కూటమి ప్రభుత్వమైనా వర్కింగ్ జర్నలిస్టులను కరుణించేనా..?!


Ens Balu
45
visakhapatnam
2025-04-21 06:44:54

వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మీడియా పూర్తిగా అణచివేతకు గురైంది.. చిన్న, స్థానిక, మధ్య తరహా పత్రికలు, న్యూస్ ఏజెన్సీలు చాలా వరకూ మూతపడ్డాయి.. ప్రభుత్వ ప్రకటనలు ఒక ప్రధాన పత్రికలు, సొంత మీడియాకి తప్పా.. స్థానిక పత్రికలకు విడుదల చేసింది లేదు.. అలాగని జర్నలిస్టులకు తాము జర్నలిస్టులమని చెప్పుకోవడానికి ప్రభుత్వం ఇచ్చే ప్రెస్ అక్రిడిటేషన్ కూడా పూర్తిస్థాయిలో అందుకోకుండా జీఓ నెంబరు 38 స్థానిక, చిన్న, మధ్య తరహా పత్రికలను అదహ్ పాతాళానికి తొక్కేసింది. ఇది దాదాపు జర్నలిస్టులు ప్రెస్ అక్రిడిటేషన్ కి కూడా నోచుకోకుండా అయిపోయింది. భారత దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా వచ్చిన జీఓతో చిన్నపత్రికలు కుదేలు అయిపోయాయి. చాలా మంది పత్రికలు మూసేసి వేరే పనులు కూడా చూసుకొని వెళ్లిపోయారు. ఇక మీడియానే నమ్ముకున్న వారు మాత్రం అప్పులు చేసి సంస్థలు నుడుపుతూ.. పత్రికలు ముద్రించి గత ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జర్నలిస్టులకు మళ్లీ ఆశలు చిగురించాయి.

 సీఎం చంద్రబాబు మీడియా, జర్నలిస్టులు పనిచేస్తేనే ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు తెలుస్తుందని నమ్మిన వ్యక్తిగా ఎప్పుడు టిడిపి అధికారంలో ఉన్నా మీడియాకి ఒక సముచిత స్థానం ఇస్తూ వచ్చారు. అయితే గత ప్రభుత్వంలో ఎన్నో గుణపాఠాలు నేర్చుకొని మీడియాకి దూరమైపోయిన వారంతా మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కొక్కరుగా మీడియాతోకి రావడం మొదలు పెడుతున్నారు. కారణం సీఎం చంద్రబాబుపై కాస్తంత నమ్మకం. ఆ నమ్మకమే ప్రస్తుతం చిన్న పత్రికలకు ఆక్సిజన్ అందిస్తోంది. ఎంపానల్ మెంట్ ఉన్న పత్రికలకు ప్రభుత్వం కొద్దో గొప్పో ప్రభుత్వ ప్రకటనలు విడుదల చేయంతో మళ్లీ చిన్న, స్థానిక, మధ్య తరహా పత్రికలకు జీవం వచ్చింది. చాలా కాలం తరువాత జర్నలిస్టులకు గుర్తింపు వస్తుందని అంతా ఆనంద పడుతూ కూటమి ప్రభుత్వం విడుదల చేయబోయే నూతన ప్రెస్ అక్రిడిటేషన్ జీఓ, జర్నలిస్టుల యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్, జర్నలిస్టుల హెల్త్ కార్డ్స్, అటాక్స్ కమిటీలు, మీడియా రక్షణ, ప్రెస్ అకాడమీ శిక్షణలు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హౌసింగ్ వంటి వాటిపై ఆశలు మొదలు అయ్యాయి. 

