సచివాలయ ఉద్యోగుల నోట్లో మట్టి..!? ప్రభుత్వశాఖ లేని మహిళా పోలీసులు


Ens Balu
1551
visakhapatnam
2025-03-13 20:33:59

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేలు జరుగుతుందనుకుంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కంటే దారుణంగా పరిస్థితి మారిపోయిందని ఉద్యోగులు గొల్లు మంటున్నారు.. దేశం చూపుని ఆకర్షించిన సచివాలయ శాఖ ఉద్యోగులకు నేటికీ సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్, ప్రభుత్వశాఖల కేటాయింపు లేని ఏకైక ప్రభుత్వశాఖలో క్యాడర్ లేని ఉద్యోగులుగా తామే చరిత్ర కెక్కామని.. తమలాంటి దౌర్భాగ్య స్థితి మరే ఇతర ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులకూ రాకూడని నెత్తీ నోరూ కొట్టుకుంటున్నారు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్యోగులను సగం నాశనం చేస్తే.. కూటమి ప్రభుత్వం మిగిలిన సగానికి పాతాళ లోకంలోకి  తొక్కేసిందని మండి పడుతున్నారు.. సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ అమలు చేస్తే అదనంగా జీతం, ప్రయోజనాలు కల్పించాల్సి వస్తుందని వాటి జోలికి వెళ్లకుండా.. రేషనలైజేషన్ పేరుదో ఉద్యోగుల కుదింపు.. క్లస్టర్ విధానంతో సచివాలయాల మదింపుకోసం మాత్రం ఆగమేఘాలపై పనులు చేస్తోందని.. అంతే వేగంగా తమకు కనీసం ప్రభుత్వ శాఖనైనా కేటాయించాలని మహిళా పోలీసులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.. వైస్సార్సీపీయే తమ భవిష్యత్తుతో ఆడుకుందనుకుంటే.. ఇపుడు కూటమి ప్రభుత్వం అంతకు రెండింతులు తమజీవితంలో పదోన్నతి చూడకుండా చేయాలని కంకణం కట్టుకుని తమ నోట్లో మట్టి కొట్టిందని కన్నీటిపర్యంతం అవుతున్నారు..!

భారతదేశంలోని ఒక్క ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని మాత్రమే క్యాడర్ లేకుండా పనిచేస్తున్నారు ఉద్యోగులు. ఏ ప్రభుత్వంలోనైనా, మరే రాష్ట్రంలోనైనా గ్రూప్-4 నుంచి ప్రారంభమయ్యే క్యాడర్ ఉంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఆ క్యాడర్ కూడా లేకుండా.. దానిక మరో క్యాడర్ పెంచి క్రిందికి దించేసిన విధానం ఉన్న ఉద్యోగాలు సచివాలయంలోనే ఉన్నాయని  వాపోతున్నారు. అందులోనూ మహిళా పోలీసులకైతే ఏ ప్రభుత్వశాఖనూ కేటాయించకుండానే ప్రభుత్వం వారిని పోలీసుశాఖలోని విధులకు, సచివాలయంలోని పనులకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గా వినియోగించుకుంటున్నది. కోర్టు కేసుల నేపథ్యంలో గత ప్రభుత్వంలో హైకోర్టుకి  మహిళా పోలీసులు పోలీసుశాఖకు చెందిన ఉద్యోగులు కారని ఒక అఫడవిట్ దాఖలు చేసి చేతులు దులిపేసుకుంది. ఆనాటి నుంచి ఈరోజు వరకూ వీరికి ప్రభుత్వ శాఖ లేకుండా వీరితో ప్రభుత్వం శెలవు రోజుల్లో కూడా అదనంగా పనులు చేయించుకుంటున్నది. తప్పిదే వీరికోసం కనీసం ఆలోచించిన పాపాన పోలేదు.

 గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులకు ఇపుడు పూర్తిస్థాయిలో సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్  ఏర్పాటు చేస్తే.. ఇతర ప్రభుత్వశాఖల్లోని ఉద్యోగులు మాదిరిగా జీతంతో కూడా ప్రయోజనాలు ఇవ్వాలని.. అదే ఏమీ చేయకుండా వదిలేస్తే.. కేవలం జీతంతోనే సరిపెట్టేయొచ్చుననే ఆలోచనగా కనిపిస్తున్నది కూటమి ప్రభుత్వానికి. దానికి గత ప్రభుత్వం చేసిన తప్పులనే బూచీగా చూపిస్తూ కాలం నెట్టుకొచ్చేస్తున్నది. అయితే ఇటీవల కాలంలో గత ప్రభుత్వం పెంచేసిన ఉద్యోగ విరమణ వయస్సు ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా 74 ప్రభుత్వ శాఖల్లో సుమారు 60వేలకు పైగా ఉద్యోగులు దఫ దఫాలుగా ఉద్యోగ విరమణలు చేస్తూ వస్తున్నారు. దీనితో ఆయా ప్రభుత్వశాఖల్లోని ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతూ వస్తున్నది. ప్రస్తుతం కొత్తగా ఉద్యోగాలు తీయాలంటే ప్రభుత్వం వద్ద ఆ  పరిస్థితి కనిపించడం లేదు. దానితో సచివాలయ ఉద్యోగులనే ఇతర ప్రభుత్వశాఖలకు పంపించే విధంగా రేషనలైజేషణ్ విధానాన్ని తెరపైకి తీసుకు వచ్చి సుమారు 40 వేల ఉద్యోగులు అధికంగా ఇక్కడ ఉన్నారని.. వాళ్లని ఆయా ప్రభుత్వశాఖల్లోని ప్రాధాన్యత కలిగిన శాఖలకు పంపించేందుకు ఆఘమేగాలపై జీఓ విడుదల చేసింది. 

ఆ రకంగా ఉద్యోగుల కుదింపు ఒక రకంగా జరిగితే ఇపుడు మళ్లీ.. క్లస్టర్ విధానాన్ని గుట్టుచప్పుడు కాకుండా అమలు చేసి ఉన్న గ్రామ, వార్డు సచివాలయాలను( రెండు మూడింటిని) కలిపేయడానికి చక చకా నిర్ణయాలు చేస్తున్నది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మార్చి నెలాఖరు నాటికి క్లస్టర్ విధానం కూడా పూర్తయి సచివాలయాల సంఖ్య కూడా తగ్గిపోనున్నది. ప్రస్తుతం రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు 1.28 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో రేషనలైజేషన్ ద్వారా 40 వేల మంది ఉద్యోగులను గుర్తించిన ప్రభుత్వం ముఖ్యమైన ఆదాయం వచ్చేశాఖల్లో వీరిని డిప్యూటేషన్ పద్దతిపై పంపడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఇంకా ఉద్యోగులు కావాల్సి రావడంతో మళ్లీ ఆ ఉన్న ఉద్యోగులను కుదించి మరింత మందిని తగ్గించి.. అలా వచ్చిన వారిని మరికొన్ని ప్రభుత్వశాఖల్లోకి పంపేందుకు చకచకా పనులు పూర్తిచేసేస్తున్నది. దగ్గర దగ్గరగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాలు ఏవి ఎందులో కలిసిపోతాయో ఎవరికీ తెలియని పరిస్థితి ఉద్యోగుల్లో నెలకొంది.

