ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పరిపాలను బ్రష్టు పట్టించేందుకు రాష్ట్రంలో కొందరు అధికారులు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను దారుణంగా వేధిస్తున్నారు. సీఎం మాటను స్వచ్చందంగా స్వీకరించి గ్రామాలు, వార్డుల్లో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్న ఉద్యోగుల ద్వారా ఎలాగైనా ప్రభుత్వంపై బురద చల్లించే విధంగా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ సర్వీసు నిబంధ నలను అతిక్రమిస్తూ సొంత నిర్ణయాలు, వేధింపులతో ఉద్యోగులను ఉసూరు మనేలా చేస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఎప్పుడు ప్రభుత్వ సెలవు, రెండవ శని, ఆదివారాలు వచ్చినా ఆ రోజుల్లోనే ప్రత్యేకంగా విధులు అప్పగించి మనశ్శాంతి లేకుండా ఉద్యోగులు వారంతట వారే ఉద్యోగాలను వదిలి వెళ్లేపోయేవిధంగా వేధింపులకు గురి చేస్తున్నారు.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ప్రభుత్వ సేవలు, పథకాలు ప్రజలకు సకాలంలో అందుతున్నాయి. దానిని జీర్ణించుకోలేని కొందరు అధికారులు. సచివాలయ ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వేలకు విధులకు రావడం లేదనే నెపంతో అర నిమిషం ఆలస్యంగా వచ్చినా ఆరోజు జీతం కట్ చేసేస్తున్నారు. పైగా ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి ఆదాయంగా చూపిస్తున్నామనే కోణాన్ని ప్రభుత్వం ముందుకి తీసుకెళుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చిన సెలవులను ఆరోగ్య కారణాల రీత్యా కూడా వినియోగించుకోకుండా సెలవు పెట్టిన రోజే ప్రత్యేక విధులు అప్పగిస్తున్నారు. రాష్ట్రంలోని ఈ పరిస్థితి ఏ ఒక్క జిల్లాకో పరిమితం చేయకుండా.. ముఖ్యంగా పట్టణ పురపాలక శాఖలోని జోనల్ కమిషనర్లు, కొన్ని చిన్న మున్సిపాలిటీల్లో కమిషనర్లు, మండలాల్లో ఎంపీడీఓలు కావాలని ఉద్యోగులను వేధిస్తూ వారంతట వారే ఇదేం ఉద్యోగం రాబాబు అనే విధంగా వేధింపులకు గురిచేస్తున్నారు.
పెట్టుకున్న సెలవులన్నింటిని కావాలన్ని రద్దు చేసి, ఆ సెలవులకి జీతం కూడా కట్ చేసేస్తున్నారు. మరో వైపు ప్రభుత్వమే ప్రత్యేక పనులు అప్పగించిం దని వాటిని సెలవు రోజుల్లో చేయించే పనులు చేపడుతున్నారు. రాష్ట్రంలోని 75 ప్రభుత్వశాఖలు ఉంటే ఏ శాఖలోనూ లేని నిభందనలను ఒక్క గ్రామ, వార్డు సచివాలయ శాఖలోనే కొందరు అధికారులు తమ సొంత నిర్ణయాలను అమలు చేస్తూ.. ఉద్యోగులను మానసికంగా కృంగ దీస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారని నిఘా వర్గాలు కూపీ లాగితే ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెలుగు చూస్తున్నాయని ఉద్యోగుల సామాజిక మాద్యమాల్లో పెద్ద ఎత్తున చర్చలు పెట్టుకుంటున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు వారి పనితోపాటు, తీసేసిన వాలంటీర్ల క్లష్టర్ల పనులు కూడా చేస్తున్నారని.. అలా నిత్యం చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేస్తుందని.. ఎలాగైనా ప్రభుత్వ పరిపాలనపై ఉద్యోగులతోనే బురద చల్లే విధంగా చేయాలంటే వారిని అదనపు విధుల పేరుతో వేధించడం తప్పా మరో మార్గం లేదనే విధంగా సొంత పైత్యాలను, అధికారాలను వినియోగిస్తున్నారని ఉద్యోగులు తీవ్ర మనో వేధనకు గురవుతున్నారు.
అంతేకాకుండా ప్రభుత్వ పరంగా సరఫరా చేయాల్సిన కార్యాలయ స్టేషనరీ సరఫరా చేయకుండా.. వాటిని సొంత డబ్బులతో కొని ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని.. కంప్యూటర్లు, ప్రింటర్లు పాడైనా సొంత నిధులతోనే రిపేర్లు చేయించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారని ఉద్యోగులు అధికారులపై దుమ్మెత్తి పోస్తున్నారు. అలాగని ఈ విషయాలను జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లకు దృష్టికి తీసుకెళితే ఆ విషయాన్ని మనుసులో పెట్టుకొని మరింతగా కక్షసాధింపులకు పాల్పడుతున్నారని కూడా వాపోతున్నారు. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు కూడా ఉద్యోగులపై జోనల్ కమిషనర్లు చేస్తున్న ఉద్యోగ వేధింపులను చోద్యం చూస్తున్నట్టుగా చూసి పట్టించుకోవడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. దీనితో తమ సమస్యలు, వేధింపులు ఆపాలని ఉద్యోగులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల వద్దకు వెళ్లి వినతి పత్రాలు సమర్పించుకోవాల్సి వస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో సుమారు లక్షా 28 వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి ఇంచు మించుగా ఇలానే ఉందంటే అధికారుల వేధింపులు ఏ విధంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.
వాస్తవానికి ప్రభుత్వం తరపున ఉద్యోగులకు రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, సర్వీసు నిబంధనలు అమలు చేయకపోయినా..అత్యంత తక్కువగా జీతాలు ఉన్నా.. ఒక ఉద్యోగంతో అన్ని ప్రభుత్వ శాఖల పనులు చేయిస్తున్నా ఉద్యోగులకి సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తున్నా.. అధికారులకు మాత్రం ఇంకా కడుపు మండట చల్లారడం లేదని.. ఏదో ఒక కారణంతో తమను వేధిస్తున్నారని ఉద్యోగులు నెత్తీ నోరూ కొట్టుకుంటున్నారు. అత్యధికంగా పనులు అప్పగిస్తే గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగం మాకొద్దని మా అంతట మేమే ఉద్యోగాలకు రాజానామా చేసే విధంగా వేధింపులు చేస్తున్నారని వాపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన సెలవులు కూడా వినియోగించుకోకుండా, ఆరోగ్య సమస్యలు వచ్చినా.. కూడా వాటిని వినియోగించుకోకుండా అడ్డుపడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ఇదే పద్దతి కొనసాగితే ఉద్యోగులంతా రోడ్డెక్కాలని కూడా నిర్ణయించుకొని.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులంతా ఒక తాటిపైకి రావడానికి సామాజిక మాద్యమాల ద్వారా చర్చలు పెట్టడం ఇపుడు చర్చనీయాంశం అవుతుంది. ఈ విషయంపై ముఖ్యమంత్రితోపాటు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ రంగంలోకి దిగితే తప్పా.. ఉద్యోగులను వేధించే అధికారుల శాడిస్టు చర్యలకు అడ్డుకట్టే పడే అవకాశాలు కనిపిండచడం లేదు. చూడాలి సచివాలయ ఉద్యోగులను వేధించి.. సెలవుల రద్దు చేసి.. సెలవుల్లోనే అదనపు విధులు అప్పగించి.. ఉద్యోగులను మానసికంగా కృంగదీస్తున్న అధికారుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటుందనేది..?!