ఆ ఆశతోనే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 50వేల మంది జర్నలిస్టులు కూటమి ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకొని  జీవిస్తున్నారు. జర్నలిస్టు వృత్తి వదిలేసిన చాల మంది తిరిగి ఆ వృత్తిలోకి వస్తున్నారు. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వర్కింగ్ జర్నలిస్టుల ప్రెస్ అక్రిడిటేషన్ కార్డులు గత ప్రభుత్వంలోని జీఓ నెంబరు 38 ఆధారంగానే రెవిన్యువల్ చేసుకుంటూ వచ్చారు తప్పితే నూతన జీఓతో కొత్త అక్రిడిటేషన్లు ఇవ్వలేదు. ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పత్రికలు, మీడియా, న్యూస్ ఏజెన్సీలు అన్నీ కూటమి ప్రభుత్వం విడుదల చేయబోయే నూతన అక్రిడిటేషన్ జీఓపైనే ఆశలు పెట్టుకున్నాయి. ఇటీవలే క్యాబినెట్ లో ఆమోదం పొందిన జర్నలిస్టుల అక్రిడిటేషన్ ఫైలు ఇంకా జీఓ రూరంలో రాలేదు. అయితే ఆ జీఓ గత ప్రభుత్వంలోని జీఓ నెంబరు 38కి అనుకూలంగా ఉంటుందా లేదా.. ప్రతికూలంగా ఉంటుందా అనే విషయంలో జర్నలిస్టులు ఆందోళన పడుతున్నారు. గత ప్రభుత్వంలో సమాచారశాఖలోని కొందరు అధికారులు, సలహాదారులు చర్యల వలన జర్నలిస్టులకు గుర్తింపు లేకుండా పోయింది. 

ఇపుడు మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మీడియాకి ఎల్లప్పుడూ సముచిత స్థానం ఇచ్చే సీఎం చంద్రబాబు, రాష్ట్ర సమాచార పౌరంబంధాల శాఖ ద్వారా జర్నలిస్టుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు.. తద్వారా జర్నలిస్టులకు ఏం మేజరుగనుంది అనే విషయంలోనే అంతా ఆలోచనలో పడ్డారు.  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జర్నలిస్టులు బాధలు, కష్టాలు, చిన్నపత్రికల నిర్వహణ తెలిసిన అధికారిగా గుర్తింపు తెచ్చుకున్న సమాచారశాఖ డైరెక్టర్ హిమాంశుశుక్లా చాలా వరకూ స్థానిక పత్రికలు, మధ్య తరహా పత్రికలకు చేయూత ఇస్తూ వస్తున్నారు. చిన్న పత్రికలకు ఆగిపోయిన ప్రభుత్వ ప్రకటనలను మళ్లీ విడుదల చేయిస్తూ.. ఆర్ధిక కష్టాలు తీరేందకు ఎంతో మంచి మనసుతో దోహద పడుతున్నారు. ఈ మధ్యలో కొన్ని జర్నలిస్టుల సంఘాల్లో  వారిలో వారికి పడకపోవడంతో మళ్లీ కాస్త ఇబ్బందులు మొదలయ్యాయి. అందులోనూ సామాజిక వర్గం పేరుతో నడిచే రాష్ట్ర స్థాయి జర్నలిస్టుల సంఘాల్లోని పోస్టుల్లో వున్నవారు సీఎం స్థాయిలో చక్రం తిప్పడం వలన కూడా ఇటీవల విడుదలకు సిద్ధమైన ప్రెస్ అక్రిడిటేషన్ జోఓల్లో కూడా మార్పులకు కారణం అయ్యారని చెబుతున్నారు.

 ప్రస్తుతం ఆ ఆంశం రాష్ట్రంలో చర్చనీయాంశం అవుతుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత  స్థానిక దినపత్రి కలకు చేయూత అందిస్తూ వస్తున్నది. ఈ క్రమంలో ప్రభుత్వంపై ఆశలే తప్పా నిరాశ లేదు. కానీ కొన్ని జర్నలిస్టు సంఘాల నేతలు మధ్యలో దూరి సమాచారశాఖ అధికారులు, తప్పుదోవ పట్టించడంతో మార్పులు చేర్పులు ఉంటాయనేది తెరపైకి వచ్చింది. దీనితో గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా కూటమి అయినా రాజకీయాలకు పోకుండా కరుణిస్తేనే స్థానిక పత్రికలు మనుగడ సాధిస్తాయని, లేదంటే ఉన్న ఆ కొద్ది మంది కూడా మీడియాను, పత్రికలను మూసుకోవాల్సి వస్తుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూడాలి..త్వరలో రానున్న మీడియా అక్రిడి టేషన్ కమిటీ జీో ఏ విధంగా ఉండబోతుంది, జర్నలిస్టులకు స్థానిక దిన పత్రికలు ఏ స్థాయిలో మేలు చేయబోతుంది. ఏ స్థాయిలో నియంత్రణ చేపట్టబోతుందనేది..?!
సిఫార్సు