గ్రామ, వార్డు సచివాలయాలు నిర్వీర్యం..? వడి వడిగా అడుగులు.. ఇక కొద్దినెలల్లోనే..!


Ens Balu
145
visakhapatnam
2025-03-18 17:43:29

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 75వ ప్రభుత్వశాఖ శాఖగా ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయశాఖ పూర్తిగా నిర్వీర్యం అయ్యే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.. గత ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయస్సు పెంచేయడం.. ఆపై వేలాదిగా ఉద్యోగులు అన్నిశాఖల్లో రిటైర్ మెంట్ కావడం.. అదే సమయంలో కొత్త ఉద్యోగాలు తీసే పరిస్థితి లేకపోవడం.. ఉన్న సచివాలయశాఖ ఉద్యోగులనే ఇతర శాఖల్లోకి సర్ధుబాటు పేరుతో విలీనం చేయడానికి రేషనలైజేషన్, క్లస్టర్ విధానాన్ని తెరపైకి తీసుకు రావడం, సచివాలయాల్లో అందే సేవల్లో చాలా వరకూ వాట్సప్ గవర్నెన్స్ లో అందించడం.. ప్రాధాన్యత శాఖల్లో విపరీతంగా సిబ్బంది కొరత పెరిగిపోవడం..

  అన్నీ వెరసీ గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సుమారు 1.30 లక్షల మందిని ఖాళీ అయిపోయిన శాఖల్లోకి సర్దుబాటు చేస్తే తక్షణమే ఖాళీల భర్తీ కి కార్యాచరణ శర వేగంగా జరుగుతున్నట్గు సమాచారం అందుతోంది.. ఆపై సచివాలయ వ్యవస్థను దశల వారీగా రద్దు చేయడానికి ఆస్కారం వుంటుందనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తున్నది. ఇటీవలే రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం పోలీస్ స్టేషన్లు ఇతర ప్రభుత్వశాఖలకు కేటాయించడం కూడా సచివాలయాల నిర్వీర్యానికి ఊతమిస్తున్నాయి. ఈ విషయంలో ఏం జరుగుతుందనే విషయంలో సాంకేతిక కోణాలపై  ఈరోజు-ఈఎన్ఎస్ ప్రత్యేంగా అందిస్తున్న గ్రౌండ్ లెవల్ రిపోర్ట్..! 

 వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏర్పాటైన సచివాలయశాఖలోని 26 జిల్లాల్లో 15వేల నాలుగు గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న 1.30 లక్షల మంది ఉద్యోగుల్లో చాలా విభాగాలకు గత ఐదేళ్ల నుంచి  సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకుండా అలా ముందుకి నడిపించేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దక్కుతుందనడంతో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగా సచివాలయశాఖ ఉద్యోగులకు అన్నీ అమలు చేస్తే పేస్కేలు పెరిగి ఆర్ధిక భారం ప్రభుత్వంపై పడుతుందని భావించి ఐదేళ్లకు పైనే కాలం నెట్టుకొచ్చేసిన ప్రభుత్వంగా కూడా ఆంధ్రప్రదేశ్  చరిత్ర సృష్టించింది. ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఏర్పడ్డ గ్రామ, వార్డు సచివాల యశాఖ ఉద్యోగులకు  కనీసం ఎదుగుదల లేకుండా.. ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగా ప్రభుత్వ ప్రయోజనాలు, పీఆర్సీ ప్రయోజనాలు అందకుండా చేసి పరిపాలించేసిన ఘనత గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి దక్కితే.. ఆ ప్రభుత్వం ఎలాగూ చేయలేదు..

