సచివాలయ ఉద్యోగులకు రంగు పడుద్ది..!


Ens Balu
376
Visakhapatnam
2024-12-02 16:17:49

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇవ్వనుంది..అదేనండీ లేట్ గా వస్తే ఒకరోజు జీతం కట్, కానీ వారు రోజంతా పనిచేయాలి.. ఆ విషయం నెలాఖరున జీతం వచ్చినపుడుగానీ వారికి తెలియదు.. అసలే ఒక ఉద్యోగం.. ప్రభుత్వంలోని అన్నిశాఖల విధులూ చేస్తున్న సచివాలయ ఉద్యోగులకు ఇదొక అదనపు బోనస్ గానే చెప్పాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే అనుకుంటే.. అంతకు మించి అదనపు పనులు కూటమి ప్రభుత్వంలో  చేయాల్సి వస్తుందని ఏకంగా అడ్మిస్ట్రేషన్ 2.0 ఎలా ఉంటుందో తమకు ప్రభు త్వం చూపిస్తుందని ఉద్యోగులు సామాజిక మాద్యమాల్లో పెద్ద చర్చకు తెరలేపారు.. అంతేకాదు కోరి మద్దతు ఇచ్చినందుకు ఆమాత్రం కూడా జీతాల్లో కోతలు, సెలవు రోజుల్లోనే విధులు, టార్గెట్లు పూర్తిచేయకపోతే మెమోలు ఇవ్వకపోతే ఎలా అంటూ సెటైర్లు కూడా వేసుకుంటు న్నారు. సీఎం చంద్రబాబు విజన్ పరిపాలన ఎక్కడా కనపడనీయకుండా  రాష్ట్ర అధికారులు అదనంగా పనిచేయించడానికే టార్గెట్ చేస్తున్నారంటూ మండి పడుతున్నారు..!

రాష్ట్రంలో రెండవ అతి పెద్ద ప్రభుత్వ శాఖగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర అధికారులు చుక్కలు చూపించడానికి సిద్దమవుతున్నారు. అదనంగా చేసిన పనిగంటలను లెక్కించ కుండా.. విధి నిర్వహణకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా.. ఇన్ అండ్ అవుట్, మిడిల్ బయోమెట్రిక్ సక్రమంగా వేయకపోతే మాత్రం ఆరోజుని సిఎల్ గా భావించడానికి సిద్దపడుతున్నారు. అసలే గత నెల జీతాల్లో జియో ట్యాగింగ్ సర్వేలు అనుకున్నంత స్థాయిలో అవలేదని సిబ్బందికి ఒకటి, రెండు రోజుల జీతం కట్ చేసి బిల్లులు పెట్టిన ప్రభుత్వం.. మరో భారీ కోతలకు సిద్దపడుతున్నదని ఉద్యోగులు సామాజిక మాద్యమాల్లో చర్చించుకుంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చి అన్ని శాఖల పనులూ చేయిస్తే.. కూటమి ప్రభుత్వం దానికి రెట్టించిన ఉత్సాహంలో చేసిన పనులకు నజరానాగా జీతాల్లో కోతలు పెట్టడానికి సిద్దమవుతున్నదని బావురు మంటున్నారు. 

గత ప్రభుత్వం  సచివాలయ ఉద్యోగుల విషయంలో చేసిన మోసాన్ని, కల్పించని ప్రయోజనాలను కూటమి ప్రభుత్వం చేస్తుందని నమ్మి మద్దతు ఇచ్చినందుకు ఆదిలోనే రిటర్న్ గిఫ్ట్ ఈ రేంజ్ లో ఇస్తుందనుకోలేదని ఉద్యోగుల వాట్సప్ గ్రూపుల్లో చర్చిస్తున్నారు. భారతదేశంలోని ఎక్కడా లేని విధంగా గ్రామ, వార్డు స్థాయిలో ప్రజలకు సేవలు అందించడానికి సచివాలయశాఖను ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే.. ఇదంతా ప్రజా సేవ అనుకున్నామని.. కానీ అన్నిశాఖల్లో ఉద్యోగాలు భర్తీచేయాల్సి వస్తుందని.. కేవలం సచివాలయశాఖ ద్వారా 19 విభాగాల ఉద్యోగాలు తీసి అన్ని శాఖల పనులూ చేయిస్తారని కలలో కూడా ఊహించలేదని వాపోతున్నారు. అలాగని ఈ శాఖకు చట్టబద్ధత గానీ, ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగా సర్వీసు నిబందనలు, ప్రమోషన్ చార్టు ఏమైనా ఏర్పాటు చేశారా అంటే అదేమీ చేయకుండా.. కేవలం ఉద్యోగులను అన్నిశాఖల విధులకు, పనులకు వినియోగించడానికే చూస్తున్నారని ఉద్యోగులు తీవ్ర వేదనకు గురవుతున్నారు. 

గత ప్రభుత్వం చేయని పనులు కూటమి ప్రభుత్వం చేస్తుందని.. కనీసం మాతృశాఖలకు తమను అప్పగిస్తుందని భావించామని.. అదేం చేయకుండా ఇక్కడే ఉంచి సెలవు రోజులు, డ్యూటీ టైమ్ కాకుండా అదనపు పనిగంటలు విధులు చేయిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. చేసిన విధులే అదనం అనుకుంటే దానికి టార్గెట్లు, వేదింపులు కూడా బోనస్ గా వస్తున్నాయని మండి పడుతూ కూటమిపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఒకరకంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే నయమంటూ పశ్చాత్తప పడినట్టుగా వారి బావాలను గ్రూపుల్లో వ్యక్తం చేసు కుంటున్నారు. ఇంకా సూపర్ సిక్స్ పథకాలు ఏమీ అమలు కాకుండానే ఇంత పని ఒత్తిడి ఉంటే.. అన్ని పథకాలు అమలు చేస్తే.. ఈ ప్రభుత్వ ఉద్యోగం మాకొద్దంటూ మా అంతట మేమే ఉద్యోగాలకు రాజీనామాలు చేసిపోయేంతగా టార్గెట్లు పెట్టేలా ఉన్నారంటూ మండిపడుతున్నారు. 

ఈ లెక్కన వీరి నిరసన ప్రజల వరకూ చేరితే ఏడాది తిరిగేలోపు ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలా కాకుండా జరగాలంటే.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సచివాలయశాఖకు కల్పించని చట్టబద్దత ఏర్పాటు చేయడంతోపాటు, ఉద్యోగుల ను మాతృశాఖల్లో విలీనం చేసి, అన్నిప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదిరిగా వీరికి కూడా పదోన్నతులు, ప్రభుత్వ ప్రయోజనాలు కల్పించి.. ఆపై అడ్మిస్ట్రేటషన్ 2.0 అమలు చేస్తే ఫలితాలొస్తాయని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. చూడాలి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల విష యంలో ఏ విధంగా వ్యవహరిస్తుందనేది..?!