అంటే ఇక్కడ ప్రభుత్వానికి అవసరం అనుకుంటే జీఓలన్నీ రాత్రికి రాత్రే పుట్టుకొచ్చేస్తాయి... అదే ప్రభుత్వ ఉద్యోగికి మేలు చేయాలన్నా.. ఏ ప్రభుత్వశాఖ లేని మహిళా పోలీసులకు ఒక ప్రభుత్వ శాఖ కేటాయించాలన్నా... ఉన్న శాఖల ఉద్యోగులకి సర్వీసు నిబంధనలు అమలు చేయాలన్నా, ప్రమోషన్ ఛానల్ వర్తింపచేయాలన్నా.. గత ప్రభుత్వం చేసిన తప్పులు గుర్తుకి వచ్చేసి మొత్తం ప్రక్రియను ఏ పనీ చేయకుండా వైఎస్సార్సీపీపై తోసేస్తున్నది. ప్రభుత్వం చేస్తున్న ఈ వింత దోరణి వలన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నేటికీ పదోన్నతి రాకుండా మిగిలిపోయారు. ఇపుడే కాదు రాష్ట్ర ప్రభుత్వం వీరికి సర్వీస్ రూల్స్, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేసే వారకూ ఇక్కడ పనిచేసే ఉద్యోగులు వారి సర్వీసు మొత్తంలో పదోన్నది కళ్ల చూస్తే ఒట్టు... పూర్తిస్థాయిలో పీఆర్సీ ప్రయోజనాలు తీసుకుంటే మరో రెండు ఒట్లు.. ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు మాదిరికి అన్ని క్యాడర్ వర్తింపచేస్తే మూడు ఒట్లు...ప్రయోషన్ తీసుకుంటే నాలుగు ఒట్లు.. ఇలా కిందా మీదా పెట్టి ఏదో ఒక రోజు ఈ శాఖ వలన ప్రభుత్వానికి, ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని ఈ శాఖను ప్రత్యేక ఆర్డినెన్సుతో రద్దు చేయకపోతే మరో ఐదు ఒట్లు.. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ గ్రామ, వార్డు సచివాలయశాఖ రద్దు దిశగానే అడుగులన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మొదట గ్రామ వాలంటీర్లు తొలగించారు.. ఆ పనులు సచివాలయ సిబ్బందికి అప్పగించారు.. ఇపుడు సిబ్బందిని కుదించడానికి రేషనలైజేషన్ తెరమీదకి తీసుకొచ్చి 40వేల మంది ఉద్యోగులను ఇతర శాఖల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. మరో ప్రక్క సచివాలయల సంఖ్యలను తగ్గించేయడానికి.. ఖాళీలు ఏర్పడుతున్న ప్రభుత్వశాఖల్లో ఉద్యోగుల కోసం ఇపుడు క్లస్టర్ విధానాన్ని తీసుకొచ్చి.. రెండు మూడు సచివాలయాను ఒకటిగా చేసి.. మిగిలిన వాటిని రద్దు చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు ఆగమేఘాలపై చేసేస్తున్నది. ఇవన్నీ ప్రభుత్వానికి అత్యవసరంగా కావాల్సిన పనులు కనుక నేరుగా ఒక జీఓ జారీ చేసి పనులు చేసుకుంటూ వెళ్లిపోతున్నది. అదే ఇక్కడి ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పించమంటే మంటే మాత్రం వెంటనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం గుర్తుకొచ్చేసి.. నిబంధనలన్నీ తెరపైకి వచ్చేస్తున్నాయి..

 ఈ విధంగా తమ ఉద్యోగుల నోట్లో కూటమి ప్రభుత్వం మట్టికొట్టి ఆనందపడుతుందని ఉద్యోగులు వాపోతున్నారు. ఇదే పద్దతి కొనసాగితే వైఎస్సార్సీపీ కి పట్టిన గతి కంటే దారుణమై పరిస్థితులు కూటమి ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా ఉద్యోగులు అపుడే ప్రజల్లోకి బలమైన వాయిస్ ను తీసుకెళుతున్నట్టుగా కనిపిస్తున్నది. చూడాలి ఎన్నికల్లో గెలుపుకోసం ఎడా పెడా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు హామీలిచ్చిన ప్రభుత్వం గత వైఎస్సార్సీపీ చేసిన తప్పులను సరిచేసి ఉద్యోగులను ఆదుకుంటుందా.. లేదంటే తమకు కావాల్సినట్టు వినియోగించుకొని.. ప్రయోజనం కల్పించాల్సి వచ్చే సమయానికి ఆ తప్పుని యదావిధిగా వైఎస్సార్సీపీ నెట్టేసి ఈ ఐదేళ్లు కనీసం ఉద్యోగులకు ప్రమోషన్ ఇవ్వకుండా.. సర్వీసు రూల్స్ వర్తింపజేయకుండా అలాగే ఉండిపోతుందా అనేది..?!
సిఫార్సు