్టమైన ఆదేశాలు రాకపోవడ కూడా ఆయా ప్రభుత్వశా ఖల్లో కమిషనరేట్లలలో సర్వీస్ రూల్స్, ప్రమోషన్ ఛానల్, మెరిట్ లిస్టు జాబితా వ్యవహారాల పనులు జరగడం లేదు. గత ప్రభుత్వంలోనే విఎఫ్ఏల నుంచి డిడి ల వరకూ ప్రమోషన్లు రావాల్సి ఉన్నా.. ఒక వర్గం అధికారులు కావాలని చేస్తున్న తాత్సారం, అడ్డు పుల్లల చర్యల వలన అన్ని విభాగాల్లోని సిబ్బంది, అధికారులకు పదోన్నతులు లేకుండా పోతున్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయం మేరకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మాతృశాఖల్లో విలీనం చేయాలనే నిర్ణయాలన్ని 19శాఖల్లో 18శాఖల కమిషనర్లు ముందుకి కదపకపోయినా.. ఒక్క మత్స్యశాఖ కమిషనర్ కదిపినా ప్రభుత్వం లో చర్యలు మాత్రం శూన్యం. ఇదే విధానం కొనసాగితే సచివాలయ గ్రామీణ మత్స్య సహాయకులు పదోన్నతులు లేకుండా సర్వీసు మొత్తం విఎఫ్ఏలుగానే ఉండిపోవాల్సి వుంటుంది..?!