అనుకున్నంతా అవుతోంది..వైఎస్ జగన్మోహనరెడ్డి మానస పుత్రిక గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, ప్రభుత్వంలోని 75వ ప్రభుత్వశాఖ త్వరలో కనుమరుగయ్యే టైమ్ వచ్చేసింది.. అవును గ్రామ, వార్డు సచివాలయాలను మదిస్తూ కూటమి ప్రభుత్వం క్టస్టర్ విధానం అమలు చేస్తోంది.. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 15వేల 4 గ్రామ, వార్డు సచివాలయాలను క్లస్టర్ విధానంతో సగానికి తొలుత కుదించేస్తున్నారు. ఇదే విషయాన్ని ఈరోజు-ఈఎన్ఎస్ నెల రోజుల క్రితం పతాక శీర్షిక ప్రచురిస్తే.. ఈరోజు పేపర్ లో రాస్తే అయిపోతుందా అని ఉన్నతాధికా రులతో పాటు, సచివాలయ ఉద్యోగులూ వెటకారంగా నవ్వారు.. తీరా ఇపుడు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు వెలువరించేసరికి నోరెళ్లబె డుతున్నారు.. ఈరోజు-ఈఎన్ఎస్ రాసింది అక్షరాల నిజమైందని చర్చ మొదలు పెట్టారు.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన దగ్గర నుంచి ఈశాఖలో వచ్చేమార్పులను, తలాతోకా లేకుండా చేస్తున్న పరిపాలనను రాష్ట్రంలోనే ఏ మీడియా అందించనంతగా గ్రౌండ్ లెవల్ రిపోర్ట్ ను ఈరోజు-ఈఎన్ఎస్ మాత్రమే ప్రత్యేక కథనాల రూపంలో ప్రచురిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే క్లస్టర్ విధానంతో తొలుత సచివాల యాలను మదించి, తరువాత కుదించి.. ఆపై తొలగిస్తారనే కథనం ప్రచురించింది. అందులో మొదటి అంశం మదింపుపై కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం విశేషం..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని 75వ ప్రభుత్వ శాఖగా ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ వచ్చిన ఐదేళ్లలోనే కనుమరుగు కాబోతుంది. ప్రజలకు ఇంటిముంగిటే సేవలు అందించాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్.జగన్మోహనరెడ్డి మానసపుత్రికగా గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటైంది. ఎక్కడైనా, ఎప్పుడైనా ప్రభుత్వంలో ఒక ప్రభుత్వశాఖ కొత్తగా ఏర్పాటైతే దానికి నిర్ధిష్ట విధివిధానాలు, సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్, ఇతర ప్రభుత్వశాఖల్లో ఉన్నట్టుగా కొత్త శాఖలోనూ క్యాడర్లు ఏర్పాటు చేస్తారు. కానీ ఉన్న ప్రభుత్వశాఖలనే మాత్రుశాఖగా ఉంచి అదనంగా కొత్తశాఖగా ఏర్పాటు చేసి.. తలా తోకా లేకుండా వీరి నియామకాలు చేపట్టింది గత ప్రభుత్వం. అలాగని అధికారంలో ఉన్న సమయంలో కూడా వారికి న్యాయం చేసిందా అంటే అదీలేదు. ఈ క్రమంలోనే ఉన్న ఇతర ప్రభుత్వశాఖల్లో ఉద్యోగుల విరమణ వయస్సు రెండేళ్లు పెంచేసింది. దానితో ఒకేసారి 74 ప్రభుత్వశాఖల్లో వేల సంఖ్యలో ఉద్యోగులు దఫ దఫాలుగా ఉద్యోగ విరమణలు చేస్తూ వస్తున్నారు.
ఇప్పటికిప్పుడు కొత్తగా మళ్లీ వేల సంఖ్యలో ఉద్యోగాలు నియామకాలు చేపట్టే పరిస్థితి ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో లేదు. దీనితో మాత్రుశాఖ ప్రామాణింగా నియమాకాలు చేపట్టి, గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటు చేసి.. నియమించిన ఉద్యోగులనే ఇపుడు కూటమి ప్రభుత్వం వారిని ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేయాలని చూస్తున్నది. ఇందులోభాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాలను తొలుత మదింపు చేయడం మొదలు పెట్టింది. అంటే రెండు సచివాలయాలను కలిపి ఒక సచివాలయంగా మదించింది. తద్వారా ఒక సచివాలయంలోని సిబ్బందిని ఇతర ప్రభుత్వశాఖల్లో ఖాళీలను భర్తీచేయడానికి మార్గం సుగమం చేసుకుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే అన్ని ప్రభుత్వశాఖల్లోనూ భారీగా అన్ని కేటగిరీల్లోని భారీగా ఖాళీలు ఉండేవి. వాటిని భర్తీచేయకుండా ఏకంగా 1.30లక్షల ఉద్యోగాలను ఒకే శాఖలో తలా తోకా లేకుండా భర్తీచేసి చేతులు దులుపుకుంది. అప్పటి ఖాళీలు, తరువాత రెండేళ్లు ఉద్యోగ విరమణ వయస్సుతో ఖాళీ అయినవి తడిసి మోపెడు అవడంతో కూటమి ప్రభుత్వంపై భారం పడింది.