 మనమెందుకు చేయాలిలే అన్నట్టుగా రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులకు రాజ్యాంగంలోని ఆర్టికల్స్  ద్వారా కల్పించాల్సిన.. సర్వీస్ నిబంధ నలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకుండా.. తాడూ బొంగరం లేకుండానే ఇంత కాలం సిబ్బందితో పనులు చేయించేసు కుం టోంది ప్రభుత్వం. గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు గ్రామస్థాయిలో అందాలని ఈ వ్యవస్థ ఏర్పాటు చేస్తే.. కూటమి ప్రభుత్వం ఉన్న ప్రభుత్వ శాఖల్లోని ఒక్కసారిగా ఏర్పడ్డ ఖాళీలను భర్తీచేసుకోవడానికి, సర్ధుబాటుకోసం మళ్లీ ఇదే సచివాలయ శాఖను వినియోగిం చుకోవ డం విశేషం. ఏ ప్రభుత్వశాఖలోనూ లేనివిధంగా సెలవు రోజులు, అదనపు పనిగంటలు, రెండవ శనివారాల్లోనూ కూడా ఎడా పెడా పనులు చేయించుకొని మరీ సిబ్బందిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తున్న ఘనత అటు వైఎస్సార్సీపీ ప్రభుత్వం తరువాత కూటమి ప్రభుత్వానికి దక్కిందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

రాష్ట్ర ప్రభుత్వం  సెలవు రోజులకు కూడా కలిపే జీతాలు ఇస్తున్నందున ఆరోజుల్లో కూడా ప్రజలకోసమే సిబ్బందితో పనులు చేయిస్తున్నామని వాదిస్తోంది. మరి వేళా పాలా లేకుండా అప్పగిస్తున్న అదనపు పనిగంటల సంగతేంటని ప్రశ్నిస్తే మాత్రం ప్రజలకోసం, ప్రభుత్వం కోసం ఆమాత్రం అదనంగా పనిచేయాలేరా..? సర్వేల కోసం సొంతంగా సెల్ ఫోన్లు సమకూర్చుకోలేరా.. ప్రభుత్వం  ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచు కొని.. మీరే ఇంటర్ ప్యాకేజీలు వేయించుకోలేరా..? కార్యాలయాల్లో సొంత ఖర్చులతో స్టేషనరీ కొనుక్కొని మరీ సేవలు అందించలేరా..? ఇన్ని చేసిన తరువాత కూడా ఇచ్చిన టార్గెట్లు పూర్తికాకపోతే కోపంతో తిట్టిన తిట్లు, పెడుతున్న వేధింపులు భరించలేరా..? అంటోంది.. ప్రభుత్వం. ఒక్క ముక్కలో చెప్పాలంటే భారతదేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగు లకి ప్రభుత్వం కేటాయించినది ఒక శాఖ మాత్రమే అయినా.. అన్ని శాఖల పనులు వీరితోనే చేయించడం ఇక్కడ ప్రత్యేకత. అలా చేయించినా..