ఆ భారాన్ని ప్రభుత్వశాఖల్లో ఉద్యోగుల ఖాళీలను భర్తీచేయడానికి ఇపుడు గ్రామ, వార్డు సచివాలయశాఖ సిబ్బందినే వినియోగించాలని నిర్ణయానికి వచ్చింది. ఎలాగూ మాత్రుశాఖల ప్రామాణికంగానే సచివాలయశాఖ ఏర్పాటుచేశారు కనుక అదే మాత్రుశాఖల్లోని ఖాళీను భర్తీచేయడానికి వీరినే వినియోగిస్తే.. గత ప్రభుత్వం వీరికి సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకుండా వదిలేసిన విధివిధానాలను భర్తీచేయాలని యోచిస్తున్నది. ఒకరకంగా సచివాలయ ఉద్యోగులకు మేలే చేస్తున్నప్పటికీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం లో భారీగా నష్టపోయిన ప్రయోజనాల విషయంలో ఎలాంటి ప్రకటన చేయకుండానే కూటమి ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం తనకి నచ్చినట్టుగా చేసుకుపోతున్నది. ప్రస్తుతం అన్ని గ్రామ, వార్డు సచివాలయాలకు క్లస్టర్ విధానంపై ఉత్తర్వులు వచ్చాయి. అందులో కొన్ని పోస్టులను కూడా లేపేశారు. ముఖ్యంగా మహిళా పోలీసు పోస్టులనే ముందు లేపేసి.. ఉత్తర్వులు జారీచేసింది ప్రభుత్వం.
అయితే అలా లేపేసిన మహిళా పోలీసులను ఖాళీ ఉన్న సచివాలయాల్లో నియమిస్తారా లేదా అనే విషయాన్ని మాత్రం ఎక్కడా పొందుపరచలేదు. దీనితో ఇప్పటికే కోర్టు కేసుల కారణంగా ఏ ప్రభుత్వశాఖ లేకుండా గాల్లో ఉన్న తమను క్లస్టర్ విధానంలో ఉన్నపోస్టులను లేపేయడంతో తమ పరిస్థితి ఏంటని మహిళా పోలీసులు గగ్గోలు పెడుతున్నారు. వాస్తవానికి చాలా సచివాలయాల్లో ప్రధాన విభాగాల్లో పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వెల్పేర్ అసిస్టెంట్, వార్డు అడ్మిన్, పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్ ఇలా చాలా పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వాటిలో వీరిని భర్తీచేయవచ్చు. కానీ ప్రభుత్వం ఏం చేస్తుందో ఉత్తర్వుల్లో తెలియజేయకుండా క్లస్టర్ లిస్టు జారీలో మాత్రం ఏ సచివాలయం ఏ సచివాలయంలో కలుస్తుంది.. ఏ పోస్టులను లేపేశారు అనే వివరాలు మాత్రమే పొందుపరిచారు. ఒకరకంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వలన గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులకు నిర్ధిష్ట ప్రభుత్వశాఖ ఏర్పాటు కావడంతోపాటు, ఏ ప్రభుత్వశాఖలోకి వీరిని పంపిస్తున్నారో సదరు ప్రభుత్వశాఖ సర్వీసు రూల్స్, ప్రమోషన్ ఛానల్ వర్తించే విధంగా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం.
కానీ ప్రజలకు అందుబాటులో ఉండే సచివాలయ వ్యవస్థకు మాత్రం దశల వారీగా మంగళం పాడేసే విధంగానే ప్రస్తుత ప్రభుత్వం చర్యలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తలా తోకా లేకుండా ఏర్పాటు చేసిందని పదే పదే చెబుతున్న కూటమి ప్రభుత్వం... అధికారంలో ఉండి ఏ చేస్తుందో కూడా చెప్పకుండా గత ప్రభుత్వం వ్యవహరించిన తీరుకంటే దారుణంగా వ్యవహరిస్తుందనే వాదనను ఉద్యోగులు వినిపిస్తున్నారు. ఏపీపీఎస్సీ ద్వారానే పోటీపరీక్షలు రాసే ఉద్యోగాలు పొందినా.. ఏ ప్రభుత్వశాఖలోనూ లేని విధంగా అన్ని ప్రభుత్వశాఖల విధులు తమతో చేయిస్తున్నారని.. పైగా సదరు ప్రభుత్వశాఖలకు ఇచ్చే ప్రయోజనాలు, సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ మాకూ వర్తింపచేయండి అంటే మాత్రం.. ఆ ఒక్కటీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజలకు సేవలు అందించేందుకు తమతో అన్నిశాఖలు పనులు, డ్యూటీ టైమ్ కంటే అదనంగా చేయిస్తూ.. సెలవు రోజుల్లో కూడా వదిలిపెట్టకుండా పనులు పురమాయించి మరీ చేయిస్తున్న ప్రభుత్వం తమకిచ్చే ప్రయోజనాలు ఇవ్వమంటే మాత్రం ఆ తప్పుని గత ప్రభుత్వంపై నెట్టేసి మా నోట్లో మట్టి కొడుతుందని లబో దిబో మంటున్నారు.
దేశంలోనే ఏ రాష్ట్రప్రభుత్వంలో లేని ఒకే ఒక్క తేడా విధానం ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయశాఖలోనే ఉందని..ఒక ప్రభుత్వ శాఖ ఉద్యోగి ఇతర ప్రభుత్వశాఖలకు చెందిన పనులు చేయడం, అదీ అదనపు పనిగంటలు చేయించడం దారుణమని వాపోతున్నారు. దానికి తోడు ఇపుడు క్లస్టర్ విధానం అమలు చేస్తూ.. సచివాలయాలను మదిస్తూ.. కొంతమంది ఉద్యోగులను లేపేయడం ఎలా అర్ధం చేసుకోవాలో తెలియడం లేదంటున్నారు. చూడాలి గత వైఎస్సార్సీపీపై తప్పులన్నీ నెట్టేస్తున్న కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాల యశాఖ విషయంలో రెండవ దశ ఉద్యోగుల కుదింపును క్లస్టర్ విధానం తరువాత ఏ విధంగా చేపడుతుందనేది..ఆఖరిగా తొలగింపు ఇంకెలా చేస్తుందనేది..?!