 రాజ్యాంగ బద్ధంగా వీరికి కల్పించాల్సిన ఉద్యోగ భద్రత, సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ మాటేంటి అంటే.. అవన్నీ చేస్తే.. ప్రభుత్వంపై ఆర్ధిక భారం పడుతుంది.. ఉద్యోగులతో, సిబ్బందితోనూ కావాల్సినట్టుగా అదనపు పనిగంటలతో పనులంటే  చేయించుకోగలం తప్పితే.. ఉద్యోగులకు చట్టబద్ధంగా ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వ ప్రయోజనాలంటే మాత్రం కాస్త ఆలోచించాల్సిందే అంటున్నారు సదరు శాఖల ముఖ్యకార్యదర్శిలు. అలాగని సచివాలయ ఉద్యోగులకు మాత్రం ప్రతీ ఆరు నెలలకు ఒకసారి ఏదో జరిగిపోతుందన్నట్టుగా.. వీరికి ఏదో ఇచ్చేస్తామన్నట్టుగా.. సమస్యలు పరిష్కరించేస్తామన్నట్టుగా మాత్రం అసెంబ్లీలో సైతం వీరి ప్రధాన సమస్యలను ప్రస్తావించి ఉద్యోగుల్లో ఆశలను చిగురింప చేస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించిన అంశాలు ఎక్కడైనా జరిగిపోతాయని ఉద్యోగులు భావిస్తారు.. కానీ గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగుల్లో మాత్రం అది కనీసం ఒక్క అడుగు కూడా ముందుకి పడటం లేదు.. కాదు కాదు వేయకుండా అలా మబ్బుల్లో తేలుస్తున్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్ లో 75 ప్రభుత్వశాఖల్లో లేని అత్యంత ఎక్కువ మంది ఉద్యోగులు ఒక్క గ్రామ, వార్డు సచివాలయశాఖలోనే ఉన్నారు. వారికి పూర్తిస్థాయిలో పనిలేదని జనాలను నమ్మించేసి.. వారిని ఖాళీ అయిపోయిన ప్రభుత్వశాఖల్లోకి సర్ధుబాటు చేస్తే.. కొత్తగా ఉద్యోగాలు భర్తీచేసే పనుండదని ప్రభుత్వం భావిస్తోంది. దానికోసమే తొలుత రేషనలైజేషన్ విధానాన్ని తెరపైకి తెచ్చి.. మళ్లీ సచివాలయాలను కుదించడానికి క్లస్టర్ విధానాన్ని అమలు చేయాలని చూస్తుంది. ఈ మధ్య కాలంలో ఒక్కో శాఖను వారి మాతృశాఖలో విలీనం చేయడానికి చాపక్రింద నీరులా వ్యవహారాలన్నీ చక్కచెబుతున్నది.  అలాగని సదరు ప్రభుత్వ శాఖలోకి విలీనం చేసినపుడైనా వారికి.. ఆశాఖలోని ఉద్యోగులు మాదిరిగా క్యాడర్, సర్వీస్ రూల్, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేస్తారా.. అమలు చేస్తారా అంటే.. ఆ ఒక్కటీ అడక్కండీ.. కేవలం ప్రస్తుతం సర్ధుబాటు మాత్రమే జరుగుతుంది.. మిమ్మల్ని మల్టీ టాస్కింగ్ స్టాప్ గా నచ్చినట్టుగా వినియోగించుకుంటామని ఇటీవలే రేషనలైజేషన్ కోసం జీఓ కూడా ఇచ్చేసింది. ఇపుడు ఎడ్యుకేషన్ అసిస్టెంట్లను విద్యాశాఖకు అప్పగించి అక్కడ పనులు చేయించడానికి కార్యాచరణ సిద్దం చేస్తున్నది. 

మరి సూపర్ సిక్స్ పథకాలు ఎలా అమలు చేస్తారు.. పెన్షన్లు ఏ విధంగా పంచుతారంటే మాత్రం ఆ పనీ వీళ్లతోనే చేయిస్తాం.. కాకపోతే రానున్న రోజుల్లో గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉంటుందో ఊడుతుందో చెప్పలేమనీ.. సూచాయగా చెబుతున్నారు అధికారులు. ఒక ప్రభుత్వం ప్రజల ఇంటి ముంగిటనే సేవలు అందించడానికి ఒక ప్రభుత్వశాఖను ఏర్పాటు చేస్తే మరో ప్రభుత్వం శాఖల్లోని సిబ్బంది ఒకేసారి వేల సంఖ్యలో రిటైర్ అయిపోవడంతో  ఆ ఖాళీలను భర్తీచేసుకోవడానికి సచివాలయ ఉద్యోగులను వినియోగించుకోవాలని చూస్తున్నది. ఇన్ని చేస్తున్న ప్రభు త్వం ఒకేసారి ఈ శాఖను రద్దు చేసేయొచ్చుగదా అంటే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందని ఆలోచన చేస్తోందట.. అలాగని తెరవెనుక  నిర్వీర్య పనులు మాత్రం ఎక్కడా ఆపడంలేదు.. చూడాలి గ్రామ, వార్డు సచివాలయాలు ఉంటాయో..ఊడుతాయో.. వారికి జాబ్  క్యాడర్, సర్వీస్ రూల్స్, ప్రమోషన్ ఛానల్ విలీనంచేసిన శాఖల్లోనైనా కేటాయిస్తారా.. లేదా అనేది..?!
సిఫార్సు